ఆత్మహత్యలకు, వాయు కాలుష్యానికి ఏమిటి సంబంధం?

    • రచయిత, రిచర్డ్ ఫిషర్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ఆత్మహత్యలను ఆపడం ఎలా? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు.

ఆత్మహత్యలు ఇప్పుడు ప్రజారోగ్యానికి సంబంధించిన అతిపెద్ద సమస్యగా మారాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ - డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ఏటా 7 లక్షల మంది తమ ప్రాణాలు తామే తీసుకుంటున్నారు.

అమెరికాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. గత రెండు దశాబ్దాలలో అమెరికాలో ఆత్మహత్యల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది.

సంపన్న దేశం, అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో నిరుడు ఒక్క ఏడాదిలోనే 50 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు.

అక్కడ ప్రతి 11 నిమిషాలకు ఒక ఆత్మహత్య నమోదవుతోంది. అమెరికాతో పోలిస్తే యూకేలో సూసైడ్స్ 25 శాతం తక్కువగా ఉన్నాయి.

ఈ మరణాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.

అయితే, ప్రభుత్వ, ప్రజారోగ్య శాఖ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా పరిస్థితులు మెరుగుపరచవచ్చని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధన సూచించింది.

మానసిక ఆరోగ్య సంరక్షణ, ఒంటరితనాన్ని దూరం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించొచ్చని పేర్కొంది.

ఉదాహరణకు, ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ఆత్మహత్య నిరోధక కేంద్రాల ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఫలితం సాధించింది డెన్మార్క్. ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నవారిని ఇలాంటి కేంద్రాలలో ఉంచి వారితో మార్పు తెచ్చి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి చాలామందిని బయట పడేయగలిగింది ఆ దేశం.

దీని ద్వారా ఆత్మహత్యల రేటును గణనీయంగా తగ్గించుకుందని 2018లో సైన్స్ జర్నల్‌లో పరిశోధకులు తెలిపారు.

కానీ ఇప్పుడు ఆత్మహత్యల నివారణ దిశగా సరికొత్త పరిశోధన జరుగుతోంది. గాలి నాణ్యత/స్వచ్ఛత‌కు ఆత్మహత్యలకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా పెరిగిన వాయు కాలుష్యానికి, ఆత్మహత్యలకు మధ్య సంబంధాన్ని పలు అధ్యయనాల్లో గుర్తించారు.

పరిశోధన ఏం చెబుతోంది?

యేల్ యూనివర్సిటీకి చెందిన సీయుల్కీ హియో, ఆమె సహోద్యోగులు వాయుకాలుష్యానికి, ఆత్మహత్యలకు మధ్య ఉన్న సంబంధంపై నిర్వహించిన 18 అధ్యయనాలను సమీక్షించారు.

కలపను తగలబెట్టడం, అడవులు కాలిపోవడం, భవన నిర్మాణాల సమయంలో విడుదలయ్యే ధూళి, అలాగే పరిశ్రమల నుంచి వచ్చే వాయువులు, ఇంధనాలు మండడం వల్ల, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాటి కారణంగా ఆత్మహత్యల ప్రమాదం పెరుగుతున్నట్లు వారు గుర్తించారు.

లండన్‌లోని యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఇసోబెల్ బ్రెయిత్‌వెయిట్ నేతృత్వంలో నిర్వహించిన పరిశోధనపై 2019లో జరిగిన సమీక్షలోనూ కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.

వివిధ అధ్యయనాలల్లో వెల్లడైన విషయాలు, డేటాను విశ్లేషించినప్పుడు.. వాయుకాలుష్యం మూడు రోజుల పాటు ఎక్కువగా ఉంటే ఆ సమయంలో ఆత్మహత్యలకు ప్రేరేపించే ఆలోచనలు పెరుగుతున్నట్లు గుర్తించారు.

దీర్ఘకాలిక వాయుకాలుష్యం డిప్రెషన్‌‌ను పెంచే అవకాశం ఉందని కనుగొన్నారు.

దీనిపై యూరప్, ఆసియాలో అనేక అధ్యయనాలు జరిగాయి. అయితే, ఇటీవల అమెరికా డేటాను విశ్లేషించినప్పుడు నగరాల్లో ఒక క్యూబిక్ మీటర్‌కు ఒక మైక్రో గ్రాము చొప్పున గాలిలో కాలుష్యకారకాలు పెరిగినప్పుడు రోజువారీ ఆత్మహత్యల రేటు 0.5 శాతం పెరిగినట్లు కేంబ్రిడ్జ్‌లోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ తన అధ్యయనపత్రంలో ప్రచురించింది.

అయితే, ఇతర అధ్యయనాల మాదిరిగా ఈ ప్రత్యేక పరిశోధన పత్రం పీర్-రివ్యూడ్ జర్నల్‌లో కనిపించలేదు.

జీవక్రియలో మార్పులేంటి?

జీవక్రియ ఎలా ఉండొచ్చనే విషయం కచ్చితంగా తెలియదు కానీ పరిశోధకులకు మాత్రం అనుమానాలున్నాయి.

ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే కాలుష్యం రక్తప్రవాహంలోకి, ఆపై మెదడుకు ఆక్సిజన్ సరఫరాను నిరోధిస్తుందని గుర్తించారు. ఇది ఇతర బలహీనతలకు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

కాలుష్యం మెదడులో వాపునకు దారితీయొచ్చని, అందువల్ల సెరోటోనిన్ లోటు ఏర్పడి ఒత్తిడికి గురైనప్పుడు ప్రతిస్పందించే పద్ధతులకు అంతరాయం కలిగిస్తుందని కొందరు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఇది నిరాశ, నిస్పృహలకు దారితీసే అవకాశాలను పెంచుతుంది.

చెడు గాలి మనుషుల ఆలోచనలను ప్రభావితం చేయడంతో పాటు, అది మెదడును పొగమంచులా చుట్టేసి వారికి తెలియకుండానే ఆత్మహత్య ఆలోచనలను ప్రోత్సహించే అవకాశం ఉంది.

హెచ్చరికలు..

యేల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ బృందాలు మెదడును ప్రభావితం చేసే కాలుష్య కారకాలను గుర్తిచడం కంటే, అధ్యయనాల్లోని గణాంకాలు, కాలుష్యానికి మెదడుకు మధ్య సంబంధం ఉందని తెలియజేసే సారూప్యతలపైకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రతి పరిశోధనలోనూ ఇతర విషయాలపై ప్రభావాన్ని కూడా పరిశీలించిన తరహాలోనే ఇతర పర్యావరణ ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉంది.

ఉదాహరణకు, హియో, ఆమె సహచరులు అధిక ఉష్ణోగ్రతలకు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

అలాగే, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరిగినట్లు కనుగొన్నారు.

ఉష్ణోగ్రతలు 7 సెల్సియస్ పెరిగితే, ఆత్మహత్యల రేటు 9 శాతం పెరిగిందని యేల్‌కి చెందని సహ రచయిత మిచెల్ బెల్ వివరించారు.

''ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల పెద్ద ప్రమాదం పొంచి ఉంది'' అని ఆమె చెప్పారు.

అలాగే, అధిక ఉష్ణోగ్రతలు భారీ వాయు కాలుష్యానికి దారితీస్తాయని హియో బృందం తమ సమీక్షలో పేర్కొంది.

వాయుకాలుష్యం స్రీ, పురుషుల్లో ఆత్మహత్య ఆలోచనలకు సంబంధించి వేర్వేరు ప్రభావం చూపుతోందా అనే అనిశ్చితి నెలకొంది. స్రీ, పురుష ఆత్మహత్యల్లో భారీ వ్యత్యాసం ఉండడమే అందుకు కారణం. అమెరికాలో గతేడాది నమోదైన ఆత్మహత్యల్లో 80 శాతం పురుషులవే.

వాయుకాలుష్యం వల్ల వ్యాధులు

కలుషితమైన గాలిని పీల్చడం వల్ల అనేక సమస్యలు వస్తాయని సైన్స్ చెబుతోంది.

బలవన్మరణాలు, అందుకు గల కారణాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీని ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా డబ్ల్యూహెచ్‌వో నిర్వహిస్తోంది.

సెప్టెంబర్ 7న ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ డేని నిర్వహించింది.

దీని ద్వారా వాయుకాలుష్యం వల్ల కలిగే అనర్థాలపై నిర్వాహకులు అవగాహన కల్పిస్తున్నారు.

''కంటికి కనిపించని కాలుష్య కారకాలు ఊపరితిత్తుల్లోకి, రక్తంలోకి చొచ్చుకుపోయి శ్వాసకోస సంబంధిత వ్యాధులు, స్ట్రోక్స్‌కు కారణమవుతున్నాయి. ఊపరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట ఒక వంతు, గుండెపోటు మరణాల్లో నాలుగింట ఒక వంతు వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి.''

నివారించడమెలా?

ఆత్మహత్యలను తగ్గించడానికి డెన్మార్క్ తరహాలో వివిధ స్థాయిల్లో చర్యలు అవసరమని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వాయుకాలుష్యం వల్ల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. అయితే, వాయుకాలుష్యాన్ని నివారించడం వల్ల సమస్య మొత్తం పరిష్కారం కాదు.

వాయుకాలుష్యం, ఆత్మహత్యలకు మధ్య సంబంధంపై మరిన్ని పరిశోధనలు జరిగి ఎక్కువ విషయాలు తెలిస్తే ప్రజలకు హెచ్చరికలు చేయడం, వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు దోహదపడుతుందని హియో, ఆమె సహచరులు చెప్పారు.

వాతావరణ మార్పుల కారణంగా ఎడారీకరణ, కరువు, అడవులు కాలిపోవడం వంటి వాటి వల్ల వాయుకాలుష్యం మరింత పెరిగిపోయే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.

వీటి వల్ల ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)