'భార్యాభర్తల మధ్య శారీరక సంబంధానికి సమ్మతి అవసరం': హైకోర్ట్ కీలకవ్యాఖ్య

    • రచయిత, భార్గవ్ పారిఖ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"వివాహంలో లైంగిక సంబంధం సాధారణమే కానీ, దానికి పరస్పర అంగీకారం, గౌరవం అవసరం. దంపతుల మధ్య పరస్పర అంగీకారం లేకుండా అసహజ శృంగారం మానసిక, భావోద్వేగ సమస్యలకు దారితీస్తుంది" అని గుజరాత్ హైకోర్టు ఒక విడాకుల కేసులో వ్యాఖ్యానించింది.

ఈ కేసులో భర్తకు ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది.

కేసులో కక్షిదారులైన భార్య, భర్తలు తమ వాదనలను కోర్టు ముందుంచారు. తన భర్త శారీరకంగా, మానసికంగా హింసించారని భార్య ఆరోపించగా, వాటిని భర్త ఖండించారు.

భార్య ప్రస్తుతం ఆమె వృద్ధ తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉంటున్నారు.

అసలు విషయమేంటి?

అహ్మదాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సీమా (పేరు మార్చాం) 2022లో హరియాణాలోని గుర్గావ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త, ముగ్గురు పిల్లల తండ్రిని వివాహం చేసుకున్నారు.

రెండేళ్ల తర్వాత "శారీరక, మానసిక హింస, అసహజ లైంగిక సంబంధాల"తో విసిగిపోయిన సీమా, 2025 అక్టోబర్ 14న అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు.

తన భర్త లోకేష్(పేరు మార్చాం) 10 కిలోల వెండి, రూ. 15 లక్షలు డిమాండ్ చేశారని సీమా ఫిర్యాదులో ఆరోపించారు.

"మద్యం తాగిన తర్వాత, నా భర్త అసంబద్ధమైన కోరికలు కోరేవారు. వాటిని తీర్చకపోతే, నా తలను గోడకేసి కొట్టేవారు. నిరంతరం మానసికంగా హింసించేవారు. అసహజ లైంగిక చర్యలకు బలవంతపెట్టేవారు. నిరాకరిస్తే, సిగరెట్లతో కాల్చేవారు. మాల్ లేదా కాఫీ షాప్‌కు వెళ్లినా, మానసికంగా హింసించేవారు. అనుమానపడుతూ నా లైవ్ లొకేషన్‌ను పంపమని బలవంతం చేసేవారు."

తన మామ కూడా లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు సీమా.

కోర్టులో భార్యాభర్తల వాదనలేంటి?

అక్టోబర్ 14న దాఖలైన ఫిర్యాదు మేరకు వారెంట్ జారీ కావడంతో, సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు లోకేష్. కానీ, దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో, డిసెంబర్ 24న గుజరాత్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. జస్టిస్ డి.ఎ. జోషి ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు.

2022 ఫిబ్రవరిలో గుర్గావ్‌లోని ఒక గెస్ట్‌హౌస్‌లో తన వివాహం జరిగిందని, దానికి అయ్యే ఖర్చులన్నీ తానే భరించానని లోకేష్ కోర్టుకు తెలిపారు. వివాహం తర్వాత వెకేషన్ ఖర్చులనూ భరించినట్లు చెప్పారు.

తన భార్య చేసిన ఆరోపణలను ఆయన తిరస్కరించారు.

లోకేష్ తరపు న్యాయవాది ఆదిత్య గుప్తా హైకోర్టులో వాదిస్తూ " వివాహ ఖర్చులన్నింటినీ భరించి, భార్యను వెకేషన్‌కు తీసుకెళ్లి, గుర్గావ్‌లో పెద్ద వ్యాపారం చేస్తున్న భర్త కట్నం డిమాండ్ చేసే ప్రసక్తే లేదు" అని అన్నారు.

"మామ లైంగిక వేధింపులకు గురిచేశారని చెబుతున్న రోజున సొసైటీలో ఒక కార్యక్రమం జరిగింది. దానికి కుటుంబం హాజరైంది. సంతోషంగా కనిపిస్తూ ఫోటోలూ దిగారు" అన్నారు.

"మరోవైపు, లోకేష్ దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నారు, అన్ని ఆధారాలను అందించారు. ఆయన తండ్రి నోటి క్యాన్సర్‌కు చికిత్స, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన తల్లికి తీవ్రమైన ఆర్థరైటిస్ సమస్య ఉంది, కాబట్టి వారందరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి" అని కోరారు ఆదిత్య గుప్తా .

మరోవైపు, సీమా న్యాయవాది జల్ ఉన్వాలా తన వాదనలు వినిపిస్తూ, "ఈ గుర్గావ్ వ్యాపారవేత్త తన మొదటి భార్యనూ ఇలాగే హింసించారు. అందుకే ఆమె విడాకులు తీసుకున్నారు. రెండో భార్య కూడా నిరంతరం మానసిక హింసకు గురైంది, ఆమె నుంచి కట్నం డిమాండ్ చేశారు. డబ్బు సంపాదించాలని బలవంతం చేశారు" అన్నారు.

ఇతరుల సహాయం లేకుండా రోజువారీ పనులను నిర్వహించలేకపోతున్నారనే వాదనను తోసిపుచ్చుతూ, ఒక సొసైటీ కార్యక్రమానికి సీమా అత్తమామలు హాజరైన ఫోటోలను కోర్టుకు సమర్పించారు.

కోర్టు ఏం చెప్పింది?

ఇరువైపులా వాదనలు విన్న కోర్టు, లోకేష్‌కు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. అనాదిగా దంపతుల మధ్య లైంగిక సంబంధాలు పరస్పర అంగీకారంతోనే ఉంఉన్నాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని, కొత్త చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరికీ వారి వైవాహిక జీవితంలో శారీరక స్వేచ్ఛను పొందే హక్కు ఉందని జస్టిస్ డీఏ జోషి అన్నారు.

వివాహంలో లైంగిక సంబంధాలు సాధారణమే కానీ, పరస్పర అంగీకారం, గౌరవం కూడా ముఖ్యమన్నారు.

"వివాహం సమయంలో పరస్పర అంగీకారం లేకుండా జరిగే అసహజ శారీరక సంబంధం మానసిక, భావోద్వేగ సమస్యలకు దారితీస్తుంది. నాగరిక సమాజంలో ఒక వ్యక్తి తన బాధ భరించలేని స్థాయికి చేరినప్పుడే బయటికి వస్తారు" అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)