‘మంచి మొసలి, పాపం చచ్చిపోయింది’ అంటూ వందలాదిగా తరలివచ్చి నివాళులర్పించిన ప్రజలు..

    • రచయిత, గ్రేస్ ఎలిజా గుడ్విన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది మాటలు చెప్పే జీవి కాదు. తనని చూడడానికి వచ్చేవారిని ఆకర్షించడం కోసం మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడం కూడా దానికి తెలియదు. ఎప్పుడూ నీరసంగా ఉంటూ, నిమ్మళంగా అటూ ఇటు కదులుతుంది.

కానీ, అది చనిపోయిందని తెలియగానే దానికి నివాళులు అర్పించేందుకు వందలమంది వచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఒక అకాడెమీలో ఉన్న అల్బినో మొసలి కథ ఇది. దాని పేరు క్లాడ్.

చనిపోయిన ఈ మొసలికి గ్రాండ్‌గా, ప్రత్యేకంగా స్మారక కార్యక్రమం జరిగింది. ఇందులో న్యూ అర్లీన్స్ తరహా బ్రాస్ బ్యాండ్, మొసలి ఆకారంలో ఎనిమిది అడుగుల పొడవైన తెల్లటి బ్రెడ్, డ్రాగ్ క్వీన్ స్టోరీ టైమ్‌ ( పిల్లలను కూర్చోబెట్టుకుని కథలు చెప్పే కార్యక్రమం)తోపాటు ‘క్లాడ్ ది ఎలిగేటర్ వే’ అంటూ ఒక వీధికి దాని పేరు కూాడా పెట్టారు.

ఆ మొసలి బతికున్నప్పుడు లక్షలమందిని ఆకట్టుకుంది. అలాగే అది ఓ పన్నెండేళ్ల బాలిక షూ దొంగతనం చేయడం కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది.

ఈ మొసలి 10 అడుగుల పొడవు, సుమారు 136 కేజీల బరువుండేది. దాని కళ్లు గులాబీ రంగులో ఉండేవి. అయితే, చూపు సరిగా ఉండేదికాదు. ఈ మొసలి డిసెంబర్‌లో చనిపోయింది. కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో క్లాడ్ 17 ఏళ్ల పాటు నివసించింది.

అక్కడ పని చేసే బార్ట్ షెపర్డ్ అనే ఉద్యోగి, అది ఒకసారి చేసిన దొంగతనాన్ని గుర్తుచేసుకున్నారు.

ఒకసారి 12 ఏళ్ల బాలికకు చెందిన బ్యాలే షూను దొంగిలించి తినేసిందని, పొట్టలోనుంచి ఆ షూ తీయడం చాలా కష్టమైందని గోల్డెన్ గేట్ పార్క్‌లోని క్లాడ్ అభిమానులతో షెపర్డ్ చెప్పారు.

క్లాడ్ కడపులోనుంచి షూను తీయడానికి ఎక్కువ మోతాదులో అనస్థీషియా, ప్రత్యేక ఉపకరణాలు, చాలామంది పశువైద్యులు, సిబ్బంది అవసరమయ్యారనీ, ఒకదశలో ఆ భవనంలో ఫైర్ అలారం మోగినా కూడా ఈ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించామని షెపర్డ్ చెప్పారు.

మొసళ్లలో చాలా అరుదుగా కనిపించే ‘అల్బినిజం’ అనే సమస్య ఈ మొసలికి ఉంది. అల్బినిజం అంటే శరీరం మెలనిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయకపోవడం వల్ల చర్మం, వెంట్రుకలు, కళ్ళు సాధారణం కంటే తెల్లగా కనిపించడం.

ఇది తెల్లగా ఉండటంతో మిగిలినవాటికి భిన్నంగా, ఎక్కడున్నా ప్రజలు దీన్ని గుర్తుపట్టేలా ఉండేదని అకాడమీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జీనెట్ పీచ్ బీబీసీతో అన్నారు.

‘‘ఈ మొసలి కోసం శానిఫ్రాన్సిస్కోలో ఇలాంటి కార్యక్రమం జరగడం నిజంగా అద్భుతం’’ అని పీచ్ అన్నారు.

‘‘ఇక్కడికి వచ్చేవారిని ఆదరించడమే కాదు, భిన్నత్వాన్ని స్వాగతించడంలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరం ఎంత ముందుందో చెప్పడానికి క్లాడ్ ఉదంతం ఒక ఉదాహరణ’’ అని పీచ్ అన్నారు.

"ఈ అద్భుతమైన జంతువు, మిగతా జాతుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది, కానీ చాలా మంచిది’’ అని ఆమె అన్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో కాలేయ వ్యాధితో మరణించిన ఈ మొసలి, 1995లో లూసియానాలోని ఒక ఎలిగేటర్ ఫామ్‌లో పుట్టింది. తర్వాత 2008లో దీన్ని అకాడమీ స్వాంప్ ఎగ్జిబిషన్‌కు తీసుకువచ్చారు.

మరణించిప్పటి నుంచి అకాడమీకి క్లాడ్ అభిమానులు వేలాదిగా లెటర్స్ రాశారు. ఆ లేఖలను చూస్తే దానికి ఎంతమంది అభిమానులున్నారో అర్ధమవుతుంది.

"నేను నిన్ను చాలా మిస్ అవుతాను, నా బాల్యంలో భాగమైనందుకు ధన్యవాదాలు. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో ఉంటావు" అని ఒకరు తన లేఖలో రాశారు.

తాను చూసిన మొసళ్లన్నింటిలో క్లాడ్‌ చాలా ప్రశాంత స్వభావం కలిగినదని, దాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అకాడెమీకి చెందిన సీనియర్ వెటర్నరీ డాక్టర్ లానా క్రోల్ చెప్పారు.

"నా జీవితకాలంలో క్లాడ్ లాంటి మరో మొసలిని చూడలేనని నేను కచ్చితంగా చెప్పగలను. నేను దాన్ని చాలా మిస్ అవుతా" అని క్రోల్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)