You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విజయవాడ: భవానీ ద్వీపంలో ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై వివాదమేంటి, ఆ సంస్థలు ఎవరివి? పర్యావరణవేత్తలు ఏమంటున్నారు?
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
అటు విజయవాడ.. ఇటు రాజధాని అమరావతి మధ్యనున్న కృష్ణా నదిలోని భవానీ ద్వీపంలో 'అడ్వెంచర్ థ్రిల్ సిటీ' నిర్మాణం పేరిట పది ఎకరాల భూములను ఓ ప్రైవేట్ సంస్థకి అప్పగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) విధానంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
మంచినీటి సముదాయ ద్వీపాల్లో ఒకటిగా పేరొందిన భవానీ ఐలాండ్‌లోని పది ఎకరాల భూములను అక్కడ ఏ ప్రాంతంలో ఇస్తున్నారో సర్వే నంబర్లు కూడా స్పష్టంగా ప్రస్తావించకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదమవుతోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పరిధిలోని భవానీ ద్వీపంలో 'అడ్వెంచర్ థ్రిల్ సిటీ' అభివృద్ధి కోసం పీపీపీ విధానంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వనాథ్ అవెన్యూస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు పది ఎకరాల భూమి కేటాయింపు, వివిధ ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ 2025 నవంబర్ 13న జీవో ఎం.ఎస్. నం. 42 విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ పర్యటక విధానం 2024 –2029 నిబంధనల ప్రకారం.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానం మేరకు, నవంబర్ 7న జరిగిన స్టేట్ ఇండస్ట్రీ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్టు ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
అయితే, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పర్యావరణ పరిరక్షణ ప్రస్తావన లేకపోవడం అన్యాయమని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు.
అసలేమిటీ అడ్వెంచర్ థ్రిల్ సిటీ?
పర్యటక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా లీజుకిచ్చేందుకు అందుబాటులో ఉన్న వివిధ భూముల వివరాలను వెబ్‌సైట్‌లో పేర్కొంటూ.. ఆసక్తి కలిగిన వారు డీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది.
ఈ మేరకు విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'అడ్వెంచర్ థ్రిల్ సిటీ' అభివృద్ధికి పెట్టుబడుల ప్రతిపాదనలను సమర్పించిందని తెలిపింది.
ఈ పదెకరాల్లో రూ.51.48 కోట్ల పెట్టుబడితో 250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామని, ఇందుకోసం భవానీ ద్వీపంలో భూమి, ప్రోత్సాహకాలను అందించాలని ఆ సంస్థ అభ్యర్థించినట్లు ఆ జీవోలో వివరించింది.
దీంతో, ఆంధ్రప్రదేశ్ పర్యటక విధానం 2024–2029 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, భవానీ ద్వీపంలో అడ్వెంచర్ థ్రిల్ సిటీ అభివృద్ధి కోసం పది ఎకరాల భూమిని కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
99 ఏళ్లకి లీజు..
లీజు కాలపరిమితి 66 సంవత్సరాలు కాగా, ప్రాజెక్ట్ విజయవంతంగా అమలులోకి వచ్చిన తర్వాత మరో 33 సంవత్సరాల పాటు పొడిగింపు ఉంటుందని ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
లీజు అద్దె ఏడాదికి ఎస్‌ఆర్‌వో విలువ(సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ.. అంటే ప్రభుత్వ ధర)లో 1% ఉంటుందనీ, ప్రతి 3 ఏళ్లకు ఒకసారి 5% పెరుగుతుందని వెల్లడించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ పేరిట జీవో విడుదలైనట్టు భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు బీబీసీకి తెలిపారు.
ఈ కంపెనీలు ఎక్కడివి? ఎవరివి?
విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వనాథ్ అవెన్యూస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నానికి చెందిన బీజేపీ నేత కాశీ విశ్వనాథ్‌వి.
అయితే, కేవలం రాజకీయ పలుకుబడితో తనకు ఈ కాంట్రాక్ట్ రాలేదని ఆయన బీబీసీతో అన్నారు.
ఇప్పటికే విశాఖ నగరంలోని పోర్ట్ స్టేడియంలో స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్న అనుభవంతో టెండర్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోగా.. తాను కోట్ చేసిన అత్యధిక ధరకు ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ ఇచ్చిందని కాశీవిశ్వనాథ్ చెప్పారు.
ఈ థ్రిల్ సిటీలో "హోటల్, రెస్టారెంట్, స్లైడర్ పూల్, కిడ్స్ పూల్, వేవ్ పూల్, చైల్డ్ పూల్, కేఫ్, గో కార్టింగ్, ఫన్‌జోన్, స్విమ్మింగ్ పూల్స్, డెస్టినేషన్ మ్యారేజ్ హాల్స్, రూమ్‌లు, కాఫీ షాప్‌లు, థ్రిల్ రైడ్స్.. 360 డిగ్రీస్ సైక్లింగ్, స్నోపాయింట్, లేజర్ షోస్ ఏర్పాటు చేయనున్నాం" అని విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాశీ విశ్వనాథ్ బీబీసీతో చెప్పారు.
వివిధ ఆలయాలు, చారిత్రక కట్టడాల నమూనాలతో కూడిన మినియేచర్ వరల్డ్‌ను తీర్చిదిద్దే ఆలోచన కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.
అక్కడ చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన డిజైన్లను కూడా ఏపీ పర్యటక శాఖ ఉన్నతాధికారులకు అందజేశామన్నారు ఆయన.
2011లో అప్పటి మంత్రి గంటాకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు..
భవానీ ద్వీపంలోని పర్యటక ప్రాజెక్టులను 2011 నవంబర్‌లో.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ప్రజారాజ్యం పార్టీ విలీనంతో కాంగ్రెస్‌లోకి వచ్చిన విశాఖ జిల్లాకు చెందిన అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అప్పగించాలని నిర్ణయించింది.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద 55 ఏళ్లకు ఆ భూములను గంటాకి చెందిన ప్రత్యూష అసోసియేట్స్ ఫిషింగ్ లిమిటెడ్ మౌలిక సదుపాయాల పెట్టుబడుల సంస్థకు లీజుకు ఇచ్చేందుకు నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది.
బహిరంగ టెండర్ల ద్వారానే ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ.. గంటాకు అనుకూలంగా వ్యవహరించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
దాంతో అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీతో పాటు వైసీపీ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది.
తాజాగా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో టెండర్ దక్కించుకున్న కాశీ విశ్వనాథ్‌కు.. విశాఖకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సన్నిహితుడిగా పేరుంది.
ఈ నేపథ్యంలో కాశీవిశ్వనాథ్ బినామీగా గంటానే ఆ ప్రాజెక్టు దక్కించుకున్నారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
అయితే, ఈ ఆరోపణలను కాశీ విశ్వనాథ్ బీబీసీ వద్ద ఖండించారు.
''నేను గతంలో టీడీపీలో ఉన్నప్పుడు గంటాకు సన్నిహితంగా మెలిగిన మాట నిజమే. కానీ 2019 తర్వాత నేను టీడీపీకి దూరమయ్యాను. మధ్యలో వైసీపీలో చేరాను. ఇప్పుడు బీజేపీలో ఉన్నాను. అయినా నా వ్యాపారాలకు గంటాకు సంబంధం ఏమిటి?
నేను మొదటి నుంచి ఇలాంటి ప్రాజెక్ట్స్ నిర్వహణ రంగంలో రంగంలో ఉన్నా. ఎప్పటి నుంచో వైజాగ్‌లో ఇలాంటి స్పోర్ట్స్ క్లబ్‌లు నిర్వహిస్తున్నా. ఆ రంగంలో అనుభవంతో నేను టెండర్ వేసి దక్కించుకుంటే అన్యాయంగా ఆరోపణలు చేయడం దారుణం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
పర్యావరణవేత్తలు ఏమంటున్నారంటే..
దేశంలోనే మంచినీటి సముదాయ ద్వీపాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన భవానీ ద్వీపాన్ని ఇలాంటి స్పోర్ట్స్ క్లబ్‌లకు ఇవ్వడం సరికాదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
నదీగర్భంలో ఉన్న ద్వీపంలో ఇలాంటి క్లబ్‌లు పెట్టి.. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ఏం చేస్తారో చెప్పకపోవడం అన్యాయమని పర్యావరణవేత్త, నాగార్జున విశ్వవిద్యాలయంలో పర్యావరణ విభాగం హెడ్‌గా పనిచేసి రిటైరైన ప్రొఫెసర్ బయ్యపరెడ్డి బీబీసీతో అన్నారు.
"ద్వీపాల్లో ఇలాంటి థ్రిల్ సిటీలు పెట్టాలంటే ముందుగా, 'స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ' నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. పబ్లిక్ హియరింగ్‌కి వెళ్లాలి, అక్కడంతా ఓకే అయితే సదరు సంస్థ వినియోగించిన నీళ్లు నదిలోకి వెళ్లకుండా జీరో లిక్విడ్ డిస్చార్జ్ సిస్టమ్ పెట్టాలి. సాగు, తాగు నీరు కాలుష్యం కాకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయో వేస్ట్ మేనేజ్‌మెంట్‌తో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పెట్టాలి. బయో డైవర్సిటీ మేనేజ్‌మెంట్ ఉండాలి. ఇవేమీ లేకుండా ద్వీపంలో భూ కేటాయింపులు చేయడం సరికాదు" అని బయ్యపరెడ్డి అన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పర్యావరణ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ బైరాగి బీబీసీతో మాట్లాడుతూ, ఇలాంటి క్లబ్‌లతో కృష్ణా నది నీరు కలుషితం అవుతుందని అన్నారు.
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం: ఏపీటీడీసీ
''రాష్ట్రంలో పర్యటక విధానం మేరకు భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేసే దిశగానే అడ్వెంచర్ థ్రిల్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఓ మంచి పని జరుగుతున్నప్పుడు విమర్శలు సహజం. ఆ క్రమంలోనే ఇప్పుడు అనవసర వాదనలు తెరపైకి వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం. వాటిపై ఎవరికీ ఆందోళన అక్కరలేదు'' అని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ బీబీసీతో అన్నారు.
రూ.51కోట్ల ప్రాజెక్ట్ అంటే నేరుగా ప్రభుత్వమే చేపట్టొచ్చు కదా.. ప్రై వేటుకి ఎందుకు అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. పీపీపీ పద్ధతిలో పెట్టుబడులను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ పాలసీ ప్రకారమే ప్రైవేటు సంస్థలకి ఇస్తున్నామని చెప్పారు.
రూ.50 కోట్ల పైబడి ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, క్యాబినెట్ అప్రూవల్ అవసరమని, ఆ మేరకు క్యాబినెట్ అనుమతితోనే విశ్వనాథ్ సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇదే మాదిరిగా ప్రతిపాదనలు వచ్చినా కార్యరూపం దాల్చకపోవడంపై మాట్లాడుతూ.. "అప్పట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు టూరిజం అభివృద్ది కోసం తీసుకున్న నిర్ణయం అమలవుతుంది" అని బాలాజీ చెప్పారు.
వందేళ్లకు భూములు కట్టబెట్టడం అన్యాయం: వైసీపీ
మరోవైపు, భవానీ ఐలాండ్ భూములు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీటీడీసీ చైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్ వరప్రసాద రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ, " పీపీపీ పేరిట వందల కోట్ల విలువైన భవానీ ఐలాండ్ భూములను ఏకంగా వందేళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం దారుణం" అని అన్నారు.
"ఆ సంస్థ పెట్టే పెట్టుబడి కేవలం రూ.50 కోట్లు. అంటే, 50 కోట్లకు పది ఎకరాల భవానీ ఐలాండ్ భూములను వందేళ్లకి కట్టబెట్టడం ఎంత అన్యాయం" అని వరప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో కూడా ఓసారి అధికారులు భవానీ ఐలాండ్‌తో సహా వివిధ ప్రాజెక్టుల ప్రై వేటీకరణ ప్రతిపాదన తీసుకువస్తే.. తాను చైర్మన్‌గా తీవ్రంగా వ్యతిరేకించానని ఆయన చెప్పారు.
కానీ, ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వమే ఓ రాజకీయ నేతకు భవానీ ఐలాండ్ భూములను అప్పనంగా అప్పజెప్పడం కంటే కుంభకోణం ఏముంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
విపక్ష విమర్శలపై మాట్లాడుతూ, "ప్రతీదానినీ రాజకీయం చేసే వైసీపీ వాదనలను, విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని ఏపీటీడీసీ చైర్మన్ బాలాజీ బీబీసీతో అన్నారు.
భవానీ ద్వీపం వివరాలిలా..
కృష్ణా నది మధ్యలో, దాదాపు 130 ఎకరాల విస్తీర్ణంతో భవానీ ద్వీపం ఉంటుంది.
2024 సెప్టెంబర్‌లో వచ్చిన వరదల వల్ల కొంత భూమి కొట్టుకుపోయిందని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) జనరల్ మేనేజర్ వాసు బీబీసీకి తెలిపారు.
అక్కడి కార్యకలాపాలను భవానీ ఐలాండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ – బీఐటీసీ) పర్యవేక్షిస్తుందని చెప్పారు.
ఇందులో ఏపీటీడీసీకి చెందిన 45 గదుల కాటేజీలు, రెండు రెస్టారెంట్లు, ఓ కాన్ఫరెన్స్ హాల్, మూడు ట్రీ – టాప్ కాటేజీలు ఉన్నాయి.
బోటింగ్ జెట్టీలు, ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉన్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)