You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మనుషులే దేవుళ్లుగా మారే పురాతన భారతీయ సంప్రదాయం
- రచయిత, సుధా జీ తిలక్
- హోదా, దిల్లీ
కేరళలో దాదాపు 300 ఏళ్లుగా ఒక కుటుంబానికి చెందిన పురాతన ఇల్లు ప్రాచీన జానపద ఆచారం తెయ్యంకు వేదికగా ఉంది.
పురాతన గిరిజన సంప్రదాయ మూలాలు ఉన్న ఈ తెయ్యం సంస్కృతి హిందూ పురాణాల్లో ప్రస్తావన కంటే ముందు నుంచే ఉంది. ప్రతి ప్రదర్శన ఓ అద్భుతమైన రంగస్థల అనుభూతిని ఇవ్వడంతోపాటు, ప్రదర్శనకారుడు ప్రత్యక్షంగా ‘దేవుని అవతారం’లా మారడం ఇందులో కనిపిస్తుంది.
కేరళలో, పొరుగునే ఉన్న కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో అనేక రకాల కాస్ట్యూమ్స్, ముఖానికి వేసుకునే రంగులు, నృత్యాలు, సంగీతం వంటివాటితో దేవుళ్లను కొలుస్తారు.
తెయ్యం: యాన్ ఇన్‌సైడర్స్ విజన్
ఏటా కేరళ వ్యాప్తంగా కుటుంబ వేడుకల్లో, ఆలయాల దగ్గర దాదాపు వెయ్యి తెయ్యం ప్రదర్శనలు జరుగుతుంటాయి. వెనకబడిన కులాలు, ఆదివాసీ తెగలకు చెందిన పురుషులు దేవుళ్ల వేషంలో ప్రదర్శనలు చేస్తారు.
నిప్పులపై నడవడం, మంటల గుండా నడవడం, పెద్ద గొంతులో శ్లోకాలు చెప్పడం వంటివాటితో అక్కడ ఓ రకమైన ఉద్విగ్న వాతావరణం ఉంటుంది. ఇది సంప్రదాయ కళల ప్రదర్శనశాల అన్న అభిప్రాయం కలిగిస్తుంది.
తన కొత్త పుస్తకం ‘తెయ్యం: యాన్ ఇన్‌సైడర్స్ విజన్’ అనే పుస్తకంలో చరిత్రకారుడు కేకే గోపాలకృష్ణన్ తన కుటుంబం తరాలుగా తెయ్యంకు ఆతిథ్యం ఇవ్వడం గురించి, శక్తిమంతమైన ఈ సంప్రదాయం గురించి ప్రస్తావించారు.
కాసర్‌గఢ్ జిల్లాలోని గోపాలకృష్ణన్ పురాతన ఇంటి ప్రాంగణంలో తెయ్యం ప్రదర్శనలు ఇస్తారు. ఆ ప్రదర్శనలను చూసేందుకు వందల మంది వస్తారు.
కేరళలో అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా తెయ్యం సీజన్ ఉంటుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత, శీతాకాలపు నెలల్లో ఇది సాగుతుంది. ప్రత్యేకించి ఉత్తర జిల్లాలైన కన్నూర్, కాసర్‌గఢ్ వంటివి తెయ్యంకు ఆతిథ్యం ఇస్తాయి. ఆలయాల దగ్గర ఉండే వేదికల్లో, కుటుంబ ఎస్టేట్లలో ఇవి జరుగుతుంటాయి.
ముందుగా అడవిలో పూజలు
పూర్వీకులను గౌరవించడం, దేవతను ఆరాధించడం, బలం, భద్రతకు గుర్తుగా పులి ఆత్మలను పూజించడం వంటివి చేస్తారు.
స్థానిక దేవతలకు గౌరవంగా ప్రదర్శన జరిపేముందు, దగ్గరిలోని అడవిలో సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అది ‘దైవదూతల ఇల్లు’ అన్న నమ్మకంతో అలా చేస్తారు.
ఆ వేడుక తర్వాత దైవదూతను దైవం ఆవహిస్తుందని నమ్ముతారు.
ఆచారాల్లో మహిళల కీలక పాత్ర
గోపాలకృష్ణన్ నాయర్ కులంలో మాతృవంశ తెగ అయిన నంబియార్ కమ్యూనిటీకి చెందినవారు. కుటుంబంలో అందరికన్నా పెద్ద వ్యక్తి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. వయసు, అనారోగ్యం వంటి కారణాలతో ఆయన ఆ బాధ్యతలు నిర్వహించలేకపోతే, కుటుంబంలో తర్వాత పెద్ద అయిన పురుషుడు ఆ విధులు నిర్వహిస్తారు.
కుటుంబంలో అందరికన్నా వయసులో పెద్ద అయిన మహిళ, ఈ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు.
సంప్రదాయాలను సరిగ్గా పాటించేలా, ఆచార వ్యవహారాలు నెరవేర్చేలా, ఇళ్లల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగేలా చూసుకుంటారు.
‘‘కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికి, కొనసాగించడానికి వారు అన్నివిధాలా ప్రయత్నిస్తారు. సమాజం నుంచి వారు చాలా గౌరవం పొందుతారు’’ అని గోపాలకృష్ణన్ చెప్పారు.
అగ్నికి ప్రాధాన్యత
గట్టిగా ఏడవడం, మంటలు, ఇతిహాసాలలోని లోతును ప్రతిబింబించే సన్నివేశాలు, నృత్యాలు తెయ్యం ప్రదర్శనలో నిండి ఉంటాయి.
ఈ ప్రదర్శనలో భాగంగా సాహసోపేతమైన పనులు చేసేవారికి కొన్నిసార్లు తీవ్రమైన గాయాలవుతాయి. అవయవాలు కోల్పోవడం వంటివి కూడా జరుగుతుంటాయి.
‘‘స్వచ్ఛతకు, ఆచారం పాటించడం ద్వారా వచ్చే శక్తికి సంబంధించిన తెయ్యం ప్రదర్శనల్లో నిప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని ప్రదర్శనల్లో తెయ్యం నృత్యకారులు మంటల గుండా నడవడం, కాగడాలను పట్టుకోవడం వంటివాటితో నేరుగా అగ్నితో అనుసంధానంలోకి వెళ్తారు. దేవతల అతీంద్రియశక్తులకు గుర్తుగా ఇవి నిర్వహిస్తారు’’ అని గోపాలకృష్ణన్ చెప్పారు.
దేవతల శక్తిని వర్ణించడానికి, ఆధ్యాత్మిక వాతావరణ పరిస్థితులు సృష్టించడానికి అగ్ని ఒక శక్తిమంతమైన సాధనంగా ఉంటుందని భావిస్తారు.
దేవతల రూపంలో...
తెయ్యం ప్రదర్శన చేసేవారిని దేవదూతలుగా భావిస్తారు.
దేవదూతలను... దేవుళ్లు, దేవతలు, పురాతన ఆత్మలు, జంతువులు, ప్రకృతి శక్తుల వ్యక్తీకరణగా ఈ ప్రదర్శనలను చూడొచ్చు.
తెయ్యం ప్రదనర్శనకారుడు కాళీమాత రూపం రక్తేశ్వరిలా కనిపిస్తున్నారు.
ఆమె రక్తంతో తడిసినట్టుగా ఆ రూపాన్ని చిత్రీకరించారు. ఆమెను శక్తికి, విధ్వంసకర సామర్థ్యానికి సంకేతంలా చూపించారు.
ఇలాంటి వేషధారణ, ఆచారపరమైన నృత్యం ద్వారా ప్రదర్శనకారుడు కాళీమాత శక్తిని, భద్రతను, న్యాయాన్ని, ఆధ్యాత్మిక భావనను ప్రతిబింబిస్తారు.
ప్రత్యేక అలంకరణలు
ప్రదర్శన సమయంలో కళాకారులు పూర్తిగా పరివర్తన చెందుతారు. దేవదూతల్లా కనిపిస్తారు. అనేక రకాల కాస్ట్యూమ్‌లు, శరీరంపై వేసుకునే పెయింట్‌లు, విభిన్నరంగులతో ప్రాణంతో కదులుతున్న దేవతల్లా కనిపిస్తారు.
దేవత రూపంలో కనిపించండానికి ఓ కళాకారుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నృత్యం ప్రారంభించేముందు తన రూపాన్ని మరోసారి జాగ్రత్తగా అద్దంలో చూసుకుంటున్నారు. అప్పుడు జాగ్రత్తగా ఆధ్యాత్మిక రూపంలోకి మారే సన్నాహాలు జరుగుతాయి.
ముఖంపై ప్రత్యేక గుర్తులు, విభిన్న డిజైన్‌లు, విలక్షణమైన రంగులు వంటివాటితో తెయ్యం కళాకారుల మేకప్ చూడగానే ఆకట్టుకుంటుంది.
దేవదూతలను తలపించేలా కళాకారుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సంప్రదాయ కళల వైవిధ్యాన్ని పట్టిచూపేలా ఇది ఉంటుంది. కొన్ని రకాల తెయ్యం ప్రదర్శనలకు ముఖంపై పెయింటింగ్‌లు అవసరం లేదు. మాస్కులు చాలు.
ప్రకృతితో మనిషి అనుబంధాన్ని కళ్లకు కట్టేలా...
ప్రకృతిలో ఇతర ప్రాణులకు, మనుషులకు గల అనుబంధం తెయ్యం మూలాల్లో కనిపిస్తుంది.
పాకుతున్న మొసలిలా కనిపించే ఈ తెయ్యం దేవదూత ప్రదర్శన సరీసృపాల శక్తిని సూచిస్తుంది. ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తామన్న భరోసాను అందిస్తున్న భావన కలిగిస్తుంది.
ఇలాంటి కాస్ట్యూమ్‌లు, నృత్యభంగిమలతో తెయ్యం ప్రకృతితో మనిషికి వేళ్లూనుకుపోయిన అనుబంధాలకు నిదర్శనంగా ఉంటుంది.
భక్తులకు ఆశీర్వాదం
ప్రదర్శన తర్వాత దైవదూత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఓ మహిళా భక్తురాలు దైవదూతతో తన సమస్యలను చెప్పుకుంటున్నారు. దేవుడు తన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
అప్పటిదాకా ప్రదర్శనలతో ఉన్న ఓ రకమైన ఉద్విగ్న వాతావరణంలో ఆధ్యాత్మికత కనిపిస్తుంటుంది. ఇక్కడ భక్తితో పాటు మానసిక బలహీనతలూ బయటపడుతుంటాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)