బంగ్లాదేశ్ చరిత్రలో రక్తపు మరకలు...ఆ వారం రోజుల్లో ఏం జరిగింది?

    • రచయిత, మీర్ సాబిర్
    • హోదా, బీబీసీ బంగ్లా

పాకిస్తాన్ నుంచి పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రానికి ఐదేళ్లు కూడా నిండకుండానే బంగా బంధుగా అని పిలుచుకునే షేక్ ముజీబుర్ రెహ్మాన్, ఆయన కుటుంబీకులు సొంత సైన్యం చేతుల్లోనే తిరుగుబాటును ఎదుర్కొని, ప్రాణాలు కోల్పోయారు.

1975వ సంవత్సరం ఆగస్టు 15 న ముజిబుర్ హత్య జరిగినప్పటి నుంచి నుంచి మొదలైన అల్లర్లు నవంబర్ మొదటివారానికి చేరుకునే సరికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

బంగ్లాదేశ్ చరిత్రలోనే దారుణమైన రక్తపాతానికి సాక్ష్యాలుగా నిలిచిన నవంబర్ మొదటి వారంలో ఏం జరిగింది?

దేశ చరితను మలుపు తిప్పిన సంఘటన వెనుక ఉన్నదెవరు?

తిరుగుబాటు ఫలితంగా..

15 ఆగస్టు 1975 ముజిబుర్ రెహ్మాన్ హత్య తరువాత ఖోండ్‌కార్ ముస్తాక్ అధ్యక్షుడిగా, ఆ హత్యలో కీలకంగా వ్యవహరించిన వారితో కలిపి అధికారాన్ని చేపట్టారు. కానీ, ముస్తాక్‌తో పోలిస్తే, ఈ హత్యలో భాగమైన ఆర్మీ అధికారులే ఎక్కువ శక్తివంతులు.

ఈ సమయంలో జియావుర్ రెహ్మాన్ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. అయితే, ముజీబ్ హత్యలో కీలక పాత్ర పోషించిన వారు మాత్రం బంగా భవన్‌ నుంచి చాలా విషయాలను నియంత్రించారు.

ఈ తిరుగుబాటుకు బదులు తీర్చుకునే తిరుగుబాటు రూపుదిద్దుకోవడం మొదలైంది. హత్య జరిగిన మూడు నెలల తర్వాత, నవంబర్ మొదటి వారంలో ఆ ఫలితం ఎలాంటిదో తెలిసింది.

ఈ తిరుగుబాటుకు చాలా కారణాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం ముజీబ్ హత్య అనంతరం సైన్యంలో మొదలైన ఉద్రిక్త పరిస్థితుల ఫలితంగా తిరుగుబాటు జరిగిందని చెప్తారు.

తిరుగుబాటు సన్నాహాలు..

విమోచన యుద్ధ సమయంలో ముగ్గురు ఆర్మీ అధికారుల గురించి అందరికీ తెలిసింది. విశ్రాంత బ్రిగేడియర్ షెకావత్ హుస్సేన్ మాట్లాడుతూ, యుద్ధం తరువాతి కాలం నుంచి ఈ ముగ్గురు అధికారులు సైన్యాన్ని తమ పరిధిలో ప్రభావితం చేశారని అన్నారు. హుస్సేన్ ఢాకాలో 46వ బ్రిగేడియర్‌గా పనిచేశారు.

ఆయన చెప్పిన ఆ ముగ్గురు సైనికాధికారులు జియావుర్ రెహ్మాన్, ఖలీద్ ముషార్రఫ్, కేఎం షఫీయుల్లా.

వివాదాలు ముందునుంచే ఉన్నాయి గానీ, ఆగస్టు 15 హత్య తర్వాత మరింత పెరిగాయి. షఫీయుల్లాను తప్పించి జనరల్ జియావుర్ వెలుగులోకి వచ్చారు. ఆయన ఆర్మీ చీఫ్‌గా అధికారం చేపట్టడంతో ఆయనకు, ఖలీద్ ముషార్రఫ్‌ల మధ్య శత్రుత్వం పెరిగింది” అన్నారు.

పదవి నుంచి తొలగించిన నాటి నుంచి తాను బయటకు రాలేదని, దాదాపుగా గృహ నిర్భంధ పరిస్థితులను ఎదుర్కొన్నారని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షఫీయుల్లా తెలిపారు.

నవంబర్ మొదటివారంలో జరిగిన తిరుగుబాటు పరిస్థితులను ఆయన జియావుర్ రెహ్మాన్, ఖలీద్ ముషార్రఫ్‌ల మధ్య జరిగిన సంఘర్షణగా చూస్తానని ఆయన అన్నారు.

‘‘భవిష్యత్తు అంధకారంగా మారిందని, జియావుర్‌ను తప్పించాలని ఖలీద్ ముషార్రఫ్ నిర్ణయించుకున్నాడు. అతడిని పదవి నుంచి తప్పించి, గృహ నిర్భంధం చేశాడు. ఖలీద్ ముషార్రఫ్ తనకు తానే చీఫ్‌గా ప్రకటించుకున్నాడు. కానీ చివరకు ఆయన వ్యూహం ఫలించలేదు. నవంబర్ 7న జియావుర్ రెహ్మాన్, తాహెర్‌లు ఇద్దరూ కలిసి ముషార్రఫ్‌ వ్యూహాన్ని నాశనం చేశారు.’’ అన్నారు.

మలుపు తిప్పిన రెండు ఘటనలు

నవంబరు 3న జరిగిన రెండు ఘటనలు మొత్తం బంగ్లాదేశ్ చరిత్రనే మలుపుతిప్పాయి. వాటిలో మొదటిది తిరుగుబాటు అయితే, రెండోది ఢాకా జైలులో జరిగిన హత్యలు.

నవంబరు 3న అర్ధరాత్రి దాటాక ఖలీద్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు జియావుర్‌ను బంధించారు. ఢాకా కంటోన్మెంట్ నుంచి బంగా భవన్‌ను ముట్టడించింది సైన్యం. మరో యూనిట్ రేడియో స్టేషన్‌ను ముట్టడించింది.

బంగా భవన్ దగ్గర ఎలాంటి సైనిక చర్యలు జరగలేదని, మేజర్ దలీం, మేజర్ నూర్‌లు కూడా ఎలాంటి ప్రతిచర్యలకు పాల్పడలేదని చెప్పారు. అదే సమయంలో బంగ భవన్ పరిసరాల్లో యుద్ధ విమానాలు కూడా చక్కర్లు కొట్టాయని అన్నారు.

“రెండు, మూడు యుద్ధ విమానాలు బంగా భవన్‌పై చక్కర్లు కొట్టడంతో ఎక్కువ సమయం లేదని వారికి అర్థమై, వారు లొంగిపోవలసి వచ్చింది” అన్నారు.

ఉదయం నుంచి రోజంతా ఖలీద్ ముషార్రఫ్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపాక వారి మధ్య ఒప్పందం కుదిరింది. వారు సాయంత్రానికల్లా దేశాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించారు.

అదేరోజు రాత్రి ముజీబ్ హత్యకేసుకు సంబంధించిన కొంతమంది సైనికాధికారులు విమానంలో థాయిలాండ్ వదిలివెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అదే రోజున ఢాకా జైలులో..

అదే సమయంలో ఢాకాలోని సెంట్రల్ జైలులో హత్యలు జరిగాయి.

ముజీబ్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు తాజుద్దీన్ అహ్మద్, సయ్యద్ నజ్రుల్ ఇస్లాం, కెప్టెన్ మన్సూర్ అలీ, కమ్రుజ్జమాలు కొంతమంది సైనికాధికారుల చేతుల్లో హత్యకు గురయ్యారు.

అప్పటి ఢాకా సెంట్రల్ జైలు అధికారి అమీనుర్ రెహ్మాన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు అర్ధరాత్రి 1.00 నుంచి 1.30 గంటల మధ్య కొంతమంది సైనికాధికారులతో ఓ వ్యాన్ వచ్చి జైలు ముందు ఆగిందని తెలిపారు. ఐజీ అధికారి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, తనను కూడా జైలు దగ్గరికి వెళ్లాల్సిందిగా చెప్పినట్లుగా వెల్లడించారు.

ఆ తరువాత తన కార్యాలయానికి వచ్చిన ఫోన్ కాల్‌లో, “అధ్యక్షులు ఐజీ అధికారితో మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ సంభాషణ అనంతరం ఐజీ అధికారి నాతో , అధ్యక్షుల నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. జైలుకు వచ్చిన సైనికాధికారులు చెప్పినట్లు చేయి” అన్నారు

ఆ తరువాత అమీనుర్ రెహ్మాన్‌కు ఒక నోట్ ఇచ్చారు ఆ అధికారులు. అందులో నలుగురు పేర్లు ఉన్నాయి. వారిని ఒకే ప్రదేశంలో ఉంచాల్సిందిగా వారు కోరారు. ఆ నలుగురూ తాజుద్దీన్ అహ్మద్ సాహిబ్, సయ్యద్ నజ్రుల్ ఇస్లాం, కెప్టెన్ మన్సూర్ అలీ, కమ్రుజ్జమాలు.

"సయ్యద్ నజ్రుల్ ఇస్లాం, తాజుద్దీన్ సాహిబ్‌లు ఒక గదిలో, మిగిలిన ఇద్దరూ మరోగదిలో ఉన్నారు. నేను అందరినీ ఒకే గదిలోకి తీసుకువచ్చాను. అధికారులకు వారిని పరిచయం చేద్దామని అనుకున్నాను. ఎడమ వైపున ఉన్న మన్సూర్ అలీని పరిచయం చేశాను. ఆయన మాట్లాడటం మొదలుపెట్టగానే ఆ అధికారులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. అందరినీ కాల్చాక అక్కడ నుంచి పారిపోయారు" అని అమీనుర్ రెహ్మాన్ చెప్పారు.

ఈ హత్య గురించి వెంటనే తెలియలేదని, సైనికాధికారులకు 4వ తేదీ ఉదయానికి తెలిసిందన్నారు షెకావత్ హుస్సేన్.

చురుగ్గా మారిన జసద్ సాయుధ దళం..

నవంబరు 3 ఘటన అనంతరం జసద్ పార్టీకి చెందిన సాయుధ దళం గోనోబాహిని (జనవాహిని) రంగంలోకి దిగింది. ఈ దళానికి కల్నల్ తాహెర్ నేతృత్వం వహించారు. తరువాత జరిగిన తిరుగుబాటులో ఈ దళమే కీలకంగా మారింది.

కల్నల్ తాహెర్ సోదరుడు, గోనోబాహిని ఢాకా మెట్రోపాలిటిన్ విభాగ అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ అన్వర్ అప్పటి సంఘటనల గురించి చెప్పారు.

జియావుర్ రెహ్మాన్ నుంచి ఖలీద్ ముషార్రఫ్‌కు అధికారం మారిందని, ఆయన ఆధ్వరంలో తిరుగుబాటు జరుగుతోందన్న సమాచారం కల్నల్ తాహిర్‌కు అందిందని తెలిపారు.

నవంబరు 3వ తేదీ తెల్లవారు జామున జియావుర్ రెహ్మాన్ నుంచి తాహిర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. వారు నన్ను ఖైదీగా పట్టుకున్నారు. నా ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అని చెప్పారు.

ఆ సమయంలో జియావుర్ ప్రధాన టెలిఫోన్ కనెక్షన్ తొలగించారని, కానీ మరోలైన్ పనిచేస్తుండటంతో కాల్ చేసేందుకు అవకాశం దొరకిందని హుస్సేన్ చెప్పారు.

కల్నల్ తాహిర్ 1972లోనే సైన్యం నుంచి బయటకు వచ్చేశారు. అప్పటినుంచే జసద్ (జేఎస్డీ) రాజకీయాల్లో పాల్గొన్నారు. దీనికి అనుబంధంగా గోనోబాహిని అనే సాయుధ దళాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికి ఆ విషయం ప్రజలకు తెలీదు.

నవంబర్ 3న నారాయణగంజ్ నుంచి ఢాకాకు చేరుకున్న తాహిర్ హుస్సెన్, అప్పటి నుంచి సైనికాధికారులు, గోనోబాహిని మిలటరీ సైన్యంలోని అధికారులతో సమావేశాలు జరిపారు.

ముషార్రఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నా కూడా ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయలేకపోయారు. అదేసమయంలో ఢాకా జైలులో మారణకాండ జరగడం, అందుకు కారణాలు తెలియకపోవడం వంటి కారణాలతో చాలా రోజులు ప్రభుత్వ ఏర్పాటు లేకుండా గడిచాయి.

ఈ సమయంలో జసద్, గోనోబాహిని, తాహిర్‌లు మిలటరీ అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. నవంబర్ 5,6 తేదీల్లో గోనోబాహిని చురుగ్గా వ్యవహరించడం మొదలైంది. కల్నల్ తాహిర్ నేతృత్వంలో తిరుగుబాటుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి.

ఇందుకు సంబంధించిన కరపత్రాల పంపిణీతో కంటోన్మెంట్‌లో నవంబర్ 6వ తేదీ సాయంత్రం గోనోబాహిని ఏదో చేయబోతుందని అర్థమైందని షెకావత్ హుస్సేన్ చెప్పారు.

తాను కూడా ఆ కరపత్రాన్ని చూశానని, అందులో ముషార్రఫ్‌తోపాటు షఫాయత్ జమీల్, కల్నల్ హుడా, జస్టిస్ అబూలను ‘దేశ ద్రోహులు’గా పేర్కొంటున్నట్లు ఉన్నాయని చెప్పారు.

అదే సమయంలో జస్టిస్ అబూ సదత్ మహమ్మద్ సాయెం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, సైన్యంలో ఏం జరుగుతుందో మాత్రం స్పష్టంగా తెలియలేదు.

నవంబర్ 9వ తేదీన తిరుగుబాటుకు జసద్ ప్రణాళికలు రచించినప్పటికీ కంటోన్మెంట్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో తిరుగుబాటు ముందే మొదలైంది.

నవంబర్ 7 తిరుగుబాటు..

నవంబర్ 7వ తేదీ రాత్రి మరో తిరుగుబాటు మొదలైంది. సైనికులే ముందుండి ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు.

సైనికులందరూ "సైనికులంతా సోదరులే, జేసీఓ తప్ప మరో ర్యాంక్ అనేదే లేదు" అంటూ నినాదాలు చేశారని ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

సైనికులందరూ ఆవేశంగా ఉన్నారు. అధికారులు తాము ఉన్నత పదవులకు చేరేందుకు తమను వాడుకుంటున్నారని, తమను ఎవరూ పట్టించుకోవట్లేదనే ఆలోచనతో ఉన్నారని చెప్పారు.

ఆ రోజు రాత్రే జియావుర్ రెహ్మాన్‌ను విడిపించారు. అదే రోజు రాత్రి కంటోన్మెంట్‌లో తుపాకీ కాల్పులు మొదలయ్యాయి. తిరుగుబాటుదారులు సైనికాధికారులను హతమార్చారు.

షెకావత్ హుస్సేన్ మాట్లాడుతూ, “జియావుర్ రెహ్మాన్‌ను జసద్ గోనోబాహిని దళం బయటకు తీసుకురాలేకపోయింది. నాలుగు బెంగాల్, రెండు ఫీల్డ్ రెజిమెంట్లు ఈ పనిని చేశాయి” అని చెప్పారు.

మరుసటి రోజు ఉదయం కల్నల్ తాహిర్‌ను కంటోన్మెంట్‌లో చూశానని షెకావత్ చెప్పారు. జియావుర్ రెహ్మాన్‌తో సమావేశమైన సమయంలో ఇద్దరి మధ్యా తీవ్రమైన వాదనలు జరిగాయని చెప్పారు.

"జియావుర్ రెహ్మాన్ రేడియో స్టేషన్‌కు వెళ్లి, గోనోబాహిని తరుపున ఉన్న 13 డిమాండ్లు, వాటిని తాను ఆమోదిస్తున్నట్లు చెప్పాలని తాహిర్ కోరారు. ఆ తరువాత సైనికులను ఉద్దేశించి ప్రసంగించాలని, డిమాండ్లను ఆమోదిస్తున్నట్లు చెప్పాలని కోరారు. కానీ జియావుర్ రెహ్మాన్ అలా చేయలేదు. అప్పటికే తన ప్రసంగాన్ని రికార్డు చేసి రేడియో స్టేషన్‌కు పంపేశాడు. అక్కడి నుంచే వారిద్దరి దారులు వేరయ్యాయి" అని చెప్పారు.

నవంబర్ 7వ తేదీన చాలామంది సైనికులు సాధారణ దుస్తుల్లో ఆయుధాలతో తిరుగుబాటులో పాల్గొన్నారని చెప్పారు.

అయితే, ఈ తిరుగుబాటులో సాధారణ పౌరులు పాల్గొనలేదని ప్రొఫెసర్ అన్వర్ హుస్సేన్ చెప్పారు. జసద్ తిరుగుబాటు విఫలం కావడానికి ఇది కూడా ఒక కారణమని అన్నారు.

నిజానికి సైనికులు జియావుర్‌ను కంటోన్మెంట్ నుంచి ఎలిఫెంట్ రోడ్డుకు తీసుకురావాలి. కల్నల్ తాహిర్, జసద్ లీడర్లు అక్కడే వారి కోసం ఎదురుచూశారు కానీ, అలా జరగలేదని అన్నారు.

అలా జియావుర్ రెహ్మాన్, కల్నల్ తాహిర్‌ల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.

ఇదే సమయాన, ఖలీద్ ముషార్రఫ్, కల్నల్ కేఎన్ హుడా, లెఫ్టినెంట్ కల్నల్ ఏటీఎం హైదర్‌లు 10వ ఈస్ట్ బెంగాల్ రెజిమెంట్‌లో హత్యకు గురయ్యారు. ఖలీద్ ముషార్రఫ్‌ను ఎందుకు చంపారన్న కోణంలో ఎలాంటి సమగ్ర దర్యాప్తు జరగలేదు.

అధికారం చేపట్టిన జియావుర్

"రేడియాలో జియావుర్ రెహ్మాన్ ప్రసంగం తర్వాత తిరుగుబాటులో కీలకంగా మారిన గోనోబాహిని పాత్ర తగ్గిపోయింది. ప్రజలు ఈ తిరుగుబాటు జియావుర్ రెహ్మాన్ నేతృత్వంలోనే జరిగిందని నమ్మడం మొదలైంది" అన్నారు అన్వర్ హుస్సేన్.

అనంతరం జియావుర్ రెహ్మాన్ అధికారం చేపట్టారు. కొద్దిరోజులకు నవంబర్ 24వ తేదీన కల్నల్ తాహిర్‌ను అరెస్ట్ చేశారు. 21 జులై 1976లో ఉరిశిక్ష విధించారు.

కల్నల్ తాహిర్‌పై తప్పుడు కేసు నమోదైందని ఈ ఘటన జరిగిన చాలా ఏళ్లకు అంటే 2013లో సుప్రీం కోర్టు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)