నాగోబా జాతర: కొత్త కోడళ్లను నాగేంద్రునికి పరిచయం చేసే ఈ జాతర ఎలా జరుగుతుందంటే...

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి (జనవరి21) నాగోబా విగ్రహాన్ని గోదావరి జలాలతో అభిషేకించడంతో ప్రారంభమైంది.

నాగోబా జాతరను సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద ఆదివాసీ జాతరగా భావిస్తారు.

రాజ్‌గోండ్ ఆదివాసీ తెగలోని ‘మేస్రం వంశస్తులు’ ప్రతీ ఏడాది ఈ జాతరను నిర్వహిస్తారు.

ఈ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి ఈ జాతరకు ఆదివాసీలు తరలివస్తారు.

నాగ దేవతను పూజించే జాతర ఇది.

పాత ఆలయం స్థానంలో సుమారు 5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన రాతి ఆలయంలో ఈసారి జాతరను నిర్వహిస్తున్నారు.

ఆలయ నిర్మాణ ఖర్చులను ఆదివాసీల నుంచి మూడేళ్లపాటు చందాల రూపంలో సేకరించారు.

జాతరకు దూర ప్రాంతాల నుంచి కుటుంబాలతో ఎడ్లబండ్లపై తరలి వస్తారు. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్ల కింద బస చేస్తారు.

ఈ సందర్భంగా తూమ్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పెద్దలకు పిండ ప్రదానం చేస్తారు.

నిర్ణయించిన ముహూర్తానికి సంప్రదాయ వాయిద్యాలతో, గోదావరి జల కలశంతో ఆలయ ప్రవేశం చేస్తారు.

కొత్త కోడళ్ల ను నాగోబా దైవానికి పరిచయం చేసే కార్యక్రమాన్ని ‘భేటింగ్’ అని పిలుస్తారు. తెల్లని వస్త్రాల్లో దైవ సన్నిధిలో కొత్త కోడళ్లను నాగోబాకు, తెగ పెద్దలకు పరిచయం చేస్తారు.

మెస్రం వంశీయుల్లో భేటింగ్ అత్యంత ప్రాధాన్యముంటుంది.

భేటింగ్ జరిగే వరకు ఈ వంశీకుల్లో కొత్త కోడళ్లను పూజా కార్యక్రమాలకు దూరంగా ఉంచుతారు.

జాతర చివరి రోజు ‘దర్బార్’ ను నిర్వహిస్తారు. దర్బార్‌లో భాగంగా ఆదివాసీలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తారు.

నిజాం కాలం నుంచి ఈ దర్బార్ ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతోంది. నిజాం పోలసులు కొమురం భీమ్ ను హత్య చేసిన తర్వాత ఆదివాసీలలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు , వారికి దగ్గరయ్యేందుకు ఈ దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఆస్త్రియా దేశానికి చెందిన హైమన్ డార్ఫ్ అనే ఆంత్రోపాలజిస్టు సూచన మేరకు ఈ దర్బారును నిజాం ప్రారంభించారు.

ఈ దర్బార్ లో ఇతర రాష్ట్రాల ఆదివాసీలు కూడా తమ సమస్యలను విన్నవిస్తారు.

వారం రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది.

ఈ జాతరకు సంబంధించిన మరికొన్ని ఫొటోలు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)