You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గౌహర్ జాన్: తనకన్నా సగం వయసున్న వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడిన ఈ కళాకారిణి ఎలా ఆస్తులు పోగొట్టుకున్నారు?
భారతదేశంలో సంప్రదాయంగా వస్తున్న దేవదాసీ, నృత్య సంగీత కళాకారుల జీవితాల గురించి దశాబ్ధాల కిందటే సంస్కర్తలు ఉద్యమించారు.
అనేక స్వచ్ఛంద, సామాజిక సంస్థలు ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా వినతి పత్రాలను సమర్పించేవి. ఈ ఫిర్యాదులపై బ్రిటీష్ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకునేది.
అలాంటి పరిస్థితుల్లో కోల్‌కతాకు చెందిన ప్రసిద్ధ తవాయఫ్ (రాజాస్థానాలలో పనిచేసే కళాకారులు) 'గౌహర్ జాన్' దేశంలోనే అత్యుత్తమమైన గాయనిగా పేరు సంపాదించారు. దేశంలో మారుతున్న ఆనాటి సామాజిక వాతావరణాన్ని ఆమె నిశితంగా గమనిస్తూ ఉండేవారు.
ఆ కాలంలోనే కోటీశ్వరురాలిగా పేరొందిన గౌహర్ జాన్ క్లాసికల్, సబ్-క్లాసికల్ సంగీతాన్ని కేవలం కొందరికే పరిమితం చేయకుండా.. గ్రామోఫోన్ రికార్డుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఒకానొక సమయంలో విరాళాల కోసం గౌహర్ జాన్‌తో గాంధీజీ ఒక షోను ఏర్పాటు చేశారంటే ఆమె ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే, గాంధీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవడంతో గౌహర్ జాన్ వ్యక్తిత్వాన్ని కూడా ఆయన తెలుసుకునే పరిస్థితి వచ్చింది.
గౌహర్ జాన్, ఆమె కుటుంబం
గౌహర్ జాన్ ఆజంగఢ్‌లో (ప్రస్తుత ఉత్తరప్రదేశ్) జన్మించారు. పుట్టినప్పుడు, ఆమె పేరు అలైన్ ఏంజెలీనా యోవార్డ్.
గౌహర్ జాన్ తండ్రి విలియం యోవార్డ్, ఆర్మేనియా సంతతికి చెందిన వ్యక్తి. కోల్‌కతాలో ఒక కంపెనీలో పనిచేసేవారు. ఆమె తల్లి ఎలెన్ విక్టోరియా హెమ్మింగ్. గాయని. 1879లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
1881లో తల్లితో కలిసి బెనారస్ వెళ్లారు అలైన్. ఆమె తల్లి ఇస్లాం మతం తీసుకుని మల్లికాజాన్‌గా మారారు. అలైన్ పేరు 'గౌహర్ జాన్'గా మారింది.
తర్వాత గౌహర్ జాన్ కలకత్తాకు (ఇప్పటి కోల్‌కతాకు) వెళ్లారు. అక్కడే శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. ఆమె పేరు వారణాసిలో మారుమోగింది.
గౌహర్ జాన్‌కు పదమూడేళ్లు ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ బాధ నుంచి బయటికి వచ్చి, సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు గౌహర్. గౌహర్ జాన్ కవయిత్రి కూడా. ఆమె కవితా సంకలనాలు, గజల్స్ అప్పట్లో ప్రచురితమయ్యాయి.
బ్రిటీష్, బ్రిటన్ కుటుంబాలను ఆనందపరిచేందుకు గౌహర్ జాన్‌ను పాటలు పాడేవారు. ఆ తర్వాత రాజ కుటుంబాల ముందు ప్రదర్శనలు ఇచ్చారు.
ఒకసారి బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ 5 ముందు కూడా ఆమె ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చింది. ఆమెకు ఎంత పేరు ఉండేదంటే, ఒకానొక సమయంలో ఆస్ట్రియాలోని అగ్గిపెట్టెలపై గౌహర్ జాన్ ఫోటోలను ప్రింట్ చేశారు.
రచయిత మృణాల్ పాండే ప్రకారం.. ‘‘అది రసిక సమాజం సింగర్లపై అత్యధికంగా డబ్బులు వెచ్చించే కాలం అది. కానీ, ఒక సాధారణ వివాహిత స్త్రీకి దక్కిన గౌరవం, హోదా కూడా సీనియర్ గాయినీలకు దక్కలేదు. అలాగే, గాయకులతో పోలిస్తే వారికి దక్కే గౌరవం చాలా తక్కువ. మరీముఖ్యంగా వయసు మళ్లిన సింగర్లకు ఎలాంటి గౌరవం ఉండేది కాదు.. '' అని పేర్కొన్నారు.
గౌహర్ జాన్ బాగా డబ్బులు ఖర్చు పెట్టేవారు. అలాగే, వ్యాపారాలు, రికార్డుల నుంచి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టేవారు. అలా ఆమె కోటీశ్వరురాలు అయ్యారు. చూడటానికి బ్రిటీష్ ఆఫీసర్‌లాగా కనిపించేవారు. రాణిలాంటి దుస్తులను, ఆభరణాలను ధరించేవారు.
అయితే, గౌహర్ జాన్ తన చిన్నతనంలో తల్లితో కలిసి జీవిస్తూ పేదరికాన్ని, నిస్సహాయ స్థితిని అనుభవించారు.
అందుకే, తాను సంపాదించిన సొమ్ములో కొంత పెట్టుబడిగా పెట్టేవారు. ఆ రోజుల్లోనే కోటీశ్వరురాలు అయిన గౌహర్ జాన్, కలకత్తాలో పలు భవంతులను కొనుగోలు చేశారు.
గౌహర్ జాన్ ధైర్యానికి ఆశ్చర్యపోయిన గాంధీజీ
1920ల్లో బనారస్ చుట్టుపక్కలున్న నిర్లక్ష్యానికి గురైనా ప్రతిభావంతులైన మహిళలు గాంధీజీ సిద్ధాంతాల వైపుకు ఆకర్షితులయ్యారని, కానీ, సంప్రదాయ వాదులు ఆ మహిళల నోళ్లు మూయించడానికి ప్రయత్నించేవారని అంతకుముందు మృణాల్ పాండే బీబీసీతో చెప్పారు. ఇంగ్లిషు మాట్లాడే మహిళలకు గౌరవం లభించేదికాదని తెలిపారు.
అయితే, ఈ గాయకులు, కళాకారులు భారతీయ ఆధ్యాత్మికత చింతనలో భాగమని గాంధీజీ నమ్మేవారు. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో బహిరంగ సమావేశాల్లో పాటలకున్న ప్రాధాన్యతను ఆయన వివరించారు.
1920లో స్వరాజ్ ఫండ్ ద్వారా విరాళాలు సేకరించేటప్పుడు, గౌహర్ జాన్‌ను ఆయన పిలిపించారు. తనవంతుగా ఈ ఉద్యమానికి సహకరించాలని ఆమెను గాంధీజీ అభ్యర్ధించారు.
గౌహర్ జాన్ చాలా సంతోషపడ్డారు. షాక్‌కు గురయ్యారు కూడా. ఎందుకంటే ప్రొఫెషనల్ సింగర్ల విషయంలో సమాజపు ఆలోచనలు ఎలా ఉంటాయో ఆమెకు తెలుసు.
తన ప్రోగ్రామ్ వల్ల వచ్చిన విరాళాలను స్వరాజ్ ఫండ్‌కు ఇచ్చేందుకు సిద్ధమని గౌహర్ జాన్ చెప్పారు. ప్రోగ్రామ్‌ను చూసేందుకు వస్తానని గాంధీ నుంచి మాట తీసుకున్నారు గౌహర్ జాన్.
కానీ, అది జరగలేదు. పాటల ప్రోగ్రామ్ రోజు గాంధీజీ రాకకోసం గౌహర్ జాన్ ఎదురు చూశారు. కానీ, ఒక ముఖ్యమైన పనిపడటంతో ఆయన హాజరుకాలేకపోయారు.
కిక్కిరిసిన హాల్‌లో ఆమె ప్రదర్శన ఇచ్చారు. రూ.24 వేలు సేకరించారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం.
ఆ తర్వాత రోజు, ప్రదర్శన ద్వారా వచ్చిన విరాళాలను తీసుకురావాలని గౌహర్ జాన్ ఇంటికి మౌలానా షౌకత్ అలీని పంపించారు గాంధీ.
కానీ, ఆమె రూ.12 వేలు మాత్రమే ఇచ్చారు. గాంధీ వ్యవహార శైలి గురించి మౌలానాతో నిష్టూరంగా మాట్లాడారు గౌహర్ జాన్.
నమ్మకం, గౌరవాల గురించి గాంధీ ఎప్పుడూ మాట్లాడుతుంటారనీ, కానీ, ఒక సాధారణ తవాయఫ్ షో కు వస్తానన్న వాగ్దానాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారని ఆమె అన్నారు.
ఆయన కార్యక్రమానికి రాలేదు కాబట్టి, ప్రదర్శనకు వచ్చినదాంట్లో సగం డబ్బు మీదే ఆయనకు హక్కు ఉందని స్పష్టం చేశారు.
దక్షిణాసియా తొలి గ్రామోఫోన్ సింగర్
'మై నేమ్ ఈజ్ గౌహర్ జాన్' అనే పుస్తకాన్ని చరిత్రకారుడు వివేక్ సంపత్ రాశారు. ఈ పుస్తకాన్ని భారతీయ నటి, థియేటర్ డైరెక్టర్ లిలిత్ దూబే, 'గౌహర్' అనే సంగీత నాటకం ద్వారా ఆ గాయని పాత్రకు ప్రాణం పోశారు.
ఈ నాటకంలో గౌహర్ జాన్‌గా రాజేశ్వరి సచ్‌దేవ్ నటించారు. గౌహర్ జాన్ వృద్ధాప్యంలో ఉన్నప్పటి పాత్రను ఉస్తాద్ విలాయత్ అలీ ఖాన్ కూతురు జిలా ఖాన్ పోషించారు.
''ఈ సమయంలో ప్రముఖ ఆర్టిస్టులు గ్రామోఫోన్ ద్వారా పాటలు పాడేందుకు తిరస్కరించేవారు. వారు ఆ అవకాశాలు అంగీకరించేవారు కాదు. మూడు నిమిషాల్లో భారతీయ సంగీతాన్ని ఆలపించడం కష్టంగా భావించేవారు. అప్పుడు గౌహర్ జాన్ తుమ్రి లేదా ఖయాల్ సంగీతాన్ని ధైర్యంగా పాడారు'' అని రాజేశ్వరి సచ్‌దేవ్ చెప్పారు.
''తవాయఫ్‌లు వేశ్యలు కాదు. ప్రతిభావంతులైన యువ మహిళలే తవాయఫ్‌లుగా మారేవారు. గౌహర్ జాన్ విద్యావంతురాలు, సంస్కృతి తెలిసిన మహిళ'' అని లిలిత్ దూబే అన్నారు.
''ప్రతి రికార్డింగ్‌కు గౌహర్ జాన్ కొత్త బట్టలు, ఆభరణాలు ధరించేవారు'' అని చెప్పారు.
''తన కెరీర్‌లో గౌహర్ జాన్ ఆరు వందల పాటలు పాడారు. ఆ సమయంలో ప్రతి రికార్డుకు మూడు వేల రూపాయలు చార్జ్ చేసేవారు. హిందీ, ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, తమిళ్‌తో సహా 20 భాషల్లో తుమ్రీలను, భజన్లను ఆలపించేవారు'' అని పరిశోధకులు ఫాతిమా జునైద్ తెలిపారు.
''ప్రతి పాట ముందు, ఆమె తన పేరును, ఏం పాడబోతున్నారో వివరించేవారు. ఇలా, సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరుచుకున్నారు'' అని ఫాతిమా అన్నారు.
ఆమె పేరుపై గ్రామోఫోన్ రికార్డు రూపొందించుకున్న తొలి దక్షిణాసియా కళాకారిణి గౌహర్ జానే.
ఆమె పాటలు నేటికీ అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్‌లో వినవచ్చు.
ప్రేమ, పెళ్లి.. ఒంటరితనం
గౌహర్ జాన్ తన జీవితంలో అనేకసార్లు వంచనకు గురయ్యారు. యవ్వనంలో ఉన్నప్పుడు తన వయసులో సగం ఉన్న ఒక పఠాన్ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, వారి వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు.
ఇద్దరూ అన్యోన్యంగా ఉన్న రోజుల్లో ఆ వ్యక్తి గౌహర్ ఆస్తులను తన పేర రాయించుకున్నారు. తర్వాత వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. ఆస్తుల వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.
న్యాయపోరాటం ద్వారా గౌహర్ జాన్ తన వారసత్వ సంపదను, ఆస్తులను పొందారు. కానీ, ఆమె చివరి రోజులు గడ్డుగా సాగాయి. చాలా ఒంటరితనాన్ని అనుభవించారు.
ఆ తర్వాత, దక్షిణ భారతదేశానికి వచ్చి ఈ ప్రాంతంలోనే, ఎవరికీ తెలియని వ్యక్తిలా జనవరి 17న కన్నుమూశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)