You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోహిత్ వేముల చట్టం: ‘ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇంకా ఎందుకు అమలు కాలేదు?’
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి 'రోహిత్ వేముల చట్టం' తీసుకురావాలని కోరారు.
భట్టి విక్రమార్కను కలిసిన వారిలో రోహిత్ వేముల తల్లి రాధిక కూడా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఈ చట్టం తీసుకురావాలనేది విద్యార్థుల డిమాండ్.
ఇప్పటికే కర్ణాటకలో చట్టం ముసాయిదా విడుదల చేయగా, అసలు రోహిత్ ఆత్మహత్య చేసుకున్న తెలంగాణలో కార్యరూపం దాల్చకపోవడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
''కర్ణాటక తయారు చేసిన ముసాయిదాకు అవసరమైన మార్పులు చేసి తెలంగాణలోను చట్టంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరాం'' అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ఎస్యూఐ కార్యదర్శి శామ్యూల్ బీబీసీతో చెప్పారు.
''చట్టం తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాం. వీలైనంత తొందరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తాం'' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ఎందుకీ చట్టం?
విశ్వవిద్యాలయాల్లో కుల, ఆర్థిక వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని కొన్నేళ్లుగా విద్యార్థి వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇందుకోసం 'జస్టిస్ ఫర్ రోహిత్ వేముల' క్యాంపెయిన్ కమిటీ పోరాడుతోంది.
''రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్జప్తి చేస్తున్నాం. ఇప్పటికే చాలాసార్లు వినతులు ఇచ్చాం'' అని రోహిత్ తల్లి రాధిక అన్నారు.
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులపై వివక్షను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
''ఉన్నత విద్యా సంస్థల్లో వివక్ష లేదని చెప్పడానికి లేదు. ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు కానీ ఏదో రూపంలో దాన్ని ప్రదర్శిస్తుంటారు'' అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ (ఏఎస్ఏ) అధ్యక్షుడు దయానిధి బీబీసీతో చెప్పారు.
అవి తగ్గాలంటే ప్రత్యేక చట్టం ఉండాలనే ఉద్దేశంతో రోహిత్ వేముల చట్టం కోసం పోరాడుతున్నామని వివరించారు.
ఎవరీ రోహిత్ వేముల?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ చక్రవర్తి 2016 జనవరి 17న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన చనిపోయి ఈ ఏడాది జనవరి 17నాటికి పదేళ్లు గడిచాయి.
అంతకు ముందు క్యాంపస్‌లో రోహిత్ వేముల కొన్ని ఆందోళనల్లో పాల్గొనడం, ఆపై ఆయన స్కాలర్ షిప్ ఆగిపోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడటంతో విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
యూనివర్సిటీ యాజమాన్యంతోపాటు బీజేపీ నాయకత్వం, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ప్రతినిధుల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ విద్యార్ధి సంఘాలు చాలాకాలం ఆందోళనలు నిర్వహించాయి.
కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు అప్పట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు మద్దతు ఇచ్చారు.
ఈ పదేళ్లలో ఏం జరిగింది?
రోహిత్ ఆత్మహత్యకు, యూనివర్సిటీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత కారణాలతో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడితే దానికి కులం రంగు పులిమారని, తమకు దీనితో ఏం సంబంధం లేదంటూ బీజేపీ, ఏబీవీపీ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించాయి. రోహిత్ దళితుడు కాదని బీజేపీ వాదించింది.
రోహిత్ ఆత్మహత్యకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఈ కేసులో నిందితులని చెప్పడానికి సాక్ష్యాలు లేవని తెలంగాణ పోలీసులు 2024 మేలో తెలంగాణ హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
రోహిత్ వేముల మరణం, కులం – ఈ రెండు అంశాలపై పోలీసులు 60 పేజీల నివేదిక రాశారు . అందులో రోహిత్ వేముల షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) కాదని పేర్కొన్నారు.
దీనిపై విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగగా కేసును పునర్విచారిస్తామని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. అయితే విచారణ మొదలుకావాల్సి ఉంది.
పోలీసుల నివేదికపై రాధిక అప్పట్లో బీబీసీతో మాట్లాడారు.
''అవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు పోలీసులు కులాన్ని ఎలా నిర్ధరిస్తారు? క్యాస్ట్ సర్టిఫికెట్‌పై దర్యాప్తు పోలీసులకు ఏం పని? 2017-18లోనే మేం కలెక్టర్‌కు రిపోర్ట్ చేశాం'' అని చెప్పారామె.
మరికొన్ని ఘటనలు
రోహిత్ వేముల మాత్రమే కాకుండా దేశంలో వివిధ సందర్భాల్లో ఉన్నత విద్యా సంస్థలలో పలువురు దళిత, ఆదివాసీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
- 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెంథిల్ కుమార్ అనే దళిత విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది.
- 2019లో ముంబయిలో పాయల్ తడ్వి అనే ఆదివాసి పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు.
- 2023లో ఐఐటీ బాంబేలో దర్శన్ సొలంకి అనే దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆయన మరణానికి చదువుల ఒత్తిడి కారణమని విచారణ కమిటీ తేల్చింది. విద్యార్థులు మాత్రం దళిత వివక్ష కారణమని అప్పట్లో ఆరోపించారు.
ఇవే కాదు, 2014-2021 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ఉన్నత విద్యాసంస్థల్లో 122 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా 2021లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆ వివరాల ప్రకారం, బలవన్మరణానికి పాల్పడిన వారిలో 24 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, 41 మంది ఓబీసీ విద్యార్థులు ఉన్నారు.
118శాతం పెరిగిన ఫిర్యాదులు
2019-20లో 173 కుల వివక్ష ఫిర్యాదులు అందగా, 2023-24 నాటికి అవి 378కు పెరిగినట్లుగా సుప్రీంకోర్టు, పార్లమెంటరీ ప్యానెల్ కు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సమర్పించిన నివేదికలో పేర్కొందని హిందుస్థాన్ టైమ్స్ రాసింది.
అంటే ఇలాంటి ఫిర్యాదులు 118శాతం పెరిగినట్లుగా నివేదిక స్పష్టం చేస్తోంది.
యూనివర్సిటీల్లో ఫిర్యాదుల కోసం కమిటీలు ఉంటున్నాయిగానీ, విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదని చెప్పారు దయానిధి.
''ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక విభాగాలు, వ్యవస్థలు యూనివర్సిటీల్లో ఉన్నాయి. విద్యార్థులు ఫిర్యాదులు చేసేందుకు ఎంతమేరకు అవి అందుబాటులో ఉన్నాయనేది అధికారులు ఆలోచించుకోవాలి'' అని చెప్పారు.
యూనివర్సిటీల్లో 'ఐడియాలజీ వార్' నడుస్తోందన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ఎస్యూఐ కార్యదర్శి శామ్యూల్.
''ఇప్పుడు ఒక్కొక్క వర్గం ఒక్కొక్క అసోసియేషన్‌గా ఏర్పడింది. వారి మధ్య సిద్ధాంతపరమైన కోల్డ్‌వార్ నడుస్తోంది. ఆధిపత్య అసోసియేషన్ వైపు ఉండకపోతే పీహెచ్‌డీ ప్రవేశాల్లో ఇబ్బందులు పెడతారని, ఫెలోషిప్‌లు నిలిపివేస్తారనే భయం నెలకొంది'' అన్నారు.
ఫిర్యాదుల విభాగాలపై వచ్చిన ఆరోపణల గురించి యూజీసీ అధికారులను ఫోన్ ద్వారా బీబీసీ సంప్రదించింది. వారి నుంచి స్పందన రాగానే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.
మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఏం చెప్పింది?
యూనివర్సిటీల్లో విద్యార్థుల మధ్య వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం తీసుకువస్తామని 2024 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సుఖ్విందర్ సింగ్‌లకు 2025 ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ లేఖలు రాశారు.
''దళిత, ఆదివాసీ, ఓబీసీ విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు గురికాకుండా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలి'' అని ఆ లేఖలో పేర్కొన్నారు.
రోహిత్ వేముల మరణించి పదేళ్లైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జనవరి 17న రాహుల్ గాంధీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
''తెలంగాణ, కర్ణాటకలో వీలైనంత త్వరలోనే రోహిత్ వేముల చట్టం తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోంది'' అని పేర్కొన్నారు.
కర్ణాటక 'ముసాయిదా'లో ఏముందంటే..
రోహిత్ వేముల చట్టాన్ని కర్ణాటకలో అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది అక్కడి ప్రభుత్వం.
రోహిత్ వేముల (బహిష్కరణ లేదా అన్యాయ నిరోధక) (విద్యాహక్కు, గౌరవం) బిల్లు – 2025 పేరుతో ముసాయిదాను 2025 జులైలో విడుదల చేసింది. ఇది ఇంకా చట్ట రూపం దాల్చలేదు. కుల వివక్షకు పాల్పడితే శిక్షలు, భారీ జరిమానాలు విధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
మొదటిసారి కుల వివక్ష నేరానికి పాల్పడి నేరం రుజువైతే ఏడాది జైలు, రూ.పది వేల జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు ప్రవేశం నిరాకరించడం, అదనపు ఫీజులు వసూలు చేయడం, సౌకర్యాల నిరాకరణ వంటివి వివక్ష పరిధిలోకి వస్తాయని బిల్లులో ప్రతిపాదించారు.
నేరం పునరావృతమైతే మూడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని బిల్లులో పేర్కొన్నారు.
నేరాభియోగాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేయడం, నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం లేదా గ్రాంట్స్ నిలిపివేయడం వంటి అంశాలను బిల్లులో పొందుపరిచారు.
'కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలి'
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
''చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు సభ నిర్వహించారు. అందులో ఎన్నో హామీలు ఇచ్చారు. వివిధ వేదికల మీద రోహిత్ వేముల చట్టం తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మాటలకే పరిమితమయ్యారు'' అని బీబీసీతో అన్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క సాక్షాత్తూ హెచ్‌సీయూ విద్యార్థి కనుక చొరవ తీసుకుని చట్టం తీసుకురావాలని ప్రవీణ్ కుమార్ అన్నారు.
విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష రాష్ట్ర సమస్యగా కాక, జాతీయ సమస్యగా చూడాలన్నారు కాంగ్రెస్ తెలంగాణ ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్.ప్రీతమ్.
''కర్ణాటకలో తీసుకువచ్చిన ముసాయిదాపై జనవరి 22న చర్చించబోతున్నాం.కర్ణాటకలో తీసుకువచ్చిన ముసాయిదాను చట్టంగా తీసుకువస్తే, అందులో మార్పులు, చేర్పులు బట్టి తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ చట్టం అమల్లోకి తీసుకువస్తాం'' అని బీబీసీతో చెప్పారు.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)