ఫుడ్ రేసిజం ఆరోపణలు: 'పాలక్ పనీర్' వాసనపై వివాదం, కేసు వేసి రూ.కోటీ 82 లక్షల పరిహారం పొందిన భారత విద్యార్థులు

    • రచయిత, శర్లీన్ మోలన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడంపై మొదలైన వివాదం ఇద్దరు భారతీయ విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీ 2 లక్షల డాలర్లు( సుమారు రూ. 1.82 కోట్లు) సెటిల్‌మెంట్ రూపంలో ఇవ్వడంతో ముగిసింది.

మైక్రోవేవ్ సంఘటన తర్వాత తమపై అనేక రూపాల్లో వేధింపులు, విమర్శలు ఎదురయ్యాయని, దీంతో బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయంపై పౌర హక్కుల దావా వేసినట్లు ఆదిత్య ప్రకాశ్, ఆయన కాబోయే భార్య ఉర్మి భట్టాచార్య బీబీసీకి తెలిపారు.

ప్రకాశ్ తన లంచ్ కోసం తెచ్చుకున్న పాలక్ పనీర్‌ను క్యాంపస్ మైక్రోవేవ్‌లో వేడి చేస్తున్నప్పుడు వాసన వస్తోందని వర్సిటీ సిబ్బంది ఒకరు ఫిర్యాదు చేయడంతో సమస్య ప్రారంభమైంది. దీని తర్వాత తాము వేధింపులకు గురయ్యామని విద్యార్థులు దావాలో ఆరోపించారు.

దీనిపై విశ్వవిద్యాలయాన్ని బీబీసీ ప్రశ్నించగా, గోప్యతా చట్టాల కారణంగా విద్యార్థుల ఆరోపణలపై మాట్లాడలేమని బదులిచ్చింది. కానీ, అందరినీ కలుపుకొనిపోయే, గౌరవప్రదమైన వాతావరణానికి వర్సిటీ మద్దతు ఇస్తుందని తెలిపింది.

2023లో ఫిర్యాదులు వచ్చినప్పుడు, వాటిని తీవ్రంగా పరిగణించి సరైన విధానాలను అనుసరించామని విశ్వవిద్యాలయం తెలిపింది. 2025 సెప్టెంబర్‌లో విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్నామని, తాము ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టంచేసింది.

అయితే, ఈ కేసు డబ్బు గురించి కాదని ప్రకాశ్ అంటున్నారు. 'సంస్కృతి కారణంగా భారతీయులపై వివక్ష చూపితే పరిణామాలు ఉంటాయనే సందేశాన్ని పంపడం' గురించి అని అన్నారు.

ఆహారంపై జాతి వివక్ష

ఈ కేసుపై గతవారం నుంచి భారత మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. పాశ్చాత్య దేశాలలో "ఆహారంపై జాతి వివక్ష" అనే అంశంపై చర్చ నడిచింది.

తమ ఆహారం కారణంగా విదేశాలలో ఎగతాళికి గురైన లేదా సమస్యలు ఎదుర్కొన్న అనుభవాలను చాలామంది భారతీయులు పంచుకున్నారు.

అయితే, భారతదేశంలో కూడా ఆహార వివక్ష ఉందని కొందరు చెప్పారు. అనేక పాఠశాలలు, కళాశాలలలో, మాంసాహారంపై నిషేధముంది. ఎందుకంటే దాన్ని అపవిత్రమైనదిగా పరిగణిస్తుంటారు. వెనుకబడిన కులాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వారి ఆహారం కారణంగా పక్షపాతాన్ని ఎదుర్కొంటారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా నుంచి వచ్చిన వారు కూడా తమ ఆహారం కారణంగా అవమానానికి గురయ్యామని చెప్పారు.

సెప్టెంబర్ 2023లో తమ సమస్యలు ప్రారంభమయ్యాయని ప్రకాశ్, ఉర్మి చెప్పారు.

ప్రకాశ్ ఆ యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ విభాగంలో పీహెచ్‌డీ విద్యార్థి.

ప్రకాశ్ పాలక్ పనీర్‌ను వేడి చేస్తున్నప్పుడు, ఒక బ్రిటిష్ స్టాఫ్ మెంబర్ వచ్చి ఆహారం ‘ఘాటైన’ వాసన వస్తోందని, అలాంటి ఆహారాన్ని వేడి చేయకూడదనే నియమం ఉందని ఆయనకి చెప్పారు. కానీ, అలాంటి నియమం ఎక్కడా రాసి లేదని ప్రకాశ్ అన్నారు. ఏ ఆహారాలు ఘాటుగా భావిస్తారని సదరు బ్రిటిష్ సిబ్బందిని అడిగితే, శాండ్‌విచ్‌లు మంచివని, కూర కాదని బదులిచ్చినట్లు ప్రకాశ్ తెలిపారు.

ఈ సంఘటన తర్వాత, విశ్వవిద్యాలయం తనపైనా, ఉర్మి భట్టాచార్య (పీహెచ్‌డీ విద్యార్థిని) పై అనేక చర్యలు తీసుకుందని ప్రకాశ్ అన్నారు. వారు తమ రీసెర్చ్ ఫండ్స్‌, టీచింగ్ జాబ్స్, పీహెచ్‌డీ అడ్వైజర్లను కూడా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో, ఇరువురు విశ్వవిద్యాలయంపై మే 2025లో దావా వేశారు. తమతో అన్యాయంగా ప్రవర్తించారని, ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు.

అయితే, అదే ఏడాది సెప్టెంబర్‌లో విశ్వవిద్యాలయం కేసును పరిష్కరించుకుంది. దీర్ఘకాలంగా, ఖరీదైన కోర్టు కేసులను నివారించడానికి సాధారణంగా ఇటువంటి సెటిల్‌మెంట్స్ జరుగుతాయి.

సెటిల్‌మెంట్స్‌లో భాగంగా, విశ్వవిద్యాలయం వారికి డిగ్రీలను ఇవ్వడానికి అంగీకరించింది. అయితే మిగతా సదుపాయలు అంటే మళ్లీ అదే విశ్వవిద్యాలయంలో చదువుకోవడం, అక్కడే ఉద్యోగం చేయడంలాంటి అవకాశం లేకుండా నిషేధించింది.

యూనివర్సిటీ ఏం చెబుతోంది?

విశ్వవిద్యాలయం బీబీసీకి అందించిన ఒక ప్రకటనలో "కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం ఆంత్రోపాలజీ విభాగం విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి కృషి చేస్తోంది. డిపార్ట్‌మెంట్ లీడర్స్ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని కలిశారు. సమ్మిళిత వాతావరణం కోసం తీసుకురావాల్సిన మార్పుల గురించి చర్చించారు. వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా నియమాలను ఉల్లంఘించే వ్యక్తులు జవాబుదారీగా ఉంటారు" అని తెలిపింది.

మొదటిసారి కాదు: ప్రకాశ్

"ఇలాంటి ఆహార వివక్ష అనుభవం నాకు మొదటిసారి కాదు" అని ప్రకాశ్ అన్నారు.

"నేను ఇటలీలో ఉన్నప్పుడు, సహవిద్యార్థులకు నా ఆహారం వాసన నచ్చకపోవడంతో, ఉపాధ్యాయులు నన్ను భోజన సమయంలో సెపరేట్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు" అని చెప్పారు.

"నా ఆహారం కారణంగా నా యూరోపియన్ క్లాస్‌మేట్స్ నన్ను దూరంగా పెట్టినప్పుడు లేదా మైక్రోవేవ్ వాడకుండా అడ్డుకున్నప్పుడు, వారు నా భారతీయతను అడ్డుకున్నట్లు అనిపించింది’’ అని ప్రకాశ్ అన్నారు.

"భారతీయులను, ఇతర జాతుల సమూహాలను అవమానించడానికి ఆహారాన్ని చాలాకాలంగా అస్త్రంగా చేసుకున్నారు" అని ఆరోపించారు ప్రకాశ్.

అమెరికా ఉపాధ్యక్షురాలికే తప్పలేదు: ఉర్మి

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఆహారం కారణంగా అవమానానికి గురయ్యారని ఉర్మి భట్టాచార్య అన్నారు. లారా లూమర్ చేసిన 2024 సోషల్ మీడియా పోస్ట్‌ను ఆమె గుర్తుచేశారు.

"హారిస్ ప్రెసిడెంట్ అయితే, వైట్‌హౌస్ కూడా కూరలాగా వాసన వస్తుంది" అని లూమర్ రాశారు.

అయితే, తాను జాత్యహంకారి కాదని లూమర్ బదులిచ్చారు.

తన ఆంత్రోపాలజి క్లాసులో ‘సాంస్కృతిక సాపేక్షవాదం’ అనే అంశం మీద ప్రసంగించడానికి ప్రకాశ్‌ను ఆహ్వానించడంతో విశ్వవిద్యాలయం తనపై చర్యలు తీసుకుందని ఉర్మి భట్టాచార్య దావాలో తెలిపారు.

సాంస్కృతిక సాపేక్షవాదం అంటే ఏ సంస్కృతి మరొక సంస్కృతి కంటే మెరుగైనది లేదా అధ్వాన్నమైనది కాదు.

ఉపన్యాసంలో, ఎవరి పేరు చెప్పకుండానే, పాలక్ పనీర్ సంఘటనతో సహా తాను ఎదుర్కొన్న ఫుడ్ రేసిజానికి సంబంధించిన అనేక ఉదాహరణలను ప్రకాశ్ ప్రస్తావించానని చెప్పారు ప్రకాశ్.

2024లో విశ్వవిద్యాలయంలో తాను, ప్రకాశ్ ఎదుర్కొంటున్న "వ్యవస్థాగత జాత్యహంకారం" గురించి ఎక్స్‌లో ఒక థ్రెడ్ పోస్ట్ చేసినప్పుడు రేసిస్ట్ వేధింపులను ఎదుర్కొన్నానని ఉర్మి భట్టాచార్య చెప్పారు. కొంతమంది ఆ జంటకు మద్దతు ఇవ్వగా, కొంతమంది ద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు.

‘‘గో బ్యాక్ ఇండియా’ "డీకాలనైజేషన్ ఈజ్ ఏ మిస్టేక్" అని కొందరు కామెంట్ చేయగా, కేవలం ఆహారమే కాదు, మీలో చాలామంది స్నానం చేయరు" అని మరికొందరు రాశారు.

విశ్వవిద్యాలయం తమ మాట వినాలని, అర్థం చేసుకోవాలని ప్రకాశ్, ఉర్మి అంటున్నారు.

దీని గురించి బీబీసీ అడిగిన ప్రశ్నకు విశ్వవిద్యాలయం సమాధానం ఇవ్వలేదు.

ప్రకాశ్, ఉర్మి భట్టాచార్యలు భారతదేశానికి తిరిగి వచ్చారు. తాము ఇక ఎప్పటికీ అమెరికా వెళ్లకపోవచ్చని వారు అంటున్నారు.

‘‘చేసే పనిలో మీరు ఎంత మంచివారైనా, మీ చర్మం రంగు లేదా మీ జాతీయత కారణంగా, మిమ్మల్ని ఎప్పుడైనా వెనక్కి పంపవచ్చని వ్యవస్థ నిరంతరం మీకు చెబుతుంది. యూనివర్సిటీలో మా అనుభవం దీనికి ఉదాహరణ" అని ప్రకాశ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)