You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చాబహార్ పోర్ట్: భారత్‌కు అమెరికా మరో భారీ ఎదురుదెబ్బ, అసలు విషయమేంటంటే..
ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నిర్వాహకులపై సెప్టెంబర్ చివరి నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని అమెరికా తెలిపింది.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌పై కూడా ప్రభావం చూపనుంది. ఎందుకంటే, ఈ వ్యూహాత్మక పోర్టులో భారత్ కూడా ఓ టెర్మినల్ నిర్మిస్తోంది.
వాణిజ్య సంబంధాల బలోపేతం దిశగా ఇరాన్ దక్షిణ తీరప్రాంతంలోని సిస్తాన్ - బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న చాబహార్ ఓడరేవును భారత్, ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.
అమెరికా నిర్ణయంపై వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ ఆందోళన వ్యక్తం చేశారు. "ఇది భారత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న దండనాత్మక చర్య"గా అభివర్ణించారు.
అమెరికా విధానాల కారణంగా చైనాకు లాభం చేకూరుతుందని, అందుకు భారత్ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెల్లానీ ఎక్స్‌లో రాశారు.
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి(డిప్యూటీ స్పోక్స్‌పర్సన్) థామస్ పిగాట్ ఈవారం మొదట్లో దీనికి సంబంధించిన సమాచారమిచ్చారు.
చాబహార్‌లో పనుల కోసం 2018లో ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించుకోవడం.. ఇరాన్‌ను ఏకాకిని చేసే అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగా ఆయన పేర్కొన్నారు.
థామస్ పిగాట్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, "అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధి కోసం.. ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫరేషన్ యాక్ట్ (ఐసీఎఫ్‌ఏ) కింద 2018లో మంజూరు చేసిన మినహాయింపులను విదేశాంగ మంత్రి రద్దు చేశారు" అని అన్నారు.
"ఈ నిర్ణయం 2025 సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన అనంతరం, చాబహార్ ఓడరేవు నిర్వాహకులు లేదా ఐసీఎఫ్‌ఏలో పొందుపరిచిన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనే ప్రతిఒక్కరికీ ఈ ఆంక్షలు వర్తిస్తాయి."
భారత్‌కు ఎదురుదెబ్బ?
ఈ నిర్ణయం భారత్‌కు భారీ ఎదురుదెబ్బ కావొచ్చు. ఎందుకంటే, భారత్ ఇప్పటికే ఈ ప్రాజెక్టులో వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. దీనిని 'కనెక్టివిటీ డిప్లొమసీ'(మధ్య ఆసియా, యూరప్‌తో కనెక్టివిటీ)లో కీలకంగా భావిస్తోంది.
ఒమన్ ఆఫ్ గల్ఫ్‌లో ఉన్న ఈ పోర్టులో ఇరాన్‌తో కలిసి భారత్ ఒక టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తోంది.
2024 మే 13న, ఈ పోర్టు నిర్వహణకు సంబంధించిన 10 ఏళ్ల ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఇది మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యాభివృద్ధికి తోడ్పడుతుంది.
భారత్ విదేశాల్లో పోర్టు నిర్వహణ బాధ్యతలు తీసుకోవడం ఇదే మొదటిసారి.
2003లో భారత్ చాబహార్ పోర్ట్ అభివృద్ధి ప్రతిపాదనలు చేసింది. తద్వారా భారత ఎగుమతులు పాకిస్తాన్‌ను తప్పించి, రోడ్డు రైల్ ప్రాజెక్ట్ అయిన ఇంటర్నేషనల్ నార్త్ - సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్‌సీటీసీ) ద్వారా అఫ్గానిస్తాన్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు చేరుకోగలవు.
ఐఎన్‌సీటీసీ అనేది భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్‌బైజాన్, రష్యా, మధ్య ఆసియా దేశాలతో పాటు, యూరప్‌కు సరుకు రవాణాను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన 7,200 కిలోమీటర్ల పొడవైన మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్.
అయితే, ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా ఆంక్షల కారణంగా పోర్టు పనులు ఆలస్యమయ్యాయి.
ఇరాన్‌ను ఏకాకిని చేసే వ్యూహమా?
ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, పోర్ట్ అండ్ మారీటైం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య ఈ దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ ఒప్పందం ప్రకారం, ప్రతి ఏటా రెన్యూవల్ చేసే పద్ధతిలో షాహిద్ బెహెష్తీ టెర్మినల్‌ను భారత్ ఆపరేట్ చేస్తోంది.
2018లో అమెరికా చాబహార్ పోర్టును ఆంక్షల నుంచి మినహాయించింది.
అందుకు ప్రధాన కారణం, ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను అఫ్గానిస్తాన్ దిగుమతి చేసుకునే వీలుకల్పించడం. ఆ సమయంలో అమెరికా సైనిక బలగాలు అఫ్గాన్‌లో ఉన్నాయి.
2023లో, చాబహార్ పోర్టు ద్వారా భారత్ 20,000 టన్నుల గోధుమలను అఫ్గాన్‌కు పంపించింది.
2021లో ఈ పోర్టు ద్వారా ఇరాన్‌కు పర్యావరణ అనుకూలమైన పురుగుల మందులు సరఫరా అయ్యాయి.
తాజా నిర్ణయంతో, ఈ మినహాయింపులు ఇప్పుడు రద్దవుతాయి.
చాబహార్ పోర్టు భారత్‌కు ఎందుకంత కీలకం?
ఇంటర్నేషనల్ నార్త్ - సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్.. అంటే ఐఎన్‌సీటీసీకి చాబహార్ పోర్టు చాలా కీలకం.
ఈ మార్గం భారత్‌కు యూరప్‌తో సంబంధాలను సులభతరం చేస్తుంది. అలాగే ఇరాన్, రష్యాకు కూడా ప్రయోజనకరం.
ఈ ప్రాజెక్టుకు చాబహార్ పోర్టు చాలా ముఖ్యం
2003లో ఇరాన్, భారత్ మధ్య పోర్టు అభివృద్ధికి అంగీకారం కుదిరింది. 2016లో భారత ప్రధాని మోదీ ఇరాన్‌లో పర్యటించారు. అదే ఏడాది ఈ ఒప్పందం ఆమోదం పొందింది.
2019లో తొలిసారి, పాకిస్తాన్‌ను దాటుకుని అఫ్గానిస్తాన్ నుంచి వస్తువులు భారత్‌కు చేరాయి.
గ్వాదర్ పోర్టుకు చాబహార్ సమాధానమా?
ఇరాన్ బోర్డర్‌కు సమీపంలో పాకిస్తాన్, చైనా గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నాయి.
భారత్, ఇరాన్, అఫ్గాన్‌లను కలిపే చాబహార్ పోర్టును గ్వాదర్ పోర్టుకు సవాల్‌గా భావిస్తున్నారు.
అరేబియా సముద్రంలో చైనా ఉనికిని సవాల్ చేసేందుకు చాబహార్ పోర్టు భారత్‌కు ఉపయోగపడుతుంది.
గ్వాదర్ పోర్టు చాబహార్ ఓడరేవు నుంచి రోడ్డు మార్గంలో కేవలం 400 కిటోమీటర్ల దూరంలో ఉంటుంది, అదే సముద్ర మార్గంలో అయితే ఈ దూరం కేవలం 100 కిలోమీటర్లు.
భారత్ వ్యూహాత్మక, దౌత్య ప్రయోజనాలకు కూడా ఈ పోర్టు చాలా కీలకం.
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పునరాగమనం తర్వాత, మధ్య ఆసియా దేశాలతో భారత్ ప్రత్యక్ష సంబంధాలు తగ్గాయని నిపుణులు భావిస్తున్నారు.
చాబహార్ ద్వారా, అవసరమైతే భారత్ ఇప్పుడు కాబూల్ చేరుకోగలదు. అలాగే మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం కూడా పెరగొచ్చు.
నిపుణులు ఏమంటున్నారు?
అమెరికా నిర్ణయంపై వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎక్స్‌లో ఆయన ఇలా రాశారు. "ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై ఒత్తిడి మరింత పెంచింది. భారత ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన అనంతరం, భారత్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవుకు 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును ఉపసంహరించుకోవడం ద్వారా భారత్‌పై దండనాత్మక చర్య తీసుకుంది."
"ఈ పోర్టు అఫ్గానిస్తాన్, ఇంకా మధ్య ఆసియా దేశాలతో భారత్‌ను అనుసంధానించే వాణిజ్య ద్వారం. అలాగే గ్వాదర్ పోర్టు(చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు)కు వ్యూహాత్మక సవాల్ కూడా" అని ఆయన రాశారు.
"చైనా ప్రాభవాన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో భారత్ శిక్షకు గురవుతోంది."
"ట్రంప్ మొదటి పదవీకాలంలో విధించిన ఆంక్షలకు అనుగుణంగా భారత్ తన సొంత ప్రయోజనాలను పక్కనబెట్టి, ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపేసింది. ఇది చైనాకు భారీగాప్రయోజనం చేకూర్చింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇరాన్ చమురును కొనుగోలు చేసే ఏకైక దేశంగా నిలిచింది. ఇది చైనా ఇంధన భద్రతను బలోపేతం చేసింది. భారత్ మాత్రం నష్టాలను చవిచూస్తూనే ఉంది" అని బ్రహ్మ చెల్లానీ రాశారు.
"నిజానికి ట్రంప్ 'తీవ్రమైన ఒత్తిడి' విధానం కారణంగా చైనా భారీ ప్రయోజనాలను పొందుతుంటే, భారత్ మూల్యం చెల్లిస్తోంది."
చాబహార్‌పై ఆంక్షల మినహాయింపు ఉపసంహరణ ప్రకటన గురించి దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు మైకేల్ కుగల్‌మెన్ ఎక్స్‌లో ఇలా రాశారు."ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌కి సంబంధించిన మినహాయింపులను ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది. ఇది భారత్ నిర్వహిస్తున్న చాబహార్ పోర్టుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది."
"ఇది భారత్‌కు వ్యూహాత్మక ఎదురుదెబ్బ అవుతుంది. భారత్ కనెక్టివిటీ ప్రణాళికల్లో చాబహార్ కీలకం. దీని ద్వారా పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో అనుసంధానం సులభమవుతుంది."
భారత ప్రయోజనాలకు విరుద్ధమని చెబుతున్న ఈ చర్య గురించి ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు జోరావత్ దౌలత్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "ఇది నిజంగా అసాధారణ పరిస్థితి. చైనాను అదుపుచేసే పేరుతో.. శక్తిమంతంగా ఎదుగుతున్న ఒక భాగస్వామి, తన సొంత 'వ్యూహాత్మక భాగస్వామి' కారణంగా బలహీనపడిన చారిత్రక ఉదాహరణ మరోటి కనిపించదు" అని సింగ్ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)