You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇస్లాం: సౌదీ యువరాజు రాజ్‌ఘాట్‌ను ఎందుకు సందర్శించ లేదు?
- రచయిత, ఫైసల్ మొహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన పలువురు దేశాధినేతలు గత ఆదివారం రాజ్‌ఘాట్‌కు వచ్చి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.
ఆదివారం ఉదయం దిల్లీలో వర్షం కురిసినప్పటికీ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సహా ఇతర నాయకులు రాజ్‌ఘాట్‌లో కనిపించారు.
వారిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఉన్నారు.
జీ20 సదస్సుకు వారే కాకుండా వివిధ దేశాల నేతలు దీల్లీకి వచ్చారు.
మహ్మద్ బిన్ సల్మాన్ రాజ్‌ఘాట్‌కు ఎందుకు రాలేదు?
అయితే, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ రాజ్‌ఘాట్‌కు రాలేదు. సదస్సులో పాల్గొనేందుకు ఆయన శనివారమే దిల్లీకి చేరుకున్నారు.
సౌదీ యువరాజు రాజ్‌ఘాట్‌కు రాకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
యువరాజు మహ్మద్ రాజ్‌ఘాట్‌కి రాకపోవడానికి కారణం మహాత్మా గాంధీపై గౌరవం లేకపోవడం కాదని, 'సలాఫీ' సంప్రదాయమే కారణమని నిపుణులు అంటున్నారు.
“సలాఫీలు లేదా అహ్ల్-ఎ-హదీత్ ప్రకారం వారు ఎలాంటి సమాధులను సందర్శించేందుకు వెళ్లరు'' అని జామియా మిలియా ఇస్లామియాలోని జాకీర్ హుస్సేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇస్లామిక్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ అఖ్తరుల్ వాసే అన్నారు.
‘సలాఫీని అనుసరించే వారికి సమాధులను శాశ్వతం చేయడం కూడా తప్పుగా భావిస్తారు’ అని ఇస్లామిక్ స్కాలర్ జాఫరుల్ ఇస్లాం ఖాన్ చెప్పారు.
ఇస్లామిక్ న్యాయశాస్త్రం లేదా ఫిఖ్ (యూదుల విశ్వాసం)లో అయిదు ప్రధాన విభాగాలున్నాయి. హనాఫీ, షఫీ, మాలికి, హంబలీ, జాఫారి.
జాఫారీ లేదా ఫిఖ్ షియా వర్గానికి చెందినవారు. మిగిలిన నలుగురు సున్నీ వర్గానికి చెందినవారు.
భారతదేశంలోని చాలా మంది ముస్లింలు హనాఫీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు.
అహ్ల్ హదీత్ అంటే ఏంటి?
సలాఫీ లేదా అహ్ల్ హదీత్ పాటించే వారు తాము భిన్నమని భావిస్తారు.
ఈ సిద్ధాంతాలన్నీ ఇస్లాం చివరి మొహమ్మద్ ప్రవక్త మరణించిన శతాబ్దాల తర్వాత ఉనికిలోకి వచ్చాయని, వాటిని ఇస్లాం గురించి ఇమామ్‌ల బోధనలుగా వారు విశ్వసిస్తారు.
అందువల్ల, మొహమ్మద్ ప్రవక్త జీవితానికి భిన్నంగా ఉండే అనేక విషయాలు ఆ విశ్వాసాల్లోకి వచ్చి చేరాయి.
అహ్ల్-ఎ-హదీత్ సంప్రదాయం పాటించే వారు కేవలం ఇస్లాం, ఖురాన్, హదీత్‌ల పవిత్ర గ్రంథాల ప్రకారం మాత్రమే ఇస్లాంను అనుసరిస్తారు.
హదీత్ అంటే మొహమ్మద్ ప్రవక్త సూక్తులు, ప్రవక్త చేసిన చర్యల ఆధారంగా సేకరించిన విషయాలు.
''19వ శతాబ్దంలో భారతదేశంలో వహాబియాత్ (అహ్ల్-ఎ-హదీత్ లేదా సలాఫీ సంప్రదాయం) వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు బ్రిటీష్ వాళ్లు వారిని ఘైర్ - ముకల్లిద్ అని ప్రస్తావించారు. అంటే, ఎవరినీ అనుసరించని వారు'' అని జాఫరుల్ ఇస్లాం చెప్పారు.
"కేవలం మూడు ప్రదేశాలను సందర్శించేందుకే వారు మొగ్గుచూపుతారు. మస్జిదుల్ హరామ్ అంటే కాబా, మస్జిదుల్ నబవి, మస్జిదుల్ అక్సా" అని ప్రొఫెసర్ అఖ్తరుల్ వాసే అన్నారు.
సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న కాబా నిర్మాణం ఇస్లాం ప్రవక్త ఇబ్రహీంకి సంబంధించినది.
మదీనాలోని మస్జిదుల్ నబవీలో ప్రవక్త మహమ్మద్ సమాధి ఉంది.
అక్సా మసీదు జెరూసలేంలో ఉంది. ప్రవక్త ఇక్కడి నుంచే స్వర్గానికి వెళ్లారని ముస్లింలు విశ్వసిస్తారు.
ప్రవక్త సమాధిపై స్పష్టత లేదు
మదీనాలోని సమాధి మొహమ్మద్ ప్రవక్తదేనన్న ధ్రువీకరణలు లేవు. దాని చుట్టూ ఎన్నో వాదనలు ఉన్నాయి.
మక్కా, మదీనాలోని ప్రవక్త కుటుంబ సభ్యులు, ఆయన సహచరుల సమాధులను కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే, సలాఫీ సంప్రదాయంలో అలాంటి వాటికి చోటులేదు.
తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దొవాన్ రాజ్‌ఘాట్‌కు వెళ్లారని, ఆయన హనాఫీ సంప్రదాయానికి చెందిన వారని ప్రొఫెసర్ వాసే చెప్పారు.
ఇస్లాం మతంలోని వివిధ సంప్రదాయాలను పాటించడం కూడా అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, పోటీకి ప్రధాన కారణాల్లో ఒకటి.
సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దశాబ్దాల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు కూడా ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. దౌత్య సంబంధాలు కూడా తిరిగి ఏర్పడ్డాయి.
ఒక ముస్లింగా ఉండాలంటే, దేవుడు ఒక్కడేనన్న విశ్వాసంతో పాటు, మొహమ్మద్ ప్రవక్తే ఇస్లాంలో చివరి ప్రవక్త, మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందనే విశ్వాసం ఉండాలని ఇస్లామిక్ నిపుణులు చెబుతున్నారు.
ఈ మూడింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. ప్రవక్త, ఆయన సహచరుల మరణం తర్వాత వివిధ ఇమామ్‌లు మతపరమైన గ్రంథాలను, సంఘటనలను వారికి నచ్చినట్టుగా వివరించడం మొదలైంది.
ఈ వివరణలలో భౌగోళిక పరిస్థితులు, ఇతర కారణాలు ఉన్నాయి. దీంతో విభేదాలు కూడా మొదలయ్యాయి.
అయితే, ఈ విషయంలో షియాలు, సున్నీల మధ్య విభేదాలకు చాలా చరిత్ర ఉంది.
ఇవి కూడా చదవండి:
- స్పిరిచ్యువల్ హీలర్స్: 'ఆధ్యాత్మిక స్వస్థత' పేరుతో రహస్యంగా సాగుతున్న లైంగిక దోపిడీ... బీబీసీ పరిశోధనలో బయటపడిన అక్రమాలు
- హరియాణా - నూహ్: 'అవన్నీ రాళ్ళు విసిరిన వారి నిర్మాణాలే, జాలి చూపించాల్సిన పని లేదు... కూల్చేయండి' - గ్రౌండ్ రిపోర్ట్
- అహ్మదీయులు ముస్లింలు కాదా, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు లేఖపై ఏమిటీ వివాదం?
- బ్యూటీ పార్లర్లపై నిషేధం: అవి మా అందాన్నేకాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి, కానీ ఇప్పుడు....
- ‘‘జైల్లో కెమెరాల ముందు దుస్తులు విప్పించారు.. శానిటరీ ప్యాడ్లు, టాంపాన్లను తొలగించమన్నారు’’-ఇరాన్ మహిళల ఆరోపణ