You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా భారీగా బంగారం ఎందుకు కొంటోంది? భారత్, రష్యా సహా బ్రిక్స్ దేశాలపై పడే ప్రభావమేంటి?
- రచయిత, సిద్ధార్థ్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి, 2025లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ.. అమెరికా ట్రెజరీ బాండ్లలో వాటి పెట్టుబడులను మించిపోయింది.
సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి, అమెరికా ట్రెజరీలలో పెట్టుబడుల విలువ 3.5 ట్రిలియన్ డాలర్లు.
యూరోను అధిగమించి రెండవ అతిపెద్ద అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తిగా మారింది బంగారం. అమెరికా 2022లో రష్యన్ ఆస్తులను స్తంభింపజేసిన అనంతరం సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను వేగవంతం చేయడంతో ఈ మార్పు వచ్చింది.
వరుసగా మూడేళ్లుగా, సెంట్రల్ బ్యాంకులు ఏటా వెయ్యి టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. ధరలు పెరుగుతున్నప్పటికీ, సెప్టెంబర్ 2025 నాటికి అదనంగా 634 టన్నులకు చేరింది.
బంగారం నిల్వలు పెరగడం వల్ల సెంట్రల్ బ్యాంకులు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటాయని, డాలర్ ఆధారిత ఆస్తులతో ముడిపడి ఉన్న నష్టాలను భరించగలవని చైనా విశ్లేషకులు అంటున్నారు.
ఒకవేళ డాలర్ విశ్వసనీయత బలహీనపడితే, విదేశీ మారక నిల్వలను స్థిరీకరించడంలో కూడా బంగారం సహాయపడుతుందన్నారు.
సెప్టెంబర్ 2025 నాటికి, చైనా మొత్తం అంతర్జాతీయ నిల్వల్లో బంగారం 7.6 శాతంగా ఉంది. ఇక రష్యా అంతర్జాతీయ నిల్వల్లో 41.3 శాతం ఉండగా, భారతదేశంలో 13.57 శాతంగా ఉంది.
విధానాల అనిశ్చితి, పెరుగుతున్న అమెరికా అప్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య సెంట్రల్ బ్యాంకులు క్రమంగా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుని బంగారంలో తమ వాటాను పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఇది ప్రపంచ ద్రవ్య వ్యవస్థలో ఎక్కువ వైవిధ్యానికి దారితీయవచ్చు.
2024లో బ్రిక్స్ అధ్యక్ష పదవిలో ఉన్న రష్యా, బ్రిక్స్ క్రాస్-బోర్డర్ పేమెంట్స్ ఇనిషియేటివ్ (బీసీబీపీఐ)ను ప్రతిపాదించింది. సభ్య దేశాల మధ్య వారి జాతీయ కరెన్సీలలో వాణిజ్యాన్ని సులభతరం చేయడం, యూఎస్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని లక్ష్యం.
ఈ ధోరణి చైనీస్ రెన్మిన్బి (చైనా కరెన్సీ అధికారిక పేరు) విస్తృత అంతర్జాతీయ ఉపయోగం కోసం కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలో పెరుగుతున్న బంగారం నిల్వలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెన్మిన్బి పాత్రపై నమ్మకాన్ని బలపరుస్తున్నట్లుగా భావిస్తున్నారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఐఎంఎఫ్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఈ విశ్లేషణ రూపొందింది. ఇది బ్రిక్స్ దేశాలలో, ముఖ్యంగా చైనాలో బంగారం కొనుగోలు విధానాలను పరిశీలిస్తుంది. బంగారం చేరడం రెన్మిన్బి విస్తృత అంతర్జాతీయ వినియోగానికి కొత్త అవకాశాలను ఎలా తెరిచిందో పరిశీలిస్తుంది.
అయితే, రెన్మిన్బి కరెన్సీ పూర్తి అంతర్జాతీయీకరణకు ప్రస్తుత స్థాయి సరిపోదు.
భారత్, చైనా, రష్యా పెట్టుబడులు
బ్రిక్స్ దేశాలు, ముఖ్యంగా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఉత్పత్తిదారులైన చైనా, రష్యా తమ బంగారం నిల్వలను పెంచుకోవడం కొత్తేమీ కాదు.
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత రెండు దేశాలు తమ బంగారం నిల్వలను పెంచడం ప్రారంభించాయి. ఆ సంక్షోభం యూఎస్ బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనతలను బహిర్గతం చేసింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు డాలర్ ఆధానిత ఆస్తులలో పెట్టుబడుల వల్ల కలిగే నష్టాలను పునరాలోచించుకోవాల్సి వచ్చింది.
అయితే, రెండు దేశాల విధానాలు భిన్నంగా ఉన్నాయి. రష్యా పెద్ద ఎత్తున, నిరంతర కొనుగోళ్ల విధానాన్ని అవలంబించింది. యుక్రెయిన్ దాడి, విస్తృతమైన పాశ్చాత్య ఆంక్షల మధ్య 2022లో రష్యా బంగారం నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
దీని తర్వాత రష్యా నిల్వలు చాలావరకు స్థిరంగా ఉన్నాయి. 2025లో, రష్యా తన దేశీయ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి తన బంగారం నిల్వలలో కొంత భాగాన్ని విక్రయించినట్లు తెలిసింది.
ఇక, చైనా వైఖరి వ్యూహాత్మకం, ధరల ఆధారితమైనది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గినప్పుడు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా సాధారణంగా బంగారం కొనుగోళ్లను పెంచుతుంది.
ఇప్పటివరకు చైనా చేసిన అతిపెద్ద వార్షిక కొనుగోలు 2015లో 708.22 టన్నులు. ఈ కొనుగోలు 2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన బాండ్-కొనుగోలు ప్రోగ్రాం క్రమంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత జరిగింది. దీనిని సాధారణంగా "టేపర్ టాంట్రమ్" అని పిలుస్తారు.
2023 తర్వాత, చైనా తన బంగారం నిల్వలను ఎక్కువగా పెంచుకోలేదు కానీ, చిన్న పరిమాణంలో కొనుగోలు చేయడం కొనసాగించింది. దీనర్థం చైనా తన బంగారం నిల్వలను పెంచే దీర్ఘకాలిక వ్యూహానికి కట్టుబడి ఉంది.
2018 నుంచి భారత్ తన బంగారం నిల్వలను క్రమంగా పెంచడం ప్రారంభించింది. రష్యా, చైనాల మాదిరిగా కాకుండా (డాలరైజేషన్ విధానంలో భాగంగా అమెరికా రుణాలను వేగంగా తగ్గించుకున్నాయి), భారత్ 2024 వరకు అమెరికా ట్రెజరీలలో భారీగా పెట్టుబడులు కొనసాగించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోకి అదనపు విదేశీ మూలధనాన్ని మళ్లించడానికి ఇది ఉద్దేశించినది.
అయితే, 2026 ప్రారంభం నాటికి, భారత్ తన వైఖరిని మార్చుకుంది. అమెరికా ట్రెజరీలలో భారత హోల్డింగ్స్ ఇప్పుడు 21 శాతంగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక నష్టాలకు వ్యతిరేకంగా భారత్ ఇప్పుడు బంగారం, డాలర్ కాని ఇతర ఆస్తులలో తన పెట్టుబడులను పెంచింది.
బ్రిక్స్ ప్రత్యామ్నాయ 'చెల్లింపు వ్యవస్థ'
ప్రపంచ నిల్వలు బంగారం వైపు మళ్లడం, డాలరైజేషన్ తగ్గుతున్న నేపథ్యంలో 'లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్' వంటి పాశ్చాత్య వేదికలకు ప్రత్యామ్నాయంగా 'బ్రిక్స్ ప్రీషియస్ మెటల్స్ ఎక్స్ఛేంజ్' ఏర్పాటుకు రష్యా ప్రతిపాదించింది. దీని ఉద్దేశం ఆంక్షల ప్రభావాల నుంచి వాణిజ్యాన్ని రక్షించడం. అయితే, 2025లో బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం వరకు ఈ ప్రతిపాదనపై ఎటువంటి పురోగతి లేదు.
దీనికి ఒక కారణం చైనా ప్రస్తుత బంగారం మార్కెట్ వ్యవస్థ అని భావన ఉంది. చైనా ఇప్పటికే రెన్మిన్బి-డినామినేటెడ్ షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్‌ను నిర్వహిస్తోంది. హాంకాంగ్‌లో సర్టిఫైడ్ బులియన్ వాల్ట్ కూడా ఉంది.
అంతేకాదు, హాంకాంగ్‌లోనే అంతర్జాతీయ బంగారం వాణిజ్య కేంద్రాన్ని స్థాపించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. అందుకే, కొత్త బ్రిక్స్ ఎక్స్ఛేంజ్ కంటే, ప్రపంచ బులియన్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న బలమైన స్థానాన్ని వాడుకోవడం చైనాకు మరింత ఆచరణాత్మకమైనదని నిపుణుల అంచనా.
2022 నుంచి బ్రిక్స్-బాస్కెట్ రిజర్వ్ కరెన్సీకి రష్యా బలమైన మద్దతుదారుగా ఉంది. బంగారం లేదా ఇతర వస్తువులతో దీన్ని అనుసంధానించే ఆలోచనలు కూడా ఉన్నాయి, కానీ ఈ ప్రతిపాదనలు ఇప్పటికీ చర్చల దశలోనే ఉన్నాయి.
మొత్తం మీద, ఆర్థిక అభివృద్ధి స్థాయిలు, విధాన ప్రాధాన్యతలు, విదేశాంగ విధాన లక్ష్యాలలో తేడాల కారణంగా బ్రిక్స్‌లో సమన్వయం పరిమితంగా ఉంది. ఇది స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని విస్తరించే ప్రయత్నాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఎక్కువగా వాణిజ్య సమతుల్యత, ద్రవ్య లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
భారత్, చైనాల మధ్య 102.5 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఈ సవాలును స్పష్టంగా తెలియజేస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రూపాయలలో జరిగితే, పరిమిత అంతర్జాతీయ వినియోగం ఉన్న కరెన్సీని చైనా పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకోవాల్సి వస్తుంది. ఈ కారణంగా, ఇటువంటి ఒప్పందాలు చైనాకు ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు.
బ్రిక్స్‌కు మించి రెన్మిన్బి అంతర్జాతీయీకరణ
బ్రిక్స్ వెలుపల కూడా, రెన్మిన్బి వినియోగాన్ని పెంచడానికి చైనా తన ఆర్థిక వ్యవస్థను నిరంతరం బలోపేతం చేస్తోంది.
హాంకాంగ్, థాయిలాండ్, యూఏఈ, సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంకులుతో సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్లాక్‌చెయిన్ ఆధారిత హోల్‌సేల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ప్లాట్‌ఫాం 'ఎంబ్రిడ్జి' చైనా కీలక కార్యక్రమాల్లో ఒకటి.
రెన్మిన్బి స్థిరత్వం, విశ్వసనీయతను చైనాలో పెరుగుతున్న బంగారం నిల్వలు బలోపేతం చేశాయి. 2009లో రెన్మిన్బిని అంతర్జాతీయీకరించడానికి చైనా చర్యలు ప్రారంభించినప్పటి నుంచి, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 32 ద్వైపాక్షిక స్థానిక కరెన్సీ స్వాప్ ఒప్పందాలను కుదుర్చుకుంది.
వాటి మొత్తం విలువ దాదాపు 4.5 ట్రిలియన్ యువాన్లు, వీటిలో సగం ఆసియా ఆర్థిక వ్యవస్థలతోనే ఉన్నాయి. ఈ భాగస్వామ్య దేశాలలో, 15 ప్రధానంగా చైనాతో వస్తువులను వర్తకం చేస్తాయి. ఎనిమిది దేశాలు చైనా-కేంద్రీకృత తయారీ సరఫరా గొలుసులతో ముడిపడి ఉన్నాయి.
ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా యూఎస్ డాలర్ ఆధిపత్యానికి సవాళ్లు పెరుగుతుండటం, వస్తువుల కోసం ప్రపంచ పోటీ పెరుగుతున్నందున, చైనా యువాన్‌లో వస్తువులను వర్తకం చేయడానికి వేగంగా ముందుకు కదులుతోంది.
చైనా తన రెన్మిన్బి కోసం విదేశాల్లోనూ వ్యవస్థను విస్తరించింది. ఆగస్టు 2025 నాటికి, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 33 దేశాలలో 35 విదేశీ రెన్మిన్బి క్లియరింగ్ బ్యాంకులకు అధికారాలు ఇచ్చింది, ఇవి చైనా ప్రధాన వాణిజ్య భాగస్వాములను ఎక్కువగా కవర్ చేస్తున్నాయి.
2024లోనే, ఈ క్లియరింగ్ బ్యాంకులు 937.6 ట్రిలియన్ యువాన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి, అంటే ఏడాదిలో పెరుగుదల శాతం 47.3గా ఉంది. అదేకాలంలో సరిహద్దుల మధ్య రెన్మిన్బి రసీదులు, చెల్లింపులు 64.1 ట్రిలియన్ యువాన్లకు చేరుకున్నాయి, ఏడాదిలో పెరుగుదల శాతం 23గా ఉంది.
ఇక ప్రాంతీయ స్థాయిలో పరిశీలిస్తే, ఏషియన్, యూరప్ రెండింటితో చైనా రెన్మిన్బి సెటిల్మెంట్లు 2024లో 8.9 ట్రిలియన్ యువాన్లుగా ఉన్నాయి.
అయితే, ఏషియన్లో వృద్ధి 50.7 శాతంగా ఉండగా, యూరప్‌లో ఇది 13.1 శాతానికి పరిమితమైంది. ఇవన్నీ ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా రెన్మిన్బి పాత్ర పరిమితంగానే ఉంది. 2024లో ప్రపంచ విదేశీ మారక ద్రవ్య నిల్వలలో దాని వాటా కేవలం 2.06 శాతం మాత్రమే.
నవంబర్ 2025 నాటికి ప్రపంచ చెల్లింపులలో ఆర్ఎంబీ వాటా 2.94 శాతం. కరెన్సీ అంతర్జాతీయీకరణను సాధారణంగా వాణిజ్యంలో దాని ఉపయోగం, రిజర్వ్ స్థితి, ధర నిర్ణయ పాత్ర, పెట్టుబడి, నిధుల అంగీకారం ద్వారా లెక్కిస్తారు.
చైనా పెరుగుతున్న బంగారం నిల్వలు రెన్మిన్బిపై విశ్వాసాన్ని పెంచాయి. దాని అంతర్జాతీయీకరణకు మెరుగైన పరిస్థితులను సృష్టించాయి. అయితే, నిజంగా ప్రపంచ కరెన్సీగా మారాలంటే, మూలధన ఖాతాను సరళీకరించడం చాలా అవసరం.
ప్రపంచ విదేశీ మారక నిల్వలలో దాని వాటాను వేగంగా పెంచడం కంటే, వాణిజ్య పరిష్కారాలు, సరిహద్దు చెల్లింపులలో రెన్మిన్బి వినియోగాన్ని పెంచడం చైనా ప్రాధాన్యత.
ఈ అధ్యయనం ఎలా నిర్వహించారు?
ఈ వ్యాసం అధ్యయనం కోసం డేటాను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రచురించిన రెన్మిన్బి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ నుంచి తీసుకున్నారు.
ఈ పరిశోధన 2007 నుంచి 2025 వరకు కవర్ చేసింది. 2007వ సంవత్సరం ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు సంవత్సరం. ప్రధాన బ్రిక్స్ దేశాలలో బంగారం నిల్వల నమూనాలను పరిశీలించడానికి ఈ అధ్యయనం లోతుగా విశ్లేషించింది.
రెన్మిన్బి అంతర్జాతీయీకరణ డ్రైవ్‌కు బంగారం నిల్వలు ఎలా మద్దతు ఇస్తున్నాయో అంచనా వేయడానికి ఇది ప్రత్యేకంగా చైనాపై దృష్టి పెట్టింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)