You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీకాళహస్తి: ‘కొండచుట్టు’గా పిలిచే ఇక్కడి కైలాస గిరి ప్రదక్షిణ గురించి మీకు తెలుసా?
- రచయిత, చిట్టత్తూరు హరికృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గిరి ప్రదక్షిణ అనగానే అందరికీ అరుణాచలం, సింహాచలం గిరి ప్రదక్షిణలే గుర్తుకొస్తాయి. ద్వారకా తిరుమల, యాదాద్రిలో కూడా గిరి ప్రదక్షిణలు జరుగుతున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పురాతన కాలం నుంచీ జరుగుతున్నట్లు చెబుతున్న గిరి ప్రదక్షిణ శ్రీకాళహస్తిలోని 'కైలాస గిరి' ప్రదక్షిణ.
పౌరాణిక సంప్రదాయాల ప్రకారం భారతదేశంలోని పంచభూత లింగాలలో నాలుగు లింగాలు తమిళనాడులో ఉంటే మిగిలిన ఏకైక లింగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ఉంది.
తమిళనాడులోని కంచిలో ఏకాంబరేశ్వరుడు పృథ్విలింగంగా, తిరుచ్చిలోని జంబుకేశ్వరుడు జలలింగంగా, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగా, చిదంబరంలోని నటరాజస్వామి ఆకాశలింగంగా వెలిశాడని భక్తులు నమ్ముతారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శివుడు వాయులింగంగా వెలిశాడంటూ భక్తులు పూజలు చేస్తుంటారు.
'కైలాస గిరి' ప్రదక్షిణ
శ్రీకాళహస్తిలో పశ్చిమాన స్వర్ణముఖి నది, తూర్పున కైలాసగిరి కొండల మధ్యన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం ఉంది. ఆలయం పక్క నుంచి దక్షిణ దిశగా దాదాపు 12 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది కైలాస గిరి.
శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో భక్తులు ప్రతియేటా రెండుసార్లు ఈ కైలాసగిరి చుట్టూనే ప్రదక్షిణ చేస్తారు.
శ్రీకాళహస్తిలోని గిరి ప్రదక్షిణను స్థానికులు 'కొండ చుట్టు'గా పిలుచుకుంటారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాలలో శివపార్వతుల కల్యాణోత్సవం సందర్భంగా ఏడాదికి రెండుసార్లు ఈ కైలాసగిరి కొండచుట్టు ప్రదక్షిణ జరుగుతుంది.
శ్రీకాళహస్తి, దాని చుట్టుపక్కల ప్రాంతాలవారికి తప్ప ఎక్కువ మందికి దీని గురించి తెలీదు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత జరిగే తమ వివాహ వేడుకకు కైలాస గిరి చుట్టూ ఉన్న రుషి గణాలను, దేవతలను ఆహ్వానించడానికి శివపార్వతుల ఉత్సవమూర్తులు మొదట కనుమ పండుగ రోజున గిరి ప్రదక్షిణకు వెళ్తారని శ్రీకాళహస్తి ఆలయ పురోహితుడు అర్థగిరి స్వామి చెప్పారు.
"కైలాస గిరి చుట్టూ 24 తీర్థాలు, ఆలయాలు ఉన్నాయి. మకర సంక్రాంతి రోజున శివుడి శూలాన్ని ఒక పల్లకీలో ఉంచి స్వామి అమ్మవార్లు పండగ సందర్భంగా దర్శనం ఇచ్చి, తమ వివాహ వేడుకకు ఆహ్వానించనున్నారని కొండ చుట్టూ తిరిగి చెబుతారు. తర్వాత కనుమ పండుగ రోజున స్వామి, అమ్మవార్లు ఉదయం 7 గంటలకు అలంకార మండపం నుంచి బయల్దేరి కైలాస గిరి చుట్టూ 22 కిలోమీటర్లు తిరుగుతారు. చుట్టూ పలు గ్రామాల పేరిట ఉన్న మండపాలలో విడిది చేసి, గ్రామస్థుల నైవేద్యాలు అందుకుంటారు. తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆలయం చేరుకుంటారు" అని ఆయన చెప్పారు.
మనుషులే మోస్తూ సాగే గిరి ప్రదక్షిణ
గిరి ప్రదక్షిణకు ఏ వాహనాలూ ఉపయోగించకుండా.. మొత్తం 22 కిలోమీటర్ల దూరం పల్లకీలలో శివపార్వతుల మూర్తులను మనుషులే మోస్తూ చుట్టి రావడం దీని ప్రత్యేకతని, ఇది అనాదిగా వస్తున్న ఆచారమని అర్థగిరి స్వామి తెలిపారు.
"స్వామి అమ్మవార్లు పల్లకీలో గిరి ప్రదక్షిణ చేస్తుంటే, ఆ పల్లకీతోపాటు భక్తులు కూడా కొండ చుట్టూ తిరుగుతారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్యాణోత్సవం అయిన తర్వాత రోజు కూడా చుట్టుపక్కల గ్రామాల భక్తులకు, దేవతలకు దర్శనం ఇవ్వడానికి స్వామి, అమ్మవార్లు మరోసారి గిరి ప్రదక్షిణ చేస్తారు. భక్తులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆహారం, నీళ్లు, మజ్జిగ లాంటివి సరఫరా చేస్తారు" అని అర్థగిరి స్వామి చెప్పారు.
గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు కైలాస గిరి చుట్టూ తిరిగి ఆలయానికి వస్తున్న స్వామి అమ్మవార్లను శ్రీకాళహస్తి నుంచి ఎదురు వెళ్లి దర్శించుకుంటారు. దీనినే 'ఎదురు సేవ' అంటారు.
2026లో జనవరి 16న కనుమ పండుగ రోజున శివపార్వతుల మొదటి గిరి ప్రదక్షిణ, ఫిబ్రవరి 15న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో కల్యాణోత్సవం తర్వాత రోజు రెండో గిరి ప్రదక్షిణను నిర్వహిస్తారు.
'దక్షిణ కైలాసం'
పురాణాల్లో శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా వర్ణించారని ఆలయ ప్రధాన అర్చకుడు సంబంధం గురుకుల్ చెప్పారు. ఆలయం పక్కనే ఉన్న కైలాస గిరి కొండను శివుడి కైలాసంలోని ఒక భాగంగా వాటిలో వర్ణించారని వివరించారు.
"బ్రహ్మదేవుడు ఒకసారి శివుడు కోసం తపస్సు చేయాలని అనుకున్నప్పుడు, శివుడు కైలాసంలోని ఒక భాగం భూమిపై ఎక్కడ పడుతుందో అక్కడ తపస్సు చేస్తే, తాను ప్రత్యక్షమై మీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పారట. ఆ కైలాసంలో ఒక ముక్క ప్రస్తుతం శ్రీకాళహస్తి ప్రాంతంలో పడడంతో దానినే కైలాస గిరిగా భావించారు. అందుకే శ్రీకాళహస్తిని 'దక్షిణ కైలాసం' అంటారని లింగ పురాణంలో ఉంది. బ్రహ్మ అక్కడే తపస్సు చేశాడట. దీంతో శివుడు ప్రత్యక్షమై ఆయనకు జ్ఞానం ప్రసాదించారని పురాణాలు చెబుతున్నాయి" అని ఆయన వివరించారు.
శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరుగా చెప్పే ధూర్జటి కవి శ్రీకాళహస్తికి చెందినవారు. ఆయన రచించిన శ్రీకాళహస్తి మహత్యంలో కూడా శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా వర్ణించారు. అందులోని నత్కీరుడి కథ దీనికి ఒక ఉదాహరణ అని అర్చకులు గురుకుల్ చెప్పారు.
పాండ్య రాజు ఆస్థానంలో నత్కీరుడు ప్రముఖ తమిళ కవి. ఒకసారి రాజ్యంలో కరువు వచ్చిన సమయంలో ఒక శివాలయంలోని అర్చకుడు గుడి వదిలి వెళ్లిపోవాలని అనుకుంటాడు. దీంతో శివుడే ప్రత్యక్షమై స్వయంగా ఒక పద్యం రాసి ఆయనకు ఇచ్చి దీనిని మీ రాజుకు వినిపిస్తే నీ కష్టాలు తీరిపోతాయని చెప్పాడని ధూర్జటి కాళహస్తి మహత్యంలో రాశారు.
కాళహస్తి మహత్యం ప్రకారం...
రాజు దగ్గరకు వెళ్లిన పూజారి ఇచ్చిన పద్యంలో 'స్త్రీల కేశాలకు సహజ గంధం' ఉంటుందని రాయడాన్ని నత్కీరుడు తప్పు బడతాడు. పూజారిని అవమానిస్తాడు. దీంతో పూజారి శివుడి దగ్గరకు వెళ్లి ఆ విషయం చెప్పి బాధపడతాడు. దీంతో శివుడు మానవ రూపంలో పూజారిని వెంటబెట్టుకుని ఆ రాజసభకు వెళ్తాడు. 'పద్యంలో తప్పేముంది' అని నత్కీరుడితో వాదిస్తాడు.
కేశాలకు సహజ గంధం ఉండదని వాదించిన నత్కీరుడితో 'పార్వతీ దేవి కేశాలకు సహజ గంధం ఉంటుంది' అని చెబుతాడు శివుడు. అది మీకెలా తెలుసని వెక్కిరించిన నత్కీరుడికి శివుడు తన మూడో కన్ను తెరిచి నిజస్వరూపం చూపిస్తాడు.
అప్పటికీ దానిని అంగీకరించని నత్కీరుడు 'ఎన్ని కన్నులు చూపించినా మీ పద్యం తప్పే' అంటాడు. దీంతో ఆగ్రహించిన శివుడు కుష్టువ్యాధితో బాధపడమని నత్కీరుడిని శపిస్తాడు.
చివరికి తప్పు తెలుసుకుని శాప విమోచనం కోరిన నత్కీరుడికి కైలాస శిఖరాన్ని దర్శించుకుంటే శాప విముక్తి అవుతుందని శివుడు చెబుతాడు. ఆ శాపాన్ని భరిస్తూ ఎంతో దూరంలో ఉన్న కైలాసాన్ని దర్శించుకోవడం ఎలా అని నత్కీరుడు బాధపడుతుంటే, తన భక్తుడైన నత్కీరుడికి శివుడి కుమారుడు కుమారస్వామి దక్షిణ కైలాసం అయిన శ్రీకాళహస్తి గురించి చెప్పారు’’ అని శ్రీకాళహస్తి మహత్యంలో ఉంది.
కుమార స్వామి 'కైలాసం అంటే శివుడు ఉత్తర దిశ కైలాసమే అని అనలేదుగా. అందుకే దక్షిణ కైలాసం అయిన శ్రీకాళహస్తిని దర్శించుకో" అని నత్కీరుడికి సూచించారట'. అలా శ్రీకాళహస్తిలోని కైలాసగిరికి వచ్చిన నత్కీరుడు ఇక్కడే శాప విమోచనం పొందినట్లు శ్రీకాళహస్తి మహత్యంలో వివరించారని ఆలయ ప్రధానార్చకుడు సంబంధం గురుకుల్ చెప్పారు.
ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు?
వివిధ మూలికలు ఉన్న కైలాసగిరి చుట్టూ తిరగడం వల్ల మోక్షం, ఆరోగ్యం వస్తాయని భక్తులు విశ్వసిస్తారని సంబంధం గురుకుల్ చెప్పారు.
కానీ ఆలయాల్లో ఇలా ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణ చేయడం వెనుక అప్పటి పాలకుల సామాజిక ఉద్దేశాలు కూడా ఉన్నాయని ఎస్వీ యూనివర్సిటీ ఎమిరెటస్ ప్రొఫెసర్ డి.కిరణ్ క్రాంత్ చౌదరి చెప్పారు.
సమాజంలోని అన్ని వర్గాల వారినీ కలుపుకుపోవాలనే సదుద్దేశం కూడా ఇందులో ఉందని ఆయన తెలిపారు. అలా స్వామివారు తమ గ్రామానికి వచ్చి తమను పెళ్లికి పిలిచారు అనే భావన ప్రజల్లో కూడా కలుగుతుందని అన్నారు.
ఎస్వీ యూనివర్సిటీ ప్రిన్సిపల్‌గా, డీన్‌గా పనిచేసి రిటైర్ అయిన కిరణ్ క్రాంత్ చౌదరి చరిత్రకారులు కూడా. భారతీయ సంస్కృతి, చరిత్ర, కళలపై పరిశోధనలు చేసిన ఆయన చాలా పుస్తకాలు రాశారు.
శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల 'గిరి ప్రదక్షిణ' 16వ శతాబ్దం నుంచీ జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని ఆయన తెలిపారు.
వాయు లింగం, జ్ఞాన ప్రసూనాంబ
శ్రీ(సాలెపురుగు), కాళ(పాము), హస్తి(ఏనుగు) వాయులింగాన్ని పూజించి శివ సాయుజ్యం పొందడంతో ఆ మూడు జీవుల పేరిట ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని, శివుడికి భక్తితో తన కన్నులు అర్పించిన తిన్నడు భక్త కన్నప్ప అయ్యారని పురాణాలు చెబుతున్నాయి.
అయితే, పంచభూత లింగాలలో ఒకటైన శ్రీకాళహస్తిలోని శివలింగాన్ని వాయు లింగంగా ఎందుకు చెబుతారో ఆలయ పురోహితులు అర్థగిరి స్వామి వివరించారు.
"మనుషులు ఎలా శ్వాస తీసుకుని వదులుతారో అలాగే వాయు లింగేశ్వరుడికి కూడా ఉచ్ఛ్వాసనిశ్వాసలుఉంటాయి. కొద్దిగా కూడా గాలి చొరబడని గర్భాలయంలో స్వామివారి ముఖానికి ఎదురుగా ఉండే రెండు దీపాలు స్వామివారి ఉచ్ఛ్వాసనిశ్వాసలకు నిరంతరం కదులుతుంటాయి. అందుకే స్వామివారికి వాయు లింగేశ్వరుడు అనే పేరు వచ్చింది" అని ఆయన తెలిపారు.
"శ్రీకాళహస్తిలో పార్వతీ దేవి జ్ఞానసిద్ధి కోసం తపస్సు చేశారు. దీంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మవారికి జ్ఞానం ప్రసాదించారు. అందుకే పార్వతీదేవి ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబిక అయ్యారు. జ్ఞానం అంటే సరస్వతి, అంబ అంటే పార్వతి, ప్రసూన అంటే లక్ష్మి. మూడు రూపాలూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అమ్మవారిని జ్ఞాన ప్రసూనాంబగా పిలుచుకుంటారు. వాయు లింగం శిరస్సున ఐదు తలల సర్పం, అమ్మవారి నడుముకు నాగాభరణం ఉండడం వల్ల ఇక్కడి శివపార్వతులను దర్శించుకుంటే నాగ దోషాలు, కాలసర్ప దోషాలు, రాహు కేతు దోషాలు నివారణ అవుతాయని పురాణాలు చెబుతున్నాయి" అని అర్థగిరి స్వామి అన్నారు.
ప్రపంచంలో అన్ని ఆలయాలలో నవగ్రహాలు దూరంగా ఉంటాయని, కానీ శ్రీకాళహస్తిలో వాయు లింగేశ్వరుడు ఆ నవగ్రహాలనే తన కవచంగా ధరించారని అర్థగిరి స్వామి చెప్పారు.
"ఇలాంటి నవగ్రహ కవచం ఎక్కడా ఏ శివ క్షేత్రంలోనూ ఉండదు. ఇక్కడ అది ఉంటుంది కాబట్టే దోష నివారణ పూజలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధి గాంచింది" అని ఆయన తెలిపారు.
శ్రీకాళహస్తి చరిత్ర
శ్రీకాళహస్తికి మొదటి పేరు తిరుకాళస్తి అని, ఇది సంస్కృతంలో శ్రీకాళహస్తిగా మారిందని చరిత్రకారుడు కిరణ్ క్రాంత్ చౌదరి చెప్పారు.
తర్వాత మొదటి రాజరాజ చోళుడు తన బిరుదైన 'ముమ్మడి చోళుడు' అని వచ్చేలా దీనికి 'ముమ్మడి చోళపురం' అనే పేరు కూడా పెట్టారని తెలిపారు.
విజయనగర కాలంలో వేసిన శిలా శాసనాలపై కూడా తిరుకాళస్తి లేదా ముమ్మడి చోళపురం అని రాసి ఉంటుందని ఆయన వివరించారు.
శ్రీకాళహస్తి గురించి వేసిన శిలా శాసనాలు మొదటి రాజరాజ చోళుడి పాలనాకాలంలో క్రీ.శ 1000-01 నుంచే అందుబాటులో ఉన్నాయని కిరణ్ క్రాంత్ చెప్పారు.
"శ్రీకాళహస్తి మొత్తం ఆలయ నిర్మాణాన్ని ఆరు దశలుగా విభజించవచ్చు. ఏడో శతాబ్దం నాటికి తమిళ సాహిత్యం దేవారం, తిరువాచకంలోని దేవుడి వర్ణనల ద్వారా ఈ ఆలయం ఉన్నట్టు తెలుస్తోంది. రెండో దశ మొదటి రాజరాజ చోళుడి కాలంలో 11వ శతాబ్దంలో జరిగింది. మూడో దశలో గర్భాలయం చుట్టూ ఉన్న నిర్మాణాలు, దక్షిణ దిశగా ఉండే మూడో ప్రాకారం, జ్ఞాన ప్రసూనాంబ గోపురం అన్నీ కుళోత్తుంగ చోళుడి కాలంలో జరిగాయి. నాలుగో దశలో విజయనగర రాజులు రాజ గోపురం, నూరు కాళ్ల మండపం లాంటి నిర్మాణాలు చేపట్టారు. ఐదో దశలో స్థానిక జమీందార్లు, గురుకుల్స్ నాలుగైదు మండపాలు నిర్మించారు. ఆరో దశలో నాట్టుకోట్టై చెట్టియార్లు 1914 ఆ ప్రాంతంలో దాదాపు రూ.15-20 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం ఆలయాన్నీ రీమోడల్ చేశారు. అందుకే ఆలయం లోపల తిరుగుతుంటే మనకు ఆలయంలో స్తంభాలన్నీ ఒకే రకంగా కనిపించవు"
శ్రీకాళహస్తి ఆలయాభివృద్ధికి చోళులు, విజయనగర రాజులతోపాటు, కాకతీయులు కూడా నిధులు ఇచ్చినట్లు శిలా శాసనాలు ఉన్నాయని కిరణ్ క్రాంత్ చౌదరి వివరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)