You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు, అసలీ ట్రెండ్ ఎప్పుడు మొదలైంది?
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇప్పుడు తెలుగునాట అరుణాచల క్షేత్ర పర్యటన, ‘మహాత్మ్యం’.. ఇవన్నీ నిరంతరం చర్చలో ఉంటున్నాయి.
భక్తి చానెళ్లు, ప్రవచనకారుల ప్రసంగాల్లో, ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న హిందువులు కలిసిన సందర్భంలో, అన్నిటికీ మించి సోషల్ మీడియాలో అరుణాచలం గురించి చర్చ లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు.
ఈ మధ్య అరుణాచల క్షేత్రం తెలుగువారితో నిండిపోయిందని కొన్ని చోట్ల వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యే తెలుగు వారికి అరుణాచలం గురించి తెలిసింది అని ఎక్కువ మంది నమ్ముతారు.
కానీ, తెలుగువారికి ఆ క్షేత్రం గురించి తెలిసింది ఈ మధ్య కాదు, చాలా ఏళ్ల క్రితమే వారికి దీనితో పరిచయం ఉంది.
హిందువులు విశ్వసించే పంచభూత లింగాల క్షేత్రల్లో ఒకటిగా భక్తులకు అరుణాచలం (తిరువణ్ణామలై) తెలుసు. వాటిలో ఒకటి శ్రీకాళహస్తి ఆంధ్రలోనే ఉండగా, మిగిలిన నాలుగూ తమిళనాడులో ఉన్నాయి.
ఇటీవల ప్రవచనకర్తల ప్రవచనాల కన్నాముందే, తెలుగువారిని అరుణాచలం వైపు ఆకర్షించిన విషయం ఒకటుంది. అదే రమణ మహర్షి. అక్కడకు తెలుగువారు పెరగడంలో రమణ మహర్షి పాత్ర ఎక్కువే.
రమణ మహర్షి మీద భక్తితో దశాబ్దాల క్రితమే తమిళనాడులోని తిరువణ్ణామలైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డ తెలుగు కుటుంబాలు కొన్ని ఇప్పటికీ కనిపిస్తాయి.
అక్కడి ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఎందరో తెలుగువారు ఉంటారు. వారంతా 60లు, 70ల నుంచే అరుణాచలానికి తరచూ వెళ్లేవారు.
వారిలో ఎక్కువ మంది అక్కడున్న అరుణాచలేశ్వరుడితో పాటు, ఆ క్షేత్రంలో నివసించిన రమణ మహర్షి, శేషాద్రి స్వామి వంటి సాధువులకు కూడా భక్తులే.
వీరంతా ఆయా సాధువులను సాక్షాత్తూ దేవుడిలాగే చూస్తారు. రమణ మహర్షిపై భక్తితో అక్కడకు వెళ్లినవారు ఎక్కువగా కనిపిస్తారు.
తెలుగునాట ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం, గోదావరి జిల్లాల్లో జిన్నూరు నాన్నగారు.. ఇలాంటి కొందరు రమణ మహర్షి గురించి తెలుగువారికి బాగా తెలియడానికి కారకులయ్యారు.
మరీ చరిత్రలోకి వెళితే, 18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి.
ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
తిరువణ్ణామలైతో పాటు పరిసర గ్రామాల్లో కూడా కొన్ని తెలుగు శాసనాలు కనిపించినట్టు బీబీసీకి చెప్పారు చరిత్రకారులు బాలమురుగన్.
ఈ చరిత్రను పక్కన పెడితే, ఆధ్యాత్మిక భావనలతో తెలుగునేల నుంచి తిరువణ్ణామలై వెళ్లే వారి సంఖ్య మాత్రం దశాబ్దాల నుంచీ ఎక్కువగానే ఉంది.
తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు తొలిసారి అరుణాచలం వచ్చినట్టు బీబీసీతో చెప్పారు సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన 64 ఏళ్ళ అరుణాచలం.
''నేను 1961లో పుట్టాను. 68లో ఇక్కడకు మొదటిసారి వచ్చాను. మా నాన్న చలం అభిమాని. నేను చలంగారిని చూశాను. ఆయనతో ఆడుకున్నాను. ఆయన ఇంట్లోనే ఉండేవాళ్లం. 1968-72 మధ్యనే 13సార్లు అరుణాచలం వచ్చాం. వస్తే 15-30 రోజులు ఉండిపోయేవాళ్లం. మా అమ్మానాన్న ఏడాదికి నాలుగుసార్లు వచ్చేవారు. 79లో చలం మరణించారు. 82లో ఆయన కుమార్తె సౌరిస్.. భీమిలి వెళ్లిపోయారు. మేం అటు వెళ్లేవాళ్లం. 2009లో నా భార్య చనిపోయాక ప్రతి నెలా అరుణాచలం రావడం అలవాటైంది. ఇప్పుడు ఇక్కడ ఒక గది తీసుకుని ఉంటున్నాను'' అని బీబీసీకి చెప్పారు అరుణాచలం.
ఆయన తండ్రి 1972-73 ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటు చేసి గుంటూరు నుంచి భక్తులను అరుణాచల క్షేత్రానికి తీసుకువచ్చినట్టు చెప్పారు అరుణాచలం.
తాను 2019లో సొంతూరు గునిపూడి నుంచి 645 కిలోమీటర్ల దూరం 16 రోజుల పాటు నడిచి అరుణాచలం వచ్చినట్టు చెప్పారాయన.
''నన్ను ఇటు లాగింది భగవానే. భగవాన్ అంటే పిచ్చి ప్రేమ. ఎంఆర్ నాగేశ్వర రావు గారని.. ఇప్పుడు చాగంటి గారిలానే, భగవాన్ గురించి చెప్పేవారు. నువ్వెవరో తెలుసుకో అనేవారు. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతోంది'' అన్నారు అరుణాచలం.
జిన్నూరు నాన్నగారు అనే ఆధ్యాత్మిక గురువు ఉపన్యాసాల ద్వారా రమణ మహర్షి ఆశ్రమానికి దగ్గరయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఉష.
భర్తతో కలసి ఇప్పుడు ఆమె అరుణాచలంలోనే ఉంటున్నారు.
''జిన్నూరు నాన్నగారు నాకు రమణ మహర్షి అక్షరమాల చదవమని చెప్పారు. 1984 అక్టోబరులో మొదటిసారి అరుణాచలం వచ్చాను. ఇక్కడ మూడు రోజులుండి, తరువాత తిరుమల వెళ్దాం అనుకున్న వాళ్లం కాస్తా, ఆ రెండు రోజులూ కూడా ఇక్కడే ఉండిపోయాం. అప్పటి నుంచి ఏటేటా వచ్చేవాళ్లం. పిల్లలు పెద్దవాళ్లయ్యే కొద్దీ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం మొదలుపెట్టాం. ఇక్కడ ఉన్నన్ని రోజులూ రోజూ గిరి ప్రదక్షిణ చేసేదాన్ని. ఉదయం 2 గంటలకు మొదలుపెడితే 5 గంటలకు తిరిగి గుడికి చేరుకుని, అక్కడ సేవల్లో పాల్గొనేవాళ్లం. తరువాత రమణాశ్రమానికి వెళ్లేవాళ్లం. రోజూ స్కందాశ్రమం చూసేవాళ్లం. భగవాన్ రమణ మహర్షి గురించి విన్నప్పుడే ఇక్కడ ఉండాలనిపించింది. బాధ్యతలు తీరిన తరువాత, 2017లో జిన్నూరు నాన్నగారు శరీరం వదిలాక, 2018లో నా భర్త రంగరాజుతో కలసి ఇక్కడ స్థిరపడ్డాను'' అని బీబీసీకి చెప్పారు ఉష.
విశాఖపట్నానికి చెందిన శ్యామల, తన వ్యాపారాలు వారసులకు అప్పగించి, ఎక్కువగా అరుణాచలంలోనే ఉంటున్నారు.
''నేను దాదాపు 33 ఏళ్ల క్రితం మా గురువుగారు జిన్నూరు నాన్నగారితో కలసి అరుణాచలం వచ్చాను. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. విశాఖపట్నంలో రమణ కేంద్రం ఒకటి ఏర్పాటు చేశాను. అరుణాచలం ఆంధ్రాశ్రమానికీ విరాళాలు ఇచ్చాం. తెలిసిన వారందరికీ ఒక్కసారైనా అరుణాచలం వెళ్లమని చెబుతుంటాను'' అని బీబీసీతో చెప్పారు శ్యామల.
అయితే రిటైరైన వారే కాదు, యువత కూడా కొందరు తిరువణ్ణామలై వెళ్లి స్థిరపడడం కనిపిస్తుంది.
అనంతపురానికి చెందిన 40 ఏళ్ల మహేంద్రనాథ్ రెడ్డి, కుటుంబంతో పాటు మూడేళ్ల క్రితం తిరువణ్ణామలైలో స్థిరపడ్డారు. ఆయన ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.
''నా స్నేహితుని తండ్రి భగవాన్ భక్తులు. నేను 9-10 తరగతుల్లో స్నేహితునితో కలసి కంబైన్డ్ స్టడీస్ చేసేప్పుడు వారింట్లో రమణ మహర్షి ఫొటో చూశాను. తరువాత ఓ 19 ఏళ్ల క్రితం ఒక పుస్తకం చదివాక రమణ మహర్షిపై ఆసక్తి కలిగింది. తరువాత ఆయనే నా జీవితం అయ్యారు. నేను అరుణాచలంలో స్థిరపడతాను అనగానే చాలా మంది సన్యాసం తీసుకుంటానని కాస్త భయపడ్డారు. నా కుటుంబ సభ్యులు ఇక్కడ సర్దుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు మొదట్లో. ఇప్పుడు అంతా బానే ఉంది. భగవాన్ రమణ మహర్షి కోసమే ఇక్కడకు వచ్చాను. ఆయనే నా జీవితం'' అన్నారు మహేంద్ర నాథ్ రెడ్డి.
సాయంత్రం పూట అరుణాచలంలోని రమణాశ్రమానికి వెళితే అక్కడ తెలుగులో మాట్లాడుకునే వారు చాలా మంది కనిపిస్తారు. వారంతా దశాబ్దాలుగా ఈ ఊరితో అనుబంధం పెంచుకున్నవారు. అందుకే అక్కడ రమణాశ్రమంలో తెలుగులో కూడా కొన్ని బోర్డులు కనిపిస్తాయి.
రమణాశ్రమంతో పాటు శేషాద్రి స్వామికి కూడా తెలుగు నాట భక్తులు ఉన్నారు. ఆయన ఆశ్రమం కూడా ఆ పక్కనే ఉంటుంది.
అయితే స్థూలంగా అలా వచ్చిన వారిలో ముందు నుంచీ ఆధ్యాత్మిక అవగాహన ఎక్కువ ఉన్న కుటుంబాలు, కొన్ని కులాల వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. సాహిత్య పరిచయం ద్వారా వచ్చిన వారు కొందరుంటారు.
1929-2011 మధ్య జీవించిన గుడివాడకు చెందిన మెరుగుమాల రాధా నాగేశ్వర రావు మొదట్లో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేవారు. యాదవ కులానికి చెందిన ఆయనకు, తన మేనమామ ద్వారా రమణ మహర్షిగా తెలిసింది. అయితే రమణ మహర్షి జీవించి ఉండగా ఆయన్ను చూడని ఎంఆర్ నాగేశ్వర రావు, కాలక్రమంలో రమణ మహర్షి భక్తునిగా మారడమే కాకుండా, రమణ మహర్షిపై రమణవాణి, రమణస్థాన్ అనే పత్రికలు నిర్వహించారు. విస్తృతంగా పర్యటిస్తూ రమణ మహర్షి గురించి ప్రవచనాలు చెప్పేవారు.
''రమణ మహర్షి భక్తునిగా, రమణ తత్త్వ ప్రచారకునిగా ఉంటూనే, కమ్యూనిస్టు పార్టీని ఎన్నడూ ద్వేషించలేదనీ త్రిపురనేని గోపిచంద్ శిష్యుడిగా ఉంటూ, సాహిత్య రంగంలో చురుగ్గా ఉండేవారని'' ఆయన కుమారుడు, ప్రముఖ పాత్రికేయులు మెరుగుమాల నాంచారయ్య బీబీసీకి చెప్పారు.
తెలుగునాట ఎక్కువగా బ్రాహ్మణులు, ఇతర కులాల్లోని కాస్త స్థిరపడ్డ కుటుంబాల్లో ఈ రమణ మహర్షి గురించి తెలిసిన వారు బాగా కనిపిస్తారు.
తెలుగునాట ఆధ్యాత్మిక ప్రపంచంలో రమణ మహర్షి గురించి తెలియడానికి కారకుల్లో కావ్యకంఠ శ్రీ వాసిష్ఠ గణపతిమునిగా ప్రాచుర్యం పొందిన అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి కూడా ఒకరు. గణపతిముని, రమణమహర్షి బోధనలతో 'రమణగీత' అని ఒక గ్రంథం కూడా రాశారు. ఆయన్ను గురువుగా అంగీకరించారు. గణపతిముని విజయనగరం దగ్గరలో కలవరాయి అగ్రహారంలో జన్మించిన సంస్కృత పండితులు, ఆధ్యాత్మిక వేత్త. రమణ మహర్షిని ఆయన ఆధ్యాత్మిక ప్రస్థాన తొలినాళ్లలో స్వయంగా కలిసిన తక్కువ మంది తెలుగువారిలో ఆయనొకరు. ఆయన బోధనలను గ్రంథస్తం చేశారు. రమణ మహర్షికి ‘భగవాన్ రమణ మహర్షి’ అనే పేరు పెట్టింది కూడా ఈయనే అని కొందరు భక్తులు చెబుతారు.
ఎవరీ రమణ మహర్షి?
వెంకట్రామన్ అయ్యర్‌గా 1879లో తిరుచుళిలో పుట్టిన ఈయన సన్యాసాశ్రమ పేరు రమణ మహర్షి.
భక్తులు భగవాన్ అని, రమణులు అని రకరకాల పేర్లతో పిలుస్తారు.
1896లో ఆయన అరుణాచలం చేరుకుని అక్కడే ఉండిపోయారు.
1922 నుంచి 1950లో ఆయన సమాధి అయ్యే వరకూ రమణాశ్రమంలో ఉన్నారు.
భారత్‌తో పాటు, భారతీయ ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న విదేశీయులు పెద్ద ఎత్తున ఈయన్ను దర్శించుకునే వారు. ఆయన సమాధి ఈ ఆశ్రమంలోనే ఉంది.
''నేను'' అనే దాని గురించి తెలుసుకోవడం, ''మౌనం'' ప్రాధాన్యం వంటివి ఆయన బోధనల్లో ప్రముఖమైనవి. ఆయన స్వయంగా తెలుగు మాట్లాడడంతో పాటు, తెలుగులో రాసేవారు.
తెలుగు భక్తుల కోసం ఆయన చేతి రాత ప్రతులను స్కాన్ చేసి పుస్తకాలు ఇస్తారు ఆశ్రమం వారు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర, తమిళనాడు కలసి ఉన్నప్పటి నుంచే ఆయనకు ఇక్కడ భక్తులు ఉండేవారు.
ఎవరీ గుడిపాటి వెంకటాచలం?
గుడిపాటి వెంకటాచలం… 'చలం' గా పాఠకులకు పరిచయం. స్త్రీల జీవితాలు కథనాంశంగా అనేక రచనలు చేశారు.
ఇప్పటికీ ఆయన రచనలు సాహితీలోకంలో చాలా పెద్ద చర్చనీయమైన అంశాలు. అనేక కట్టుబాట్లను ప్రశ్నించారు. ఆయన రచనలను తీవ్రంగా వ్యతిరేకించేవారూ ఉండేవారు.
తన చివరి దశలో ఆధ్మాత్మికత పట్ల ఆకర్షితుడైన చలం.. అరుణాచలం వెళ్లి స్థిరపడిపోయారు. ఆయన సమాధిని అక్కడే నిర్మించారు.
ఆయన కుమార్తె సౌరిస్ సన్యాసం తీసుకున్నారు. ఆయన ప్రభావంతో అరుణాచలం – రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిన తెలుగు వారు చాలా మంది ఉన్నారు.
ఎవరీ జిన్నూరు నాన్నగారు?
పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరుకు చెందిన భూపతిరాజు వెంకట లక్ష్మీ నరసింహ రాజునే జిన్నూరు నాన్నగారు అని ఆయన భక్తులు పిలుచుకుంటారు.
1957 నుంచి ఆయనకు రమణ మహర్షిపై భక్తి కలుగగా, 1959లో మొదటిసారి తిరువణ్ణామలై వచ్చినట్టు ఆయన భక్తులు చెబుతారు.
తెలుగునాట రమణ భక్తిని ఈయన బాగా ప్రచారం చేశారు. 1984-85 మధ్య జిన్నూరులో రమణ క్షేత్రాన్ని నిర్మించారు. తిరువణ్ణామలైలో ఆంధ్రాశ్రమం పేరుతో ఒక ఆశ్రమం కట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)