You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'చావుపుట్టుకలు పడవలోనే, మాకు రెండో ప్రపంచం లేదు'.. శబరి నదిలో 11 కుటుంబాల జీవన ప్రయాణం
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆ నదిపై ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఇళ్లు తేలుతూ కనిపిస్తాయి. అయితే ఆ ఇళ్లకు గోడలుండవు. తలుపులూ ఉండవు. అడ్రస్సే ఉండదు.
కానీ అక్కడ జీవితాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా చింతూరులో శబరి నదిపై తేలుతున్న పడవలే వీరి ఇల్లు. పుట్టుక నుంచి చావు వరకు ఈ కుటుంబాల జీవితం పడవల్లోనే సాగిపోతోంది.
నది, ఇసుక దిబ్బలు, పడవలు...ఇవి తప్ప రెండో ప్రపంచమే తెలియని కొన్ని కుటుంబాలు చింతూరు వద్ద శబరి నదిపై జీవిస్తున్నాయి.
వీరు దశాబ్దాల కిందట బతుకుతెరువు కోసం వందల కిలోమీటర్లు నదిలోనే ప్రయాణం చేసి చింతూరులోని శబరి నది ఒడ్డుకు చేరుకున్నారు.
ఇది ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతం దాటిన తర్వాత వచ్చే చింతూరులోని వంతెన కింద పడవలనే ఇళ్ళుగా మార్చుకుని జీవిస్తున్న 11 మత్స్యకార కుటుంబాల కథ.
పడవలపై జీవితం
పడవలపై జీవిస్తున్న వీరి పరిస్థితులు తెలుసుకునేందుకు బీబీసీ బృందం చింతూరు చేరుకుంది.
శబరి నదిపై ఉన్న వంతెనపై నుంచి చూస్తే, ఇసుక దిబ్బల వద్ద కొన్ని పడవలు కనిపించాయి. పడవల మధ్య నుంచి పొగ పైకి వస్తోంది. బాగా చలి ఉంది.
సమయం ఉదయం 5.45 గంటలు.
పడవల వద్దకు చేరుకున్నప్పుడు.. ఒక పడవపై ఉన్న కోడి తెల్లారిందంటూ కూస్తోంది. ఒక్కో పడవ ఇల్లు మెల్లగా మేల్కొంటోంది. కొద్దిసేపటికి మత్స్యకారులు లేచి టీ కోసం పొయ్యి వెలిగించారు. చలితో వణుకుతున్న మమ్మల్ని చూసి టీ తాగుతారా అని అడిగారు.
సింహాద్రి, వెంకటేశ్వరరావు దంపతులు, వారి ఇద్దరు పిల్లలు నివసిస్తున్న 'హరమ్మతల్లి' అనే పడవ ఇంటికి మేం వెళ్లాం. పక్కనే ఉన్న ఇతర పడవల్లో కూడా కుటుంబాలు ఒక్కొక్కటిగా నిద్ర లేచి దినచర్య మొదలుపెట్టాయి.
పడవ ఇళ్లు ఎలా ఉన్నాయంటే...
పడవపై ఉన్న తులసి మొక్కపై సూర్యకాంతి పడుతోంది. దుప్పట్లు మడతపెట్టి, కట్టెల పొయ్యి వెలిగించేందుకు వెంకటేశ్వరరావు తన భార్య సింహాద్రికి కర్రలు అందించారు.
పడవ లోపల మధ్యభాగాన్ని టార్పాలిన్లతో గూడులా చేసుకున్నారు. ఆ గూడు కింద అరలు, బీరువాలు, బియ్యపు పెట్టెలు ఉన్నాయి. పైభాగంలో అలంకరణ సామగ్రి, కింద నూనెలు, కూరగాయలు, ఇంటికి కావాల్సిన సరంజామా అంతా అక్కడే అమర్చుకున్నారు.
ఒడ్డున ఉన్న ఇసుకపై పిల్లలు ఆడుకుంటుంటే.. మహిళలు, పురుషులు పడవల్లోనే వంట పనుల్లో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ కనిపించారు. కొన్ని పడవలు సరకులు తెచ్చేందుకు మరో ఒడ్డుకు బయలుదేరాయి. చలి ఎక్కువగా ఉండటంతో కొంతమంది పిల్లలు మాత్రం గూడులోనే నిద్రపోతున్నారు.
ప్రతి పడవపై హరమ్మ, పోలమ్మ వంటి పేర్లు కనిపించాయి. ఆ పేర్లే ఆ పడవ ఇళ్ల చిరునామా. అడ్రస్, గోడలు లేని ఇళ్లు అయినా...ఇక్కడ కొన్ని కుటుంబాల పూర్తి ప్రపంచం ఈ పడవలే.
'ఎక్కడ పుట్టినా...పడవలోకి చేరాల్సిందే'
సింహాద్రి తల్లిదండ్రుల స్వస్థలం ధవళేశ్వరం.
గోదావరి ఒడ్డే. కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు ఆమె తల్లిదండ్రులు.
సింహాద్రి చింతూరులోనే పుట్టారు. చింతూరులోని శబరినదిపై పడవపైనే జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం సింహాద్రికి 45 ఏళ్లు.
"అమ్మనాన్న కూడా ఈ పడవలోనే ప్రయాణం చేశారు. ఈ పడవనే మాకు అప్పచెప్పారు. మేం కూడా ఇదే జీవితం కొనసాగిస్తున్నాం" అని ఆమె చెప్పారు.
"మా అమ్మను ప్రసవానికి ఈ పడవ మీదే చింతూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లారట. ప్రసవం ఆసుపత్రిలో జరిగినా...తర్వాత మళ్లీ నన్ను ఇదే పడవ మీద తీసుకొచ్చారు. ఇక్కడే పెరిగాను" అని చెప్పారు సింహాద్రి.
"నా పిల్లలూ ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరుగుతున్నారు" అని సింహాద్రి అన్నారు.
సింహాద్రి మాటల్లో మాకు వేరే దారి లేదు, బతుకు తెరువు కోసం ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో జీవిస్తున్నాం అనే భావన కనిపించింది.
చదువు కోసం నదిని దాటి
ప్రస్తుతం ఈ పడవల్లో పుట్టిన పిల్లల్లో తొమ్మిది మంది ఇక్కడే పెరుగుతున్నారు. మరో ఇద్దరు ధవళేశ్వరంలో చదువుకుంటున్నారు. పిల్లలు పడవెక్కి మరో ఒడ్డుకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.
పిల్లలు బడికి వెళ్లగానే తల్లిదండ్రులు వేటకు వెళ్తారు. దొరికిన చేపలను వెంటనే అమ్మేస్తారు. మధ్యలో పడవలపైనే వంట చేసుకుని తింటారు. సాయంత్రం పిల్లల రాక కోసం ఎదురుచూస్తారు. ప్రతి దశలోనూ పడవ తప్ప మరో ప్రపంచం లేదు.
"మా పిల్లలు మాలాగా ఉండకూడదు. నా జీవితం పోయినా సరే వాళ్ల చదువు ఆపను" అని సింహాద్రి అంటారు.
"మా పెద్దోళ్లు మాకు పడవలు అప్పగించారు. మేం మాత్రం వాళ్లకి నది మీద జీవితం కాకుండా మంచి జీవితాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాం" అని మత్స్యకారుడు మహేష్ చెప్పారు.
ప్రస్తుతం ఈ 11 కుటుంబాల జీవితాలు శబరి నదిపైనే ఉన్నా...పిల్లల భవిష్యత్తు మాత్రం నది ఒడ్డుకు చేరాలని వీరి ఆలోచనలు సాగుతున్నాయి.
పడవే ఆలయం, ఆస్తి
ఈ మత్స్యకారులు పడవలను ఆలయంగా భావిస్తారు.
"పడవలకు దేవుళ్ల పేర్లు పెడతాం. చెప్పులతో ఎక్కం" అంటారు మహేష్.
50 ఏళ్ల వెంకటేశ్వరరావుకు మూడు పడవలున్నాయి. "ఒకటి ఇల్లు, ఒకటి వేటకు, ఇంకొకటి వేట పడవ పాడైతే వాడేందుకు. ఒక్కో పడవకు లక్ష రూపాయలు ఖర్చవుతుంది. ఇదే మా ఆస్తి, ఇదే మా వారసత్వం" అంటారాయన.
"ఇదే మా ఆస్తి. ఇది మా వారసత్వం కూడా. ఇంతకు మించి 40 ఏళ్లుగా వేట కొనసాగిస్తున్నా ఏం సంపాదించలేదు" అని అన్నారు.
'అలవాటే కానీ...భయం కూడా...'
బతుకు తెరువు కోసం ధవళేశ్వరం నుంచి వచ్చి జీవితాలు గడుపుతున్నామని చెప్పిన మత్స్యకారుడు మహేష్ మాటల్లో ప్రతి రోజు తాము ఎదుర్కొనే సమస్యలపై భయం కనిపించింది.
"మాకు ఈ వేట రాత్రి, పగలూ అలవాటే, కానీ భయం కూడా ఉంది. రాత్రి ఏదైనా అవసరం అయితే అప్పటికప్పుడు బోట్లు కట్టుకుని అవతలి ఒడ్డునున్న వైద్యుల వద్దకు వెళ్తాం. బాగా ఆపద వస్తే దేవునిపైనే భారమేస్తాం" అని మహేష్ బీబీసీకి చెప్పారు.
"పగలు వేట బాగానే సాగిపోద్ది, కానీ చీకటి పడితే పడవల్లో ఉన్న ఆడోళ్లు, పిల్లలు భయపడుతుంటారు. ఎందుకంటే దూరంగా నక్కల అరుపులు వినిపిస్తుంటాయి, కీచుకీచు శబ్దాలు వస్తూనే ఉంటాయి. దీంతో వాళ్లు మేం వచ్చే దాకా బితుకుబితుకుమంటూ భయంతో ఉంటారు. కొన్నిసార్లు వేటకోసం వారాల తరబడి ఒక్కో కుటుంబం ఒక్కో చోట ఉంటాం" అని చెప్పారు మహేష్.
మరి సొంతూరు ఎందుకు వెళ్లడం లేదంటే....
సొంతూరుకు 130 కిలోమీటర్లు దూరంగా జీవిస్తున్న ఈ 11 కుటుంబాలు నెల, రెండు నెలకోసారి ధవలేశ్వరం వెళ్తారు. ఒకసారి చింతూరు నుంచి ధవళేశ్వరం వెళ్లిరావాలంటే వెయ్యి రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారు.
"కేవలం రేషన్ తెచ్చుకోవడం కోసమే దాదాపు రూ. 1000 ఖర్చు చేసి...ధవళేశ్వరం వెళ్లి వస్తుంటాం. రేషన్ ద్వారా వచ్చే సరకులతో పోల్చుకుంటే...ప్రయాణ ఖర్చులే ఎక్కువ. కానీ రేషన్ కార్డుని బతికించుకోవడం కోసమే పోయొస్తుంటాం" అని దుర్గమ్మ చెప్పారు.
"ఎందుకంటే రేషన్ కార్డే మా గుర్తింపు. దానిని రద్దు కాకుండా చూసుకోవడానికే ధవళేశ్వరం వెళ్తుంటాం" అని మరో మత్స్యకారుడు బుజ్జిబాబు బీబీసీతో చెప్పారు.
అంటే గవర్నమెంట్ లెక్కల్లో ఉన్నామని అనిపించుకునేందుకు....నీటి మీద జీవించే ఈ కుటుంబాలు నెలకోమారు నీటిని దాటి ప్రయాణిం చేస్తుంటాయి.
"కానీ ఫంక్షన్లు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లకి ధవలేశ్వం నుంచి చుట్టాలు, స్నేహితులు వస్తుంటారు. శుభకార్యాలన్నీ శబరి నది ఇసుక దిబ్బలపైనే చేస్తాం. స్థానికులను కూడా పిలుస్తాం" అని దుర్గమ్మ చెప్పారు.
చేపలు చిక్కడం లేదు...
"ప్రతిసారి వేటలో చేపలు దొరకుతాయనే నమ్మకం ఉండదు. కొన్నిసార్లు విసిరిన ఖాళీ వలే మళ్లీ చేతికి వస్తుంది" అని మత్స్యకారుడు బుజ్జిబాబు చెప్పారు.
కొన్నిసార్లు కూరకి సరిపోయే చేపలు కూడా దొరకవు. ఒక ట్రిప్‌కి డీజీల్‌కే కనీసం రూ. 700 నుంచి రూ. 800 ఖర్చు పెట్టాలి. అలాంటప్పుడు నష్టపోతామని బుజ్జిబాబు చప్పారు .
"కొన్నిసార్లు చేపలు పడితే వాటిని ఫోటోలు తీసి వాట్సప్‌లో పెడతాం. మేం ఒడ్డుకి వచ్చేసరికి కస్టమర్లు సిద్దంగా ఉంటారు. పెద్దగా బేరాలు చెప్పం. ఎందుకంటే మేం లోకలోళ్ల నుంచి సాయం పొందుతాం, వాళ్లతో స్నేహాలు ఉంటాయి. మా బ్యాటరీ లైట్లు, సెల్ ఫోన్లకు ఛార్జింగ్ కోసం వాళ్లిళ్లకే వెళ్తుంటాం" అని అన్నారు మహేష్.
బాగా ఎక్కువ చేపలు దొరికినప్పుడు ఒడ్డుకొచ్చాక అమ్మగా మిగిలినవి చింతూరు మార్కెట్‌కి తీసుకెళ్లి అమ్మతాం, ఇదే తమ రోజు వారి వ్యాపారం సాగే తీరని అని ఆయన చెప్పారు.
ఆశలు తీరుతాయా...
కాలక్రమంలో తెడ్డు పడవల నుంచి ఇంజన్ బోట్ల వరకు వచ్చారు.
కరెంట్, కేబుల్ లేకపోయినా మొబైల్ ఫోన్లు ఉన్నాయి. పడవలపై జీవితం కష్టమైనదే అయినా, పిల్లలకు మెరుగైన రేపటి కోసం వీరి ప్రయత్నం.
నీటిమీద తేలుతూ, తరాలుగా తమ జీవనాన్ని నెట్టుకొస్తున్న ఈ కుటుంబాల కథ…శబరి నది ప్రవాహంలాగే కొనసాగుతూనే ఉంది.
భావి తరాల భవిష్యతైనా పడవలో ముగియకూడదని వీరి ఆశ.
ప్రస్తుతానికైతే వీరి ఆశలు, వీరి జీవితాలు నీటిపైనే తేలుతున్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)