You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు ఎవరు?
- రచయిత, రజనీష్ కుమార్ మరియు వాత్సల్య రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
తాజ్‌మహల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ భారతదేశంలో మాత్రం రాజకీయాల కారణంగా అది వివాదాల్లో చిక్కింది.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు.
మొదట ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం టూరిజం బుక్‌లెట్ నుంచి తాజ్ మహల్‌ను తొలగించింది.
ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తాజ్‌మహల్‌ను ఒక దురాక్రమణదారుడు నిర్మించాడని అంటున్నారు.
భారతీయ సంస్కృతిపై తాజ్‌మహల్ ఒక మచ్చ అని పేర్కొన్నారు.
గతంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజ్‌మహల్ భారత సంస్కృతిని ప్రతిబింబించదు అన్నారు. అక్బర్‌ను ఆయన దురాక్రమణదారుగా అభివర్ణించారు.
మరోవైపు రాజస్థాన్‌లో రాజ్‌పుత్ పాలకుడు మహారాణా ప్రతాప్ హల్దీ ఘాటి యుద్ధంలో మొఘల్ చక్రవర్తి అక్బర్‌ను ఓడించినట్లు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
భారతదేశంలో మితవాద పక్షం కేవలం బ్రిటిష్ పాలనను మాత్రమే కాదు, మధ్య యుగాన్ని కూడా 'బానిస భారతం'గా పేర్కొంటోంది.
బ్రిటిష్ పాలకులు రావడానికి 200 ఏళ్ల ముందు కూడా భారతదేశం బానిసత్వంలో ఉందా? మొఘల్ పాలకులు విదేశీయులా?
ఈ ప్రశ్నలను చరిత్రకారులు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్, ప్రొఫెసర్ రామనాథ్, ప్రొఫెసర్ హర్బన్స్ ముఖియాల ముందు ఉంచాం.
ఇర్ఫాన్ హబీబ్
చరిత్రను ఎవరూ తుడిచేయలేరు. తాజ్ మహల్‌ను కూల్చేసినా, అది చరిత్రలో నిలిచే ఉంటుంది.
వీళ్లు ముస్లింలను విదేశీయులు అని అంటున్నారు. బయట నుంచి మన దేశానికి వచ్చి, ఇక్కడ సంపదను తరలించుకుపోతే వారిని విదేశీయులు అంటారు.
మొఘల్ పాలకులు, విదేశీ పాలకుల మధ్య తేడాను చూడాలి. వీళ్లు 'విదేశీయులు' అని అంటున్న వారంతా ఇక్కడే పుట్టి, ఇక్కడే మరణించారు.
మొఘల్ పాలకులను దురాక్రమణదారులు అంటే, గుజరాత్‌పై దాడి చేసిన మౌర్య పాలకులు ఏమౌతారు?
గుజరాత్, మగధలు రెండు వేర్వేరు దేశాలు అనుకుంటే, మౌర్యులూ విదేశీయులే.
వీళ్లు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం వ్యతిరేక, దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారు.
హర్బన్స్ ముఖియా
అక్బర్ ఎన్నడూ భారతదేశం బయటకు వెళ్లలేదు. అక్బర్ అనంతరం వచ్చిన పాలకులు కూడా భారత్‌లో జన్మించిన వాళ్లే. వాళ్లెవరూ కూడా భారత్ బయట అడుగు పెట్టలేదు. అందువల్ల విదేశీ అనే మాటే తలెత్తదు.
విదేశీయులంటే ఆంగ్లేయులు. వాళ్లు భారతదేశానికి వచ్చి 200 ఏళ్లపాటు దేశాన్ని లూటీ చేశారు.
భారతదేశానికి వచ్చి, ఇక్కడే స్థిరపడి, ఈ మట్టిలోనే కలిసిపోయిన వారిని విదేశీయులని ఎలా అంటారు?
విదేశీ అన్న భావన 18, 19వ శతాబ్దాలలోనే ఏర్పడింది. 16వ శతాబ్దంలో ఆ భావన లేదు.
ఇవాళ కొందరు మళ్లీ హిందూ వర్సెస్ ముస్లింల చరిత్ర రాయాలని ప్రయత్నిస్తున్నారు.
రామ్‌నాథ్
అక్బర్, షాజహాన్‌లను దోపిడీ దొంగలు అంటున్న వీళ్లకు నిజంగా వాళ్ల గురించి తెలీదు . అక్బర్ మొఘల్ సామ్రాజ్యానికి ఒక దేశంలాంటి రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు బుద్ధుని విగ్రహాన్ని కూల్చారు. తాలిబన్లు చేసిన పనే ఇక్కడ వీళ్లూ చేయాలనుకుంటున్నారా?
మొఘలులు మన చరిత్ర, సంస్కృతిలో భాగం. అమీర్ ఖుస్రోను మనం ఎలా మరిచిపోగలం?
నిజానిజాలు చర్చల ద్వారానే తేలుతాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)