కత్రినా కైఫ్: 42 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన నటి, 40లలో తల్లి అయ్యే వారికి ఎదురయ్యే సవాళ్లేంటి?

    • రచయిత, సుమన్‌దీప్ కౌర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తాను గర్భవతి అయినట్టు 42 ఏళ్ల బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రకటించారు.

వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించిన తర్వాత కుటుంబ జీవితాన్ని ప్రారంభించడం లేదా విస్తరించాలని భావించే మహిళలకు కత్రినా కైఫ్ ఒక్కరే ఉదాహరణ కాదు.

హాలీవుడ్ నటి హాలీ బెర్రీ 2013లో తన 47వ ఏట బిడ్డకు జన్మనిచ్చారు. నలభైల తర్వాత తల్లి కావడం అనేది శారీరకంగా, భావోద్వేగ పరంగా అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం.

నాలుగు పదుల వయసు తర్వాత గర్భం దాల్చడం వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి అవగాహన చేసుకోవడానికి దిల్లీలోని షాలిమార్‌బాగ్‌లో ఉన్న మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రసూతి, గైనకాలజీ విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎన్ బసు, అమృత్‌సర్‌లోని అమన్‌దీప్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ శివానీ గర్గ్‌తో బీబీసీ మాట్లాడింది.

నలభైలలో తల్లికావడంలో ఉన్న కష్టాలు, వైద్యపరంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీ, ఇతర అంశాల గురించి ఈ నిపుణులు వివరించారు.

సవాళ్లు- మార్గాలు

నాలుగు పదులు దాటిన తర్వాత తల్లి కావడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్ ఎస్ఎన్ బసు, డాక్టర్ శివానీ గర్గ్ చెప్పారు. వాటిలో

హైపర్ టెన్షన్ - వయసు 40 దాటిన తర్వాత హైపర్ టెన్షన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది తల్లీ బిడ్డకు ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే రక్తపోటు అధికంగా ఉందేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గర్భధారణ సమయంలో మధుమేహం - గర్భ ధారణ సమయంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. గర్భం ధరించిన మహిళకు డయాబెటిస్ ఉంటే 40 ఏళ్ల తర్వాత అది మరింత పెరిగే అవకాశం ఉంది. షుగర్ ఉన్న మహిళలు 40ల తర్వాత గర్భం ధరించినప్పుడు వారిలో షుగర్ లెవల్స్ పెరిగితే అది శిశువు శరీర నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. శిశువు బరువు బాగా పెరగవచ్చు. శిశువు చుట్టూ ఉండే నీరు కూడా పెరగొచ్చు. ప్రసవం తర్వాత బిడ్డకు కామెర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

దీంతో పాటు ఈ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

శిశువుపై ప్రభావం

పుట్టుకతో వచ్చే వైకల్యం - నాలుగు పదుల వయసులో గర్భం దాల్చడం వల్ల వచ్చే సమస్యలలో శిశువు నిర్మాణంపై ప్రభావం పడటం ఒకటి. శిశువు పెరుగుదలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

శిశువు సరైన బరువు ఉండే అవకాశం కూడా తక్కువే.

పిండానికి సంబంధించి కూడా సమస్యలు ఏర్పడవచ్చు. పిండానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగక అది సరిగ్గా ఏర్పడకపోవచ్చు. దీని వల్ల పిండం చుట్టూ నీరు తగ్గిపోవడం లేదా శిశువు ఎదుగుదల తగ్గిపోవచ్చు.

క్రోమోజోమ్‌ల అసమానతలు - తల్లికి 40 ఏళ్లు దాటిన తర్వాత పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ లాంటి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుంది.

నాలుగు పదుల తర్వాత గర్భం దాల్చిన మహిళలకు పుట్టే బిడ్డల్లో డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం వందమందిలో ఒకరికి ఉంటుందని డాక్టర్ బసు చెప్పారు.

ప్రమాదాలను తగ్గించవచ్చా?

వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలను తొలగించలేనప్పటికీ, ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలివల్ల వాటిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

"బిడ్డ పుట్టడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, బ్లడ్ ప్రెషర్‌ను పర్యవేక్షించడం, బరువును అదుపులో ఉంచుకోవడం, ఫోలిక్ యాసిడ్ లాంటి విటమిన్లు తీసుకోవడం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా ఈ ప్రమాదాలను నియంత్రించవచ్చు" అని డాక్టర్ ఎస్ఎన్ బసు వివరించారు.

ఆరోగ్యకరమైన జీవనశైలితో గర్భాశయ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని డాక్టర్ బసు చెప్పారు.

దీని కోసం, సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఒమెగా త్రీ ఉండే ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

చేపలు, అధిక కెఫీన్, ప్రాసెస్ట్ ఫుడ్, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది.

వీటన్నింటితో పాటు వ్యాయామం చేయడం గురించి వైద్యులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. నడక, ఈత కొట్టడం, తేలికపాటి యోగాసనాలతో వ్యాయామం చేయడం మంచిదని డాక్టర్ బసు చెప్పారు.

రిస్క్ ఎక్కువగా ఉండే స్పోర్ట్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ మొత్తం ప్రక్రియలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దాన్ని పూర్తిగా తొలగించుకోవాలని డాక్టర్ బసు చెప్పారు. ధ్యానం చేయడం, ప్రశాంతంగా ఉండటం, సరిపడా నిద్రపోవడం కూడా ముఖ్యం.

40ల తర్వాత గర్భం దాల్చిన మహిళలు వైద్యులు సూచించిన మేరకు ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ డి, డీహెచ్ఏలాంటి సప్లిమెంట్లు తీసుకోవాలి.

సహజ గర్భధారణ అవకాశాలు

"40 దాటిన తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం వేగంగా తగ్గిపోతుంది. సరాసరిగా చూస్తే 40 ఏళ్ల తర్వాత రుతుచక్రంలో గర్భధారణ రేటు 5శాతంగా ఉంది. వయసు పెరిగే కొద్దీ అది మరింత తగ్గుతుంది" అని డాక్టర్ బసు చెప్పారు.

డాక్టర్ శివానీ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.

"మహిళల అండాశయంలో అండాల నాణ్యతను పరీక్షించేందుకు ఏఎంహెచ్ (యాంటీ ముల్లేరియన్ హార్మోన్) టెస్ట్ చేస్తారు. 40 ఏళ్లు దాటిన వారిలో ఈ పరీక్ష చేసినప్పుడు వారి అండాశయంలో అండాల సంఖ్య సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంది. వయసు పెరిగే కొద్దీ ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గి మెనోపాజ్ అవకాశాలు ఎక్కువవుతాయి" అని డాక్టర్ శివానీ చెప్పారు.

"మీ వయసు 40 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ ఉంటే, మీరు గర్భం ధరించేందుకు ఆరు నెలల పాటు ప్రయత్నించినా వీలుకాకపోతే సంతానోత్పత్తి నిపుణుల్ని సంప్రదించండి" అని డాక్టర్ బసు సూచించారు.

40లలో తల్లి కావాలని భావించేవారు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కేఎఫ్‌టీ, ఎల్‌ఎఫ్‌టీ, షుగర్ లెవల్స్, థైరాయిడ్, అండాశయంలో ఆరోగ్యకరమైన అండాల సంఖ్య, గర్భాశయం, అండాశయం అల్ట్రాసౌండ్‌ సహా అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ శివానీ చెప్పారు.

"40 ఏళ్ల తర్వాత తండ్రి కావాలని భావించే పురుషులు కూడా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. వీర్యం నాణ్యత చెక్ చేయించుకుంటే మంచిది" అని శివానీ అన్నారు.

శాస్త్రీయంగా వైద్య రంగం చాలా అభివృద్ధి సాధించింది. వీటి సాయంతో సమస్యల్ని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రసవానికి ముందు పరీక్షలు

  • క్రోమోజోమ్ సమస్యల కోసం నాన్-ఇన్వాసివ్ ప్రినేటల్ టెస్టింగ్ (NIPT)
  • తొలి త్రైమాసిక స్క్రీనింగ్ (రక్త పరీక్షలు + నూచల్ ట్రాన్స్‌లెన్సీ స్కాన్
  • అవసరాన్ని బట్టి అమ్నియోసెంటెసిస్ లేదా కారియోనిక్ విల్లస్ శాంప్లింగ్ పరీక్ష (CVS)

కింద ప్రస్తావించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ బసు చెప్పారు

  • తీవ్రమైన కడుపు నొప్పి లేదా తిమ్మిరి
  • రక్తస్రావం పెరగడం లేదా ఫ్లూయిడ్ లీకేజ్
  • తీవ్రమైన తలనొప్పి, కంటి చూపు తగ్గడం
  • పిండం కదలిక తగ్గడం లేదా లేకపోవడం (20 వారాల తర్వాత)
  • అధిక జ్వరం లేదా ఇన్ఫెక్షన్ సంకేతాలు

తల్లి కావడానికి ‘సరైన’ సార్వత్రిక వయసు ఎంత?

గర్భం ధరించేందుకు సార్వత్రికంగా వర్తించే "సరైన" వయస్సు లేదని డాక్టర్ బసు, డాక్టర్ శివానీ గర్గ్ స్పష్టం చేశారు.

అయితే సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కీలక అంశాల్లో వయస్సు కూడా ఒకటి.

మహిళల్లో పునరుత్పత్తి వయస్సు 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తారు. మహిళల్లో 35 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం మొదలవుతుంది.

"బయోలాజికల్‌గా చూస్తే స్త్రీలలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య సంతానోత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. 35 తర్వాత అది తగ్గుతుంది. 40 నుంచి బాగా పడిపోతుంది" అని డాక్టర్ బసు చెప్పారు. 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం సాధ్యమవుతున్నప్పటికీ వైద్య పర్యవేక్షణ అవసరమని డాక్టర్ బసు అభిప్రాయపడ్డారు.

అంతిమంగా బిడ్డను కనడానికి సరైన సమయం అనేది వ్యక్తిగత నిర్ణయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)