You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్య తీసుకుంటారా? అదే జరిగితే భారత్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుంది?
ఇరాన్‌లో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు మిడిల్ ఈస్ట్ అంతటా అస్తవ్యస్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఈ నిరసనలు గత డిసెంబర్‌లో మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్ భద్రతా దళాలు ఈ నిరసనలను అణచివేశాయి. ఫలితంగా అనేకమంది చనిపోయారని, చాలామందిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సంబంధించి తరచుగా ప్రకటనలు చేస్తున్నారు.
ఇరాన్ మాత్రం, అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపిస్తోంది. దేశంలో సైనిక జోక్యం జరిగితే, ఈ ప్రాంతంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
భారతదేశ ఇంధనం, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇరాన్ కీలక పాత్ర పోషించినందున ఇది భారత్‌కు కూడా చాలా కీలకం. ముఖ్యంగా చాబహార్ నౌకాశ్రయం వంటి ప్రాజెక్టుల ద్వారా మిడిల్ ఈస్ట్, అఫ్గానిస్తాన్‌లకు చేరుకునే అవకాశం భారతదేశానికి ఉంది.
ఈ పరిస్థితుల్లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు, ప్రతిష్టంభన భారత ప్రయోజనాలకు ఆందోళనకరంగా మారాయి.
ఈ నేపథ్యంలోనే కొన్ని అనుమానాలు వస్తున్నాయి.
- ఈ నిరసనలు గతంలో జరిగినవాటికంటే భిన్నమైనవా?
- నాయకత్వం లేకపోవడం నిరసనకారులలో ప్రధాన బలహీనతా? ఖమేనీ నాయకత్వానికి సవాళ్లు ఏంటి?
- కఠినచర్యల గురించి మాట్లాడుతున్న ట్రంప్ సైనిక చర్య తీసుకోగలరా?
- ఈ అస్థిరత భారతదేశానికి మంచిదా? చెడ్డదా?
బీబీసీ హిందీ వీక్లీ షో 'ది లెన్స్'లో, కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మ ఈ ప్రశ్నలపై నిపుణులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో భారత మాజీ దౌత్యవేత్త మహేశ్ సచ్‌దేవ్, జామియా మిలియా ఇస్లామియాలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టడీస్‌లో ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో మిడిల్ ఈస్ట్ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ కబీర్ తనేజా పాల్గొన్నారు.
ఈ నిరసనలు గతంలో జరిగినవాటికంటే భిన్నమైనవా?
దీనిపై, జామియా మిలియా ఇస్లామియాలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టడీస్‌లో ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య మాట్లాడుతూ "ఇరాన్‌లో జరుగుతున్నదాన్ని కేవలం తాత్కాలిక నిరసనగా చూడకూడదు. ఇది అక్కడి ప్రజల్లో చాలా కాలంగా పేరుకుపోయిన నిస్పృహ, అసంతృప్తి, డిమాండ్లు ఒక్కసారిగా బయటకు రావడమే" అని అన్నారు.
"ధరల పెరుగుదల, నిరుద్యోగం, కరెన్సీ విలువ పడిపోవడంతోపాటు ఇరాన్ ప్రజల రోజువారీ జీవితంపై విధించిన ఆంక్షలు సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. వారి సహనాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఇరాన్ వీధుల్లో కనిపించేది కేవలం ఒక సమస్యకు ప్రతిస్పందన కాదు, మొత్తం వ్యవస్థపై ఏర్పడిన నిరాశకు ప్రతిబింబం" అని ప్రొఫెసర్ సుజాత అంటున్నారు.
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో మిడిల్ ఈస్ట్ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ కబీర్ తనేజా ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. "ఒక ఏడాది వెనక్కి వెళ్దాం... ఇరాన్ ప్రభుత్వం తన ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీ భద్రత. కానీ అమెరికా ఇరాన్‌పై బాంబు దాడి చేసింది, ఇజ్రాయెల్ కూడా బాంబు దాడి చేసింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ టాప్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. వాళ్లు ఎక్కడ తింటున్నారు, ఎక్కడ నిద్రపోతున్నారు అన్నది బాగా తెలిసినట్టుగా ఈ దాడులు జరిగాయి" అని అన్నారు.
"కొన్ని నెలల క్రితం తెహ్రాన్‌లో నీటి సంక్షోభం తలెత్తినప్పుడు, ప్రజలు తమ రాజధానిని మార్చాల్సి రావచ్చని మాట్లాడుకున్నారు. ఇరానియన్లు తీవ్రమైన నీటి సమస్య ఉందని చెప్పారు. కానీ ఇరాన్‌లోని ఉన్నత వర్గాలు, ఐఆర్‌జీసీలోని వారు లేదా అయతొల్లా మనుషులు మాత్రం నీటి కొరత లేదని భావించారు. ఇప్పటివరకు ప్రాథమిక అవసరాలపై ఉన్న పోరాటం, గడచిన ఐదారు నెలల్లో ఇంత తీవ్ర స్థాయికి ఎప్పుడూ చేరలేదు"అని తనేజా చెప్పారు.
"మీరు మాకు ఉద్యోగాలు, డబ్బు, నీరు ఇవ్వలేకపోతున్నారని ప్రజలు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు భద్రత కూడా కల్పించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్‌లో చాలా కాలంగా ఆలోచనల్లో, అసంతృప్తి రూపంలో పేరుకుపోయిన ఆగ్రహం ఇప్పుడు బయటకు వచ్చింది" అని తనేజా అన్నారు.
నాయకత్వ లేమి నిరసనకారుల బలహీనతా? ఖమేనీకి సవాళ్లేంటి?
ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల్లో ప్రజలు ముందుకొచ్చి ఆందోళన చేస్తున్నారు. కానీ, అది వ్యవస్థీకృతంగా కనిపించడం లేదు. కొందరు అమెరికా రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావీ రావాలని, అధికారం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళనకారులను ఒక్కతాటిపై నడిపించే నాయకత్వం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఉద్యమాన్ని కఠినంగా అణచివేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ, గత 15 ఏళ్లలో జరిగిన ఈ అతిపెద్ద నిరసనలకు ప్రభుత్వం ఏమాత్రం భయపడదని స్పష్టం చేశారు.
నిరసనల తర్వాత మొదటిసారిగా ప్రజలముందుకు వచ్చిన ఖమేనీ.. విదేశీ శక్తుల కోసం పనిచేసేవారిని తన ప్రభుత్వం సహించదని బహిరంగంగా ప్రకటించారు.
కానీ ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనలు, సైనిక జోక్యం ముప్పు, అమెరికా విధించిన ఆంక్షలు ఇవన్నీ కలిసి ఇరాన్ సమస్యలను మరింత క్లిష్టంగా మార్చాయి.
"ఇరాన్‌లో పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. దీనిని కేవలం దేశీయ సమస్యగా మాత్రమే చూడలేం, ఎందుకంటే ఇతర దేశాలు ఇరాన్‌పై విధించిన ఆంక్షలు కూడా ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తాయి" అని భారత మాజీ దౌత్యవేత్త మహేశ్ సచ్‌దేవ్ అన్నారు.
"ఈ పరిస్థితుల దృష్ట్యా, ఖమేనీ ఎదుర్కొంటున్న మొదటి సమస్య ఏంటంటే, తన మద్దతుదారులను (వారు రివల్యూషనరీ గార్డ్స్ అయినా లేదా ఇస్లామిక్ రిపబ్లికన్ పార్టీ అయినా) ఎలా ఏకం చేసి ఉంచాలి. వారిలో అంతర్గత ఉద్రిక్తతలు లేదా చీలికలను ఎలా నిరోధించాలి" అని ఆయన అంటున్నారు.
"ఖమేనీ సాధారణ ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి. ఇరాన్ పాలనకు మద్దతు ఇచ్చే విదేశాలను ఆయన నిలుపుకోవాలి, వాటి మద్దతు పొందాలి" అని ఆయన చెప్పారు.
ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్య తీసుకోగలరా?
ఇరాన్‌లో నిరసనలు మరింత పెరిగి ప్రజలు చనిపోతే అమెరికా సైన్యం నిజంగా జోక్యం చేసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.
దీనిపై మహేశ్ సచ్‌దేవ్ మాట్లాడుతూ.. "అమెరికా అలాంటిపని చేయదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే సైనికులను ఎక్కడికీ పంపబోమని అమెరికా ఇప్పటికే తన ప్రజలకు హామీ ఇచ్చింది. అంతేకాదు, గత అధ్యక్షులు అమెరికాను అంతులేని యుద్ధాల్లో ఇరుక్కుపోయేలా చేశారని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. దీనివల్ల అమెరికాకు ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అది ఇరాక్ అయినా, అఫ్గానిస్తాన్ అయినా, అక్కడ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు, దేశ అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది" అని అన్నారు.
"ఇక్కడ అమెరికా పాత్ర ఎక్కువగా ఆంక్షలు, ఒత్తిడి రూపంలో ఉంటుంది. నేరుగా యుద్ధరంగంలోకి దిగకుండా, ఆర్థిక, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారానే ప్రభావం చూపాలని చూస్తుంది" అని ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య అంటున్నారు.
"వెనెజ్వెలాలో చేసినట్టు అమెరికా నేరుగా దాడి చేస్తుందని అనుకోవడం సరికాదు. భౌగోళిక వాస్తవాలను చూడాలి. వెనిజువెలా అమెరికా పొరుగుదేశం, కానీ ఇరాన్ చాలా దూరంలో ఉంది. గతంలో అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసినప్పటికీ, ఇప్పుడు మాత్రం ఒత్తిడి ఎక్కువగా రాజకీయ, దౌత్య మార్గాల్లోనే ఉంటుందని నేను భావిస్తున్నా" అని ఆమె అన్నారు.
ఈ అస్థిరత భారతదేశానికి మంచిదా? చెడ్డదా?
భారత్, ఇరాన్ అనేక రంగాలలో ముఖ్యమైన భాగస్వాములు. ఒకప్పుడు, భారతదేశం ఇరాన్ నుంచి గణనీయమైన మొత్తంలో చమురు కొనుగోలు చేసేది.
ఈ భాగస్వామ్యం ఫలితంగానే ఇరాన్‌లో భారతదేశం అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్ట్ కూడా ఏర్పడింది. ఈ నౌకాశ్రయం ద్వారా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఏషియా వరకూ భారత్ రాకపోకలు సాగించవచ్చు.
ఈ పరిస్థితిలో ఇరాన్ అస్థిరంగా ఉంటే లేదా ఇరాన్‌లో అధికార మార్పు జరిగితే, అది భారతదేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
దీనిపై కబీర్ తనేజా మాట్లాడుతూ.. "భారతదేశం ఇరాన్‌ను ఎలా చూస్తుందో కూడా మనం గమనించాలి. భారత్ దానిని ఒక పొరుగుదేశం లాగా చూస్తుంది" అని అన్నారు.
"ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ సమస్యపై ఇరాన్ ఎప్పుడూ భారత్‌కే మద్దతు ఇచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి భారత్ కృషి చేస్తుంది. ఇరాన్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా భారతదేశం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నా" అని తనేజా అన్నారు.
"ఇరాన్‌పై పాశ్చాత్య దేశాల ఒత్తిడి కొనసాగితే లేదా పెరిగితే, ఇరాన్ తన మద్దతును స్థిరీకరించడానికి పాకిస్తాన్, చైనా, అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఏషియా, రష్యా సహకారం మరింత కీలకమైంది" అని భారత మాజీ దౌత్యవేత్త మహేశ్ సచ్‌దేవ్ అన్నారు.
"మరిన్ని ఆంక్షలు విధిస్తే, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ ద్వారా భూ మార్గాలను ఉపయోగించి చైనాతో తన వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను మళ్ళీ విస్తరించుకోవచ్చు. ఇరాన్ కాస్పియన్ సముద్రం మార్గం ద్వారా రష్యాతో వ్యాపారం చేసి ఆంక్షలను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది" అని ఆయన చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)