అమెరికా తర్వాత.. యూరప్, ఆస్ట్రేలియాలోనూ భారతీయులకు నిరసనలు ఎందుకు ఎదురవుతున్నాయి?

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, లండన్ నుంచి బీబీసీ కోసం

ఇద్దరు నేతలు రెండు వేర్వేరు వేదికలపై సెప్టెంబర్ 23న ఇచ్చిన ప్రసంగాలు చర్చనీయాంశంగా మారాయి.

బ్రిటన్‌లో లిబరల్ డెమోక్రాట్ల నాయకుడు ఎడ్ డేవీ ఫార్ రైట్ నేతలను తీవ్రంగా విమర్శించారు. వారిని దుష్టశక్తులుగా అభివర్ణించారు.

వలసదారులకు వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం చేస్తున్న నైజన్ ఫరాజ్, టామీ రాబిన్సన్, ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్‌ను ఆయన ప్రస్తావించారు.

మరోవైపు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన డోనల్డ్ ట్రంప్, దీనికి విరుద్ధమైన సందేశం ఇచ్చారు.

వలసదారుల కోసం బార్లాతెరిచిన తలుపులు, యూరప్‌ను సంక్షోభంలోకి నెట్టేశాయని చెప్పారు.

ఈ దేశాలు త్వరలోనే కుప్పకూలబోతున్నాయని హెచ్చరించారు.

ఈ ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఉదారవాదం వర్సెస్ జాతీయవాదంపై చర్చను తీవ్రతరం చేశాయి.

ఫరాజ్, మస్క్, ట్రంప్ కలిసి బ్రిటన్‌ను ట్రంప్ అమెరికాలా మార్చాలని చూస్తున్నారని డేవీ అన్నారు. సామాజిక మాధ్యమాన్ని ద్వేషపూరిత వేదికగా మార్చారని ఆయన విమర్శించారు.

అదే సమయంలో లండన్ ముస్లిం మేయర్ సాదిక్ ఖాన్‌పై ట్రంప్ ప్రత్యక్ష దాడి మొదలుపెట్టారు. ఖాన్ షరియా చట్టాన్ని విధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ ఆరోపణలను మేయర్ కార్యాలయం తోసిపుచ్చింది. అవి "పక్షపాతం", "ద్వేషపూరితం"గా పేర్కొంది.

ఈ ప్రకటనలు ప్రజాస్వామ్య దేశాల మధ్య వలసల విషయంలో ఉన్న తీవ్ర విభేదాలను మరోసారి తేటతెల్లం చేశాయి. ఇది యూరప్ వీధుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

వీధుల్లో భయాందోళన

రెండు వారాల క్రితం లండన్‌లో వలస వ్యతిరేక నిరసనలు చెలరేగాయి. గుంపులో నుంచి ఒక మహిళ పారిపోతున్న వీడియో వైరల్ అయింది.

ఆమె వెనకున్న వారు నినాదాలు చేస్తూ, జెండాలు ఊపుతూ కనిపించారు. లక్షలాది మంది ఆ వీడియోను వీక్షించారు.

ఇది కేవలం గందరగోళం కాదనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు వలసదారులకు ఒక సందేశంగా నిలిచింది. "మీరు ఎప్పటికీ ఇక్కడ స్థానికులు కాలేరు" అనే భావనను కల్పించింది.

బ్రెగ్జిట్ తర్వాత అతిపెద్ద జనసమీకరణగా పరిగణిస్తున్న ఈ ర్యాలీలో దాదాపు 1.5 లక్షల మంది పాల్గొన్నారు.

కేవలం ఇదొక్క సంఘటనే కాదు, ది హేగ్‌లో ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని తగలబెట్టారు, దీంతో పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది.

ఇఫ్పుడు యూరప్‌లోని చాలా దేశాల ప్రభుత్వాలు మళ్లీ సరిహద్దు తనిఖీలు అమలు చేస్తూ, శరణార్థులకు సంబంధించి కఠిన చట్టాలను రూపొందిస్తున్నాయి.

దీంతో పాటు, సముద్ర మార్గాల్లో వచ్చే వారినీ అదుపులోకి తీసుకునేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

2015 సంక్షోభం తర్వాత వలసలు తగ్గినప్పటికీ, దాని ప్రభావం గణాంకాల్లో కంటే భయం రూపంలో ఎక్కువగా ప్రతిబింబిస్తోంది.

ప్రస్తుతం వలసదారులు, రైట్-వింగ్ రాజకీయాలకు సులువైన లక్ష్యంగా మారారు.

ఈ ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.2 కోట్ల మందికి పైగా భారతీయ ప్రవాసుల్లోనూ అసంతృతప్తి నెలకొంది, బ్రిటన్‌లో నివసించే భారతీయులు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

14 ఏళ్లుగా లండన్‌లో ఉంటున్న ఫిల్మ్‌మేకర్ శ్రీమోయి చక్రవర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

"జాత్యహంకార వాదులకు ఇది నా సందేశం. నేను వలసవచ్చిన వ్యక్తిని. కష్టపడి పనిచేశాను. అధిక పన్నులు చెల్లించాను. కానీ, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ద్వేషం చూసి, నా గుండె బద్ధలైంది. షాక్‌కు గురయ్యాను" అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ప్రవాస భారతీయులు బ్రిటన్ హెల్త్ సర్వీస్ ఎన్‌హెచ్‌ఎస్‌లో డాక్టర్లుగా, నర్సులుగా, జర్మనీలో ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో రెస్టారెంట్లు, మిలన్‌లో దుకాణాలు నడుపుతున్నారు.

పన్నులు కడుతున్నారు. కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నారు.

అయినప్పటికీ, వారు ''నువ్వు మాడివి కావు'' అనే నిందను ఎదుర్కొంటున్నారు.

లండన్‌‌కు చెందిన 47 ఏళ్ల బ్రిటన్ పౌరురాలు నోరా హచిసన్‌ గతంలో హెల్త్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు, కానీ ఇప్పుడు తాత్కాలిక, చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఆమెకు భారత్‌ అంటే ఇష్టం. కానీ, బ్రిటన్‌లో భారతీయ జనాభా పెరగడం గురించి ఆమె ఆందోళన చెందుతున్నారు.

పెద్దగా నైపుణ్యం లేని భారతీయులు చాలామంది యూకేకు వస్తున్నారని నోరా ఆరోపిస్తున్నారు.

మీడియాతో మాట్లాడుతూ, ''మీలాంటి వారితో మాకెలాంటి సమస్య లేదు. కానీ, ఎన్‌హెచ్ఎస్‌లో పనిచేసే చాలామంది డాక్టర్లకు, నర్సులకు కనీసం ఆల్ట్రాసౌండ్ రిపోర్టులను చదవడం రాదు, డిజిటల్ ఎక్స్-రేలను సరిగ్గా చూడలేరు. భారత్‌లోని ఆస్పత్రుల్లో కూడా అలాంటి వారిని నియమించుకోవు'' అని ఆమె అన్నారు.

నేరం, దాని ప్రభావం

అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపేయాలని నోరా కోరుకుంటున్నారు.

బ్రిటన్, అమెరికాల్లో ఉన్న అలాంటి వారిలో చాలామంది భారతీయులేనని, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారని నోరా అంటున్నారు.

ఈ ఉద్రిక్తతలు ఎస్సెక్స్‌ కౌంటీలో ఎక్కువగా కనిపిస్తాయి. ఒకప్పుడు సాధారణ వసతి కేంద్రంగా ఉన్న బెల్ హోటల్‌ కొద్దినెలలుగా నిరసనలకు కేంద్రబిందువుగా మారింది.

''వారిని వెనక్కి పంపేయండి'' అనే నినాదాలు ఇక్కడ నిత్యకృత్యమయ్యాయి.

బ్రిటన్‌ వచ్చిన 8 రోజులకే 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే అభియోగాలపై ఇథియోపియాకు చెందిన శరణార్థి హదుష్ కెబాటు అరెస్టయ్యారు, ఈ ఘటన వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది.

కోర్టు అతనికి ఏడాది పాటు జైలు శిక్ష కూడా విధించింది. కానీ, తనకేమీ తెలియదని, తానున మంచి క్రైస్తవుడినని చెబుతున్నారు కెబాటు.

వలస వ్యతిరేకులు ఈ ఘటనను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు.

యూకేలోని హోటళ్లలో దాదాపు 32 వేల మంది శరణార్థులు నివసిస్తున్నారు, గత ఏడాది ఈ సంఖ్య 51 వేలుగా ఉండేది. శరణార్థుల సంఖ్య తగ్గినప్పటికీ, ప్రభుత్వ వాగ్దానాలతో పోలిస్తే ఎక్కువే.

ఆన్‌లైన్‌లో మంచి గదులు, బాత్రూమ్‌లు కనిపించే ఈ హోటళ్లు ప్రస్తుతం శరణార్థులకు ఆశ్రయాలుగా మారాయి.

ఇక్కడే గందరగోళం నెలకొంది, చాలామంది శరణార్థులు.. ఎక్కువగా గిగ్ ఎకానమీలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న ఇల్లీగల్ వర్కర్స్‌తో పాటు ఉంటున్నారు.

ఖాదిర్ ప్రస్తుతం ఒక హోటల్లో ఉంటున్నారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా పనిచేసుకోవాలని కోరుకుంటున్నారు.

దీనికి విరుద్ధంగా, వారానికి కేవలం 9.95 పౌండ్లు (సుమారు రూ.1,190) మాత్రమే సంపాదించుకునే కొందరు రోజుకు 20 పౌండ్ల (దాదాపు రూ.2,392) చొప్పున బలవంతంగా చట్టవిరుద్ధమైన షిప్టుల్లో పనిచేయాల్సి వస్తోంది.

ఎందుకంటే, మానవ అక్రమ రవాణాదారుల వద్ద అప్పులు చేసి మరీ ఇక్కడకు రావడంతో ఇలా జరుగుతోంది.

అయితే, అలాంటి ఇబ్బందులకు సంబంధించిన కథనాలు మాత్రం వార్తల్లో కనిపించవు. కెబాటు లాంటి కేసులు మాత్రమే హెడ్‌లైన్స్‌లోకి వస్తాయి, మొత్తం వ్యవస్థ విఫలమైపోయిందనే భావనను ఇవి మరింత పెంచుతాయి.

నిరసనలు..

బ్రిటన్ వెలుపల కూడా దీని ప్రభావం కనిపిస్తోంది.

'' వలస వ్యక్తిగా నేను, నా అస్తిత్వాన్ని పదేపదే నిరూపించుకోవాల్సి వస్తోంది. నేను అలసిపోయాను'' అని ఆస్ట్రేలియాలోని భారత సంతతి ఎంపీ మిషెల్ ఆనంద రాజా అన్నారు.

భారత సంతతి వ్యక్తి రెండుసార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికైన ఐర్లాండ్‌లో కూడా ఇటీవల భారతీయుల లక్ష్యంగా దాడులు జరిగాయి.

ఆస్ట్రేలియాలో ఒకప్పుడు భారతీయ వలసదారుల్ని ప్రశంసించిన పౌలైన్ హాన్సన్.. ప్రస్తుతం భారతీయుల సంఖ్యను తగ్గించాలని పిలుపునిచ్చే బృందాలకు మద్దతు ఇస్తున్నారు.

'' సమస్య వలసదారులు లేదా కార్మికులతో కాదు'' అని డెన్మార్క్‌కు చెందిన రచయిత తబిష్ ఖైర్ అన్నారు.

'' అసలు సమస్యేంటంటే.. బిలియన్ డాలర్లు బయటికి వెళ్లిపోతున్నాయి. ఇది ప్రతి దేశంలోని కార్మికులపై ప్రభావం చూపుతోంది. 1980లలో దీన్ని పరిష్కరించడానికి బదులు ప్రోత్సహించారు'' అని తబిష్ ఖైర్ చెప్పారు.

భారతీయులే ఎందుకు టార్గెట్?

వాస్తవానికి.. అమెరికాలోని ఇతర దేశాల వారితో పోలిస్తే అత్యధిక సగటు ఆదాయంతో విద్య, వృత్తిపరమైన పురోగతిలో భారతీయ వలసదారులు ముందంజలో ఉన్నారు.

భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్‌ ప్రధాని అయ్యారు, కెనడాలో భారతీయ వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు పెద్దసంఖ్యలో ఉన్నారు.

అంతా బాగుంటే వారిని పొగడ్తల్లో ముంచెత్తుతారు. అదే రోజులు బాగోకపోతే అసూయ, ఆగ్రహం పెరిగిపోతాయి. ఇది కొత్తేమీ కాదు.

భారతీయుల అస్తిత్వం తరచూ ఉద్రిక్తతలను పెంచుతోంది.

భారతీయుల పండుగల సమయంలో ట్రాఫల్గర్ స్క్వేర్, టైమ్స్ స్క్వేర్‌ను అలంకరిస్తారు. ప్రతి రద్దీ వీధిలో భారతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయి. బాలీవుడ్, క్రికెట్ స్టార్లు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచారు.

మంచిగా ఉన్నప్పుడు, వారిని విజయానికి ప్రతీకగా చెబుతారు, కానీ.. క్లిష్ట సమయాల్లో అవే వివాదానికి కారణమవుతాయి.

'' సామరస్య చిహ్నాలు, ఉద్రిక్త సమయాల్లో విభజనను గుర్తు చేస్తాయి'' అని ఒక విశ్లేషకుడు చెప్పారు.

ట్రంప్ కొత్త అమెరికా

యూరప్‌లో వలసదారులపై ఉన్న ద్వేషం వీధుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, అమెరికాలో అది నాయకులు ప్రసంగాలు, విధానాల్లో ప్రతిబింబిస్తుంది.

'' ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడం, అమెరికాలో భారతీయులపై జాత్యహంకారంలో సరికొత్త శకానికి నాంది పలికింది'' అని లోవీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన భారతీయ వ్యాఖ్యాత అన్నారు.

భారత సంతతికి చెందిన అధికారులు, చివరికి భారత సంతతికి చెందిన ఉపాధ్యక్ష అభ్యర్ధి భార్య కూడా జాత్యహంకారల దాడులకు గురయ్యారు.

ట్రంప్ ఇటీవలే హెచ్-1బీ వీసా ఫీజును 1,500 డాలర్ల నుంచి 1,00,000 డాలర్లకు.. అంటే సుమారు రూ.88 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఇది భారతీయులకు అతిపెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే, హెచ్-1బీ వీసా గ్రహీతల్లో 70 శాతం మంది భారతీయులే. చిన్నచిన్న అమెరికన్ కంపెనీలు, స్టార్టప్‌లు ఈ భారీ ఫీజులను చెల్లించలేవు.

ఇప్పుడు విదేశీ కంపెనీలు భారత్ నుంచి ఉద్యోగులను నియమించుకోవడం వెనకడుగు వేస్తాయని నిపుణులు అంటున్నారు.

దీని ప్రభావంతో భారత ఇంజినీర్లు, ఐటీ నిపుణులు భారత్‌లోనే ఉండాలి, లేదంటే ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలను వెతుక్కోవాలి.

కానీ, వాస్తవానికి అమెరికాకు భారత్, చైనా విద్యార్థులు అవసరం.

అమెరికన్ విద్యార్థులు ఇంజినీరింగ్‌ వంటి రంగాలను ఎంచుకునే అవకాశం తక్కువ. అయితే, అమెరికన్ ల్యాబ్‌లలో ఇంజినీర్లు, డెవలపర్లు, డేటా సైంటిస్టులుగా పనిచేస్తూ సిలికాన్ వ్యాలీని నడిపిస్తోంది భారత్, చైనా విద్యార్థులే. అందువల్ల, ఇలాంటి చర్యలు అమెరికానే బలహీనపరుస్తాయి.

కానీ, నిరసనలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా స్థానిక యువకుడు రైట్-వింగ్ రచయిత, ట్రంప్ సన్నిహితుడిగా చెప్పే చార్లీ కిర్క్‌ను హత్య చేశాడు.

ఈ ఘటనకు ముందే చార్లీ కిర్క్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ''భారత్‌కు అమెరికా ఇకపై వీసాలు ఇవ్వకూడదు. చాలామంది అమెరికన్ ఉద్యోగులను ఇప్పటికే భారతీయులు భర్తీ చేసేశారు. ఇంతవరకూ జరిగింది చాలు" అని అందులో రాశారు.

కెనడాలో సీనియర్ ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్న సౌరభ్ శర్మ మాట్లాడుతూ, ''నేను కెనడాలో ఉన్నా. నా స్నేహితులు, సహోద్యోగులు అమెరికాలో ఉన్నారు. ఏం జరుగుతుందోనని వాళ్లెప్పుడూ భయపడుతూనే ఉంటారు. వారి భవిష్యత్‌ అగమ్యగోచరంగా ఉంది. ఎప్పుడు వెళ్లిపోవాల్సి వస్తుందోనని నిత్యం భయంభయంగా బతకడం అంత తేలిక కాదు'' అని అన్నారు.

భారత సహకారం, అపవాదు

ప్రవాస భారతీయుల దోషం అసలేమీ లేదని అనడం కూడా అన్యాయమే. ఎందుకంటే, వీసా మోసాలు, దోపిడీలు, రాజకీయాల్లో అతిజోక్యం వంటివి విస్తృతంగా జరుగుతున్నాయి.

అయితే, వీటి ఆధారంగా లక్షల మందిని ఒకేగాడిన కట్టేయడం కూడా సరైనది కాదు. భారతీయులు తమ జీవన విధానం, శ్రమించేతత్వంతో చాలా దేశాల్లో మార్పులొచ్చాయి.

యూకేలో రిషి సునక్ నుంచి అమెరికాలో కమలా హారిస్, నోబెల్, బుకర్ ప్రైజ్‌లు అందుకున్న రచయితల వరకు.. ఆస్పత్రుల నుంచి ఐటీ కంపెనీల వరకూ వారి సహాయసహకారాలు ప్రతిచోటా కనిపిస్తాయి.

డెన్మార్క్‌కు చెందిన తబిష్ ఖైర్ మాట్లాడుతూ, ''పాశ్చాత్య దేశాలకు, మిగిలిన అభివృద్ధి చెందుతోన్న ప్రపంచానికి మధ్య ఒక గోడను నిర్మిస్తున్నారు. పాశ్చాత్య దేశాలపై భారత్ ఆధారపడకూడదు. మనం పశ్చిమ దేశాలలో భాగం కాదు, 'మిగిలిన ప్రపంచంలో భాగం' భారత్ అక్కడ నాయకత్వం వహించగలదు'' అని అన్నారు.

క్లిష్టంగా మారుతున్న మార్గం

ప్రవాస భారతీయులకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.

యూరప్‌లో ర్యాలీలు జాత్యహంకారంగా మారుతున్నాయి. ఆస్ట్రేలియాలో రాజకీయ నాయకులు వలసదారులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

అమెరికాలో వీసా ఫీజులు భారీగా పెరిగాయి. భారతీయులకు రాజకీయంగా తగినంత శక్తి ఉన్నప్పటికీ, భారత్‌తో కెనడా ఉద్రిక్తతలు అభద్రతకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

భారత్‌లో కూర్చుని మనం అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మనకు అనిపించవచ్చు, కానీ వాస్తవమేంటంటే.. దాని వెనుక భయం, అభద్రత ఉన్నాయి.

మనం ఈ సమాజంలో భాగమనే భావన బలంగా కనిపించినప్పటికీ, అది చాలా సున్నితమైన విషయం. ఏ క్షణాన అయినా అది మారిపోవచ్చు.

అంతర్జాతీయ సవాళ్లు

ఆతిథ్య దేశాలు వలసలపై నిజాయితీగా చర్చించగలవా? అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.

వారు మొత్తం సమాజాన్ని నిందించకుండా ఉండగలరా? సొంతంగా ఆస్పత్రులు, యూనివర్సిటీలు, టెక్నాలజీ రంగాలను నడిపిస్తున్న వారికి రక్షణ కల్పించగలరా?

ప్రపంచంలో అతిపెద్ద వలసదారుల దేశంగా పేరున్న భారత్ వారికి గొంతుక కాగలదా? ఇది కేవలం ద్వేషపూరిత నేరాలు జరిగినప్పుడు మద్దతు ఇవ్వడం ద్వారా మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా, ధైర్యంగా గళమెత్తడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

భారత సంతతి ప్రజలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు భారతీయులు కూడా అంటున్నారు, ఎందుకంటే.. విజయం గుర్తింపు తెస్తుంది. ఆ గుర్తింపు ప్రశ్నలను కూడా రేకెత్తిస్తుంది.

భారత ప్రభుత్వం కూడా శక్తివంతమైన ప్రభావం కోసం వలసదారులను ప్రోత్సహిస్తోందని, కానీ వలసదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే విధానాలపై కానీ, ఆయా ప్రభుత్వాల వ్యతిరేక ధోరణిపై కానీ ఏమీ మాట్లాడదని వారంటున్నారు.

భారతీయ వలసదారుల జీవితాలు రోజురోజుకూ కష్టతరంగా మారుతున్నాయి.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, కెనడా, సిలికాన్ వ్యాలీ, సిడ్నీ వంటి ప్రాంతాల్లో పరిస్థితి మారిపోతోంది. ఇది ఇకపై కేవలం విజయగాథ మాత్రమే కాదు. మనుగడ కోసం, గౌరవంగా బతకడం కోసం జరుగుతున్న పోరాటం.

అయితే, భారత్ ముందున్న అతిపెద్ద ప్రశ్నేంటంటే.. విదేశాల్లో వ్యక్తమవుతోన్న ఈ ద్వేషం నుంచి ప్రవాస భారతీయులను రక్షించేందుకు తన గొంతుకను వినిపించగలదా?

లేదంటే రోజురోజుకీ అభద్రతా భావంలో కూరుకుపోవడాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోతుందా?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)