షార్క్ బీచ్: ఈతకు వెళితే సొరచేప పట్టేసింది, ఆ పిల్లాడి ఫ్రెండ్స్ సాహసం చేసి ఎలా రక్షించారంటే...

ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్‌ సమీపంలోని ఓ బీచ్‌లో ఈత కొడుతున్న ఓ 12 ఏళ్ల అబ్బాయిపై షార్క్ దాడి చేయడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతని పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఆదివారం సిడ్నీకి సమీపంలోని షార్క్ బీచ్‌లో ఆరు మీటర్ల ఎత్తైన రాతి కొండపై నుంచి ఆ అబ్బాయి, అతని ఫ్రెండ్స్ నీళ్లలో దూకుతూ ఈత కొడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది.

రెండు కాళ్లకు తీవ్ర గాయాలైన అతను ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు.

రెస్క్యూయర్స్ చేరుకోవడానికి ముందే అపస్మారక స్థితికి చేరుకున్న ఆ అబ్బాయిని నీళ్లలో నుంచి సమయానికి బయటకు లాగిన అతని స్నేహితులను పోలీసులు ప్రశంసించారు. వాళ్లు సమయస్ఫూర్తితో స్పందించిన కారణంగానే అతడు ప్రాణాలతో బయటపడ్డాడని ఓ పోలీస్ సూపరింటెండెంట్ అన్నారు.

పేరులో షార్క్ ఉన్నప్పటికీ, సిడ్నీకి సమీపంలో ఉన్న ఈ పాపులర్ స్విమ్మింగ్ స్పాట్ ‘షార్క్ బీచ్‌’లో సొరచేపల దాడులు అరుదుగానే జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు.

"ఆ సమయంలో అతని స్నేహితులు ధైర్యంగా నిలబడ్డారు. అదొక అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్" అని న్యూ సౌత్ వేల్స్ మెరైన్ ఏరియా కమాండ్‌‌కు నేతృత్వం వహిస్తున్న జోసెఫ్ మెక్‌నల్టీ అన్నారు.

"ఆ అబ్బాయిలకు కూడా తీవ్రంగానే గాయాలైనట్లున్నాయి. బహుశా స్నేహం అంటే ఇదేనేమో" అన్నారాయన.

సొరచేప దాడిలో గాయపడిన కుర్రాడిని రక్షించిన అతని స్నేహితులను న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ కూడా ప్రశంసించారు.

"నీటిలో ఉన్న ఆ పిల్లాడిని రక్షించిన అతని ఫ్రెండ్స్‌కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా. వాళ్లు అతని ప్రాణాలను కాపాడ్డానికి ఎంత చేయాలో అంత చేశారు" అని మిన్స్ అన్నారు.

దాడి జరిగిన చోటుకు మెరైన్ పోలీసులు చేరుకున్నారని మెక్‌నల్టీ విలేఖరులతో చెప్పారు. పోలీస్ స్పీడ్ బోట్ ద్వారా సదరు అబ్బాయిని బయటకు తీసుకువచ్చి చికిత్స అందించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.

‘‘అతని ఫ్రెండ్స్ లో ఒకరు షార్క్ బారినపడ్డ తన స్నేహితుడి కోసం అమాంతం నీళ్లలోకి దూకి అతన్ని ఒడ్డుకు లాక్కొచ్చాడు. మిగిలిన వారు అతనికి సాయపడ్డారు. అప్పటికి షార్క్ వారికి సమీపంలోనే ఉంది’’ అని పోలీసులను ఉటంకిస్తూ ఆస్ట్రేలియా పత్రికలు న్యూస్ డాట్ కామ్, డైలీ మెయిల్‌లు కథనాలు రాశాయి.

ఉష్ణమండల జలాల్లో, తక్కువలోతు సముద్రపు నీటిలో దూకుడుగా ఉండే బుల్ షార్క్‌లే ఆ అబ్బాయిపై దాడి చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన షార్క్‌లలో బుల్ షార్క్ ఒకటని నిపుణులు చెబుతుంటారు.

భారీ వర్షం కారణంగా బ్రాకిష్ వాటర్ (ఉప్పు నీరు, మంచి నీరు కలిసిన) పరిస్థితులు తలెత్తాయని మెక్‌నల్టీ భావిస్తున్నారు. ఆ పరిస్థితులే ఆదివారం షార్క్ దాడి చేయడానికి కారణమై ఉండొచ్చని ఆయన అన్నారు.

భారీ వర్షాలు నదులు, సముద్రాల్లోకి పోషకాలను మోసుకొస్తుంటాయి. వాటికోసం షార్క్‌లు తీరం దగ్గరకు వస్తుంటాయి.

అందమైన బీచ్‌లకు నిలయం ఆస్ట్రేలియా. అలాగే షార్క్ దాడులు జరిగే ప్రమాదకర ప్రదేశాలు కూడా ఇక్కడే ఉన్నాయి.

గతేడాది షార్క్ దాడుల కారణంగా ఆస్ట్రేలియాలో ఐదుగురు చనిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)