You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
కాకినాడ-సామర్లకోట రోడ్డుపై రాత్రి 7 గంటల సమయంలో చలిలో రెండున్నరేళ్ల బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎ. జయశాంతి చేసిన పని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసలందుకొంటోంది.
జనవరి 17న జరిగిన ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
మూడు కిలోమీటర్ల మేర ఆగిపోయిన ట్రాఫిక్‌ను ఆమె సరిచేసే ప్రయత్నం చేశారు.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌ను ముందుకు పంపాలన్న ఆలోచనే బిడ్డను చంకన ఎత్తుకుని విధులు నిర్వహించేలా చేసిందని ఆమె బీబీసీతో అన్నారు.
సొంతూరు బయలుదేరాను: జయశాంతి
ఆ రోజు అసలేం జరిగిందో కానిస్టేబుల్ జయశాంతి బీబీసీకి వివరించారు.
"పండుగ కావడంతో నా రెండున్నరేళ్ల బాబుతో సొంతూరు బయలుదేరాను. బస్సులు దొరకలేదు. చాలా బస్సులు రద్దీగా ఉన్నాయి. ఆదివారం ఒక్క రోజే సెలవు దొరికింది. మళ్లీ సోమవారం డ్యూటీలో జాయిన్ కావాలి. అందుకే ఇక బస్సులు కోసం ఎదురు చూడకుండా అప్పటికే కొందరు ప్రయాణీకులతో వెళ్లేందుకు సిద్దంగా ఉన్న ఒక కారు మాట్లాడుకుని ఎక్కాను. అది సామర్లకోట సమీపంలోకి రాగానే ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది" అని చెప్పారు జయశాంతి.
"కాకినాడ–సామర్లకోట రహదారిపై, పండుగ రాకపోకల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందులో ఒక అంబులెన్స్ చిక్కుకుపోయింది. అసలు దిగడానికి కూడా వీలు లేనంతగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బాబు నా చేతిలో పడుకుని ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అంబులెన్స్ సైరెన్ వినిపిస్తూనే ఉంది" అని జయశాంతి గుర్తుచేసుకున్నారు.
"నేను ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వెళ్లాలని కానీ, బాబును ఏం చేయాలో తెలియడం లేదని నా పక్కవారితో చెప్పాను. ఆ సమయంలో వారు నా పరిస్థితిని గమనించి, బిడ్డను తాము చూసుకుంటామన్నారు"
"మేడం, మీరు అంబులెన్స్ పంపించండి, బాబుని మేం చూసుకుంటాం అన్నారు. బాబుని వారికి ఇచ్చేశాను. నేను ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ముందుకు వచ్చేశాను. ఆ తర్వాత గుర్తుకొచ్చింది నాకు కనీసం బాబుని ఇచ్చిన ఆ వెహికల్ నంబర్ కూడా గుర్తు లేదని. కానీ, అంబులెన్స్‌ని ముందుకు పంపించాలన్న ఆలోచనతో ముందుకే కదిలాను"
"అక్కడ కొందరు యువకులు కనిపించారు. వారి వద్దకు వెళ్లాను. తమ్ముడు, కొంచెం హెల్ప్ చేయరా? అంబులెన్స్ పంపిద్దాం అన్నాను. వాళ్లు కూడా వెంటనే వాహనాలను పక్కకు తీశారు. ఇలా ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ వాహనాలను ముందుకు పంపిస్తున్నాం" అని చెప్పారు జయశాంతి.
‘ఒకటి కాదు, రెండు అంబులెన్సులు..’
"మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో, ఒకచోట నిలబడి క్లియర్ చేస్తే సరిపోలేదు. పాయింట్ పాయింట్‌కు వెళ్లి వాహనాలను పక్కకు పంపించాల్సి వచ్చింది. ఇక్కడ నిలబడ్డామంటే అక్కడ లైన్ మళ్లీ దారి తప్పేది. అందుకే ట్రాఫిక్ ఎక్కడైతే ఆగిపోయిందో, ఆ పాయింట్ వద్దకు అంటే ముందుకు వెళ్లి, అక్కడ నుంచి క్లియర్ చేస్తూ వచ్చాం. ఆ క్రమంలో ఈ ట్రాఫిక్‌లో చిక్కుకున్నది ఒకటి కాదు రెండు అంబులెన్సులు అని తెలిసింది. గంట కష్టపడితే ఆ అంబులెన్సులను ఒకదాని వెనుక ఒకటి బయటకు పంపించగలిగాం. అయితే ఈ మొత్తం సమయంలో నా బాబు కారులోని ఆ కుటుంబంతోనే ఉన్నాడు. అప్పటికే చాలా సమయం గడవడంతో బాబు నిద్రలేచి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ కుటుంబం నన్ను వెతుకుతూ, అందరిని అడుగుతూ నా కోసం తిరుగుతున్నారు.
ఎట్టకేలను బాబుతో నా దగ్గరకు చేరుకున్నారు. నా పరిస్థితి చూసి వారు బాబుని వాళ్లతో ఉంచుకోవాలని ప్రయత్నించారు. కానీ, చాలాసేపవడంతో కుదర్లేదు. చివరికి బాబుని నేనే ఎత్తుకునే మళ్లీ ట్రాఫిక్ క్లియర్ చేయడం మొదలుపెట్టాను. సుమారు గంటసేపు బాబుని చేతుల్లో పెట్టుకునే డ్యూటీ చేశాను. అశోక్ అనే వ్యక్తి ఆ సమయంలో నేను బాబుని ఎత్తుకుని విధులు నిర్వహిస్తున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు" అని వివరించారు జయశాంతి.
వీడియో వైరల్...
"బాబుని ఎత్తుకుని మరీ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో సాయం చేస్తున్న నన్ను సామర్లకోట సీఐ చూసి ప్రశంసించారు. నన్ను బస్సు ఎక్కించి పంపించేశారు. బస్సులో బయలుదేరి వెళ్తున్నా. ఒక గంటలో నాకు ఫోన్లు రావడం మొదలైంది. ఆ వీడియో వైరల్ అయ్యింది. అది చూసి మా స్టేషన్ సిబ్బంది, తెలిసిన వాళ్లు అంతా ఫోన్లు చేసి నన్ను అభినందించడం మొదలు పెట్టారు. అయితే నేను వాట్సప్ తప్ప, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడను. దాంతో నాకు వాళ్లు ఆ వైరల్ వీడియోను స్క్రీన్ షాట్స్ తీసి పంపించారు.
సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు నన్ను అభినందించారు. మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో అభినందిస్తూ పోస్ట్ చేశారు. హోంమంత్రి అనిత గారు నాతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి మెచ్చుకున్నారు. కుటుంబంతో సహా వచ్చి తనను కలవాలని కోరారు" అని జయశాంతి చెప్పారు.
"జయశాంతి చేసిన పని వల్ల పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది" అని హోం మంత్రి అనిత అన్నారు.
'బాధ్యతగానే చేశాను'
ఇలా గుర్తింపు వస్తుందని ఊహించలేదని జయశాంతి అన్నారు.
"నేను ఊహించలేదు. ఒక పోలీస్‌గా నా డ్యూటీ చేశా అంతే. యూనిఫాం వేసుకుని రోడ్డుపై నిలబడ్డానంటే ట్రాఫిక్ సమస్య ఆటోమేటిక్‌గా ఆగుతుంది. అంతే నా ఆలోచన" అని ఆమె చెప్పారు.
"ఆ ట్రాఫిక్ జామ్‌లో నాతో పాటు పౌరులు కూడా పనిచేశారు. కానీ, వారి మాటలను వాహనదారులు పట్టించుకోలేదు. అందుకే పోలీసుగా నేను ఆ పని చేస్తే ఫలితం ఉంటుందని అనిపించి, వెంటనే దిగాను" అని జయశాంతి బీబీసీతో చెప్పారు.
మొత్తానికి రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆమె చెప్పారు.
అన్నవరంలో హోంగార్డుగా...
జయశాంతి భర్త కూడా పోలీస్ శాఖలోనే పనిచేస్తున్నారు. ఆయన పల్నాడు జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్నప్పటి నుంచే పోలీస్ కావాలన్న ఆసక్తి ఉండేదని జయశాంతి చెప్పారు.
"అమ్మకు పోలీస్ అంటే ఇష్టం లేదు. ఆడపిల్లలు టీచర్లు అవుతారు అనేది. కానీ, నాకు పోలీస్ అంటేనే ఇష్టం" అని ఆమె నవ్వుతూ చెప్పారు.
"కానిస్టేబుల్ కావడానికి ముందు, అన్నవరం దేవాలయంలో 2012 నుంచి ఐదేళ్లు హోంగార్డుగా పని చేశాను. ఆ సమయంలోనే అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. పలు అవార్డులు కూడా అందుకున్నారు. 2017లో కానిస్టేబుల్‌గా పోస్టింగ్ వచ్చింది" అని జయశాంతి చెప్పారు.
"ఎవరికైనా ఏదైనా సాయం చేయాలన్న గుణం నేను మా అమ్మలోనే చూశాను" అని తెలిపారు.
జయశాంతి సేవాభావం, బాధ్యతాయుతమైన ప్రవర్తన పోలీస్ శాఖకు స్పూర్తిగా నిలుస్తోందని రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆమెను ప్రశంసించారు.
నెటిజన్లు కూడా ఆమెను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
"జయశాంతి చేసిన పని ప్రశంసనీయం అన్న విషయంలో సందేహం లేదు. అయితే ఈ ఘటన మరో ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. ట్రాఫిక్ వ్యవస్థ సమర్థంగా పనిచేసి ఉంటే, ఒక తల్లి తన చంటి బిడ్డను ఇలా రోడ్డుపైకి తీసుకురావాల్సి వచ్చేదా?. అంబులెన్స్‌కు దారి ఇవ్వడమనేది ఒక వ్యక్తిగత త్యాగంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?" అని విశాఖపట్నానికి చెందిన మహిళా న్యాయవాది వాణి ప్రశ్నించారు.
ఒక మహిళా కానిస్టేబుల్ చూపిన ధైర్యం, మానవత్వం సమాజానికి స్పూర్తి కావచ్చు కానీ, అలాంటి స్పూర్తి అవసరం లేకుండా, వ్యవస్థే బాధ్యతగా పనిచేసే రోజు ఎప్పుడొస్తుందన్న ప్రశ్న మాత్రం మిగిలే ఉందని వాణి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)