'నా జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది', హెచ్-1బీ వీసా కొత్త నిబంధనలతో అయోమయంలో భారతీయులు

హెచ్-1బీ వీసా.. అమెరికాలోని వేలాది మంది దక్షిణాసియా నిపుణులకు చాలాకాలంగా విద్య, పరిశోధన అవకాశాలు, ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ మార్కెట్‌లో ఉద్యోగాలను పొందేందుకు ఒక మార్గంగా ఉంది.

కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా అదంత సేఫ్(సురక్షితం) కాదనిపిస్తోంది.

కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుము విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ నియమం సెప్టెంబర్ 21(నేటి) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ ప్రకటనతో హెచ్-1బీ వీసాదారులతో పాటు భారత కంపెనీల యజమానులు గందరగోళంలో పడ్డారు.

ఆదేశాలు జారీ అయిన వెంటనే, దాని పరిధి ఎంతనే విషయంపై గందరగోళం వ్యాపించింది. న్యాయవాదులు, కంపెనీ యజమానులు, వీసాదారులు అందరూ దాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.

ఈ నేపథ్యంలో, అమెరికాలో నివసిస్తున్న పలువురు హెచ్-1బీ వీసాదారులు, నిపుణుల అభిప్రాయాన్ని ఇరామ్ అబ్బాసీ బీబీసీ కోసం తెలుసుకున్నారు.

అలాగే, ప్రకటన వెలువడే సమయంలో స్వదేశానికి వచ్చిన పలువురు భారతీయులతో బీబీసీ కరస్పాండెంట్ ఇషాద్రిత లాహిరి మాట్లాడారు.

'సెప్టెంబర్ 21 గడువుకు ముందే తిరిగి రండి'

ఇరామ్ అబ్బాసి, బీబీసీ కోసం, వాషింగ్టన్ డీసీ

"ప్రకటన జాగ్రత్తగా చదివిన తర్వాత కూడా, అది ఎలా అమలవుతుందనే దానిపై స్పష్టత లేదు" అని దక్షిణాసియా బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో న్యాయవాదులు అన్నారు.

అమెరికాలో ఇప్పటికే నివసిస్తున్న హెచ్-1బీ వీసా హోల్డర్లు "ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే సరిహద్దు అధికారులకు విస్తృత అధికారాలు ఉండొచ్చు" అని వారు సూచించారు.

అమెరికా వెలుపల ఉన్నవారు వీలైతే సెప్టెంబర్ 21 గడువుకు ముందు తిరిగి రావాలని, లేదా కోర్టు ఆదేశాల కోసం వేచివుండాలని చెప్పారు.

ఇటీవల వీసా లాటరీలో ఎంపికైన వారు 'పరిస్థితిలో పూర్తి స్పష్టత వచ్చే వరకు' తమ స్టేటస్ మార్చుకోవద్దని లేదా అంతర్జాతీయంగా ప్రయాణించవద్దని కూడా సూచించారు.

ఇదే సమయంలో, వైట్‌హౌస్ కూడా ఈ ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేసింది.

'లక్ష డాలర్ల రుసుము వార్షిక ఛార్జీ కాదు. కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తించే, ఒకేసారి చెల్లించే ఫీజు' అని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఎక్స్‌ ద్వారా తెలిపారు.

"ఇప్పటికే హెచ్-1బీ వీసాలు కలిగి ఉన్నవారు, ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నవారిపై తిరిగి ప్రవేశించడానికి ప్రస్తుతానికైతే లక్ష డాలర్లు ఛార్జ్ చేయడం లేదు" అని కూడా ఆమె తెలిపారు.

వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటికి వెళ్లి, రావొచ్చని తెలిపారు. తాజా నిబంధన కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుందని, పునరుద్ధరణలకు(రెన్యూవల్స్), ప్రస్తుత వీసాదారులకు కాదని కరోలిన్ తెలిపారు.

"నూతన ఆదేశాలు తదుపరి హెచ్-1బీ లాటరీలో అమలవుతాయి" అని లెవిట్ రాశారు.

అయినప్పటికీ కంపెనీలు, ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొంది.

అనేక ప్రధాన టెక్ కంపెనీలు విదేశాలలో ఉన్న తమ హెచ్-1బీ సిబ్బందికి "కొత్త నియమాలపై స్పష్టత వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలి. బయట ఉన్నవారు తిరిగి రావాలి" అని సూచించాయని నివేదికలు చెబుతున్నాయి.

ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, "2023లో ఆమోదించిన హెచ్-1బీ వీసాలలో దాదాపు మూడు వంతులు భారతీయులకే వెళ్లాయి. చైనా చాలా వెనుక ఉంది, 11 శాతం వీసాలనే పొందింది".

2022 అక్టోబర్, 2023 సెప్టెంబర్ మధ్య జారీ చేసిన హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులకే వెళ్లాయని అమెరికా ప్రభుత్వ డేటా కూడా ధ్రువీకరిస్తోంది. అందుకే, ఈ వీసాల నిబంధనల్లో ఎలాంటి మార్పులొచ్చినా దాని ప్రభావం మొదటగా పడేది భారత నిపుణులపైనే.

'నా జీవితం తల్లకిందులైంది'

"ఈ రూల్ నా జీవితాన్ని ఒక్కసారిగా తల్లకిందులు చేసింది" అని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందిన భారతీయ పోస్ట్‌ డాక్టోరల్ ఫెలో ఒకరు బీబీసీతో అన్నారు.

తన వీసా వచ్చే ఏడాది రెన్యూవల్‌కు సిద్ధంగా ఉందని, తన విశ్వవిద్యాలయం లక్ష డాలర్ల రుసుము చెల్లించగలదా? అని ఆమె సందేహిస్తున్నారు. తనలాంటి పరిశోధకులకు విద్యా వృత్తిని కొనసాగించడానికి హెచ్-1బీ ప్రోగ్రామ్ సహాయపడుతోంది కాబట్టే, అమెరికాకు వచ్చినట్లు ఆమె చెప్పారు. కొత్త నిబంధనల వార్తలు సహోద్యోగులలో ఆందోళనను పెంచాయని, భారత దౌత్యవేత్తలు జోక్యం చేసుకోవాలనే డిమాండ్లు పెరిగాయని ఆమె అన్నారు.

పేరు చెప్పకూడదనే షరతుపై ఆమె మాట్లాడుతూ, హెచ్-1బీలో కెరీర్‌ను నిర్మించుకోవడం తనకు చాలా కష్టమని అర్థమైందన్నారు.

మొదట సోషియాలజీలో పీహెచ్‌డీ చేయడానికి విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చారామె. ఆ తర్వాత హెచ్-1బీ వీసాపై మొదటి టీచింగ్ జాబ్ సంపాదించుకున్నారు. గత నాలుగేళ్లలో ఆమె మూడు సంస్థలలో పనిచేశారు. విద్యారంగంలో జీతాలు వీసా సంబంధిత భారీ ఖర్చులను భరించడానికి సరిపోవని ఆమె అన్నారు.

హెచ్-1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న ఒక పాకిస్తానీ జాతీయుడు బీబీసీతో "నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నా" అన్నారు.

అధికారికంగా వస్తున్న అప్‌డేట్స్, చట్టపరమైన సలహాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నానని ఆయన అన్నారు. కానీ, నియమాలు ఎలా అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదన్నారు.

"అనిశ్చితి నన్ను గందరగోళంలో పడేసింది" అని ఆయన అన్నారు.

"యూఎస్‌లో ఉండటానికి దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవాలా? లేక అకస్మాత్తుగా తిరిగి ఇంటికి వెళ్లడానికి సిద్ధం కావాలో నాకు తెలియడం లేదు" అని అన్నారాయన.

నిపుణులు ఏమంటున్నారు?

"ఈ విధానాన్ని ఎలాంటి నోటీసు లేకుండా, ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా అమలు చేశారు" అని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ పాలసీ డైరెక్టర్ జార్జ్ లోవరీ బీబీసీకి తెలిపారు.

"వీసా హోల్డర్లు, వారి కుటుంబాలలో మాత్రమే కాకుండా, ఎలా పాటించాలో తెలియక కంపెనీ యజమానులు విశ్వవిద్యాలయాలలో కూడా మేం గందరగోళాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా జీవితాలు, కెరీర్లు ప్రమాదంలో ఉన్నప్పుడు, నియమాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది" అని అన్నారు లోవరీ.

ఈ ఉత్తర్వు కఠినమైనదని, అస్పష్టంగా ఉందని అమెరికాలో ఉన్న అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది గుంజన్ సింగ్ బీబీసీతో చెప్పారు.

హెచ్-1బీ ఉద్యోగాల కోసం క్యూలో ఉన్న నిపుణులు, విద్యార్థులలో ఇది ఇప్పటికే భయాందోళనలను సృష్టించింది.

"లక్ష డాలర్ల రుసుము పరిశోధకులు, లాభాపేక్షలేని సంస్థలలో పనిచేసే వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వారి జీతాలు కార్పొరేట్ టెక్ రంగంలో ఉన్నవారి కంటే చాలా తక్కువగా ఉంటాయి" అని ఆయన అన్నారు.

' ఏళ్లుగా అమెరికా కోసం పనిచేశాను'

ఇషాద్రిత లాహిరి, దిల్లీలో బీబీసీ ప్రతినిధి

సెప్టెంబర్ 20న, ట్రంప్ హెచ్-1బీ వీసాలపై ప్రకటన చేసిన తర్వాత, రోహన్ మెహతా (పేరు మార్చాం) కేవలం 8 గంటల్లోనే రూ.7 లక్షలకు పైగా ఖర్చు చేశారు.

ఆయన నాగ్‌పూర్ నుంచి అమెరికాకు విమానాలను నిరంతరం బుక్ చేస్తూ, రీబుకింగ్ చేస్తూ ఉన్నారు.

"చాలా విమానాలు కటాఫ్‌ సమయానికి దగ్గరగా ఉన్నందున ఎక్కువ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాను. కొంచెం ఆలస్యం అయినా, నేను గడువును కోల్పోయేవాడిని" అని మెహతా చెప్పారు.

సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన మెహతా, గత 11 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఆయన తన తండ్రి వర్ధంతి కోసం నాగ్‌పూర్‌కు వచ్చారు.

"నా భార్య, కూతురు నాతో రాలేదని సంతోషంగా ఉన్నాను. ఇదో పెద్ద భయానక అనుభవం. నా జీవితంలో తీసుకున్న నిర్ణయాలకు చింతిస్తున్నా. నా యవ్వనంలో అత్యుత్తమ భాగాన్ని ఆ దేశం(యూఎస్) కోసం వెచ్చించాను. ఇప్పుడు నేను అక్కడ అవసరం లేదనిపిస్తోంది" అని అన్నారాయన.

"నా కూతురు జీవితం అంతా అమెరికాలోనే గడిపింది. అక్కడి నుంచి నన్ను నేను వేరు చేసుకుని, భారతదేశానికి వచ్చి మళ్లీ ప్రతిదీ ఎలా ప్రారంభించాలో నాకర్థం కావడం లేదు" అని ఆయన అన్నారు.

దశాబ్దాలుగా అమెరికాలో పనిచేస్తున్న అనేకమంది హెచ్-1బీ వీసాదారులతో బీబీసీ మాట్లాడింది. వారి కంపెనీల యజమానులు అనుమతి ఇవ్వకపోవడంతో వారిలో ఎవరూ తమ పేర్లను ప్రచురించడానికి అంగీకరించలేదు. మరోవైపు, "నిఘా" కారణంగా చాలామంది మాతో మాట్లాడటానికి నిరాకరించారు.

మేం మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఈ ఆర్డర్ గురించి ఆందోళన చెందుతున్నట్లు అనిపించింది.

ట్రంప్ ప్రభుత్వం ఏం చెబుతోంది?

అమెరికన్ వర్కర్లను రక్షించడం, వీసా వ్యవస్థ దుర్వినియోగం కాకుండా నిరోధించడం, అత్యంత నైపుణ్యం కలిగిన, అత్యధిక జీతం పొందే విదేశీ నిపుణులు మాత్రమే అర్హులని నిర్ధరించుకోవడం అవసరమని చెబుతూ ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యను సమర్థించింది.

రాయిటర్స్ ప్రకారం, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ "మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే, మన దేశంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ఇటీవల గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వండి. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. విదేశాల నుంచి తీసుకొచ్చి, మన ఉద్యోగాలను ఇవ్వడం ఆపండి" అని అన్నారు.

జాతీయ భద్రతపై కూడా వైట్‌హౌస్ ఆందోళన వ్యక్తం చేస్తూ, సున్నితమైన పరిశ్రమలలో విదేశీ వర్కర్లపై అధికంగా ఆధారపడటం అమెరికా సామర్థ్యాలను బలహీనపరుస్తుందని అభిప్రాయపడింది.

హెచ్1-బీ వీసాకు సంబంధించి అమెరికా తీసుకున్న కొత్త నిర్ణయంపై భారత్ కూడా స్పందించింది. తదనంతర పరిణామాలను సంబంధిత భారత సంస్థలతో పాటు భాగస్వామ్య పక్షాలన్నీ అధ్యయనం చేస్తున్నాయని, ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా కొన్ని ఊహాగానాలపై ఇప్పటికే స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయని పేర్కొంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల శాఖ అభిప్రాయపడింది. ఈ ఇబ్బందులను అమెరికా గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)