You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2026: పాన్-ఆధార్ లింక్ సహా జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే 6 ముఖ్యమైన మార్పులు ఇవే..
2025 సంవత్సరం ముగిసి, నూతన సంవత్సరం 2026 ప్రారంభమవుతున్న నేపథ్యంలో, మీరు కొన్ని మార్పులకు సిద్ధమవ్వాలి.
పాన్ కార్డు, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలు, గ్యాస్ ధరలు వంటి పలు అంశాలపై ఈ మార్పులు ప్రభావం చూపబోతున్నాయి.
ఇవే కాకుండా, ప్రభుత్వ పథకాలు, క్రెడిట్ స్కోర్ ఇచ్చే విధానంపైనా వాటి ప్రభావం ఉంటుంది.
జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఆరు ముఖ్యమైన మార్పులేమిటో ఇక్కడ చూద్దాం.
పాన్, ఆధార్ నంబర్‌లను అనుసంధానం చేయడానికి 2025 డిసెంబర్ 31తో గడువు ముగిసిపోతోంది. అప్పటికీ లింక్ చేయకపోతే, మీరు పలు సేవలను పొందడం ఇక కష్టమవుతుంది. అంతేకాదు, జనవరి 1 నుంచి పాన్, ఆధార్ లింక్ చేయాలంటే మీరు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడంలో, అదనంగా చెల్లించిన పన్నును రీఫండ్ పొందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
అంతేకాకుండా, కొన్ని రకాల ఆర్థిక సేవలు నిలిచిపోవచ్చు.
ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాలు కొనసాగుతాయి, కానీ కేవైసీ అప్‌డేట్ కాదు. దీనివల్ల కొత్త పెట్టుబడులు పెట్టడం కష్టమవుతుంది.
పాన్, ఆధార్‌ను అనుసంధానం చేయడం కష్టమేమీ కాదు. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ www.incometax.gov.in/iec/foportal/ కి వెళ్లి 'లింక్ ఆధార్' (Link Aadhaar) పై క్లిక్ చేసి, ఆ ప్రక్రియను మీరు పూర్తి చేయవచ్చు.
మీకు ఒక ఓటీపీ వస్తుంది. దీంతో ఆధార్, పాన్ లింక్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఒకవేళ మీ పాన్ కార్డు ఇప్పటికే పనిచేయకపోతే (ఇన్‌ఆపరేటివ్), మీరు రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే దానిని ఆధార్‌తో అనుసంధానించడం సాధ్యమవుతుంది.
ఇదే కాకుండా యూపీఐ, డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన నిబంధనలలో బ్యాంకులు మార్పులు చేశాయి. ఇవి జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి.
ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఈ పథకానికి సంబంధించిన కొన్ని నిబంధనలు జనవరి 1 నుంచి మారుతున్నాయి.
ఉదాహరణకు, కొన్ని రాష్ట్రాల్లో రైతుల కోసం ప్రత్యేక ఐడీ (ఫార్మర్ ఐడీ) అంటే ఒక గుర్తింపు సంఖ్యను రూపొందించనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద నగదు పొందడానికి ఈ ఐడీని సమర్పించడం ఇక తప్పనిసరి అవుతుంది.
14 రాష్ట్రాల్లో రైతుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అక్కడ కొత్త రిజిస్ట్రేషన్లకు మాత్రమే 'ఫార్మర్ ఐడీ' అవసరమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ ఇటీవల పార్లమెంటులో తెలిపారు. ఈ ప్రక్రియ ప్రారంభంకాని రాష్ట్రాల్లో మాత్రం, ఐడీ లేకుండానే నమోదు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
ఇది కాకుండా, ఏనుగులు తదితర అటవీ జంతువుల వల్ల పంటలకు ఏదైనా నష్టం జరిగితే దానికి 'ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన' కింద పరిహారం పొందవచ్చు. అయితే, పంట నష్టం జరిగిన 72 గంటలలోపు రైతులు ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఏడవ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసిపోతుంది. 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు.
జనవరి 1 నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమలవుతుందా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ఇటీవల పార్లమెంటులో తెలిపారు.
వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి మరో 18 నెలల సమయం పడుతుంది, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు.
జనవరి నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంపుదలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అలాగే కొన్ని రాష్ట్రాల్లో పార్ట్ టైమ్, దినసరి కూలీలకు కనీస వేతనాల పెంపును కూడా ప్రకటించవచ్చు.
ఇప్పుడు ఏ రకమైన రుణం పొందాలన్నా క్రెడిట్ స్కోర్ చాలా అవసరం. దీనికి సంబంధించిన నిబంధనలు జనవరి 1వ తేదీ నుంచి మారుతున్నాయి.
ప్రస్తుతం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ప్రతి 15 రోజులకు ఒకసారి క్రెడిట్ డేటాను అప్‌డేట్ చేస్తున్నాయి. ఇకపై ప్రతి వారం డేటాను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
దీనివల్ల రుణం తీసుకునే వ్యక్తులకు సంబంధించి మరింత కచ్చితమైన క్రెడిట్ స్కోర్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
క్రెడిట్ స్కోర్ స్వల్ప వ్యవధిలోనే అప్‌డేట్ కావడం మొదలైతే, అది కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన ఆర్థిక క్రమశిక్షణను పాటించే వారి క్రెడిట్ స్కోర్ వేగంగా మెరుగవుతుంది.
ఒకవేళ మీరు ఏదైనా ఈఎంఐ చెల్లించడం మరచిపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గి ఉంటే, తిరిగి క్రమంగా ఈఎంఐల చెల్లింపు ప్రారంభించిన తర్వాత మళ్లీ మీ స్కోర్ వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
దేశంలో జనవరి 1వ తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫామ్‌లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
వీటిలో మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ముందే పూరించి ఉంటుంది.
జనవరి నెల నుంచి బ్యాంకులు యూపీఐ, డిజిటల్ పేమెంట్ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నాయి.
సిమ్ కార్డు వెరిఫికేషన్ నిబంధనలు కూడా కఠినంగా మారనున్నాయి.
ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తరచుగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో సిమ్ కార్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత పకడ్బందీగా చేయనున్నారు.
సీఎన్‌జీ, పీఎన్‌జీ (పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజవాయువు) ధరలు జనవరి 1వ తేదీ తర్వాత యూనిట్‌కు రెండు నుంచి మూడు రూపాయల వరకూ తగ్గే అవకాశం ఉంది.
వాహనాల్లో సీఎన్‌జీ, గృహావసరాలకు పీఎన్‌జీ ఉపయోగిస్తారు. సీఎన్‌జీ ధర తగ్గితే రవాణా ఖర్చులు, పీఎన్‌జీ ధర తగ్గితే ఇంటి బడ్జెట్ భారం కాస్త తగ్గుతుంది.
గ్యాస్ కొత్త ధరల విధానాన్ని పెట్రోలియం రెగ్యులేటరీ అథారిటీ ఆమోదించింది.
రాష్ట్రంలోని పన్ను విధానం, దూరభారాలను బట్టి ఈ ధరల తగ్గింపులో తేడాలు ఉండవచ్చు.
మరోవైపు, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలలో కూడా జనవరి 1వ తేదీ నుంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. విమాన ప్రయాణ చార్జీలపై కూడా దాని ప్రభావం ఉండవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)