You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బాల నేరస్థులకు 'రెండో అవకాశం' లేకుండా పోతోందా? దేశంలో జువైనల్ వ్యవస్థ పనితీరు ఎలా ఉందంటే..
- రచయిత, చెరిలాన్ మొలాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తన తల్లిని హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో పూజ* వయసు 16 ఏళ్లు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో తన మారుతండ్రితో కలిసి నివసించే ఈ టీనేజర్‌ను 2018లో అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఆ సమయంలో పూజ మైనర్ అని పోలీసులకు ఆమె తరఫు న్యాయవాది చెప్పారు.
భారతీయ చట్ట ప్రకారం, ఆమెను అరెస్టు చేసిన 24 గంటల్లోపు జువైనల్ జస్టిస్ బోర్డు(జేజేబీ) ముందు హాజరు పర్చాల్సి ఉంటుంది.
ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బోర్డు పిల్లలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిశీలిస్తుంది.
అయితే, పూజ విషయంలో ఈ ప్రక్రియ జరగలేదని 2024లో ఆమె కేసు బాధ్యతలు చేపట్టిన లాయర్ యమీనా రిజ్వీ బీబీసీతో చెప్పారు.
"అలాంటి వేలాది చిన్నారుల్లో పూజ ఒకరు"
ఒక ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, ఇద్దరు సామాజిక కార్యకర్తలతో ఉండే జేజేబీ, 16 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండే పిల్లలు క్రూరమైన నేరాలకు పాల్పడిన సందర్భంలో వయోజనులుగా దర్యాప్తు చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తుంది.
దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత జువైనల్ జస్టిస్ చట్టంలో ఈ నిబంధనను పొందుపరిచారు.
అయితే, జేజేబీ ఎదుట హాజరు కావడానికి బదులుగా పూజ కేసు విచారణ వయోజనుల కోర్టులో జరిగింది. ఆ తర్వాత ఆమె ఆరేళ్ల జైలు శిక్షను అనుభవించారు.
"మైనర్ల గురించి తెలుసుకునేందుకు జేజేబీలు కూడా క్రమం తప్పకుండా జైళ్లకు వెళ్లి, పరిశీలించాలి. కానీ, పూజ జైలులో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా ఈ తరహా పరిశీలన జరగలేదు" అని రిజ్వీ ఆరోపించారు.
చివరకు, 2024లో పూజ కేసు జేజేబీకి బదిలీ అయింది. నేరారోపణలు ఎదుర్కొన్న సమయంలో పూజ మైనర్ అని జేజేబీ తేల్చింది. జువైనల్స్‌కు గరిష్ట జైలు శిక్ష మూడేళ్లు మాత్రమే. కానీ, పూజ అప్పటికే ఆరేళ్ల జైలు శిక్ష పూర్తి చేసిన కారణంగా అదే ఏడాది జైలు నుంచి విడుదలయ్యారు.
"జువైనల్ న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం దక్కని వేలాది మంది చిన్నారుల్లో పూజ కూడా ఒకరు" అని రిజ్వీ అన్నారు.
'చట్టానికి అనేక సవరణలు'
భారత్‌లో చిన్న పిల్లల నేరాలకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు ఉద్దేశించిన తొలి జువైనల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం వచ్చి దాదాపు నలభై ఏళ్లు గడిచాయి.
ఇందులోని నిబంధనలను బలోపేతం చేయడానికి ఈ చట్టానికి అనేకసార్లు సవరణలు చేశారు. పిల్లలను సంరక్షించడం, వారి సంస్కరణ కోసం అవకాశాలను సృష్టించడం, తద్వారా వారు సమాజంలో తిరిగి మమేకమై, అర్థవంతమైన జీవితాలను కొనసాగించే లక్ష్యంతో ఈ చట్టం రూపొందింది.
అయితే, ఈ చట్ట ఉద్దేశాలను పూర్తిగా అమలు చేసే విషయంలో వ్యవస్థ ఇంకా చాలాదూరంలో ఉందని పిల్లల హక్కుల నిపుణులు చెబుతున్నారు.
జేజేబీలపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
దేశంలోని బాలల న్యాయ వ్యవస్థ బలంగా ఉండటమనేది జువెనైల్ జస్టిస్ బోర్డుల (జేజేబీలు) పనితీరు ఆధారంగా ఉంటుంది. చిన్నారులు తమ చర్యల కారణంగా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొనే క్రమంలో.. వారి హక్కులను సంరక్షించడంలో ఈ బోర్డులు కీలకపాత్ర పోషిస్తాయి.
జేజేబీలను 2000లో ఏర్పాటు చేశారు. ఇవి ఒక్క సేవతోనే పరిమితం కాకుండా, సెన్సిటైజ్డ్ పోలీస్ యూనిట్ల ఏర్పాటు, పిల్లలకు న్యాయ సలహా సేవలు, వారికి పునరావాస కేంద్రాల ఏర్పాటు వంటి స్నేహపూర్వక సేవలను అందించే ఓ నెట్‌వర్క్‌గా పని చేస్తుంది.
అయితే, ఈ కీలకమైన ప్యానెళ్ల విషయంలో అంతా సవ్యంగా జరగడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే, ఈ సేవల సంబంధిత సమాచారాన్ని పొందడం కష్టతరం కావడం. ఎందుకంటే, వాటికి సంబంధించిన డేటాను ట్రాక్ చేసి, బహిరంగంగా పంచుకునే ఏ ఒక్క ప్రభుత్వ పోర్టల్ కూడా లేదు.
'సగానికిపైగా కేసులు పెండింగ్‌లోనే'
పౌర సమాజ సంఘాలు తయారు చేసి, నవంబర్‌లో విడుదల చేసిన ఇండియా జస్టిస్ రిపోర్ట్(ఐజేఆర్) నివేదికలో.. 2023 నాటికి 362 జేజేబీల ముందున్న కేసుల్లో సగానికిపైగా పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఈ నివేదికలో భారత్‌లోని అన్ని జేజేబీల సమాచారం పొందుపరచలేదు. ఎందుకంటే, సమాచార హక్కు చట్టం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు.
ఈ నివేదిక ప్రకారం, భారత్‌లోని 745 జిల్లాల్లో 707 జేజేబీలు ఉన్నాయి. అలాగే ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తిస్థాయి జేజేబీ ఉండాలని చట్టం చెబుతున్నప్పటికీ, ప్రతి నాలుగు జేజేబీల్లో ఒక దానికి పూర్తి బెంచ్ కూడా లేదు.
స్పష్టమైన సమాచారం లేకపోవడం అనేది పర్యవేక్షణ లేకపోవడాన్ని సూచిస్తోందని, అలాగే జవాబుదారీతనం లేకపోవడానికి దారితీస్తుందని ఐజేఆర్ ఎడిటర్ మజా దారువాలా అభిప్రాయపడ్డారు.
జేజేబీలు లేకపోవడం ద్వారా పిల్లలు కేవలం చట్టపరమైన సంరక్షణకు దూరమవడమే కాకుండా, వారి సంస్కరణకు కావాల్సిన అవకాశాల నుంచి కూడా దూరమైపోతారని "ఎకో(Echo)" అనే ఎన్‌జీఓ వ్యవస్థాపకులు ఫాదర్ ఆంటోని సెబాస్టియన్ అన్నారు. ఈ ఎన్‌జీఓ జువైనళ్ల సంరక్షణ కోసం పనిచేస్తోంది.
"ఈ పిల్లల్లో చాలామంది పేదరికం, బలహీన కుటుంబాల నుంచి వచ్చినవారై ఉంటారు. వాళ్లు హింసను, పేదరికాన్ని చూస్తూ పెరుగుతారు. అలాంటి వాళ్లను పోలీసులు కొట్టి, జైళ్లలో పడేసినప్పుడు, వాళ్లు మళ్లీ బాధితులుగా మారిపోతారు" అని ఫాదర్ సెబాస్టియన్ అన్నారు.
ఆయన బెంగళూరు నగరంలో రెండు వేర్వేరు జేజేబీలకు గతంలో ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు.
జైలుకు తరలించని మైనర్ల విషయంలో.. బాల సంరక్షణ సంస్థలలో( చట్టపరమైన సంఘర్షణ ఎదుర్కొనే పిల్లలకు ఆశ్రయం కల్పించే కేంద్రాలు) సంస్కరణకు పెద్దగా ఆస్కారం లేదని, బలహీన వర్గాల వారికి న్యాయ సహాయం అందించే ఐప్రొబోనో అనే సంస్థలో ప్రోగ్రామ్ డైరెక్టర్ దీక్ష గుజ్రాల్ అన్నారు.
"కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి"
నేరాల్లో నిందితులుగా ఉన్న పిల్లలను జేజేబీలు అబ్జర్వేషన్ హోమ్స్‌కు పంపవచ్చు. అలాగే, నేరాలకు పాల్పడినట్లు తేలిన పిల్లలను స్పెషల్ హోమ్స్‌కు పంపిస్తాయి.
"ప్లేస్ ఆఫ్ సేఫ్టీ"(సురక్షిత స్థలం) అని పిలిచే ఓ ప్రత్యేక కేంద్రంలో క్రూరమైన నేరాల కేసులో నిందితులుగా ఉన్న పిల్లలు లేదా దోషులుగా తేలిన పిల్లలకు ఆశ్రయం కల్పిస్తారు.
చట్ట ప్రకారం సరైన ప్రమాణాలను పాటిస్తున్నాయా? లేదా? అనేది పరిశీలించేందుకు జేజేబీలు ప్రతినెలా ఈ కేంద్రాలకు వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది.
అయితే, జేజేబీలు ఈ తరహా పరిశీలనలు అరుదుగా చేస్తున్నాయని, అది కూడా తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని పిల్లల హక్కుల కోసం పోరాడే చాలామంది న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
తని పనిలో భాగంగా అనేక చిన్నారుల అబ్జర్వేషన్ హోమ్స్, స్పెషల్ హోమ్స్‌ను సందర్శించిన గుజ్రాల్, ఆ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయని, అక్కడ కౌన్సిలర్లు లేరని, అర్థవంతమైన జీవితాలను అందించేందుకు ఉపకరించే విద్య, వృత్తి నైపుణ్యాలు వంటివి బోధించే సౌకర్యలు లేవని చెప్పారు.
బాలురకు, బాలికలకు వేర్వేరుగా కేంద్రాలున్నప్పటికీ, విభిన్న వయసుల వారిని వేర్వేరుగా ఉంచాల్సిన మార్గదర్శకాలు అంతగా అమలవడం లేదన్నారు గుజ్రాల్.
"అక్కడి పిల్లలు చేసేదల్లా తినడం, పడుకోవడం, టీవీ చూడటమే. గ్యాంగ్, డ్రగ్ కల్చర్ వంటివి ఇప్పటికే విపరీతంగా ఉన్న దిల్లీ వంటి నగరాల్లోనైతే ఈ కేంద్రాల పిల్లల మధ్య కూడా ఈ తరహా కల్చర్ కనబడుతోంది. చిన్నవారు, తక్కువ అనుభవం ఉన్నవారు ఈ కేంద్రాల బయట తమ రక్షణ కోసం పెద్ద పిల్లల వెంబడి చేరడానికి, వారి గ్యాంగ్‌లతో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు" అని గుజ్రాల్ అన్నారు.
అలాగే హింసాత్మక ఘటనలు, లైంగిక వేధింపులు కూడా జరగుతున్నాయని అమె అన్నారు.
బాలల న్యాయ వ్యవస్థను పర్యవేక్షించే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖను ఈ అంశంపై వివరణ కోరుతూ బీబీసీ పలు ప్రశ్నలు వేసింది. అయితే, ఇంకా స్పందన రాలేదు.
చాలా కేంద్రాల్లోని అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని రిజ్వీ అన్నారు.
"ఈ పిల్లలు ఎలాంటి సాయానికి నోచుకోరని, వాళ్లను మార్చడానికి తాము ఏమీ చేయలేమని వారు అనుకుంటున్నారు" అన్నారు.
చిన్నపిల్లల తరఫున పని చేసే అనేకమంది లాయర్లలోనూ ఈ తరహా అభిప్రాయాలనే తాను గమనించినట్లు చెప్పారు రిజ్వీ.
"వారి జీవితాలను మేం మార్చగలిగాం"
పిల్లల హక్కులను, చట్ట ఉద్దేశాన్ని అర్థం చేసుకోనప్పుడు నిర్లక్ష్యం వేళ్లూనుకుపోతుందని ఫాదర్ సెబాస్టియన్ అన్నారు. తాము నిర్వహించే స్పెషల్ హోమ్ 'ఎకో'లో అనేక విజయగాథలను చూశామని అన్నారు. హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో దోషులుగా తేలిన చిన్నారుల జీవితాలను మార్చగలిగామని చెప్పారు.
డెయిరీ, పౌల్ట్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి వృత్తి శిక్షణ కార్యక్రమాలను, అలాగే రెగ్యులర్ కౌన్సిలింగ్ సెషన్లను తమ ఎకో కేంద్రంలో నిర్వహిస్తున్నామని ఫాదర్ సెబాస్టియన్ తెలిపారు.
ఓ క్రికెట్ మ్యాచ్ గొడవలో తన స్నేహితుడి హత్య కేసులో దోషిగా తేలిన దర్శన్ అనే బాలుడు ఎకో కేంద్రానికి వచ్చారు. అంతకుముందు అతను వీధుల్లో నివసించేవారు.
"దర్శన్ గత అనుభవాల నుంచి బయటపడేందుకు 'ఎకో'లో నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్లు సాయపడ్డాయి" అన్నారు సెబాస్టియన్ .
దూర విద్య ద్వారా తన చదువు పూర్తి చేసుకున్న దర్శన్ బిహేవియర్ మోడిఫికేషన్ ప్రోగ్రామ్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందిన అతను ప్రస్తుతం ఓ ప్రఖ్యాత హోటల్‌లో పని చేస్తున్నారు.
ప్రతి చిన్నారి రెండో అవకాశం పొందడానికి అర్హులు అని సెబాస్టియన్ అన్నారు.
"సమాజంలో భాగమైన మనం.. వారికి ఆ మాత్రమైనా చేయాలి" అన్నారు.
*జువైనల్ నిందితుల గుర్తింపును బహిర్గతం చేయడం చట్టపరంగా నిషేధం కాబట్టి, ఇందులోని పిల్లల పేర్లను మార్చాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)