You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ చేసిన 22 ప్రతిజ్ఞలు ఏమిటి, హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయా?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రతి విజయ దశమికి నాగ్‌పూర్‌లో లక్షల మంది బౌద్ధులు సమావేశమవుతుంటారు.
హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారుతున్న సందర్భంలో అంబేడ్కర్ చేసిన 22 ప్రతిజ్ఞలు ఇప్పటికీ చర్చలో ఉన్నాయి. ఈ ప్రమాణాలపై రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాలని కొన్నేళ్లుగా చాలామంది ప్రయత్నం చేశారు. అలాంటి ఒక ఘటనే 2022లో జరిగింది.
2022 అక్టోబర్ 5న దిల్లీలోని అంబేడ్కర్ భవన్‌లో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఒక మత మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో 10 వేల మంది హిందూ మతాన్ని వదులుకుని, బౌద్ధాన్ని స్వీకరించారు.
ఆ సమయంలో అంబేడ్కర్ 22 ప్రతిజ్ఞలను వారు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో హిందూ దేవుళ్లను, దేవతలను విమర్శించారని ఆరోపణలు వచ్చాయి.
అయితే విమర్శలకు దారితీసిన ఆ 22 అంబేడ్కర్ ప్రతిజ్ఞలు ఏంటి? నిజంగా అవి హిందూ దేవుళ్లను, దేవతలను కించపరిచేలా ఉన్నాయా?
అంబేడ్కర్ చేసిన 22 ప్రతిజ్ఞలు ఏమిటి?
నాగ్‌పూర్ దీక్షభూమిలో బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ అంబేడ్కర్ తన అనుచరులతో కలిసి 22 ప్రతిజ్ఞలను (ప్రమాణాలను) చేశారు.
అంబేడ్కర్ ప్రతిజ్ఞలు ఆయన మాటల్లో..
- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను దేవుళ్లుగా నేను పూజించను.
- రాముడిని, కృష్ణుడిని దేవుళ్లుగా కొలవను, లేదా వారిని ప్రార్థించను.
- గౌరి-గణపతి వంటి హిందూ దేవతలను, దేవుళ్లను నేను గౌరవించను, కొలవను.
- భగవంతుడు మానవ అవతారం ఎత్తాడనే దాన్ని నేను నమ్మను.
- గౌతమ బుద్ధుడు విష్ణువు అవతారమనేది తప్పు. నేను నమ్మను. ఇది తప్పుడు ప్రచారం.
- శ్రాద్ధ పక్షను (హిందూ సంప్రదాయ కర్మ కాండలను) నేను చేయను.
- బౌద్ధ మతానికి సరితూగని ఎలాంటి పనులను చేపట్టను.
- బ్రాహ్మణుల చేతుల మీదుగా ఎలాంటి పనులను, కార్యక్రమాలను చేపట్టను.
- మనుషులందరూ సమానులేనని నేను నమ్ముతాను.
- సమానత్వాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తాను.
- తథాగత బుద్ధుడు నేర్పించిన అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తాను.
- తథాగత బుద్ధుడు చెప్పిన పది నీతి సూక్తులను నేను పాటిస్తాను.
- జంతువులన్నింటిపట్ల నేను కరుణతో ఉంటాను.
- నేను దొంగతనం చేయను.
- వ్యభిచారం లాంటి పనులు చేయను.
- అబద్ధం చెప్పను.
- మద్యం తాగను.
- బౌద్ధ ధర్మంలోని మూడు సిద్ధాంతాలు ప్రజ్ఞ, సన్మార్గం, కరుణ జీవితాంతం పాటిస్తాను.
- జన్మతహా వచ్చిన నా హిందూ మతాన్ని త్యజిస్తాను. అది మానవ ప్రగతికి విరోధం. మనుషులను సమాన దృష్టితో చూడనివ్వదు. అందుకే బౌద్ధ మతాన్ని స్వీకరించాను.
- బౌద్ధ ధర్మం మాత్రమే నిజమైన మతమని నేను నమ్ముతున్నాను.
- నాకు ఇవాళ పునర్జన్మ ఎత్తినట్లు ఉంది.
- బుద్ధుడి బోధనలను జీవితాంతం అనుసరిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
అంబేడ్కర్ ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు?
అంబేడ్కర్ చేసిన ఈ 22 ప్రతిజ్ఞలతో చాలామంది హిందువులు తమ మనోభావాలు దెబ్బ తిన్నట్లు ఆరోపణలు చేశారు.
కానీ, అంబేడ్కర్ చేసిన ఈ ప్రతిజ్ఞలు ఎవర్ని కించపరిచేందుకు చేసినవి కాదని బౌద్ధ ధర్మ స్కాలర్ రూప కులకర్ణి బౌద్ధి చెప్పారు.
‘‘ఈ ప్రతిజ్ఞల ఉద్దేశం గణపతి లేదా విష్ణువులను కించపరచడం కాదు. విగ్రహాలను కొలవడం, ఆచారాలను, అద్భుతాలను నమ్మే సమాజం నుంచి వారు స్వేచ్ఛను పొందాలనుకున్నారు. వీటిన్నింట్లో ఉన్న వ్యర్థత గురించి బాబా సాహెబ్‌కు తెలుసు. ప్రజలు మెరుగైన సమాజంలో జీవించాలని అంబేడ్కర్ కోరుకున్నారు.’’ అని ఆయన తెలిపారు.
బౌద్ధ పుస్తకాలను చదవడం, వాటిల్లో ఉన్న భాషను అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాని పనని అంబేడ్కర్‌కు తెలుసు.
బౌద్ధ మతాన్ని ఎలా అనుసరించాలో సరళమైన విధానంలో చెప్పేందుకు తన అనుచరుల కోసం ఆయన ఈ ప్రమాణాాలు చేశారు.
‘‘బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ప్రజలు మునపటి భావజాలంలోకి తిరిగి వెళ్లేందుకు బాబా సాహెబ్ ఒప్పుకోలేదు. అందుకే, ఈ ప్రతిజ్ఞలు చేశారు. భిన్నమైన జీవన విధానాన్ని ఎంపిక చేసుకున్నామని ఆయన ప్రజలకు తెలియజేయాలనుకున్నారు.’’ అని రచయిత, సోషల్ యాక్టివిస్ట్, దళిత్ పాంథర్ కో ఫౌండర్ అర్జున్ డాంగ్లే చెప్పారు.
‘అదో సామాజిక విప్లవం’
‘‘బౌద్ధ మతాన్ని స్వీకరించడం అంటే ద్వేషం ప్రాతిపదికగా ఉన్న వ్యవస్థను తిరస్కరించడమని అంబేడ్కర్ భావించారు. ఆయన జీవన విధానం పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా, శాస్త్రీయంగా, ఆధునికంగా ఉంది.’’ అని అర్జున్ డాంగ్లే చెప్పారు.
‘‘మతం, వ్యవస్థలు మానవత్వం చూపని మనుషులకు, అధికారం, గౌరవం, సంపద ఇవ్వని మనుషులకు కొత్త గుర్తింపు ఇవ్వడానికి అంబేడ్కర్ ప్రయత్నించారు. వారి దృష్టిలో బౌద్ధాన్ని స్వీకరించడం అంటే మతం మారడం మాత్రమే కాదు. అదొక సామాజిక విప్లవం కూడా. మతంతో ముడిపడి ఉన్న మానసిక బానిసత్వాన్ని తిరస్కరించడానికి అంబేడ్కర్ ఈ ప్రతిజ్ఞలు చేశారు.’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే అంబేడ్కర్ చేసిన ఈ ఆలోచనను పక్కనబెట్టి, మతం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)