You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని గుర్తించడం ఎలా?
- రచయిత, డాక్టర్ దేశం పీఆర్
- హోదా, బీబీసీ కోసం
తనతోపాటు పనిచేసే సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడని విశాల్‌కు ఆఫీసుకు వచ్చాక తెలిసింది. నిన్న తనతో పాటే భోజనం చేసిన వ్యక్తి ఈరోజు లేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు విశాల్.
రోజూ పది, పదకొండు గంటలు ఆఫీసులో తనతో పాటే ఉండే సందీప్ ఎందుకిలా చేశాడనే బాధ, ముందుగానే గుర్తించలేకపోయననే పశ్చాత్తాపం అతనిని వెంటాడుతున్నాయి.
భారత దేశంలో ఏటా కనీసం లక్షమందికిపైగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక్క 2022లోనే మన దేశంలో 1,70,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందికి సగటున 12 మంది ఆత్మహత్య చేసుకుంటుంటే, దక్షిణ భారతదేశంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది.
తెలంగాణలో లక్షకు 26 మంది, ఆంధ్రప్రదేశ్‌లో లక్షకు 17 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెప్తున్నాయి.
ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకనిపిస్తుంది?
ఎవరికైనా ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకనిపిస్తుంది?అలాంటి వారిని ముందుగానే గుర్తించడం ఎలా? వీటిని నివారించగలమా?
ఆత్మహత్యకు కారణాలలో...
- కుటుంబ కలహాలనేపథ్యం 31%
- దీర్ఘకాలిక జబ్బుల వలన 18%
- మద్యానికి బానిస కావడం వల్ల 7%
- భార్యా భర్తల మధ్య కలహాల వల్ల 5%
- ప్రేమ విఫలం అవ్వడం వల్ల 4 నుంచి 5%
- అప్పుల బాధ వల్ల 4 % మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.
యువకులలో చాలామంది నిరుద్యోగం సమస్య వల్ల చనిపోతూ ఉంటే, ఈ మధ్య పరీక్ష పాసవ్వలేదని ఆత్మహత్య చేసుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది.
ఆత్మహత్య చేసుకునే వారిలో 70 శాతం మంది పురుషులు, 30 శాతం మంది ఆడవాళ్లు ఉన్నారు. మగవాళ్ళ ఆత్మహత్యలకు చాలావరకు ఆర్థిక విషయాలు కారణమైతే ఆడవాళ్ల ఆత్మహత్యలకు భార్యాభర్తల మధ్య కలహాలు, కట్నం కోసం వేధింపులు ముఖ్య కారణాలుగా రికార్డ్ అవుతున్నాయి.
ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో పంట నష్టం వచ్చిన రైతులు కూడా ఎక్కువే ఉన్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 25 % మంది రోజు కూలీలు.
ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి ఆర్థిక పరిస్థితి చూస్తే 65 % మంది ఏడాదికి లక్ష రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. మిగతా 30% మంది సంవత్సరానికి లక్ష రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు మాత్రమే సంపాదిస్తున్నారు.
మనదేశంలో ఆత్మహత్యల రేటు పల్లెల్లో కంటే పట్టణాల్లో ఎక్కువగా ఉంది.
ముందుగానే గుర్తించవచ్చా?
వృద్ధాప్య సమ స్యలు, డిప్రెషన్, మానసిక సమస్యలు ఉన్నవారు, మద్యం తాగేవారు, ఫిట్స్, పక్షవాతం, క్యాన్సర్, హెచ్ఐవి లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు, కుటుంబం నుంచి విడిపోయి ఒంటరిగా ఉండేవారు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కుటుంబంలో ఎవరైనా చనిపోయినా లేదా భాగస్వామితో విడిపోయిన వారిని కొన్ని రోజులు కనిపెట్టుకొని ఉండటం మంచిది. కుటుంబంలో ఎవరైనా గతంలో ఆత్మహత్య చేసుకున్న వారు ఉంటే, ఆ కుటుంబంలోనే మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఆ కుటుంబానికి తగిన భరోసా ఇవ్వాలి.
మన ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, స్నేహితులు డిప్రెషన్ లేదా కుంగుబాటులో ఉన్నారని తెలిపే సంకేతాలు కొన్ని
- రోజులో ఎక్కువ సేపు బాధపడుతూ ఉండటం
- ఇదివరకు ఏదైనా చాలా ఇష్టంగా చేసే పని (సంగీతం వినడం, సినిమాలు చూడటం, బయటకి వెళ్ళడం, పుస్తకాలు చదవడం, మొక్కలు పెంచడం మొదలైనవి) ఇప్పుడు చేయడానికి అసలు ఆసక్తి చూపకపోవడం.
- కొన్నిరోజుల్లోనే బరువు తగ్గిపోవడం (డైట్ చేయకుండా) లేదా బరువు పెరగడం
- ఎక్కువగా నిద్రపోవడం,లేదా అసలు నిద్ర పోకపోవడం
- ఎప్పుడూ నీరసంగా ఉందనడం, తొందరగా అలసిపోవడం
- నేను ఎందుకూ పనికిరాను, నా జీవితం వ్యర్థంలాంటి మాటలు మాట్లాడటం
- నేను నా కుటుంబానికి భారంగా మారాను లేదా నా స్నేహితులకి భారంగా మారాను అని మాట్లాడటం
- ఎప్పుడూ ఆందోళనగా, ఆరాట పడుతూ ఉండటం.
- ఒక పని మీద దృష్టి పెట్టలేకపోవడం, అన్నీ మర్చిపోతూ ఉండటం, అడిగిన ప్రశ్నే మళ్ళీ అడగడం
- ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఉండటం, నేను చనిపోతే బాగుండు లాంటి మాటలు మళ్లీ మళ్లీ మాట్లాడుతూ ఉండటం.
భరోసా దొరికితే..
చాలామంది ఆత్మహత్య చేసుకుంటామనుకునేవారు నిజానికి సమయానికి మంచి సహకారం దొరికితే అలాంటి ఆలోచనలు మానుకుంటారు.
ఆత్మహత్య చేసుకోవాలనే భావన కొన్ని నిమిషాలు లేదా గంటలు మాత్రమే చాలా బలంగా అనిపిస్తుంది. ఆ నిమిషం, ఆ గంట గడిచిపోయాక మళ్ళీ మామూలుగా ఆలోచించడం మొదలుపెడతారు.అందుకని తెలిసిన వారిలో ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనబడితే వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి.
- అలాంటి వ్యక్తులను గుర్తిస్తే ముందు వారితో ఏకాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.
- వారికి సరిపడా సమయం ఇచ్చి వారు ఏం చెప్పదలుచుకున్నారో అర్థం చేసుకోవాలి.
- వాళ్ళ మాటలను కొట్టి పారేయకూడదు.
- ఇంతకంటే ఎక్కువ సమస్య ఉండే వాళ్ళను చాలామందిని చూశాం లాంటివి మాట్లాడకూడదు.
- వారి సమస్య అవతలి వ్యక్తికిఎంత చిన్నదిగా కనపడినా, డిప్రెషన్‌లో ఉన్నవారికి అది పెద్ద సమస్యలాగే ఉంటుంది.
- వారికి, వారి ఆలోచనలకు గౌరవం ఇవ్వాలి.
- వారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఆపకూడదు.
- వారితో పాటు బాధపడి ఏడవకూడదు.
- ఎక్కువ ప్రశ్నలు అడగకుండా, వారు చెప్పదలుచుకుంది ఓపికగా వినాలి.
చాలామందికి ఉండే తప్పుడు అభిప్రాయం ఏంటంటే, ఆత్మహత్య గురించి మాట్లాడేవారు అసలు ఆత్మహత్య చేసుకోరని. కానీ నిజం ఏమిటంటే ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు కనీసం మూడు నెలలు ముందు నుంచే ఎవరితో ఒకరితో ఆ విషయం మాట్లాడుతూ ఉంటారు. కనిపెట్టుకు చూస్తే ఖచ్చితంగా పై లక్షణాలలో కొన్నైనా కనపడతాయి.
ఒంటరితనాన్ని ఇష్టపడతారు
ఆత్మహత్య చేసుకోవానుకునే వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
మద్యం , సిగరెట్లు లేదా ఇతర మత్తుపదార్థాలు తీసుకోవడం చేస్తుంటారు.
ఎప్పుడూ ఒక రకమైన ప్రతికూల ఆలోచనలతో ఉండడం, సమయానికి తినకపోవడం, నిద్రపోకపోవడం వంటివి చేస్తారు. వారి పైన వారికి విపరీతమైన ద్వేషం కలగడం, నేను ఎందుకు పనికిరాను అనే ఒక భావన కలగడం కూడా జరుగుతుంది.
ఇలాంటి లక్షణాలు ఉన్నవారు చావు గురించి మాట్లాడుతూ ఉంటే, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో అడగడం, దాని గురించి వారు ఇదివరకే ఏదైనా ప్లాన్ వేసుకున్నారేమో కనుక్కోవడం చాలా ముఖ్యం. వాళ్ళుకనుక ఇలా చనిపోతే బాగుంటుంది అని చెప్తే, వెంటనే వారితో మాట్లాడి, ఒప్పించి మానసిక వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్ళాలి. ఎవరైనా పై లక్షణాలతో ఉంటే వారినిఒంటరిగా వదలకూడదు. వారి దగ్గర నిద్ర మాత్రలు , పురుగుల మందులు లాంటి ఆత్మహత్యకు ఉపయోగించేవి ఏవీ లేకుండా చూసుకోవాలి.
వారు చాలా దగ్గర సంబంధికులు అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మహత్య చేసుకోను అని ప్రమాణం చేయించుకోవడం కొంతవరకు సహాయం చేస్తుంది. ఇదివరకే ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడి బ్రతికి ఉంటే గనక, వారు మళ్లీ ఆత్మహత్య చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వారు అలాంటి ఆలోచనలనుంచి మొత్తంగా బయటపడేదాకా వారికి సపోర్ట్ ఇస్తూ ఉండాలి.
ఎవరైనా ఆత్మహత్య చేసుకోబోతున్నారనిపిస్తే వెంటనే వారి అనుమతి తీసుకొని, కుటుంబ సభ్యుల తోనో లేదంటే వారి స్నేహితులతోనో లేదా వారికి ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడడానికి వారికి సహాయం చేయాలి.
ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిపట్ల అసహనంగా ఉండకుండా వారిని అసహ్యించుకోకుండా, వారిని నీచంగా చూడకుండా వారికి ఉన్న సమస్య అర్థం చేసుకోవడానికి, వారికి మానసిక స్థైర్యం ఇవ్వడానికి ప్రయత్నించాలి.
కాస్త వ్యాయామం.. కొంచెం ఎండ..
వ్యక్తిగత జీవితంలో ఒంటరితనం ఉన్నవారు వారి ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం చేస్తూ ఉంటారు. మందు, సిగరెట్‌లానే సోషల్ మీడియా కూడా ఒక వ్యసనమే అని గుర్తించాలి. వ్యసనం ఉంది అని గుర్తించిన వారు వెంటనే వైద్యులని సంప్రదించి వారి సలహా తీసుకోవాలి.
డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులను నయం చేసే మందులు, ఆత్మహత్య చేసుకోవాలనే భావన నుండి బయట పడేసే కచ్చితమైన మందులు మనందరికీ అందుబాటులో ఉన్నాయి. వైద్య నిపుణులను కలిస్తే వారు క్షుణ్ణంగా పరీక్ష చేసి మందులు ఇస్తారు.
రోజూ వ్యాయామం చేయడం, కనీసం అరగంట అయినా శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవడం, ఉద్యోగం, ఇంటి పని మాత్రమే కాకుండా మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని ఇష్టమైన పనులు (హాబీస్) చేస్తూ ఉండటం చేయాలి.
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడటం వల్ల సమయం వృథా అవుతుందని భావించకుండా, మనం సమాజం లో ఒక భాగమని, మానవ సంబంధాలు లేకపోతే మనుషులకు మనుగడే లేదని గుర్తించాలి. అవసరంలో ఉన్న మనుషులకు సహాయం చేయడం, వారికి వీలైనంత రక్షణ కల్పించడం, జీవితం పట్ల ఆశ కలిగించడం చేయాలి.
(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)