మీ ఇంట్లో పెంచుకునే మొక్కలు తరచుగా చనిపోతున్నాయా? అయితే, ఈ 4 చిట్కాలు మీ కోసమే..

    • రచయిత, ఎమిలీ హోల్ట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీ కుండీ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నా, బాగా నీరు పోస్తున్నా చనిపోతున్నాయా?

మీరేం శాపగ్రస్తులు కాదని, మొక్కలను పెంచడానికి ప్రత్యేక నైపుణ్యాలూ అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అయితే, మీరు ఏ తప్పు చేస్తున్నారో తెలుసుకోవాలని చెబుతున్నారు.

ఇంటి మొక్కలను సజీవంగా, ఆరోగ్యంగా ఉంచడానికి గార్డెనర్స్ వరల్డ్ హోస్ట్ ఆడమ్ ఫ్రాస్ట్, రాయల్ హార్టికల్చరల్ సొసైటీ(ఆర్‌హెచ్ఎస్) నిపుణులు క్లేర్ ప్రెస్టన్-పోలిట్‌లు కొన్ని చిట్కాలను పంచుకున్నారు.

అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

చాలామంది మొక్కలు అందంగా ఉన్నాయని ఎంచుకుంటారు. కానీ, అవి మీ ఇంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం ముఖ్యమని ఆర్‌హెచ్ఎస్ గార్డెన్ బ్రిడ్జ్‌వాటర్‌లోని ఉద్యానవన సలహాదారు క్లేర్ చెప్పారు.

"చాలామంది తమకు నచ్చిన మొక్కలను కొని, ఇంటికి తీసుకెళతారు. కొన్నినెలల్లోనే అవి నెమ్మదిగా అనారోగ్యకరంగా మారడం చూస్తుంటారు" అని ఆమె చెప్పారు.

ఇంట్లో మొక్కను సరైన ప్రదేశంలో పెట్టకపోవడం వల్ల ఇలా జరుగుతుందని క్లేర్ అంటున్నారు.

ప్రకాశవంతమైన లివింగ్ రూములు మాన్‌స్టెరా జాతి మొక్కలకు, వెచ్చని, తేమతో కూడిన వంట గదులు పీస్ లిల్లీ మొక్కలకు అనువైనవని సూచించారామె.

అధిక తేమ ఉన్న బాత్రూమ్‌ గదుల్లో డెవిల్స్ ఐవీ ప్లాంట్స్, చీకటి గదులు లేదా హాలులకు ఫాల్స్ కాస్టర్ ఆయిల్ ప్లాంట్‌ను క్లేర్ సిఫార్సు చేశారు.

సాధారణంగా చేసే తప్పేంటంటే.. నీరు ఎక్కువగా పోయడం. అన్ని మొక్కలకు ఒకే మొత్తంలో నీరు అవసరం లేదు, కాబట్టి ప్రతి మొక్కకు ఏది అవసరమో అది తెలుసుకోవడం ముఖ్యం.

పీస్ లిల్లీస్ లేదా స్పైడర్ ప్లాంట్స్ వంటి ఇంటి మొక్కలకు గోధుమ రంగు ఆకులు కనిపిస్తే, అవి నీరు చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ తీసుకుంటున్నాయని సంకేతం. నీరు పోసే ముందు నేల పొడిగా ఉందో లేదో చూడాలి.

కాక్టి, సక్యూలెంట్స్ వంటి మొక్కలకు చాలా తక్కువ నీరు సరిపోతుంది. కానీ, వాటికి ఎక్కువగా నీళ్లు పోసి చంపేస్తుండడం తరచుగా కనిపిస్తుంటుందని క్లేర్ అంటున్నారు.

ఇలాంటి మొక్కలు తాజాగా ఉండటానికి నీరు పిచికారీ చేస్తే సరిపోతుందని ఆడమ్ చెప్పారు.

మొక్కకు నెమ్మదిగా నీటిని అందించే వాటర్ మ్యాట్ లేదా వాటర్ గ్లోబ్‌ను ఉపయోగించాలని క్లేర్ సూచించారు. కాస్ట్ ఐరన్, హోయా కార్నోసా, స్నేక్ ప్లాంట్స్ అంత సులభంగా చనిపోని ఇంటి మొక్కలని చెప్పారు. అవి కరువును తట్టుకుంటాయి, అంటే నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించగలవు. కాస్ట్ ఐరన్, స్నేక్ ప్లాంట్స్ ఇంట్లో వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతాయి.

సీజన్లను బట్టి మొక్కలను చూసుకునే విధానం మార్చడం చాలా ముఖ్యం.

"వసంతకాలం, వేసవి కాలంలో తరచుగా నీరు అందించవచ్చు" అని క్లేర్ చెప్పారు. ఎందుకంటే, ఈ సమయాల్లో మొక్కలు చురుకుగా పెరుగుతాయన్నారామె.

వేసవి కాలంలో మాన్‌స్టెరా వంటి కొన్ని మొక్కలకు వారానికి రెండు లేదా మూడుసార్లు నీరు పోయాలి. ఈ సమయంలో మొక్కలకు తగినంత పోషకాలు పొందాలి, దీనికోసం నేల ద్వారా వాటికి ఆహారాన్ని అందించాలి.

శరదృతువు, శీతాకాలంలో మొక్కల సంరక్షణను తగ్గించాలని క్లేర్ సూచించారు. ఈ కాలంలో వెలుతురు తగ్గితే ఫాలియేజ్ ప్లాంట్స్ పెరుగుదల నెమ్మదిస్తుంది. అవి పాక్షిక నిద్రాణ దశలోకి ప్రవేశిస్తాయి.

అంటే, ఈ సమయంలో మొక్కలకు చాలా తక్కువ నీరు అవసరం, ఆహారం కూడా ఎక్కువ అవసరం లేదు. నేల పూర్తిగా ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పెట్టాలని క్లేర్ సలహా ఇస్తున్నారు.

మొక్కలను ఆరోగ్యంగా ఉంచడానికి రీపోటింగ్(తిరిగి నాటడం) కూడా ముఖ్యం. వసంతకాలం రీపోటింగ్ చేయడానికి ఉత్తమ సమయమని క్లేర్ చెప్పారు. ఎందుకంటే, అప్పుడు మొక్కల వేర్లు సులభంగా పెరుగుతాయని తెలిపారు.

వేర్లు కుండీ అడుగున లేదా చుట్టూ ఎక్కువగా నిండి ఉంటే, లేదా డ్రైనేజ్ రంధ్రాల ద్వారా బయటకు పెరగడం, అలాగే నీరు మట్టిలోకి ఇంకకుండా రంధ్రాల నుంచి బయటకు రావడం వంటివి మొక్కకు పెద్ద కుండీ అవసరమని చెప్పే సూచనలని, రీపోటింగ్ సంకేతాలని క్లేర్ అంటున్నారు.

చాలామంది డిసెంబర్ సమయంలో ఇంటి మొక్కలను తెచ్చుకుంటారు, ఎక్కువగా పాయిన్‌సెట్టియా మొక్కలను పెంచుకుంటారు. జనవరి ప్రారంభం నాటికి, దాని ఎర్రటి ఆకులు బలహీనంగా, ముడతలు పడినట్లు కనిపించవచ్చు.

పాయిన్‌సెట్టియాలు మెక్సికో వంటి ప్రాంతాల నుంచి వస్తాయని, వాటికి వెచ్చదనం అవసరమని గుర్తుంచుకోవాలని ఆడమ్ చెప్పారు.

"అవి వెచ్చదనాన్ని కోరుకుంటాయి. వాటిని చల్లని గాలి వచ్చే చోట ఉంచకూడదు" అని సూచించారు. ప్రత్యక్ష సూర్యకాంతిలో కూడా ఉంచవద్దన్నారు.

పాయిన్‌సెట్టియాలకు ఎక్కువ నీరు అవసరం లేదని, నేల పొడిగా ఉన్నప్పుడు మాత్రమే వాటికి నీరు పెట్టాలని ఆడమ్ సూచించారు.

నీరు ఎక్కువ అవ్వకూడదనుకుంటే, ప్రతిరోజూ కొద్దిసేపు కుండీని నీటితో నిండిన పాత్రలో ఉంచవచ్చు లేదా ఆకులపై తేలికగా నీటిని పిచికారీ చేయవచ్చు.

నెలకు ఒకసారి మొక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల పాయిన్‌సెట్టియా ఎక్కువ కాలం ఉంటుందని ఆడమ్ చెప్పారు. ఏప్రిల్‌లో కొమ్మలను కత్తిరించి, మేలో మొక్కను తిరిగి నాటడం మంచిదని సూచించారు.

సెప్టెంబర్ నుంచి, మొక్కను రోజుకు కనీసం 12 గంటలు వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశానికి తరలించాలి. ఇది తదుపరి క్రిస్మస్ సమయానికి ఆకులు మళ్లీ ఎర్రగా మారడానికి సహాయపడుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)