అహ్మదీయులు ముస్లింలు కాదా, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు లేఖపై ఏమిటీ వివాదం?

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు వివాదంలో ఇరుక్కుంది. ముస్లింలలో అహ్మదీయులకు చోటులేదని ఇటీవల బోర్డు ఇచ్చిన ఉత్తర్వులతో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

చివరకు కేంద్ర వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదులు రావడంతో కేంద్రం సీరియస్ అయింది. ఏపీ వక్ఫ్ బోర్డు ఉత్తర్వులను ద్వేష పూరిత ప్రచారంగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

అయితే, తమ పేరుతో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటోంది ఏపీ వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగత హోదాలో చేసిన వ్యాఖ్యలకు బోర్డుతో సంబంధం లేదని చెబుతోంది.

దాంతో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ లేఖ ఆధారంగా మొదలయిన వివాదం పలు మలుపులు తిరుగుతోంది. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

ఇంతకీ ఈ వివాదం ఎలా మొదలైంది, ఏపీ వక్ఫ్ బోర్డులో ఏం జరుగుతోంది?

వివాదానికి అదే మూలం

జాతీయ స్థాయిలో అహ్మదీయ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సదార్ అంజూమన్ అహ్మదీయ సంస్థ కేంద్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఏపీ వక్ఫ్ బోర్డు చేసిన తీర్మానం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది, ఏపీ వక్ఫ్ బోర్డు వైఖరిని తప్పుబట్టింది.

ఏపీలో అహ్మదీయులను కాఫిర్లుగా పేర్కొంటూ వారు ముస్లింలు కాదని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌ ఖాదర్ బాషా పేరుతో వచ్చిన లేఖ ఈ వివాదానికి మూలం.

2023 ఫిబ్రవరి 3వ తేదీన విడుదలైన ఈ లేఖను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఫిర్యాదు లేఖతో అహ్మదీయుల ప్రతినిధి బృందం అందించింది. దాని ఆధారంగా ఏపీలో తమకు అన్యాయం జరుగుతోందంటూ విన్నవించింది.

‘‘మాకు సంబంధమే లేదు...’’

కేంద్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల శాఖ దీనిపై స్పందిస్తూ ఏపీ వక్ఫ్ బోర్డు తీరును తప్పుబట్టింది. వక్ఫ్ బోర్డు నిర్ణయం విద్వేషపూరిత చర్చగా పేర్కొంది.

కొన్ని వక్ఫ్ బోర్డులు అహ్మదీయ సమాజాన్ని వ్యతిరేకిస్తున్నాయంటూ, చట్ట విరుద్ధమైన తీర్మానాలు చేస్తున్న తీరు మీద చర్యలు తీసుకోవాలని అహ్మదీయ సమాజం కోరిన నేపథ్యంలో ఏపీ వక్ఫ్ బోర్డుకు కేంద్రం నుంచి లేఖ రాశారు.

అహ్మదీయులతో పాటుగా ఏ సమాజానికీ మతపరమైన గుర్తింపులు నిర్ధరించే అధికారం ఏపీ వక్ఫ్ బోర్డుకు లేదంటూ కేంద్రం తేల్చి చెప్పింది.

వక్ఫ్ చట్టం 1995 ద్వారా ఏర్పడిన వక్ఫ్ బోర్డులు కేవలం దేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిరక్షణ బాధ్యత మాత్రమే నిర్వహించాల్సి ఉంటుందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సూచించింది. తమ పరిధికి మించి రాష్ట్ర వక్ఫ్ బోర్డులు వ్యవహరించకూడదని ఆదేశించింది.

అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన ఆయా వక్ఫ్ బోర్డులు, తమ రాష్ట్రానికి సంబంధం లేని ఫత్వాలను అనుసరించి నిర్ణయాలు చేయడం తగదంటూ పేర్కొంది.

ఈ పరిణామాలపై ఏపీ వక్ఫ్ బోర్డు స్పందించింది. వక్ఫ్ బోర్డు సీఈవో అబ్దుల్ ఖాదర్ బీబీసీతో మాట్లాడారు.

"కేంద్ర ప్రభుత్వానికి అహ్మదీయ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుపై మాకు కేంద్రం నుంచి లేఖ వచ్చింది. అయితే ఏపీ వక్ఫ్ బోర్డు అలాంటి తీర్మానం ఏదీ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2012 ఫిబ్రవరి 18నాడు తీర్మానం నెం. 99 గా చేసిన తీర్మానాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. దాని మీద తెలంగాణ హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. రిట్ పిటిషన్ నంబర్ 14502గా అది విచారణలో ఉంది. ఆ కేసు, దానికి సంబంధించిన సమాచారం అంతా తెలంగాణ వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉంది. ఏపీకి సంబంధం లేదు" అని ఆయన వివరించారు.

అయితే ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వ్యక్తిగత హోదాలో రాసిన లేఖను తీర్మానంగా ప్రస్తావిస్తున్నారంటూ ఆయన వివరించారు. ఏపీ వక్ఫ్ బోర్డులో అలాంటి తీర్మానం చేయలేదని ఆయన చెప్పారు.

చైర్మన్ తీరుపై విమర్శలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండగా నాటి ఏపీ వక్ఫ్ బోర్డు చేసిన తీర్మానంపై అప్పట్లో దాఖలైన పిటిషన్‌పై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నేటికీ ఆ స్టే అమలులో ఉంది. అయితే అమలులోని తీర్మానం అనుసరించి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ సంతకంతో వచ్చిన ప్రకటనతో మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ లేఖలో 2009 మే 6 నాటి జమాయతే ఉలేమా ద్వారా జారీ అయిన ఫత్వాని ప్రస్తావించారు. దానిని అనుసరించి అహ్మదీయులను కాఫిర్లు అంటూ ఆయన విడుదల చేసిన ప్రకటన పట్ల స్పందించాలంటూ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషాను బీబీసీ సంప్రదించింది. కానీ ఆయన మాత్రం అందుబాటులోకి రాలేదు.

అహ్మదీయులు, ఖాదీయాన్‌కు సంబంధించి తాము ఎటువంటి తీర్మానం చేయలేదని ఏపీ వక్ఫ్ బోర్డు తెలిపింది. కానీ లెటర్ హెడ్‌పై ఫత్వాని ప్రస్తావిస్తూ లేఖ విడుదల చేసిన చైర్మన్ మాత్రం స్పందించడం లేదు.

చైర్మన్ తీరును పలువురు తప్పుబడుతున్నారు. ముస్లిం సమాజంలో విభజన ప్రయత్నాలు చేస్తున్నారంటూ గుంటూరుకు చెందిన ముస్లిం సంఘాల ప్రతినిధి రియాజ్ వ్యాఖ్యానించారు.

"దేశంలో మైనార్టీల మీద దాడులు పెరుగుతున్నాయి. అంతా ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉంది. పస్మాంద ముస్లింలనే పేరుతో ముస్లింలను విభజించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వారికి వంతపాడేలా ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ తీరు ఉంది. ముస్లింలలో విభేదాలున్న మాట వాస్తవమే. కానీ వాటిని ప్రస్తావించాల్సిన అవసరం ఇప్పుడు లేదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

విభేదాలు పెంచే పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.

మద్దతు పలుకుతున్న కొన్ని ముస్లిం సంస్థలు

అహ్మదీయులకు సంబంధించి ఎటువంటి తీర్మానం చేయలేదని ఏపీ వక్ఫ్ బోర్డు అధికారులు చెబుతుండగా కొన్ని ముస్లిం సంస్థలు మాత్రం అహ్మదీయులను ముస్లింలు కాదంటూ వాదిస్తున్నాయి. అంతేగాకుండా ఏపీ వక్ఫ్ బోర్డు తీర్మానాన్ని ఆహ్వానిస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి.

తాజాగా జమాయత్ ఉలేమా-ఇ-హింద్ ఓ తీర్మానం ఆమోదించింది. ఏపీ వక్ఫ్ బోర్డుకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించింది. ముస్లింల అభిప్రాయాన్ని ఏపీ వక్ఫ్ బోర్డు నిర్ణయం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఏపీ వక్ఫ్ బోర్డు తీర్మానం మీద మైనార్టీ సంక్షేమ శాఖ వైఖరిని తప్పుబట్టడింది.

దాంతో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ లేఖపై మొదలైన ఈ వివాదం పలు మలుపులు తిరుగుతోంది. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

పాకిస్తాన్‌కు భిన్నంగా...

ముస్లింలలో సున్నీ తెగకు చెందిన అహ్మదీయులకు సమాన హక్కులు నిరాకరించే ధోరణి అనేక చోట్ల ఉంది. పాకిస్తాన్‌లో ఇది బహిరంగంగానే సాగుతుంది. వారిని ముస్లింలుగా పాకిస్తాన్‌లో మత పెద్దలు అంగీకరించడం లేదు. అహ్మదీయ కమ్యూనిటీ సమాన హక్కుల కోసం అక్కడ చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది.

19వ శతాబ్దంలో పంజాబ్‌ కేంద్రంగా ఇస్లామిక్ మత పునరుజ్జీవన ఉద్యమంగా అహ్మదీయులు ఆవిర్భవించారు. అహ్మద్ బోధనలను అనుసరించే వారందరినీ అహ్మదీయులుగా భావిస్తారు. వారిని ఖాదియన్లు అని కూడా అంటుంటారు.

దేశ విభజన సమయంలో భారత్‌లో ఉన్న అహ్మదీయుల సంఖ్య స్వల్పం. అయినప్పటికీ నేటికీ వారి ఉనికి ఉంది. ఏపీలో వారి సంఖ్య మరింత తక్కువగా ఉందని వక్ఫ్ బోర్డు కూడా చెబుతోంది.

పాకిస్తాన్‌కు భిన్నంగా భారత్‌లో మైనార్టీ సంక్షేమం కింద అన్ని హక్కులు అనుభవిస్తున్నారు. అహ్మదీయ ముస్లిం జమాత్ ఇండియా అనే సంస్థ వారికి ప్రతినిధిగా ఉంది. వివిధ సందర్భాల్లో అహ్మదీయుల హక్కుల కోసం ప్రయత్నాలు చేసింది. తాజాగా ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ లేఖ తెరమీదకు రావడంతో స్పందించింది.

కేంద్ర ప్రభుత్వానికి తాము వివరణ ఇచ్చామని, వివాదం సమసిపోయినట్టేనని ఏపీ వక్ఫ్ బోర్డు చెబుతోంది. అయితే తాజా పరిణామాల తర్వాత ఏపీ వక్ఫ్ బోర్డు కొత్త సీఈవోగా పి. బషీర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇకనైనా వక్ఫ్ బోర్డు నాయకత్వం సామరస్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అనంతపురం నగరానికి చెందిన ముస్లిం నేత సిరాజుద్దీన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)