You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తాజ్‌మహల్‌ను దేశద్రోహులు నిర్మించారన్న బీజేపీ ఎమ్మెల్యే, ఘాటుగా స్పందించిన ఓవైసీ
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మీరట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్‌ను దేశద్రోహులు నిర్మించారని, ఇది భారత సంస్కృతిపై దాడి అని ఆయన అభివర్ణించారు.
సంగీత్ సోమ్‌పై 2013లో ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలను రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆనాటి హిందూ-ముస్లిం ఘర్షణల్లో 62మంది చనిపోయారు.
కొన్ని వారాల క్రితమే తాజ్‌మహల్‌ను పర్యాటక కేంద్రాల జాబితా నుంచి ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ తొలగించింది. ఈ వివాదం సద్దుమణగకముందే బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పర్యాటక కేంద్రాల జాబితా నుంచి తాజ్‌మహల్ తొలగించారంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ ఆరోపించారు. 'ఏది చరిత్ర.. ఎక్కడిది చరిత్ర? హిందువులను సర్వనాశనం చేయాలని చూసిన వ్యక్తిది చరిత్రేనా?' అని ప్రశ్నించారు.
అలాంటి వ్యక్తి పేరు చరిత్రలో ఉంటే అది నిజంగా దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. చరిత్ర తిరగ రాయడం ఖాయం. దానికి నేను గ్యారంటీ అని కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే అన్నారు.
హిందువులను, భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్మించిన తాజ్‌మహల్‌ను చరిత్రగా పిలుస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ చరిత్రగా భావిస్తే దాన్ని తప్పకుండా మార్చాల్సిందేనని సంగీత్ సోమ్ అన్నారు.
తమ ప్రభుత్వం మహారాణా ప్రతాప్, శివాజీ జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. అక్బర్, ఔరంగజేబ్, బాబర్ అంటూ చరిత్ర పుస్తకాల్లో కల్పిత కథలను పొందుపరిచారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.
సంగీత్ సోమ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చరిత్ర చెరిపితే చెరిగిపోదు!
బీజేపీ ఎమ్మెల్యే సోమ్ వ్యాఖ్యలపై ఎంఐఎం నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.
'ఎర్రకోటను కూడా మీరు దేశద్రోహులుగా భావిస్తున్న వాళ్లే నిర్మించారు. అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ప్రధాని మోదీ ఆపేస్తారా' అని ట్వీట్ చేశారు.
'ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌ను కూడా వాళ్లే నిర్మించారు. అక్కడ విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం ఆపేస్తారా' అని అసద్ మరో ట్వీట్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై చాలామంది స్పందించారు.
ప్రపంచ వింతల్లో తాజ్‌మహల్ ఒకటని, ఎనిమిదో వింతగా బీజేపీ త్వరలో ఆ జాబితాలో చేరుతుందని కౌషిక్ ట్వీట్ చేశారు.
తాజ్‌మహల్ దేశానికే గర్వకారణమని నరేంద్ర అన్నారు. ఎన్నో చారిత్రక కట్టడాలకు భారతదేశం నిలయమని చెప్పారు.
తాజ్‌మహల్ దేశద్రోహులు నిర్మించారని భావిస్తే, ఎర్రకోట సంగతేంటని సయీద్ హీనా ప్రశ్నించారు.
బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌కు మద్దతుగా సోనమ్ మహాజన్ ట్వీట్ చేశారు. తాజ్‌మహల్ భారతీయ సంస్కృతిపై దాడి అని అభిప్రాయపడ్డారు. షాజహాన్ హిందువులను లక్ష్యంగా చేసుకుని, ఆలయాలను కొల్లగొట్టారని ట్వీట్ చేశారు.
అయితే, సంగీత్ సోమ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. తాజ్‌మహల్ దేశచరిత్రలో అత్యంత కీలకమని ఆ పార్టీ ప్రతినిధి కోహ్లీ అన్నట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. చరిత్రలో ఏం జరిగిందో మార్చలేం కానీ దానిని సరిగా రాయాలని అభిప్రాయపడ్డారు.
మొఘల్ సామ్రాజ్యాధిపతి షాజహాన్ తన భార్య జ్ఞాపకంగా 1643లో తాజ్మహల్ నిర్మించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)