పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం గుండెజబ్బులకు దారితీస్తుందా? - అధ్యయనం

    • రచయిత, నందిని వెల్లస్వామి
    • హోదా, బీబీసీ తమిళ్

మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్లు, అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ (ఏఎస్‌సీవీడీ) మధ్య సంబంధంపై ఒక ప్రధాన అధ్యయనం గతేడాది డిసెంబర్‌లో, జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురితమైంది.

ఈ అధ్యయనం 27 లక్షల మందికి పైగా మహిళలపై నిర్వహించారు. ఇందులో అటువంటి కణితులు ఉన్న 45 లక్షల మంది మహిళలు, కణితులులేని 22.5 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరి సగటు వయస్సు 41 ఏళ్లు.

పదేళ్లపాటు అనేక కేంద్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం, గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఉన్న మహిళలకు, అవి లేని మహిళలతో పోలిస్తే ఏఎస్‌సీవీడీ గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఈ ప్రమాదం కరోనరీ ఆర్టెరీ డిసీజ్, సెరెబ్రోవాస్క్యులర్ డిసీజ్, పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్ వంటి అన్ని ప్రధాన గుండె సమస్యలకూ వర్తిస్తుందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.

ఈ ప్రమాదం అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి వర్తిస్తుందని కూడా అధ్యయనం పేర్కొంది.

గుండె జబ్బుల ప్రమాదం ఉన్న మహిళలకు గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఒక ముఖ్యమైన ముందస్తు హెచ్చరిక అని ఈ అధ్యయనం సూచిస్తోంది.

గర్భాశయ ఫైబ్రాయిడ్లు అంటే ఏంటి? వాటికీ గుండె జబ్బులకు సంబంధమేంటి? అనే విషయాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

గర్భాశయ ఫైబ్రాయిడ్లు అంటే ఏంటి?

గర్భాశయంలోని కండరాల కణజాలం నుంచి పెరిగే కణితులను గర్భాశయ ఫైబ్రాయిడ్లు అంటారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఈ కణితులు కనిపిస్తుంటాయని ప్రసూతి వైద్యులు శాంతి రవీంద్రనాథ్ చెబుతున్నారు.

"ఏదైనా పరీక్షల కోసం వెళ్లినప్పుడు మాత్రమే ఈ కణితులు ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. ఈ కణితి ప్రమాదకరమని కాదు కానీ, ఈ సమస్య ఇప్పుడు ఎక్కువ మంది మహిళల్లో కనిపిస్తోంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే రెండు హార్మోన్లు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి" అని ఆమె వివరించారు.

ఇవి ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉందని, అయితే ఇది 40 ఏళ్లలోపు వారిలో, అంటే మెనోపాజ్, పెరిమెనోపాజ్ సమయంలో ఎక్కువగా కనిపిస్తుందని ఆమె అన్నారు.

"మీకు మెనోపాజ్‌కు ముందు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ మెనోపాజ్ తరువాత లక్షణాలు కనిపించవచ్చు."

గర్భాశయ ఫైబ్రాయిడ్లు, గుండె జబ్బుల మధ్య సంబంధమేంటి?

"ఈ కణితులు ఇన్‌ఫ్లమేషన్ కలిగించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలు గుండె జబ్బులకు కూడా కారణమవుతాయి" అని డాక్టర్ శాంతి రవీంద్రనాథ్ వివరించారు.

"ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ విడుదలవుతున్నంత కాలం, అది గుండె జబ్బులను నివారిస్తుంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం మొదలవుతుంది. మెనోపాజ్‌కి చేరుకున్న స్త్రీలందరికీ గుండె జబ్బులు రావు, కానీ మెనోపాజ్‌కి చేరుకున్న వారిలో ఇటీవల గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి" అని డాక్టర్ శాంతి తెలిపారు.

కార్డియాలజీ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన కె.ఎస్. గణేశన్ మాట్లాడుతూ, "సాధారణంగా, మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గర్భాశయం ఉన్న, లేని మహిళలకు కూడా వర్తిస్తుంది" అని ఆయన చెప్పారు.

సాధారణ లక్షణాలు :

  • పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం.
  • పీరియడ్స్ సమయంలో అధిక నొప్పి.
  • సంతానలేమి.
  • తరచుగా మూత్రవిసర్జన.

ఏ వయసు వారిలో వస్తాయి?

ఈ కణితులకు కారణమేమిటో చెప్పడం కష్టమని డాక్టర్ శాంతి రవీంద్రనాథ్ అంటున్నారు. అయితే, అవి అభివృద్ధి చెందే ప్రమాదం ఉన్నవారెవరో ఆమె చెప్పారు.

  • ఊబకాయం ఉన్నవారు.
  • చాలా చిన్న వయస్సులోనే గర్భస్రావం అయినవారు.
  • చాలా ఆలస్యంగా మెనోపాజ్‌కు చేరుకునే వారు.

"గర్భధారణ సమయంలో ఈ కణితి పెద్దది అవుతుంది. ప్రసవం తర్వాత మళ్లీ చిన్నదిగా మారుతుంది. ఇది మెనోపాజ్ సమయంలో కూడా చిన్నదిగా మారుతుంది" అని ఆమె వివరించారు.

ఎలా నివారించాలి?

ఇందులో ఊబకాయం ప్రధానపాత్ర పోషిస్తుందని చెప్పిన డాక్టర్ శాంతి రవీంద్రనాథ్, అది తగ్గించుకోవడానికి ఏం చేయాలో వివరించారు.

  • ఎత్తుకు తగిన శరీర బరువు ఉండాలి.
  • ధూమపానం వదిలేయాలి.
  • ఒత్తిడిని తగ్గించుకోవాలి.
  • ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి.
  • తగినంత నిద్రపోవాలి.
  • గర్భాశయంలో కణితి స్థానం, పరిధిని గుర్తించడానికి, తగిన చికిత్స పొందడానికి అల్ట్రాసౌండ్‌తో సహా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి.

"దేశవ్యాప్తంగా మహిళల్లో ఊబకాయం పెరిగింది. అందుకే, భారత దేశంలో గర్భాశయ ఫైబ్రాయిడ్లు, గుండె వ్యాధుల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది" అని డాక్టర్ శాంతి రవీంద్రనాథ్ అంటున్నారు.

2025లో ప్రచురించిన లాన్సెట్ అధ్యయనం ప్రకారం, 2050 నాటికి దేశంలో దాదాపు 45 కోట్ల మంది భారతీయులు ఊబకాయం బారిన పడే అవకాశముందని అంచనా.

మహిళల్లో గుండె జబ్బులను నివారించడం ఎలా?

"ఇటీవల, గుండె జబ్బులతో బాధపడుతున్న మహిళల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. మహిళల్లో గుండె జబ్బుల లక్షణాలు, చికిత్సలో తేడాలు ఉన్నాయి. ఇది విస్తృతమైన పరిశోధన అవసరమున్న ఒక ప్రత్యేకమైన విభాగం" అని రిటైర్డ్ కార్డియాలజీ ప్రొఫెసర్ కె.ఎస్.గణేశన్ అన్నారు.

పెరిమెనోపాజ్ సమయంలో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని, చాలా మంది మహిళలకు ఎటువంటి లక్షణాలు లేకుండానే గుండె జబ్బులు వస్తాయని ఆయన అన్నారు.

మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన అంటున్నారు.

"మహిళల్లో రక్తనాళాలు పురుషుల కంటే చిన్నవిగా ఉంటాయి, కాబట్టి హైపర్‌కోయాగ్యులేషన్ (రక్తం ఎక్కువగా గడ్డ కట్టడం) ఉంటే వెంటనే గుండెపోటు వచ్చే ప్రమాదముంది" అని ఆయన హెచ్చరించారు.

40 ఏళ్లు పైబడిన మహిళలు చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షలను ఆయన సూచించారు.

  • హార్మోన్ పరీక్ష
  • లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష
  • జెనెటిక్ స్టడీ
  • కోయాగ్యులేషన్ ప్రొఫైల్ పరీక్ష
  • హోమోసిస్టీన్ పరీక్ష

ఈ పరీక్షల్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లు తెలిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

సాధారణంగా, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్న మహిళలు జీవితాంతం కొన్ని మాత్రలు వేసుకోవాలని సలహా ఇస్తారని డాక్టర్ కె.ఎస్. గణేశన్ అంటున్నారు. అలాగే మహిళలు రోజూ గంటసేపు నడవడం అలవాటు చేసుకోవాలని కూడా ఆయన సూచిస్తున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)