You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత హై కమిషనర్‌ను దేశం నుంచి బహిష్కరించాలన్న బంగ్లాదేశీ నేత.. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో అసలేం జరుగుతోంది?
భారత్‌లోని సెవెన్ సిస్టర్స్(ఈశాన్య) రాష్ట్రాలను భారత్ నుంచి వేరుచేస్తామంటూ బెదిరింపుల తర్వాత, భారత హై కమిషనర్‌ను దేశం నుంచి బహిష్కరించాలని బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్‌సీపీ) సదరన్ చీఫ్ ఆర్గనైజర్ హస్నాత్ అబ్దుల్లా బుధవారం అన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో, బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కుమిల్లా-4 నుంచి హస్నత్ అబ్దుల్లాను ఎన్‌సీపీ నిలబెట్టింది.
కుమిల్లాలోని దేబిద్వార్‌లో బుధవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన హస్నత్ అబ్దుల్లా , బంగ్లాదేశ్ హై కమిషనర్‌ను భారత్ పిలిపించడాన్ని వ్యతిరేకిస్తూ, "భారత్ వైఖరికి మనం తీవ్రంగా స్పందించి ఉండాలి. షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తున్నందున భారత హై కమిషనర్‌ను దేశం నుంచి బహిష్కరించాలి" అని అన్నారు.
బుధవారం, భారత్... దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లాను పిలిపించి, ఢాకాలోని భారత హైకమిషన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర గౌరవంపై ఆధారపడి ఉండాలని హస్నాత్ అన్నారు.
"పరస్పర గౌరవం చూపితేనే భారత దేశ సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను బంగ్లాదేశ్ గౌరవిస్తుంది. మీరు 'కనపడితే కాల్చేయండి' విధానాన్ని అనుసరిస్తే, మేం 'కనపడితే సెల్యూట్' విధానాన్ని ఎందుకు అనుసరించాలి?" అని ఆయన ప్రశ్నించారు.
కొద్దినెలలుగా, బంగ్లాదేశ్ నాయకులు నిత్యం భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భారత విదేశాంగ శాఖ, "బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి రాడికల్ శక్తులు ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలను మేం పూర్తిగా తిరస్కరిస్తున్నాం. తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించకపోవడం లేదా అందుకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను భారత్‌తో పంచుకోకపోవడం దురదృష్టకరం" అని పేర్కొంది
భారత్‌పై ఆగ్రహం
భారత్‌పై హస్నత్ అబ్దుల్లా దూకుడు గురించి బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆరిఫా రెహమాన్ రుమా మాట్లాడుతూ... "మొహమ్మద్ యూనస్ ఛాందసవాదులను ప్రోత్సహిస్తున్నారు" అని అన్నారు.
భారత హై కమిషనర్‌ను బహిష్కరించడం గురించి మాట్లాడుతున్న హస్నత్ వీడియో క్లిప్‌ను ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"బంగ్లాదేశ్ ప్రమాదకరంగా అదుపుతప్పుతోంది. భారత హై కమిషనర్‌ను దేశం నుంచి బహిష్కరించాలని హస్నత్ అబ్దుల్లా బహిరంగంగా ప్రకటించారు. బాధ్యతాయుతమైన ఏ నాయకుడూ అలాంటి ప్రకటన చేయరు. హస్నత్ వంటి తీవ్రవాద, హింసాత్మక సిద్ధాంతకర్తలు, వారి మద్దతుదారులు ఇప్పుడు ముహమ్మద్ యూనస్‌కు మద్దతిచ్చే ప్రధాన శక్తిగా మారారు" అని ఆరిఫా రెహమాన్ రుమా ఎక్స్‌లో రాశారు.
"పొరుగు దేశ హై కమిషనర్‌ను బహిష్కరిస్తామని యూనస్ నాయకులు ర్యాలీల్లో బహిరంగంగా ప్రకటించగలిగే దేశంలో, సాధారణ ప్రజలు ఎంత అభద్రతా భావంలో ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి బంగ్లాదేశ్‌లో, సాధారణ పౌరులు తమ జీవితాలకు, ఆస్తులకు భద్రత ఉన్నట్లు భావించలేరు. ఇది దేశంలో శాంతిభద్రతలు, రాజకీయ సంయమనం పూర్తిగా పతనమయ్యాయని బహిర్గతం చేస్తోంది" అని ఆరిఫా రాశారు.
షేక్ హసీనా కుమారుడు ఏమన్నారు?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి భారత్‌కు ముప్పును పెంచుతోందని కూడా ఆయన హెచ్చరించారు. 54 ఏళ్ల వాజిద్ అమెరికాలో నివసిస్తున్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి పాకిస్తాన్‌తో పెరుగుతున్న సాన్నిహిత్యం గురించి వాజెద్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, "ఇది భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. మా అవామీ లీగ్ ప్రభుత్వం భారత దేశ తూర్పు సరిహద్దులను అన్ని ఉగ్రవాద కార్యకలాపాల నుంచి సురక్షితంగా ఉంచింది. అంతకుముందు, భారత్‌లో తిరుగుబాటుకు బంగ్లాదేశ్‌ను ప్రధాన స్థావరంగా ఉపయోగించారు" అని ఆయన అన్నారు.
"ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ వస్తోంది. యూనస్ ప్రభుత్వం జమాతె ఇ ఇస్లామి, ఇతర ఇస్లామిస్ట్ పార్టీలకు దేశంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇస్లామిస్ట్ పార్టీలు బంగ్లాదేశ్‌లో ఎప్పుడూ ఐదు శాతం కంటే ఎక్కువ ఓట్లను పొందలేదు. అన్ని ప్రగతిశీల, ఉదారవాద పార్టీలను నిషేధించడం ద్వారా, ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం ద్వారా, యూనస్ ఇస్లామిక్ ఛాందసవాదులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు" అని వాజెద్ జాయ్ తెలిపారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత్ పట్ల పెద్దగా సానుకూలంగా లేదు.
1971 విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్ సహకారాన్ని భారత్ నిరంతరం తక్కువ అంచనా వేస్తోందని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహాదారు మొహ్మద్ తౌహీద్ హుస్సేన్ బుధవారం ఆరోపించారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధులు లేకుండా ఈ విజయం సాధ్యం కాదని తౌహీద్ హుస్సేన్ నొక్కి చెబుతున్నారు.
విజయ్ దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జర్నలిస్టులకు పంపిన అభినందన సందేశాలకు తౌహీద్ స్పందిస్తూ, ఈ రోజును కోల్‌కతాలో "ఈస్టర్న్ కమాండ్ డే"గా ప్రత్యేకంగా జరుపుకుంటారని, భారత్ దీనిని తన సాయుధ దళాల విజయంగా భావిస్తుందనే వాస్తవాన్ని ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు.
"భారత్ పాకిస్తాన్ పై గెలిచింది నిజమే. కానీ బంగ్లాదేశ్ విజయం సాధించిన సమయంలో, స్థానిక ప్రతిఘటన వల్ల పాకిస్తాన్ సైన్యం బలహీనపడకపోతే, భారత్ గెలవడానికి ఎక్కువ సమయం పట్టేదని నా పుస్తకంలో నేను ప్రస్తావించిన భారతీయ నిపుణులు అంగీకరిస్తున్నారు. నష్టాలు, ప్రాణనష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేది" అని తౌహీద్ హుస్సేన్ అన్నారు.
విమోచన పోరాటంలో భారత్ పాత్రపై ప్రశ్నలు
గతేడాది ఆగస్టులో షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ పాత్ర గురించి తీవ్ర చర్చ జరిగింది. అనేక మంది బంగ్లాదేశ్ నాయకులు భారత్ పాత్రను ప్రశ్నిస్తున్నారు.
గతేడాది డిసెంబర్‌లో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) స్టాండింగ్ కమిటీ సభ్యుడు మీర్జా అబ్బాస్ మాట్లాడుతూ, "భారత్ బంగ్లాదేశ్‌ను సృష్టించలేదు. మేం బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించాం. భారత్ పాకిస్తాన్‌ను విభజించింది మన ప్రయోజనం కోసం కాదు, తన సొంత ప్రయోజనం కోసం" అని అన్నారు.
షేక్ హసీనా ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా, 1971 నాటి యుద్ధం విముక్తి కోసం జరిగిన యుద్ధమా? లేక భారత్ - పాకిస్తాన్ యుద్ధమా? అనే దానిపై చర్చ జరిగింది.
పాకిస్తాన్ దీనిని భారత్‌తో యుద్ధం అని పిలుస్తుంది. బంగ్లాదేశ్ విమోచన పోరాటంగా పిలవదు. భారతీయ పాఠ్యపుస్తకాల్లో కూడా దీనిని భారత్ - పాకిస్తాన్ యుద్ధంగానే వ్యవహరిస్తారు. అయితే, దీనిని బంగ్లాదేశ్ విమోచన పోరాటం అని పిలవడానికి భారత్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు.
డిసెంబర్ 6, 2021న, అప్పటి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ ఏకే మోమెన్, భారత దేశంతో దౌత్య సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బంగ్లాదేశ్ నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ పార్టీ వైఖరిని ప్రకటించారు.
"బంగ్లాదేశ్ విమోచన పోరాటాన్ని భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంగా చిత్రీకరించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ అది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, దీనిలో భారత్ సాయం మాత్రమే చేసింది. డిసెంబర్ 6న, భారత్.. బంగ్లాదేశ్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించింది" అని మోమెన్ అన్నారు.
1971 యుద్ధం పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ దాడితో ప్రారంభమైంది. తరువాత, అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ యుద్ధానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
పాకిస్తాన్‌కు దగ్గరవుతోందా?
2024 జూలైలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం విమోచన పోరాటానికి కూడా వ్యతిరేకం అన్నట్లు కూడా కనిపించింది.
నిరసనకారులు విమోచన పోరాటానికి సంబంధించిన అనేక చిహ్నాలపై దాడి చేశారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజిబుర్ రెహమాన్ ఇంటిపై కూడా దాడి జరిగింది. ఇదిలా ఉంటే, మరోవైపు పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపించాయి.
బంగ్లాదేశ్ విమోచన పోరాట వ్యతిరేకిగా, పాకిస్తాన్‌తో చేతులు కలిపిందంటూ తరచుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జమాతె ఇ ఇస్లామి ఇప్పుడు ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో భారత్ పాత్రను కూడా ప్రశ్నిస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, బంగ్లాదేశ్ వార్తా వెబ్‌సైట్ ప్రథమ్ ఆలోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బంగ్లాదేశ్ జమాతె-ఇ-ఇస్లామి చీఫ్ షఫీకుర్ రెహమాన్, "1971లో మా వైఖరి సూత్రప్రాయంగా ఉంది. భారత దేశ ప్రయోజనం కోసమే మేం స్వతంత్ర దేశాన్ని కోరుకోలేదు" అని అన్నారు.
"మనం ఒకరి ద్వారా లేదా మరొకరి తరఫున స్వాతంత్య్రం పొందితే.. అది ఒక భారాన్ని వదిలించుకుని, మరో భారాన్నీ ఎత్తుకున్నట్లు అవుతుంది. 53 ఏళ్లుగా బంగ్లాదేశ్‌కు జరుగుతోంది ఇదే కదా? ఒక దేశం.. ఒక పార్టీని ఇష్టపడదనేది ఎందుకు వస్తోంది. ఒక దేశానికి నచ్చకపోతే, నిర్దిష్టమైన పార్టీ అధికారంలోకి రాకూడదా? స్వతంత్ర దేశం వైఖరి ఇదేనా? బంగ్లాదేశ్ యువత ఇకపై ఇవన్నీ వినడానికి ఇష్టపడడం లేదు" అని రెహమాన్ అన్నారు.
షేక్ హసీనాకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం బంగ్లాదేశ్ విమోచన పోరాటానికీ వ్యతిరేకంగా మారిందా?
బంగ్లాదేశ్‌కు చెందిన ఇంగ్లిష్ న్యూస్ వెబ్‌సైట్ ప్రథమ్ ఆలో.. ప్రముఖ మేధావి, సెంటర్ ఫర్ పాలసీ డైలాగ్ వ్యవస్థాపకులు రెహమాన్ శోభన్‌ను ఈ ప్రశ్న అడిగినప్పుడు, "జూలై ఉద్యమం ప్రజాస్వామ్య వైఫల్యం, అన్యాయమైన పాలనతో ప్రేరేపితమైంది" అని ఆయన సమాధానం ఇచ్చారు.
"విమోచన యుద్ధ వ్యతిరేకులు ఈ ఉద్యమాన్ని దుర్వినియోగం చేశారు. వారు చాలా కాలంగా మన రాజకీయాల్లో పాలుపంచుకున్నారు. ఈ ఉద్యమంలోకి చొరబడి దాని దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. ఇది నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సామూహిక తిరుగుబాట్లలో తరచుగా కనిపిస్తుంది" అని ఆయన చెప్పారు.
"బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో వారి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో వారి గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయి. 1971లో పాకిస్తానీ సైన్యానికి మిత్రులుగా ఉన్న తమ చారిత్రక పాత్రను పునర్నిర్వచించేందుకు వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. రాజకీయంగా చతురత కలిగిన నేతల నాయకత్వంలో విమోచన పోరాటంపై వారి వైఖరిని కొంత జాగ్రత్తగా ప్రదర్శిస్తారు. అయితే, 1971లో వారి పాత్రను నిష్కళంకంగా చూపించే ప్రయత్నాలు వారి వ్యూహంలో అంతర్భాగంగా ఉంటాయి" అని రెహమాన్ శోభన్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)