క్యాన్సర్ చిన్నారుల కోసం 'ఫండ్‌రైజింగ్' పేరుతో కోట్లు దోచేస్తున్న ముఠాలు.. బీబీసీ ఇన్వెస్టిగేషన్

    • రచయిత, సిమి జొలాసొ, జాక్ గుడ్‌మ్యాన్, సారా బక్లే
    • హోదా, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్

(హెచ్చరిక: ఈ కథనంలోని వివరాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

ఓ చిన్న బాలుడు కెమెరా వైపు చూస్తున్నారు. అతని మొహం పాలిపోయి ఉంది. తల మీద జుట్టు లేదు.

"నాకు ఏడేళ్లు, నాకు క్యాన్సర్. దయచేసి నాకు సాయం చేసి నన్ను కాపాడండి" అని ఆ చిన్నారి వేడుకుంటున్నారు.

ఖలీల్ - వీడియోలో నుంచి ఈ ఫోటోను సేకరించాం.

పిల్లవాడికి గుండు చేయించాలని ఖలీల్ తల్లి అల్జిన్‌కు చెప్పారు.

ఆ తర్వాత వీడియో చిత్రీకరణ బృందం అతని చేతికి నకిలీ సెలైన్ బాటిల్ అమర్చింది.

ఆ రోజు బాలుడు పుట్టిన రోజు జరుపుకుంటున్నట్లుగా నటించాలని కుటుంబ సభ్యులకు చెప్పారు.

బాలుడికి ఒక ఇంగ్లిష్ స్క్రిప్ట్ ఇచ్చి దాన్ని నేర్చుకుని, చెప్పాలన్నారు.

పిల్లవాడి కళ్లలో నీళ్లు కారేందుకు ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టడం, కళ్ల కింద మెంథాల్ రాయడం.. 'అది వాడికి నచ్చలేదు' అని అల్జిన్ చెప్పారు.

ఇదంతా ఫేక్ సెటప్ అయినప్పటికీ.. అల్జిన్ దీనికి అంగీకరించింది. ఎందుకంటే, ఖలీల్‌కు నిజంగానే క్యాన్సర్ ఉంది.

అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు ఈ వీడియో సాయం చేస్తుందని, ప్రజలు డబ్బులు విరాళంగా ఇస్తారని వారు ఆమెకు చెప్పారు.

ఖలీల్ పేరు మీద నిర్వహించిన ఈ ప్రచారపు వీడియో వల్ల దాదాపు 24 లక్షల రూపాయలు సేకరించారు.

ఖలీల్ వైద్యం కోసం వీడియో ద్వారా నిధులు సంపాదించే కార్యక్రమం విఫలమైందని వాళ్లు అల్జిన్‌కు చెప్పారు.

ఆ డబ్బులో తమకేమీ అందలేదని, వీడియో చిత్రీకరణ సమయంలో మాత్రం సుమారు 63 వేల రూపాయలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు.

ఏడాది తర్వాత ఖలీల్ చనిపోయారు.

పిల్లలకు వైద్యం అందించలేని తల్లిదండ్రుల నిస్సహాయ స్థితిని ఉపయోగించుకుని ఇలాంటి ఆన్‌లైన్ ప్రచార స్కామ్‌ల ద్వారా దోచుకుంటున్నట్లు బీబీసీ వరల్డ్ సర్వీస్ గుర్తించింది.

ఆన్‌లైన్‌లో ఇలాంటి వీడియోలు చూసి పిల్లల జీవితాలను కాపాడొచ్చనే ఉద్దేశంతో ఈ వీడియోల ప్రచారకర్తలకు ప్రజలు విరాళాలు ఇచ్చారు. ఇలా సేకరించిన నిధులలో చాలా తక్కువ లేదా అసలేమీ ఇవ్వని... క్యాన్సర్ సోకిన చిన్నారులతో హృదయ విదారకమైన వీడియోలను చిత్రీకరించి, వాటితో క్యాంపెయిన్ చేశారో లేదో కూడా తెలియని 15 కుటుంబాలను మేం గుర్తించాం.

వారిలో, దాదాపుగా ఒకేలా సాగిన ఈ ప్రచార కార్యక్రమాలతో సంబంధమున్న 9 కుటుంబాలతో బీబీసీ మాట్లాడింది. ఈ ప్రచార కార్యక్రమాల ద్వారా, క్యాన్సర్ బాధితుల పేర్లతో సేకరించిన దాదాపు రూ.36 కోట్లలో తమకు దక్కింది ఏమీ లేదని వారు చెప్పారు.

వాళ్లు "3 నుంచి 9 ఏళ్ల మధ్య ఉన్న అందమైన, జుట్టు లేని చిన్నారుల కోసం" వెతుకుతున్నట్లు ఈ స్కామ్ నెట్‌వర్క్‌‌తో సంబంధమున్న విజిల్‌బ్లోయర్ ఒకరు బీబీసీతో చెప్పారు.

ఈ స్కామ్‌లో కీలకపాత్ర పోషించిన వ్యక్తిని.. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న ఎరెజ్ హదరి అనే ఇజ్రాయెలీ వ్యక్తిగా మేం గుర్తించాం.

"నాకు చనిపోవాలని లేదు. నా చికిత్సకు చాలా ఖర్చవుతుంది" అంటూ ఘనాకు చెందిన అలెగ్జాండ్రా అనే అమ్మాయి ఏడుస్తూ చెబుతున్న హృదయవిదారక యూట్యూబ్ వీడియోను చూసి.. 2023 అక్టోబర్‌లో మేం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం.

ఆమె కోసం నిర్వహించిన క్రౌడ్‌ఫండింగ్ ప్రచారం ద్వారా రూ.6 కోట్ల రూపాయలకు పైగా సేకరించినట్లు కనిపించింది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇలాంటి వీడియోలే యూట్యూబ్‌లో ఉండడాన్ని గుర్తించాం. అవన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. భావోద్వేగపూరిత భాషతో, అత్యవసరం అనేలా ఆ వీడియోలు ఉన్నాయి. చాలా వింతగా అనిపించింది, భారీమొత్తంలో డబ్బు సేకరించినట్లు అనిపించింది.

దీంతో ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశోధన చేయాలని మేం నిర్ణయించుకున్నాం.

అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేసిన ఈ క్యాంపెయిన్ ఇజ్రాయెల్, అమెరికాలో నమోదైన చాన్స్ లెటిక్వా (ఇంగ్లిష్‌లో చాన్స్ ఫర్ హోప్ అని అర్థం) అనే సంస్థ పేరుతో ఉన్నాయి.

ఈ సంస్థ పోస్ట్ చేసిన వీడియోల్లో ఉన్న చిన్నారులను గుర్తించడం కష్టం.

ఫిలిప్పీన్స్, కొలంబియా వంటి దూరంలో ఉన్న ప్రాంతాలకు చెందిన ఈ చిన్నారులను, వారి కుటుంబాలను గుర్తించేందుకు జియో లొకేషన్, సోషల్ మీడియా, ఫేషియల్ రికగ్నిషన్ లాంటి సాఫ్ట్‌వేర్లను ఉపయోగించాం.

ఆ వీడియోలను పోస్ట్ చేసిన సంస్థ వెబ్‌సైట్‌లో చూపుతున్న విరాళాల మొత్తం కచ్చితమైనదో కాదో స్పష్టంగా తెలుసుకోవడం కష్టమే అయినప్పటికీ, వారిలో ఇద్దరికి కొంత మొత్తం విరాళంగా పంపడం ద్వారా ఆ విరాళాల మొత్తం పెరగడం మేం గమనించాం.

అలెగ్జాండ్రా వీడియో చూసి ఆమెకు సుమారు లక్షా 60 వేల రూపాయలు విరాళంగా పంపానని, ఆ తర్వాత మరిన్ని విరాళాల కోసం తనపై ఒత్తిడి వచ్చిందని చెప్పిన వ్యక్తితో మేం మాట్లాడాం. ఆ అభ్యర్థనలన్నీ అలెగ్జాండ్రా, ఆమె తండ్రి రాసినట్లుగా ఉన్నాయి.

తన ఏడో పుట్టిన రోజు అయిన కొద్దిరోజులకే ఖలీల్ అనారోగ్యం బారిన పడినట్లు అల్జిల్ తబాసా.. ఫిలిప్పీన్స్‌లో మాతో చెప్పారు.

"వాడికి క్యాన్సర్ అని తెలియగానే కాళ్లకింద భూమి కంపించిపోయినట్లు అనిపించింది" అని ఆమె అన్నారు.

సెబు నగరంలోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స నెమ్మదిగా కొనసాగుతోందని, సాయం కోసం తనకు తెలిసిన వారందరికీ సందేశాలు పంపినట్లు అల్జిన్ తెలిపారు.

ఒక వ్యక్తి ఆమెను రోయీ ఇన్సియెర్టో అనే స్థానిక వ్యాపారికి పరిచయం చేశారు. ఖలీల్ వీడియో కోసం అడిగారు. అయితే, అది ఆడిషన్ అని అల్జిన్‌కు తర్వాత తెలిసింది.

2022 డిసెంబర్‌లో మరో వ్యక్తి కెనడా నుంచి వచ్చారు. తనను తాను "ఎరెజ్"గా పరిచయం చేసుకున్నారు. ఖలీల్ వీడియో తీసుకునేందుకు అతను డబ్బు చెల్లించారని ఆమె చెప్పారు. వీడియో వల్ల విరాళాలు వస్తే నెలకు 1.36 లక్షలు ఇస్తానని ఎరెజ్ హామీ ఇచ్చారని ఆమె చెప్పారు.

ఎరెజ్ స్థానిక ఆసుపత్రిలో ఖలీల్ వీడియో తీశారు. ఈ వీడియోకు ఆయనే డైరెక్టర్‌గా వ్యవహరించారు. వీడియో కోసం పిల్లవాడితో 12 గంటలపాటు అనేకసార్లు రీటేక్స్ చేశారని అల్జిన్ చెప్పారు.

నెలలు గడిచినప్పటికీ, ఆ వీడియోకు ఎలాంటి స్పందన వచ్చిందో తమకు తెలియదని ఆ కుటుంబం చెప్పింది. ఎరెజ్‌కు అల్జిన్ మెసేజ్ చేయగా, ఆ వీడియోకు పెద్దగా స్పందన రాలేదని ఎరెజ్ ఆమెకు చెప్పారు.

"అందువల్ల, ఆ వీడియో ద్వారా విరాళాలు రాలేదని అనుకున్నా" అని ఆమె అన్నారు.

అయితే, ఆ వీడియో ద్వారా 2024 నవంబర్ నాటికి దాదాపు 24 లక్షల రూపాయలు విరాళంగా వచ్చాయని, ఆ వీడియో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఉందని మేం ఆమెకు చెప్పాం.

"విరాళాల ద్వారా డబ్బు వచ్చినట్లు నాకు తెలిసి ఉంటే, నేనేం చేయగలనో తెలీదు కానీ, ఖలీల్ ఈరోజు మనతోనే ఉండేవాడేమో అని అనిపిస్తోంది. వాళ్లు ఇలా ఎలా చేయగలిగారో అర్థం కావడం లేదు" అని అల్జిన్ అన్నారు.

వీడియో చిత్రీకరణలో "మీ పాత్ర ఏంటి" అని స్థానిక వ్యాపార వేత్త రోయీ ఇన్సియెర్టోను అడిగినప్పుడు, వీడియో చిత్రీకరణ కోసం పిల్లలకు గుండు చేయించాలని తాను ఎవరికీ చెప్పలేదని ఆయన అన్నారు. వీడియోల కోసం క్యాన్సర్ సోకిన చిన్నారుల కుటుంబాలను ఏర్పాటు చేస్తున్నందుకు తనకు ఎవరూ ఏమీ ఇవ్వలేదని ఆయన చెప్పారు.

విరాళాలుగా వచ్చిన నిధులను ఏం చేస్తున్నారనే దాని గురించి తనకు తెలియదని, వీడియో చిత్రీకరణ తర్వాత ఆ కుటుంబాలతో ఎలాంటి సంప్రదింపులూ లేవని ఆయన అన్నారు.

విరాళాల సొమ్ము ఆ కుటుంబాలకు అందలేదని ఆయనతో అన్నప్పుడు.. "ఆశ్చర్యపోతూ, ఆ కుటుంబాలకు నిజంగా క్షమాపణలు చెబుతున్నా" అని ఆయన అన్నారు.

చాన్స్ లెటిక్వా సంస్థ రిజిస్ట్రేషన్ పత్రాలలో ఎరెజ్ అనే పేరుతో ఎవరూ కనిపించలేదు.

అయితే, ఇలాంటి ప్రచార కార్యక్రమాల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న సంస్థల గురించి మేం పరిశోధన చేసినప్పుడు 'వాల్స్ ఆఫ్ హోప్' అనే సంస్థ గురించి తెలిసింది. ఈ సంస్థ ఇజ్రాయెల్, కెనడాలో రిజిస్టర్ అయింది. సంస్థ రిజిస్ట్రేషన్ పత్రాలలో కెనడాలో దీని డైరెక్టర్ పేరు ఎరెజ్ హదరి అని ఉంది.

ఆన్‌లైన్‌లో ఉన్న ఆయన ఫోటోలు.. ఫిలిప్పీన్స్, న్యూయార్క్, మయామీలో జరిగిన యూదు మత వేడుకల్లో పాల్గొన్నట్లు చూపిస్తున్నాయి.

ఆ ఫోటోలను అల్జిన్‌కు చూపించినప్పుడు తనను కలిసిన వ్యక్తి ఆయనే అని ఆమె స్పష్టం చేశారు.

ఫిలిప్పీన్స్‌లో క్యాన్సర్ సోకిన చిన్నారుల వీడియోలతో విరాళాల సేకరణ క్యాంపెయిన్ గురించి మేం ఎరెజ్ హదరీని అడిగాం, ఆయన స్పందించలేదు.

ఎరెజ్ పోస్ట్ చేసిన, ఆయనకు సంబంధమున్న ప్రచార వీడియోల్లోని మిగిలిన చిన్నారుల కుటుంబాలను కూడా మేం కలిశాం. అందులో కొలంబియాలోని మారుమూల గిరిజన తెగకు చెందిన కుటుంబం ఒకటి కాగా, మరో కుటుంబం యుక్రెయిన్‌‌కు చెందినది.

ఖలీల్ కేసు మాదిరిగానే మిగతా ప్రాంతాల్లోనూ పిల్లల వీడియోలు చిత్రీకరించేందుకు స్థానిక మధ్యవర్తులు కొందరు ఆయా కుటుంబాలను సంప్రదించారు.

పిల్లలతో వీడియోలు తీశారు. వీడియో తీస్తున్న సమయంలో వారు కన్నీరు పెట్టుకుంటున్నట్లుగా నటించేందుకు కొద్దిమొత్తంలో డబ్బులు ఇచ్చారు. అయితే ఆ తర్వాత వారికి ఎలాంటి సాయం అందలేదు.

8 ఏళ్ల 'ఆనా'ను మోసం చేసిన సంస్థ

మొదట తాను ఈ సాయాన్ని తిరస్కరించినట్లు వాయువ్య కొలంబియాలోని సుక్రే ప్రాంతంలో నివసించే సెర్గియో కేర్ చెబుతున్నారు.

తన 8 ఏళ్ల కుమార్తె ఆనా మెదడులో ట్యూమర్ ఉందని తెలిసిన తర్వాత ఆర్థిక సాయం అందించేందుకు ఇసాబెల్ అనే వ్యక్తి తనను సంప్రదించినట్లు ఆయన చెప్పారు.

ఇసాబెల్, ఇంటర్నేషనల్ ఎన్జీవోకు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న మరో వ్యక్తి కలిసి ఆనా చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చారని సెర్గియో చెప్పారు.

ఇంటర్నేషనల్ ఎన్జీవోకు చెందిన వ్యక్తి గురించి సెర్గియో చెప్పిన పోలికలు ఎరెజ్ హదరికి దగ్గరగా ఉన్నాయి. బీబీసీ ఎరెజ్ ఫోటో చూపించినప్పుడు తనను కలిసింది ఆయనే అని సెర్గియో గుర్తించారు.

"ఆయన నాకు ఆశ కల్పించారు. ఇక మున్ముందు అవసరాలకు నా దగ్గర డబ్బులు కూడా లేవు" అని సెర్గియో అన్నారు.

వీడియో రికార్డ్ చేయడంతోనే ఎరెజ్ డిమాండ్లు అయిపోలేదు.

ఇసాబెల్ ఆయనకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఆనా ఆసుపత్రి ఫోటోలు మరిన్ని కావాలని కోరారు.

సెర్గియో స్పందించకపోవడంతో ఇసాబెల్ నేరుగా ఆనాకు సందేశాలు పంపడం మొదలుపెట్టారు.

ఇసాబెల్ ఆనాకు పంపించిన వాయిస్ మెసేజ్‌లను మేం విన్నాం.

ఇక పంపించడానికి ఎలాంటి ఫోటోలు లేవని ఆనా ఇసాబెల్‌కు చెప్పారు. అందుకు ఇసాబెల్, "ఇదేమీ బాలేదు ఆనా. ఇలా చేయడం మంచిది కాదు" అని ఇసాబెల్ అన్నారు.

ఈ ఏడాది జనవరిలో ఆనా పూర్తిగా కోలుకున్నారు. తనకు ఇస్తానన్న డబ్బు ఏమైందో కనుక్కునేందుకు ఆమె ప్రయత్నించారు.

"ఆ స్వచ్ఛంద సంస్థ అదృశ్యమైంది, మీ వీడియో అసలు అప్‌లోడ్ చేయలేదు. ఇప్పటివరకూ చేయలేదు. చేసేదేమీ లేదు. వింటున్నావా?" అని ఆనాకు ఇసాబెల్ పంపిన వాయిస్ నోట్‌లో ఉంది.

కానీ, ఆనా వీడియో అప్‌లోడ్ అయినట్లు మేం గుర్తించగలిగాం. 2024 ఏప్రిల్ నాటికి ఆ వీడియో ద్వారా సుమారు రూ.2.25 కోట్ల విరాళాలు సేకరించినట్లు కనిపించింది.

అక్టోబర్‌లో, వీడియో లింక్ ద్వారా మాతో మాట్లాడేందుకు ఇసాబెల్ హెర్నాండెజ్‌ను ఒప్పించాం.

ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఓ స్నేహితురాలు, క్యాన్సర్ చిన్నారులకు సాయం చేస్తున్న "ఒక ఫౌండేషన్" కోసం పని చేయాలంటూ ఒకరికి పరిచేయం చేశారని ఆమె చెప్పారు. అయితే, ఆ సంస్థ ఏది? ఆ వ్యక్తి ఎవరు అనే వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు.

ఆమె సాయం చేసిన వీడియోలలో ఒకటి మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయిందని, ఆ వీడియోకు పెద్దగా స్పందన రాలేదని చెప్పారని ఇసాబెల్ తెలిపారు.

అప్‌లోడ్ చేసిన రెండు వీడియోలను మేం ఆమెకు చూపించాం. అందులో ఒక వీడియోకు 6.32 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు చూపిస్తోంది.

"నేను ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. వారి విషయంలో ఇలా జరుగుతుందని తెలిస్తే, అసలు అలాంటి పని చేసి ఉండేదాన్ని కాదు" అని ఆమె అన్నారు.

ఆసుపత్రిలోనే వీడియోల చిత్రీకరణ

యుక్రెయిన్‌లో అనారోగ్యంతో ఉన్న చిన్నారి తల్లిని సంప్రదించిన వ్యక్తి, ఆ వీడియో చిత్రీకరించిన ఆసుపత్రిలోనే పని చేస్తున్నట్లు మేం గుర్తించాం.

చెర్నివిట్సిలోని ఏంజెల్‌హాల్మ్ క్లినిక్‌లో బ్రెయిన్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న ఐదేళ్ల విక్టోరియాతో వీడియో తీసేందుకు టెటియానా ఖలియెవ్‌కా ఏర్పాట్లు చేశారు.

చాన్స్ లెటిక్వా క్యాన్సర్ బాలల ప్రచారంలో భాగంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో విక్టోరియా, ఆమె తల్లి ఒలెనా ఫిర్సోవా ఓ మంచం మీద కూర్చుని ఉన్నారు.

"మీ బిడ్డను కాపాడేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలను మేం చూశాం. అది మమ్మల్ని కలచివేసింది. విక్టోరియా చికిత్సకు అవసరమైన సొమ్మును సేకరించేందుకు మేం కాలంతో పోటీ పడుతున్నాం" అని ఆ వీడియోకు క్యాప్షన్ రాసి ఉంది.

తాను ఎప్పుడూ అలా రాయలేదని, అసలు ఆ వీడియో అప్‌లోడ్ చేసిన విషయమే తనకు తెలియదని ఒలెనా చెప్పారు.

ఈ వీడియో ద్వారా సుమారు 2.96 కోట్ల రూపాయలు సేకరించినట్లు కనిపిస్తోంది.

ఏంజెల్‌హాల్మ్‌ క్లినిక్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్‌గా టెటియానా పని చేస్తున్నట్లు బీబీసీకి చెప్పారు.

తమ క్లినిక్‌లో వీడియోల చిత్రీకరణకు తాము ఎవరికీ అనుమతి ఇవ్వలేదని క్లినిక్ ప్రతినిధి ఇటీవల బీబీసీకి చెప్పారు.

"ఈ వ్యవహారంలో క్లినిక్ ఎప్పుడూ పాలుపంచుకోలేదు. పిల్లలకు చికిత్స పేరుతో విరాళాలు సేకరించేందుకు ఏ సంస్థకు మద్దతు కూడా ఇవ్వలేదు" అని ఆ ప్రతినిధి వెల్లడించారు.

టెటియానాను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఏంజెల్‌హాల్మ్‌ చెబుతోంది.

సంతకం చేయాలని కోరుతూ వాళ్లు ఇచ్చిన ఒప్పంద పత్రాన్ని ఒలెనా మాకు చూపించారు.

వీడియో చిత్రీకరణ సమయంలో ఆ కుటుంబానికి ఇచ్చే సుమారు 1.35 లక్షలతో పాటు విరాళాల సొమ్ము ద్వారా రూ.7.22 లక్షలు ఇస్తామని ఆ ఒప్పందంలో రాసి ఉంది. అయితే, విరాళాల సేకరణకు వారు ఎంత మొత్తం లక్ష్యంగా పెట్టుకున్నారనే కాలమ్‌ను ఖాళీగా వదిలేశారు.

కాంట్రాక్టులో పేర్కొన్న అడ్రస్ చాన్స్ లెటిక్వా, న్యూయార్క్ పేరుతో ఉంది.

సంస్థ వెబ్‌సైట్‌లో మరో అడ్రస్ ఉంది. అది ఇజ్రాయెల్‌లోని జెరూసలేం నగరానికి గంట ప్రయాణం దూరంలో ఉన్న ప్రాంతంలో ఉంది. మేం ఆ రెండుచోట్లకూ వెళ్లాం. అయితే ఎక్కడా ఆ కార్యాలయం కనిపించలేదు.

ఆ తర్వాత బీబీసీ చేసిన పరిశోధనలో చిన్నారులకు క్యాన్సర్ చికిత్స పేరుతో విరాళాలు వసూలు చేసే అనేక సంస్థల్లో చాన్స్ లెటిక్వా కూడా ఒకటని తేలింది.

విక్టోరియాపై వీడియో చిత్రీకరించిన వ్యక్తి బీబీసీ ప్రతినిధితో తనను తాను క్యాన్సర్ చిన్నారుల స్నేహితుడిగా చెప్పుకున్నారు, తాను ఇలాంటి సంస్థల కోసం పనిచేస్తుంటానని చెప్పుకొచ్చారు.

"ఒక్కోసారి, ఒక్కో సంస్థతో " అని ఒలెహ్‌గా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మా ప్రతినిధితో చెప్పారు.

"ఇలా చేయడం నాకు నచ్చడం లేదు. కానీ అదంతా ఒక గొలుసు మాదిరిగా, ఒక లింక్ మరో దాన్ని లాక్కెళ్లినట్లుగా పని చేస్తాయి" అని అన్నారు.

"మెటీరియల్" (క్యాన్సర్ బారిన పడిన చిన్నారులు) కావాలని డజనుకు పైగా సంస్థలు అడిగేవి. అందులో సెయింట్ థెరిసా, లిటిల్ ఏంజెల్స్ ఉన్నాయని అన్నారు. ఈ రెండు సంస్థలు అమెరికాలో రిజిస్టర్ అయ్యాయి.

ఆ సంస్థల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పరిశీలించినప్పుడు, మరోసారి మాకు ఎరెజ్ హదరి పేరు కనిపించింది.

ఈ వ్యవహరంలో అర్థం కాని అంశం ఏంటంటే, పిల్లల చికిత్స కోసం సేకరించిన విరాళాలకు సంబంధించిన కోట్ల రూపాయల సొమ్ము ఎవరి దగ్గరకు చేరింది?

విక్టోరియా వీడియో తీసిన దాదాపు ఏడాది తర్వాత తల్లి ఒలెనా.. ఒలెహ్‌కు ఫోన్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి చాన్స్ లెటిక్వా నుంచి ఎవరో ఫోన్ చేసి విరాళాల ద్వారా వచ్చిన డబ్బును ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు చెప్పారని ఆమె చెప్పారు.

ఖలీల్ తల్లి అల్జిన్‌ ఫోన్‌లో ఎరెజ్‌ను నిలదీసినప్పుడు కూడా, ఆమెకు ఇలాగే చెప్పారు.

"ప్రచారం కోసం డబ్బు ఖర్చవుతుంది. అందుకే వచ్చిన సొమ్మంతా దానికే సరిపోయింది" అని ఎరెజ్ ఫోన్‌లో ఒలెనాతో చెప్పారు. అయితే, అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదు.

అయితే, విరాళాల ద్వారా వచ్చే సొమ్ములో ప్రచారం కోసం 20 శాతం డబ్బు సరిపోతుందని స్వచ్ఛంద సంస్థల నిపుణులు మాకు చెప్పారు.

చాన్స్ లెటిక్వా తరఫున క్యాన్సర్‌తో ఉన్న పిల్లల కోసం గతంలో పనిచేసిన ఒక వ్యక్తి వాళ్లను ఎలా ఎంచుకుంటారో మాకు చెప్పారు.

క్యాన్సర్ ఆసుపత్రులకు వెళ్లాలని, అక్కడ తమ గుర్తింపు వెల్లడించవద్దని వారికి చెబుతారు.

"వాళ్లకు తెల్లగా ఉండే అందమైన పిల్లలు కావాలి. పిల్లల వయసు 3 నుంచి 9 ఏళ్ల లోపు ఉండాలి. వాళ్లకు బాగా మాట్లాడటం తెలిసి ఉండాలి. వాళ్లకు నెత్తిన జుట్టు ఉండకూడదు" అని గతంలో చాన్స్ లెటిక్వా తరఫున పని చేసిన వ్యక్తి చెప్పారు.

"ఆ పిల్లలు సరిపోతారా లేదా తేల్చుకునేందుకు ముందు వాళ్ల ఫోటోలు కావాలని మమ్మల్ని అడుగుతారు. నేను వాటిని ఎరెజ్‌కు పంపిస్తాను" అని ఆ వ్యక్తి మాకు వివరించారు.

తాము ఆ ఫోటో ఎరెజ్‌కు పంపించిన తర్వాత ఆయన వాటిని ఇజ్రాయెల్‌లో ఉండే మరెవరికో పంపిస్తారని, వాళ్ల పేర్లు తమకు తెలియవని చెప్పారు.

ఎరెజ్‌ను సంప్రదించేందుకు కెనడాలోని రెండు అడ్రస్సుల్లోనూ మేం ప్రయత్నించాం. కానీ, ఆయన్ను సంప్రదించలేకపోయాం.

విరాళాల ద్వారా సేకరించిన సొమ్మును ఏం చేశారని అడుగుతూ మేం ఆయన ఫోన్ నంబర్‌కు పంపిన వాయిస్ మెసేజ్‌కు స్పందిస్తూ, 'ఇప్పుడు ఆ సంస్థ యాక్టివ్‌గా లేదు' అని సమాధానమిచ్చారు. అయితే, ఏ సంస్థ అనేది ఆయన చెప్పలేదు.

ఆ తర్వాత.. ఆయనపై వచ్చిన ఆరోపణలు, క్యాన్సర్ సోకిన పిల్లల తల్లిదండ్రులతో చేసుకున్న ఒప్పందాలు, ఇతర అంశాల గురించి ప్రశ్నిస్తూ మరో వాయిస్ నోట్ పంపించాం, కానీ ఆయన స్పందించలేదు.

చాన్స్ లెటిక్వా వీడియోలు చిత్రీకరించిన ఇద్దరు చిన్నారులు ఖలీల్, మెక్సికోకు చెందిన హెక్టర్ చనిపోయారు. అయినప్పటికీ, వారి వైద్యానికి సాయం అందించాలని కోరుతూ పోస్ట్ చేసిన వీడియోలు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి. విరాళాలు స్వీకరిస్తున్నట్లు చూపుతున్నాయి.

చాన్స్ లెటిక్వాకు చెందిన అమెరికన్ బ్రాంచ్ సెయింట్ రఫెల్ అనే కొత్త సంస్థతో అనుసంధానమై ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సంస్థ కూడా క్యాన్సర్ సోకిన చిన్నారుల వీడియోలు రూపొందించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తోంది.

సెయింట్ రఫెల్ రూపొందించిన వీడియోల్లో కనీసం రెండు వీడియోలు యుక్రెయిన్‌లోని ఏంజెల్‌హాల్మ్‌ క్లినిక్‌లో చిత్రీకరించినట్లుగా అనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఉన్న వీడియోల్లో ఏంజెల్‌హాల్మ్ క్లినిక్‌కు చెందిన ప్యానెళ్లు, సిబ్బంది యూనిఫాం స్పష్టంగా కనిపిస్తోంది.

తన కుమార్తెకు మరో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని విక్టోరియా తల్లి ఒలెనా చెప్పారు. మా పరిశోధనలో తేలిన విషయాలతో తాను ఆవేదనకు గురైనట్లు ఆమె చెప్పారు.

"మీ బిడ్డ ప్రాణాలతో పోరాడుతూ.. మరణశయ్యపై ఉన్నప్పుడు, అక్కడ ఉన్న వారు దాని నుంచి డబ్బులు సంపాదించాలని చూడడం ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించండి. అది నెత్తుటి కూటితో సమానం" అని ఆమె అన్నారు.

టెటియానా ఖలియెవ్కా, అలెక్స్ కొహెన్, చాన్స్ లెటిక్వా, వాల్స్ ఆఫ్ హోప్, సెయింట్ రఫెల్, లిటిల్ ఏంజెల్స్, సెయింట్ థెరిస్సా లాంటి సంస్థలను మేం సంప్రదించాం.

వారిపై వచ్చిన ఆరోపణల మీద స్పందించాలని కోరాం. అయితే, ఎవరి నుంచీ ఎలాంటి స్పందనా రాలేదు.

తమ దేశంలో ఏర్పాటు చేసిన సంస్థలను చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు ముసుగుగా ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లభిస్తే, అలాంటి సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని, సంస్థల వ్యవస్థాపకులను ఆయా రంగంలో పని చేయకుండా అడ్డుకుంటామని ఇజ్రాయెల్‌లో లాభాపేక్ష రహిత సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే ఇజ్రాయెల్ కార్పొరేషన్స్ అథారిటీ తెలిపింది.

విరాళాలు ఇచ్చే వారు ఆయా సంస్థలు రిజిస్టర్ అయి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలని బ్రిటన్‌లో స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే చారిటీ కమిషన్ సూచించింది. ఎవరికైనా ఏవైనా సందేహాలుంటే వెంటనే తమను సంప్రదించవచ్చని తెలిపింది.

అదనపు రిపోర్టింగ్: నెడ్ డేవిస్, ట్రాక్స్ సఫ్లోర్, జోస్ ఆంటోనియో లూసియో, అల్ముడెనా గార్సియా పరాడో, విటాలియా కొజెమెంకో, షక్కెడ్ ఔర్బాచ్ , టామ్ జుర్ విస్‌ఫెల్డర్, కేటరినా, అనస్టాసియా కుచెర్, అలన్ పులియాడో, నీల్ మెకార్తీ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)