You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇన్‌ఫెక్షన్లతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ శరీర కణాలను ఏమీ చేయదెందుకో కనిపెట్టిన శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి
- రచయిత, జేమ్స్ గల్లఘర్
- హోదా, బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి
ఇన్‌ఫెక్షన్లపై దాడి చేసే రోగనిరోధక వ్యవస్థ.. శరీరంలోని సొంత కణాలపై ఎందుకు దాడి చేయదో వివరించే ఆవిష్కరణలకు 2025 వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది.
జపాన్‌కు చెందిన షిమోన్ సకాగుచి, అమెరికా పరిశోధకులు మేరీ బ్రన్కోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్ సంయుక్తంగా ఈ బహుమతికి ఎంపికయ్యారు.
శరీరంపై దాడి చేయగలిగే రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని భాగాలను తొలగించే 'సెక్యూరిటీ గార్డుల' (నియంత్రిత టి-కణాలు)ను వారు కనుగొన్నారు.
ఇవి శరీరంపై దాడి చేసే ఇతర రోగనిరోధక కణాల ప్రభావాన్ని తగ్గించడానికి శరీరమంతా తిరుగుతాయి.
ఆటోఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్‌కు కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికి వారి పరిశోధన ఉపయోగపడుతుంది.
నోబెల్ బహుమతి కింద మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రోనోర్ (సుమారు రూ.10.38 కోట్లు)ను విజేతలకు అందుతుంది.
తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధులపై అవగాహనకు...
''రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి వారి పరిశోధనలు పనిచేస్తాయి'' అని నోబెల్ కమిటీ అధ్యక్షుడు ఒల్లె కాంపే చెప్పారు.
శరీరంపై దాడి చేయడానికి ప్రయత్నించే వేలాది రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రోగనిరోధక వ్యవస్థ మనల్ని ఎలా రక్షిస్తుంది? అదే సమయంలో మన శరీర సొంత కణజాలాలను మాత్రం దెబ్బతీయకుండా ఎలా వదిలేస్తుంది? అని అవగాహన చేసుకోవడానికి ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధన చాలా కీలకం.
ఎలుకలకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చేలా చేయడానికి థైమస్ గ్రంథిని తొలగించి వాటిపై జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షిమోన్ సకాగుచి ప్రయోగాలు చేశారు. ఇతర ఎలుకల నుంచి రోగనిరోధక కణాలను ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ వ్యాధిని నివారించవచ్చని ఆయన నిరూపించారు. అంటే, రోగనిరోధక కణాలు శరీరంపై దాడి చేయకుండా ఆపేందుకు ఒక వ్యవస్థ ఉందని ఇది సూచిస్తుంది.
అమెరికా సియాటిల్‌లోని ఇనిస్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన మేరీ బ్రన్కోవ్, ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలోని సోనోమా బయోథెరప్యూటిక్స్‌లో ఉన్న ఫ్రెడ్ రామ్స్‌డెల్... ఎలుకలు, మనుషులలో వంశపారంపర్యంగా వచ్చే ఒక ఆటోఇమ్యూన్ వ్యాధిపై పరిశోధన చేస్తూ, నియంత్రిత టి-కణాలు పనిచేయడానికి ముఖ్యమైన ఒక జన్యువును కనిపెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)