You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పిల్లలు పుట్టడం వల్ల తల్లుల ఆయుష్షు తగ్గిపోతుందా?
- రచయిత, కేట్ బోవీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు, లేదా తినడానికి, నిద్రపోవడానికి మారాం చేస్తున్నప్పుడు తల్లులు సరదాగా మా ప్రాణం తీసేస్తున్నారని(ఆయుష్షు తగ్గించేస్తున్నారనే అర్థంలో) అంటుంటారు.
నిజానికి, ఈ సరదా మాట.. కొన్ని భిన్నమైన పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్న మహిళల వాస్తవిక పరిస్థితికి దగ్గరగా ఉండొచ్చని ఒక కొత్త అధ్యయనం సూచిస్తోంది.
చారిత్రక రికార్డుల విశ్లేషణ ప్రకారం, కొందరు మహిళలు తమకు పుట్టిన ఒక్కో బిడ్డకు ఆరు నెలల చొప్పున ఆయుర్దాయం కోల్పోయినట్లు సూచిస్తోంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న మహిళలు తీవ్రంగా ప్రభావితమయ్యారు.
ఈ పరిణామాన్ని అధ్యయనం చేస్తున్న పరిశోధకులు.. పారిష్ జనన, మరణాలకు సంబంధించిన రికార్డులపై అధ్యయనం చేశారు.
ఈ రికార్డుల్లో 1866, 1868 మధ్య ఫిన్లాండ్‌లో సంభవించిన భారీ కరవు నుంచి బయటపడిన 4,684 మంది మహిళల వివరాలు ఉన్నాయి.
ఇది యూరప్ ఇటీవలి చరిత్రలో "అత్యంత దారుణమైన కరవుల్లో ఒకటి" అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు, నెదర్లాండ్స్‌లోని గ్రోనింగన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ యువాన్ యంగ్ అన్నారు.
కరువు సమయంలో తల్లులైన మహిళలు ప్రతి బిడ్డతో ఆరు నెలల ఆయుర్దాయం కోల్పోయారని యంగ్, ఆయన బృందం - ప్రొఫెసర్ హన్నా డగ్డేల్, ప్రొఫెసర్ విర్పి లుమ్మా, డాక్టర్ ఎరిక్ పోస్ట్మా కనుగొన్నారు.
పరిశోధన ఫలితాల ప్రకారం, ఈ తల్లుల శక్తి వారి కణాలను మరమత్తు చేయడానికి బదులుగా పునరుత్పత్తికి ఎక్కువ ఖర్చు అయ్యి ఉండొచ్చు. ఇది వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
కానీ, కరవుకు ముందు లేదా తర్వాత మహిళలు తల్లులు కావడానికీ, వారి ఆయుర్దాయానికీ ఎలాంటి సంబంధం కనిపించలేదు.
"కరువు సమయంలో గర్భధారణ, ప్రసవం జరిగిన స్త్రీలలో మాత్రమే దీన్ని గుర్తించాం" అని డాక్టర్ యంగ్ చెప్పారు.
పిల్లలను కనే సమయాల్లో మహిళలు నివసిస్తున్న వాతావరణం కూడా ఒక ముఖ్యమైన కారకంగా ఇది సూచిస్తోంది.
దీనికి కారణాలేంటి?
మరి, ఇలా ఎందుకు జరిగింది?
పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పిల్లలను కనడం వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు తీవ్రం కావడం ఒక కారణం కావొచ్చు.
తల్లులకు గుండె, జీవక్రియ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందనేది తెలిసిన విషయమే. బరువు, శారీరక ఒత్తిడి పెరగడమే దీనికి కారణం.
"ఈ క్రమంలో పిల్లలను పెంచడం, తల్లిపాలు ఇవ్వడం, గర్భధారణ ప్రక్రియ తల్లి శరీరంలో అవసరమైన పోషకాల లోపానికి దారితీస్తుండడం మరో కారణం కావొచ్చు" అని డాక్టర్ యంగ్ చెప్పారు.
గర్భధారణకు, పాలివ్వడానికి చాలా శక్తి అవసరం. కరవు సమయంలో అప్పుడే తల్లైన మహిళ శరీరంలో శక్తి తక్కువగా ఉంటుంది. దీని వల్ల తర్వాతి కాలంలో అనారోగ్యాన్ని నివారించడం కష్టమవుతుంది.
కానీ, ఈ అధ్యయనం కొత్త ప్రయోగాల ద్వారా సేకరించిన సమాచారాన్ని కాకుండా చారిత్రక డేటాను విశ్లేషించినందున, ఇది పూర్తిగా కచ్చితమైనదని చెప్పలేనని కూడా ఆయన అన్నారు.
ఎక్కువ మంది పిల్లలున్న మహిళలపై అధిక ప్రభావం..
ఈ ప్రభావం ఎక్కువ మంది పిల్లలను కన్న మహిళల్లో అధికంగా ఉందని, అందరు మహిళలపై సమానంగా లేదని కూడా డాక్టర్ యంగ్ పరిశోధన గుర్తించింది.
"ఇది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంది, ఒకటి చాలా పెద్ద కుటుంబాలు, రెండోది కరవు వంటి పరిస్థితులు" అని ఆయన వివరించారు.
ఎలుకలు, కీటకాలు వంటి కొన్ని జాతులకు జీవితకాలం తక్కువుండడం, ఎక్కువ సంతానం కలగడం.. ఏనుగులు, తిమింగలాలు, మనుషులకు ఎక్కువ జీవితకాలం ఉండడం, తక్కువ సంతానం.. ఎందుకు? అనేదానిపై దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు సమాధానాలు అంతుచిక్కడం లేదు.
కణాల మరమత్తు నుంచి పునరుత్పత్తికి శక్తి మళ్లుతుందన్నది, ఇది వృద్ధాప్యానికి దోహదం చేస్తుందన్నది ఒక ప్రముఖ సిద్ధాంతం.
ఇది ఇప్పటి మహిళలకూ వర్తిస్తుందా?
అయితే, 200 ఏళ్ల కిందటి మహిళలపై జరిగిన పరిశోధనల ఫలితాలు 21వ శతాబ్దంలోని తల్లులకు కూడా వర్తిస్తాయా?
"ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు అంత బలంగా లేని ఆ చారిత్రక కాలాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం" అని డాక్టర్ యంగ్ అంటున్నారు.
"అప్పట్లో, మహిళలకు సగటున నలుగురు నుంచి ఐదుగురు పిల్లలు ఉండేవారు, ఇప్పటి మహిళలతో పోలిస్తే చాలా ఎక్కువ'' అని ఆయన అన్నారు.
1800 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023 నాటికి, సగటున ప్రతి మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. విద్య, ఉపాధి, గర్భనిరోధకాలు, పిల్లల మరణాల తగ్గింపు వంటివాటితో ఈ మార్పు వచ్చింది.
అయితే, నైజెర్, చాడ్, సోమాలియా, దక్షిణ సూడాన్ వంటి కొన్ని దేశాల్లో, మహిళలకు ఇప్పటికీ కనీసం నలుగురు పిల్లలుంటారు.
ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు అవసరమని డాక్టర్ యంగ్ చెప్పినప్పటికీ, ఈ ఫలితాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ వర్తించే సూచనలున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)