You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రొమ్ము క్యాన్సర్: వ్యాక్సీన్ ఇంకెంత దూరంలో ఉంది, అది మహిళలకు కొత్త జీవితాన్ని అందించగలదా?
- రచయిత, ఏంజెలా హెన్షాల్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
‘‘మేమిప్పుడు దాదాపు చివరి దశకు చేరుకున్నాం" అని ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వ్యాధి నిపుణులు) డాక్టర్ నోరా డీసిస్ అన్నారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో సంచలనంగా నిలవబోయే బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాక్సీన్‌ను డెవలప్ చేసే ప్రయత్నాల్లో ఆమె ఇప్పుడు కీలక దశలో ఉన్నారు.
రానున్న దశాబ్ద కాలంలో… ప్రామాణిక క్యాన్సర్ చికిత్సలో వ్యాక్సీన్లు భాగంగా మారుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని మెడిసిన్ క్యాన్సర్ వ్యాక్సీన్ ఇన్‌స్టిట్యూట్‌కు నోరా డీసిస్ నేతృత్వం వహిస్తున్నారు.
చాలా దేశాల్లో క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్న మహిళల మరణాల్లో ఎక్కువమంది రొమ్ము క్యాన్సర్ సోకినవారే ఉంటున్నారు.
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్‌సీ) ప్రకారం…ప్రస్తుతం ప్రతి 20 మంది మహిళల్లో ఒకరు వారి జీవితకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు.
అయితే... ఇప్పుడు ఒక ఆశ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విధానాలను అనుసరించి, 50కి పైగా యాక్టివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాక్సీన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది. ఇందులో ఐదు టీకాలు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయని చెప్పింది.
గత 18 నెలల కాలంలో టీకా అభివృద్ధి ప్రక్రియలో భారీ పురోగతి కనిపించింది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను వ్యాధులతో పోరాడేలా చేసే ఇమ్యూనోథెరపీలో వచ్చిన పురోగతి కారణంగా ఇది సాధ్యమైందని తెలుస్తోంది.
దాంతోపాటు, క్యాన్సర్ రోగుల్లోని వేలాది డేటాసెట్స్‌ను విశ్లేషించే కృత్రిమ మేధ (ఏఐ) కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
"మీ ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది"
వాస్తవిక ప్రపంచంలో ఈ వ్యాక్సీన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పడానికి నటి విక్టోరియా ఎకానోయె ఉదంతం నిదర్శనంగా ఉంది.
ఆమె 30వ ఏట డక్టల్ కార్సినోమా ఇన్ సిటు(డీసీఐఎస్) వ్యాధి బారినపడ్డారు. డీసీఐఎస్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్‌లో తొలి దశ. రొమ్ములోని పాలవాహికలకు ఇది సోకుతుంది.
"మీ వర్క్‌లైఫ్, సోషల్ లైఫ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్...అందరి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీ ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది" అని ఆమె అన్నారు.
"మనం వ్యాక్సీన్‌తో దాన్ని అడ్డుకోగలిగితే ఇది నిజంగా అద్భుతమే" అన్నారామె.
విక్టోరియా ఎకానోయెకు సికిల్ సెల్ వ్యాధి కూడా ఉన్నందున ఆమె చికిత్స క్లిష్టంగా మారింది. తన సర్జరీల సమయంలో అనేకసార్లు ఆమె రక్తమార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది.
అయితే.. ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే కనిపెట్టి, చికిత్స తీసుకోవడం వల్ల సదరు నటి దీని నుంచి కోలుగలిగారు.
క్యాన్సర్ వ్యాక్సీన్లు ఎలా పని చేస్తాయి?
దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు వ్యాక్సీన్లను అభివృద్ధి చేసి, చికిత్సతో క్యాన్సర్ నుంచి రోగులను రక్షించాలని ప్రయత్నించారు. అయితే.. దీంట్లో చాలా తక్కువసార్లు మాత్రమే విజయవంతమయ్యారు.
మీజిల్స్, మెనింజైటిస్ వంటి వ్యాధుల్లో వాటి వ్యాప్తికి కారణమయ్యే వైరస్ లేదా బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పించేలా శరీరంలో రక్షణ కవచాన్ని అభివృద్ధి చేయడంలో వ్యాక్సీన్లు సాయపడ్డాయి.
అయితే.. క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ.
ఎందుకంటే క్యాన్సర్ శరీరంలోని కణాల నుంచే ఉద్భవిస్తుంది. అంటే చాలా క్యాన్సర్ టీకాలు కస్టమ్- బిల్ట్ లా(ప్రతి వ్యక్తికి వేర్వేరుగా) ఉంటాయి.
వాటిలోని "ఇంగ్రీడియెంట్స్" ప్రతి రోగికి వారి కణితికి చెందిన ప్రత్యేకమైన జన్యు సంతకానికి(జెనెటిక్ సిగ్నేచర్) అనుగుణంగా మార్పుకు లోనవుతాయి.
ఆ క్యాన్సర్ కణాలపై మాత్రమే కనిపించే మార్కర్లు లేదా యాంటిజెన్‌లపై దాడి చేసే ప్రోటీన్లు లేదా యాంటీబాడీలను తయారు చేయాలని ఈ వ్యాక్సీన్లు శరీరానికి నిర్దేశిస్తాయి.
జరుగుతున్న అధ్యయనాలు ఏంటి?
ఈ టీకాలను కనుగొనడంలో కొంత పని డాక్టర్ నోరా డీసిస్ ఆధ్వర్యంలో జరుగుతోంది. అనేక ప్రధాన వ్యాక్సీన్లను ఉత్పత్తి చేస్తున్న యూఎస్ కన్సార్షియం ‘క్యాన్సర్ వ్యాక్సీన్ కోయిలిషన్’ సంస్థతో కలిసి ఆమె పని చేస్తున్నారు.
యూడబ్ల్యూకు చెందిన వోక్ వాక్ (డబ్ల్యూఓకేవీఓసీ) టీకా పరీక్షలు సహా ఇతర ప్రాజెక్టులపై డాక్టర్ డీసిస్ పని చేస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు వేగంగా పెరగడానికి కారణమయ్యే హెచ్ఈఆర్ 2 ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని వోక్ వాక్ టీకా పని చేస్తుంది.
ఈ ట్రయల్స్‌లో భాగంగా.. హెచ్ఈఆర్2 పాజిటివ్‌గా తేలిన బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు కీమో థెరపీతో సహా ఇతర థెరపీలను కొనసాగిస్తూనే ఈ టీకాను అందిస్తున్నారు.
మూడింట ఒకవంతు డయాగ్నోసిస్‌లో…వారు కణితులను తొలగించడానికి చికిత్స చేయించుకునే ముందు ఈ టీకాను అందిస్తున్నారు.
"ఎట్టకేలకు.. సమీప భవిష్యత్తులో క్లినికల్ వినియోగం కోసం ఈ క్యాన్సర్ టీకాలు అనుమతి పొందే చివరి దశకి మేం చేరుకున్నాం" అని డాక్టర్ డీసిస్ చెప్పారు.
ఓహాయోలోని బయోటెక్ సంస్థ ఆనిక్సా బయోసైన్సెస్, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అభివృద్ధి చేసిన టీకాకు సంబంధించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ఈ ఆగస్టులో పూర్తయ్యాయి.
ఈ పెప్టైడ్ ఆధారిత వ్యాక్సీన్.. ఆల్ఫా లాక్టాల్బుమిన్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది.
ఇది అత్యంత ప్రాణాంతకమైన రూపాలలో ఒకటైన దూకుడుగా ఉండే ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ (టీఎన్‌బీసీ)తో ముడిపడి ఉండే తల్లి పాల ప్రొటీన్.
"మేం రొమ్ము క్యాన్సర్ కణాలకు ప్రత్యేకమైన ఒక ప్రొటీన్‌ను ప్రవేశపెడుతున్నాం. ఆ కణాలపై దాడి చేసేలా..శరీరానికి శిక్షణనిస్తున్నాం" అని అనిక్సా సంస్థకు చెందిన డాక్టర్ అనిల్ కుమార్ వివరించారు.
ఈ వ్యాక్సీన్ రోగిలోని ట్యూమర్‌ను తగ్గించగలదా లేదా అనేది నిర్ధరించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. సర్జరీ తక్కువ మోతాదులో చేయాల్సి ఉంటుందా లేక సర్జరీ అవసరమే ఉండదా, అలాగే కణతులు తిరగబెడతాయా వంటివి తెలుకోనున్నారు.
టీఎన్‌బీసీ నుంచి కోలుకున్న వారిపై అలాగే బయాప్సీలలో క్యాన్సర్ ముందుదశగా ఉండే… మ్యుటేషన్లు ఉన్నట్లు తేలిన స్త్రీలపై ఈ వ్యాక్సీన్లను పరీక్షిస్తున్నారు.
ఈ ట్రయల్స్ లో 70శాతం కంటే ఎక్కువ మంది మహిళలలోని రోగ నిరోధక వ్యవస్థ, రొమ్ము క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తున్నట్లు తేలింది.
2026 ప్రారంభంలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్
అతి తక్కువ సైడ్-ఎఫెక్ట్స్ తో ఈ వ్యాక్సీన్ బాగా పని చేస్తున్నట్లు ఈ ముందుస్తు ఫలితాలు సూచిస్తున్నాయని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ జీ థామస్ బడ్ తెలిపారు.
2026 ప్రారంభంలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు. ఇందులో ప్లాసిబో గ్రూప్‌ను(టీకాను తీసుకోనివారు) కూడా భాగస్వామ్యం చేయనున్నారు. తద్వారా ఈ టీకాల ప్రభావాలను శాస్త్రవేత్తలను అంచనా వేయనున్నారు.
"క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి", ఇప్పటికే క్యాన్సర్ లేని మహిళలకు అలాగే కొంతమంది పురుషులకు ఏదో ఒక రోజు ఈ వ్యాక్సీన్‌ను అందించగలమని ఆశిస్తున్నట్లు డాక్టర్ కుమార్ చెప్పారు.
ఆ తర్వాత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందులో… అనేక ఆస్పత్రుల్లోని వందల నుంచి వేలాది రోగులపై భారీ స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. దాని ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ చికిత్సలతో, ఈ కొత్త చికిత్సలను పోల్చి చూడనున్నారు.
ఈ దశ తర్వాత… ఈ వ్యాక్సీన్ లైసెన్స్ పొందడానికి ఇంకా మరిన్ని సంవత్సరాలు పడుతుంది. అయినప్పటికీ… క్యాన్సర్ సహా ఇలాంటి కొన్ని ప్రత్యేక రోగాలకు సంబంధించి అనుమతులను వేగవంతం చేయడానికి తగిన చర్యలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ చేపట్టింది.
"ఇది ఓ లాటరీని గెలుచుకున్న సందర్భం వంటిది" అని వ్యాక్సీన్ టీకా తీసుకుని, మూడేళ్లుగా ఉపశమనంలో ఉన్న డయాన్నా ఇన్నెస్ అన్నారు. ఆమె 39 ఏళ్ల వయసులో తన రెండేళ్ల చిన్నారిని గుండెలకు హత్తుకుని నిద్రపుచ్చుతున్నప్పుడు తన రొమ్ములో గడ్డలు ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఆ తర్వాత టీఎన్ బీసీ స్టేజ్ 3 ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
ఆ తర్వాత డయాన్నా కొన్నినెలలపాటు కఠినంగా ఉండే చికిత్సను తీసుకున్నారు. ర్యాడికల్ సర్జరీ, రేడియో థెరపీ, 16 రౌండ్లు కీమోథెరపీ చేయించుకున్నారు. అందులో దాని రంగు, ప్రభావం కారణంగా "రెడ్ డెవిల్" గా పిలిచే టాప్- టైర్ కీమో కూడా ఉంది.
అప్పుడు ఆమెకు రొమ్ము క్యాన్సర్ వ్యాక్సీన్ ట్రయల్స్‌లో భాగమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. మొదట్లో ఆమె సందేహించినప్పటికీ… దీని గురించి పూర్తిగా తెలసుకున్న తర్వాత..ఈ వ్యాక్సీన్ పొందడం తన అదృష్టంగా భావించినట్లు ఆమె తెలిపారు.
"ఇది సైన్సులో రాబోయే గొప్ప సంచలనం అనుకుంటున్నా" అని ఆమె అన్నారు.
ఈ ట్రీట్‌మెంట్ పొందడానికి ఎవరికి అనుమతి ఉంటుంది?
పర్సనలైజ్డ్ వ్యాక్సీన్‌ల సామర్థ్యంపై అంచనాలు పెరుగుతున్నప్పటికీ, ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ వ్యాక్సీన్లు కచ్చితత్వంతో కూడిన చికిత్సను అందిస్తాయి. కానీ, వాటి సంక్లిష్టమైన తయారీ ప్రక్రియ వాటిని ఉత్పత్తి చేయడం ఖరీదైన వ్యవహారంగా మారుస్తోంది.
సాధారణ కణితులను లక్ష్యంగా చేసుకుని విస్తృత జనాభా కోసం పనిచేసే "ఆఫ్-ది-షెల్ఫ్" వ్యాక్సీన్లను అభివృద్ధి చేయడం.. ఔషధ కంపెనీల దీర్ఘకాలిక లక్ష్యం.
మరో విషయం ఏంటంటే...రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకునే అవకాశాలకు అలాగే వారు నివసించే ప్రాంతానికి సంబంధం ఉంటోంది.
అధిక ఆదాయ దేశాల్లో వ్యాధి ఉన్నట్లు తేలిన వారిలో 83శాతం మంది కోలుకున్నారు. అదే.. దక్షిణాఫ్రికా సహా అల్పాదాయ దేశాల్లో వ్యాధి నిర్ధరణ అయినవారిలో దాదాపు సగం మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
"పరిస్థితి మరింత సవాలుగా మారుతుంది"
ఎవరికైతే ఈ వ్యాక్సీన్లు అవసరమవుతాయో, ఆ మహిళలకు భారీ స్థాయిలో ఈ నవీన సాంకేతికతలతో కూడిన వ్యాక్సీన్లు అందవని కొంతమంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అతి సాధారణ క్యాన్సర్ చికిత్సలైన సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ వంటివాటిని పొందేవారిలో ఇప్పటికే పెద్ద స్థాయిలో తేడాలు ఉన్నాయని ఐఏఆర్‌సీలో క్యాన్సర్ సర్వైలెన్స్ బ్రాంచ్ విభాగాధిపతి డాక్టర్ ఇసాబెల్లె సోయెర్జోమాతరమ్ అన్నారు.
"అధునాతనమైన, పర్సనలైజ్డ్ క్యాన్సర్ చికిత్సలకు విషయానికి వచ్చేసరికి పరిస్థితి మరింత కష్టంగా మారుతోంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఐఏఆర్‌సీ ఫిబ్రవరిలో వెలువరించిన నివేదిక ప్రకారం.. 2050 నాటికి రొమ్ము క్యాన్సర్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 38శాతం పెరగనున్నాయి. అలాగే వార్షిక మరణాలు 68శాతం పెరగనున్నాయి.
"నిమిషం వ్యవధిలో.. ప్రపంచవ్యాప్తంగా నలుగురు మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధరణ అవుతుండగా.. ఒక మహిళ ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు" అని ఐఏఆర్‌సీ నివేదిక రూపకల్పనలో భాగమైన శాస్త్రవేత్త డాక్టర్ జోయెన్నే కిమ్ అన్నారు.
విక్టోరియా విషయంలో వ్యాక్సీన్ పురోగతి అంత వేగంగా ఏమీ జరగలేదు. ఇప్పుడు ఆమె బ్లాక్ విమెన్‌లలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు.
"రొమ్ము క్యాన్సర్ గురించి అరుదుగా మాట్లాడే కొన్ని కమ్యూనిటీలు ఇంకా ఉన్నాయి" అని ఆమె తెలిపారు.
డయాన్నా రొమ్ము క్యాన్సర్ నుంచి ఉపశమనం పొంది ఐదేళ్లకు చేరువ అవుతున్నప్పటికీ.. తన క్యాన్సర్ తిరగబెడుతుందా అనే విషయం గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు.
"కానీ, ఇది సైన్స్ ఫిక్షన్ స్టోరీకాదు. ప్రస్తుతం రెండోదశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాం. సజీవ సాక్ష్యంగా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను" ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)