You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీబీసీ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్‌లో చర్చ, ఇంతకీ ఆయనేమన్నారు? జావేద్ అఖ్తర్ ఏం చెప్పారు?
'గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో నాకు అవకాశాలు ఆగిపోయాయి' అని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు.
రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌కు చెందిన చాలామంది స్పందించారు.
గీత రచయిత జావేద్ అఖ్తర్ మాట్లాడుతూ "ఇందులో మతపరమైన కోణం లేదని అనుకుంటున్నా" అన్నారు.
రెహమాన్ వ్యాఖ్యలపై, నవలా రచయిత్రి శోభా డే స్పందిస్తూ "ఇది చాలా ప్రమాదకరమైన వ్యాఖ్య, నేను 50 ఏళ్లుగా బాలీవుడ్‌ను చూస్తున్నాను. మతతత్వం లేని ఏదైనా ప్రదేశం ఉందంటే.. అది బాలీవుడ్. మీకు ప్రతిభ ఉంటే, అవకాశం లభిస్తుంది" అన్నారు.
"ఆయన చాలా విజయవంతమైన, పరిణతి చెందిన వ్యక్తి. ఆయనలా అని ఉండకూడదు. దాని వెనకేదో కారణం ఉండి ఉండొచ్చు, దాని గురించి మీరు ఆయననే అడగాలి" అని శోభా డే అన్నారు.
గాయకుడు శంకర్ మహదేవన్ మాట్లాడుతూ, "పాటను కంపోజ్ చేసే వ్యక్తి, అలాగే పాటను తీసుకోవాలా, లేదా దానిని మార్కెట్ చేయాలా వద్దా అని నిర్ణయించుకునే వ్యక్తి ఇద్దరు వేర్వేరు. దీన్ని నిర్ణయించే వ్యక్తులు సంగీత రంగానికి చెందినవారు కాదు" అన్నారు.
రెహమాన్ ఏమన్నారు?
ఆస్కార్ అవార్డు గ్రహీత, అనేక భారతీయ చిత్రాలకు చిరస్మరణీయ సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్ తన సంగీత ప్రయాణం, మారుతున్న సినిమా, భవిష్యత్తు ప్రణాళికలు, సమాజంలోని ప్రస్తుత వాతావరణం గురించి బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
చిత్ర పరిశ్రమ గురించి రెహమాన్ మాట్లాడుతూ, "బహుశా గత 8 సంవత్సరాలలో అధికారం మారడం వల్లనేమో, సృజనాత్మకత లేని వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో మతపరమైన కోణం కూడా ఉండవచ్చు. అయితే, నాతో ఎవరూ అనలేదు" అన్నారు.
కాకపోతే, ఇప్పుడు తనకు పెద్దగా పని లేదని రెహమాన్ అంగీకరించారు.
"అంటే, కొన్ని విషయాలు నా దాకా వచ్చాయి. ఉదాహరణకు, 'మీరు ఆల్రెడీ బిజీగా ఉన్నట్లున్నారు, ఈ సినిమాకి నిధులు సమకూర్చిన మ్యూజిక్ కంపెనీ వారి సొంత కంపోజర్లను తీసుకొచ్చింది' ఇలా.
అప్పుడు వాళ్లకి చెప్పా.. 'ఓకే, నేను విశ్రాంతి తీసుకుంటా. నా కుటుంబంతో సమయం గడుపుతా' అని. నేను అవకాశాల కోసం చూడను. అవే రావాలని అనుకుంటాను" అన్నారు రెహమాన్.
"అయితే, దాని గురించి పెద్దగా ఆలోచించను. ఎందుకంటే, ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం అనుకోను. ప్రతి ఒక్కరికీ వారి సొంత ఆలోచనలు, ప్రాధాన్యతలు ఉంటాయి. మనకి ఎన్ని అవకాశాలు రావాలనేది మన చేతుల్లో లేదు" అన్నారు.
జావేద్ అఖ్తర్ ఏమన్నారంటే..
రెహమాన్ వ్యాఖ్యలపై గీత రచయిత జావేద్ అఖ్తర్ ఐఏఎన్ఎస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ, "నాకెప్పుడూ అలా అనిపించలేదు. నేను ముంబయిలో ఎంతోమందిని కలుస్తుంటాను. ఆయన్ను (రెహమాన్) చాలా గౌరవిస్తారు. బహుశా ఆయన ఇప్పుడు విదేశాల్లో బిజీగా ఉన్నారని అందరూ అనుకుని ఉండొచ్చు. బహుశా, ఆయనవి చాలా పెద్ద ప్రోగ్రామ్‌లు, పూర్తయ్యేప్పటికి చాలా సమయం పడుతుందని అనుకోవచ్చు" అని అన్నారు.
"రెహమాన్ చాలా పెద్ద వ్యక్తి, ఆయన్ను సంప్రదించడానికి చిన్నచిన్న నిర్మాతలు కూడా భయపడతారు. అయితే, ఇందులో ఎలాంటి మతపరమైన కోణం లేదని అనుకుంటున్నా" అన్నారాయన.
నితేష్ తివారీ రాబోయే చిత్రం "రామాయణ"కు రెహమాన్ సంగీతం అందించారు. వేరే మతంలో ఉంటూ ఈ చిత్రానికి సంగీతం అందించడంపై అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానమిచ్చారు.
గత సంవత్సరం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన "ఛావా" చిత్రం విడుదలైంది. ఈ చిత్రం వాస్తవాలను వక్రీకరించి, విభజనకు దారితీసిందని పలువురు చరిత్రకారులు విమర్శించారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో హింస కూడా చెలరేగింది.
చిత్ర, సంగీత పరిశ్రమలో 'మతపరమైన లేదా మైనారిటీ' కోణాన్ని బాలీవుడ్ గాయకుడు షాన్ తోసిపుచ్చారు.
"సంగీతానికి మతపరమైన లేదా మైనారిటీ కోణం లేదని అనుకుంటున్నా. గత 30 సంవత్సరాలుగా ఉన్న మన ముగ్గురు సూపర్‌స్టార్లు కూడా మైనారిటీలే, వారికి అభిమానులు ఏమైనా తగ్గిపోయారా? వారి సంఖ్య ఇంకా పెరుగుతోంది" అని అన్నారు.
ప్రతి ఒక్కరూ మంచి పని చేస్తూనే ఉండాలని, వీటి గురించి ఆలోచించకూడదని ఆయన సూచించారు. రెహమాన్ అద్భుతమైన స్వరకర్త అని, ఆయనది ప్రత్యేకమైన శైలి అని షాన్ ప్రశంసించారు.
రాజకీయ వర్గాల నుంచి..
రెహమాన్ ప్రకటన తర్వాత, రాజకీయ వర్గాల నుంచి కూడా స్పందనలు వచ్చాయి.
"పరిశ్రమలో మతపరమైన కోణం గురించి రెహమాన్ మాట్లాడటం దురదృష్టకరం. ఆయనకు అన్ని రకాల అవకాశాలు వచ్చాయి. భారతదేశ ఔన్నత్యం భిన్నత్వంలో ఏకత్వంలోనే ఉంది. అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం దేశం గొప్పతనం" అని శివసేన నాయకురాలు షైనా ఎన్‌సీ అన్నారు.
రెహమాన్ వ్యాఖ్యలపై భజన్ గాయకుడు అనుప్ జలోటా మాట్లాడుతూ, "ఇది అస్సలు నిజం కాదు. నిజం ఏమిటంటే ఆయన ఐదేళ్లలో 25 ఏళ్లకు సరిపడా పని చేశారు. ఇప్పుడేం చేయగలరు? ఆయన చాలా పని చేసేశారు, చాలా బాగా చేశారు. ప్రజలకు ఆయనపై చాలా గౌరవం ఉంది" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)