9/11 దాడులు: అమెరికా ట్విన్ టవర్స్‌ను విమానాలతో ఎలా కూల్చారు... ఆ రోజంతా అసలేం జరిగింది?

    • రచయిత, అనా పైస్, సిసిలియా టోంబేసి
    • హోదా, బీబీసీ న్యూస్ ముండో

అది 2001, సెప్టెంబర్ 11.

ఆ రోజు ఉదయాన నాలుగు విమానాలు హైజాక్ అయ్యాయి. అవి అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తికి చిహ్నాలైన రెండు భారీ భవనాల్లోకి దూసుకెళ్లాయి.

2,996 మంది మరణానికి కారణమైన 9/11 దాడులు అమెరికా చరిత్రలోనే అతి పెద్ద దాడులు. దాని పర్యవసానాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

ఈ దాడుల తరువాతే అమెరికా 'ఉగ్రవాదంపై యుద్ధం' ప్రారంభించి ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో దాడులు చేసింది.

సెప్టెంబరు 11 ఉదయం 149 నిమిషాల పాటు సాగిన ఆ బీభత్సం పూర్తి వివరాలు ఇవిగో.

ఉదయం 07:59 గంటలు

లాస్ఏంజెలస్ వెళ్లాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 (ఏఏ11) బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరింది. పైలట్, సహ పైలట్, తొమ్మిది మంది సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు.

అందులో ఉన్న 81 మంది ప్రయాణికులలో ఈజిప్ట్‌కు చెందిన మొహమ్మద్ అట్టా నేతృత్వంలోని అయిదుగురు హైజాకర్లు కూడా ఉన్నారు. వారు తమ పథకం అమలుకు సిద్ధమవుతున్నారు.

అప్పటికి అయిదేళ్ల కిందటే అఫ్గానిస్తాన్‌లోని అల్ ఖైదా స్థావరంలో ఈ పథక రచన మొదలైంది.

ఈ దాడులకు రూపకర్తగా ఆరోపణలున్న పాకిస్తానీ తీవ్రవాది ఖాలిద్ షేక్ మొహమ్మద్.. ఇస్లామిస్ట్‌లకు పైలట్ శిక్షణ ఇచ్చి వారితో విమానాలు హైజాక్ చేయించి అమెరికాపై దాడులు చేయాలన్న పథకం వేశారు.

ఈ పథకానికి ఒసామా బిన్ లాదెన్ ఆమోద ముద్ర వేశారు. అమెరికా గూఢచర్య సంస్థల నిఘాలో ఉన్న సౌదీ బిలియనీర్ ఒసామా బిన్ లాదెన్ అల్ ఖైదాలో కీలక నేత.

08:14

బోస్టన్ ఎయిర్‌పోర్ట్‌లోనే మరో టెర్మినల్ నుంచి యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఏ 175 విమానం కూడా 9 మంది సిబ్బంది, 56 మంది ప్రయాణికులతో లాస్‌ఏంజెలస్ బయలుదేరింది.

అందులో ప్రయాణిస్తున్న 56 మందిలో కూడా అయిదుగురు హైజాకర్ల బృందం ఒకటి ఉంది.

ఈ విమానం బయలుదేరే సమయానికి మొదటి విమానం(ఫ్లైట్ ఏఏ11)లో ఉన్న హైజాకర్లు కాక్‌పిట్‌లో ప్రవేశించి విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు.

అప్పటికే ఇద్దరు విమాన సిబ్బందిని హైజాకర్లు పొడిచేశారు. హైజాకర్ల బృందానికి నేతృత్వం వహించిన అట్టా, మరో హైజాకర్ వెంట రాగా తాను కూర్చున్న చోటి నుంచి బిజినెస్ క్లాస్‌లోకి వెళ్లారు.

ఈలోగా అయిదో హైజాకర్ ఒక ప్రయాణికుడిని పొడిచేశాడు.

చనిపోయిన ప్రయాణికుడు డేనియల్ లెవిన్ ఇజ్రాయెల్‌ ఆర్మీలో నాలుగేళ్లు పనిచేసిన వ్యక్తి. అట్టా వెనుక సీట్లో కూర్చున్న ఆయన ఈ హైజాక్ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్లే చంపేసినట్లు భావిస్తున్నారు.

08:20

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 77 (ఏఏ 77) వాషింగ్టన్ డీసీ విమానాశ్రయం నుంచి ఆరుగురు సిబ్బంది, 58 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆ ప్రయాణికుల్లోనూ అయిదుగురు హైజాకర్లున్నారు.

ఇది కూడా లాస్ ఏంజెలస్ వెళ్లాల్సిన విమానమే.

ఈ విమానాలన్నీ ఒక తీరప్రాంత నగరం నుంచి మరో తీర ప్రాంత నగరానికి బయలుదేరినవే.

వీటిలో సుమారు 43 వేల లీటర్ల ఇంధనం ఉంది. దీంతో ఈ విమానాలు హైజాకర్ల చేతుల్లో గైడెడ్ మిసైళ్లలా మారాయి.

08:24

మొహమ్మద్ అట్టా ప్రయాణికులనుద్దేశించి మాట్లాడి విమానం హైజాక్ చేశామని చెప్పాలనుకున్నారు. కానీ, ఆయన ఒక బటన్‌కు బదులు వేరే బటన్ నొక్కడంతో ఆయన సందేశం బోస్టన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు చేరింది.

ఆ ఒక్క విమానమే కాదని, చాలా విమానాలు హైజాక్ అయ్యాయని అట్టా చెప్పారు.

మొదట ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కొంత గందరగోళానికి గురైనప్పటికీ అట్టా నుంచి వచ్చిన రెండో మెసేజ్‌తో ఫ్లైట్ ఏఏ11 హైజాక్ అయినట్లు స్పష్టమైపోయింది.

అయితే, ఆ వెంటనే హైజాకర్లు విమానంలోని ట్రాన్స్పాండర్‌ను ఆపేశారు. విమానం వేగం, దిశ, ఎంత ఎత్తులో వెళ్తోంది వంటివన్నీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలుసుకోవడానికి ఈ ట్రాన్స్పాండర్ ఉపయోగపడుతుంది.

దాన్ని ఆపేయడంతో విమానం ఎక్కడుందో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ కనిపెట్టలేకపోయింది.

ఈలోగా హైజాక్ సమాచారం యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కి చేరింది.

అట్టా తన సందేశంలో చెప్పిన ''మా దగ్గర చాలా విమానాలున్నాయి'' అనే మాట ఎట్టకేలకు ఎఫ్ఏఏ అధికారులకు అర్థమయ్యే సరికే హైజాక్ జరిగి అరగంట దాటిపోయింది.

08:42

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93(యూఏ 93) న్యూజెర్సీలోని నెవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లేందుకు టేకాఫ్ అయింది.

ఆ విమానం 8 గంటలకే బయలుదేరాల్సి ఉన్నప్పటికీ ఉదయం వేళ ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఆలస్యమైంది.

విమానంలో ఏడుగురు సిబ్బంది, 37 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో నలుగురు హైజాకర్లు.

హైజాక్ అయిన మిగతా మూడు విమానాల్లో అయిదుగురు చొప్పున హైజాకర్లు ఉండగా ఇందులో మాత్రం నలుగురే ఉన్నారు.

యూఏ 93 టేకాఫ్ అవుతున్న సమయంలోనే యూఏ 175 ఆకాశ మార్గంలో హైజాక్ అయింది.

08:44

ఏఏ 11 హైజాక్ అయిన అరగంట తరువాత నిర్మలమైన న్యూయార్క్‌ గగనతలంలోకి ప్రవేశించింది. ఆకాశంలో మబ్బులు లేకపోవడం వల్లే కాదు ఇంకే విమానాలూ లేకపోవడం వల్ల కూడా న్యూయార్క్ గగనతలం నిర్మలంగా ఉందప్పుడు.

ఆ విమానం జాన్.ఎఫ్.కెనెడీ విమానాశ్రయానికి వస్తుందని భావించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం అప్పటికి గాల్లో ఉన్న అన్ని విమానాలనూ అక్కడికి దూరంగా వెళ్లిపోవాలని కోరింది.

ఏఏ 11లోని ఫ్లైట్ అటెండెంట్ మాడలీన్ స్వీనే విమానం వెనుక వైపు కూర్చుని ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తన ఫోన్లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ సర్వీస్ మేనేజర్ మైఖేల్ ఉడ్‌వార్డ్‌కు చెబుతున్నారు. హైజాకర్ల నుంచి రిస్క్ ఉన్నప్పటికీ ఆమె 15 నిమిషాల పాటు అలా అప్డేట్స్ ఇస్తున్నారు.

విమానం కిందకు దిగుతోంది, కానీ జాన్.ఎఫ్.కెనడీ విమానాశ్రయం వైపుగా అది వెళ్లడం లేదు అని చెప్పారామె.

అలా చెప్పిన సెకన్లోనే ఆమె... ''విమానం చాలావేగంగా కిందకు దిగుతోంది. ఇంకా కిందకు దిగుతోంది.. బాబోయ్! బాగా తక్కువ ఎత్తులో ఎగురుతోంది...'' అంటుండగానే కాల్ ఒక్కసారిగా కట్ అయిపోయింది.

08:46

ఏఏ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కి చెందిన ఒక టవర్‌లోకి నేరుగా దూసుకెళ్లింది.

ఒక్కసారిగా అంతా గందరగోళంగా మారింది.

అప్పటికి కాన్స్‌టెన్స్ లాబెట్టీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌లోని 99వ అంతస్తులో పనిచేసుకుంటున్నారు. మొదటి విమానం టవర్ల వైపు రావడాన్ని ఆమె చూశారు.

''అలా స్థాణువులా నిల్చుండిపోయాను. అంగుళం కూడా కదలలేకపోయాను'' అని చెప్పారామె.

9/11 మెమోరియల్ మ్యూజియంలో ఆమె చెప్పిన మాటల రికార్డు ఉంది.

''అది దగ్గరగా.. మరింత దగ్గరగా రావడాన్ని చూశాను. దాని వెనుకవైపు ఏఏ అన్న అక్షరాలు కనిపించాయి. కాక్‌పిట్ విండోలు కూడా కనిపించాయి. అంత దగ్గరగా చూశాను నేను''

నార్త్ టవర్లోకి ఏఏ 11 దూసుకెళ్లగానే పెను గర్జనలాంటి భీకరమైన శబ్దం వచ్చింది. ''ఆ క్షణంలో నేను ఉపశమనం పొందినట్లుగా నిట్టూర్చాను. కానీ, అది ఒక్క క్షణమే. నాకేం కానప్పటికీ ఆ నార్త్ టవర్లో ఉన్నవారంతా చనిపోయుంటారని అర్థమయ్యాక ఆ క్షణంలో పొందిన ఉపశమనమంతా మాయమైపోయింది'

నార్త్ టవర్ 93వ అంతస్తు నుంచి 99వ అంతస్తు మధ్యలోకి ఏఏ11 దూసుకెళ్లడంతో వందలాది మంది ఆ క్షణంలోనే మరణించారు.

విమానంలోని ఇంధనం అగ్నిగోళంలా మండడంతో లిఫ్టులు ధ్వంసమయ్యాయి. దిగువ అంతస్తులూ దెబ్బతిన్నాయి. భవనంలోని కొన్ని ప్రదేశాలలో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిపోయింది. దట్టమైన నల్లని పొగ నార్త్ టవర్‌తో పాటు సౌత్ టవర్‌నూ కమ్మేసింది.

వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంతర్గత కమ్యూనికేషన్ల వ్యవస్థ ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. కానీ లాబెట్టీ బాస్ రాన్ ఫాజియో మాత్రం మెట్ల మీదుగా దిగి ఆ భవనం నుంచి బయటపడాలని తన ఉద్యోగులకు సూచించారు.

ఆయన నిర్ణయం పదుల సంఖ్యలో అక్కడివారి ప్రాణాలను కాపాడింది.

08:47

అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఫ్లోరిడాలోని ఎమ్మా.ఇ.బుకర్ ప్రాథమిక పాఠశాలలోని ఒక తరగతి గదిలోకి వెళ్తున్నారు. అప్పుడే ఆయనకు ఒక చిన్న విమానం ట్విన్ టవర్స్‌లో ఒక దాన్ని ఢీకొందన్న సమాచారం అందింది.

అంతకుమించి ఆయనకు సమాచారం రాకపోవడంతో ముందు అనుకున్న ప్రకారమే విద్యార్థుల వద్దకు వెళ్లేందుకు ముందుకు కదిలారు.

విమానం హైజాక్ అయిన విషయం అప్పటికే ఎఫ్ఏఏకు తెలిసినప్పటికీ వాషింగ్టన్‌లో ఏ ఇతర ఏజెన్సీకి సమాచారం అందించిన దాఖలాలు లేవు.

ఈ విషయం వైట్‌హౌస్‌కు కూడా తెలియదు.

ఉపాధ్యక్షుడు డిక్ షెనీ కూడా టీవీల్లో చూసే విషయం తెలుసుకున్నారు.

అంతా ఈ షాక్‌లో ఉంటుండగానే హైజాకర్లు మూడో విమానం ఏఏ77ను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు.

08:56

మొదటి విమానంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లోకి దూసుకెళ్లిన తరువాత నార్త్ టవర్ పైఅంతస్తులలో అక్కడక్కడా మిగిలిన భాగాల్లోకి చేరి వేడి, పొగ నుంచి కాపాడుకునే ప్రయత్నం చేశారు కొందరు.

ధ్వంసమైన టవర్ నుంచి కిందకు పడిపోతున్నవారు.. ప్రాణాలు దక్కుతాయేమోనన్న ఆశతో వందల అడుగుల ఎత్తు నుంచి దూకేస్తున్నవారు కనిపించారు.

09:03

యూఏ 175 విమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌లోని 77, 85వ అంతస్తుల మధ్య ప్రాంతంలోకి దూసుకెళ్లింది.

నార్త్ టవర్లోకి విమానం దూసుకెళ్లిన 17 నిమిషాల్లోనే ఇది జరిగింది.

తానుండే సౌత్ టవర్‌ను విమానం ఢీకొన్న సమయానికి లాబెట్టీ ఇంకా మెట్ల మీద నుంచి కిందకు దిగుతూనే ఉన్నారు.

''అప్పటికి 72వ అంతస్తుకు వచ్చాననుకుంటున్నాను... భయంకరమైన శబ్దం వినిపించింది. మెట్లు మీద నుంచి దిగుతున్నవారు ఒక్కొక్కరు పడిపోతున్నారు'' అని చెప్పారామె. ఆ ఆడియో రికార్డు 9/11 మ్యూజియంలో ఉంది.

''నేను పడిపోలేదు కానీ చాలామంది పడిపోయారు. నార్త్ టవర్ కూలిపోతూ సౌత్ టవర్‌పై పడిపోయిందేమో అనుకున్నాను'' అన్నారామె.

లాబెట్టీ.. నార్త్ టవర్ కూలిందనుకుని మెట్ల మీది నుంచి కిందికి దిగుతూనే ఉన్నారు.

కానీ లాబెట్టీ ఉన్న రెండో టవర్‌ను కూడా విమానం ఢీకొట్టిందని టీవీల్లో చూస్తున్న లక్షలాది మందికి తెలుసు.

దీంతో ముందుగా అనుకున్నట్లు ఇది ప్రమాదం కాదన్న విషయం స్పష్టమైంది.

మొదటి విమానం మాదిరిగా కాకుండా టవర్‌ను ఢీకొట్టడానికి ముందు యూఏ175 విమానం కొద్దిగా కిందికి వంగి ఉంది. దీంతో అది ఢీకొట్టిన ప్రదేశంలో భవనం ధ్వంసమైంది.

అయితే, ఒకవైపు మెట్లు అప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. కనీసం 91 అంతస్తు నుంచి కింది వరకు మెట్లు బాగానే ఉన్నాయి. కానీ మెట్ల మీది నుంచి దిగడం అంత సులువు కాదు. మంటలు, పొగ, చీకటిలో తప్పించుకోవడం కష్టతరమైంది.

అదే సమయంలో మరో సమస్య ఎదురైంది. అది 911. ఎమర్జెన్సీ ఫోన్ లైన్.

911కి కుప్పలు తెప్పలుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. టవర్స్‌లో వాళ్లు ఎక్కడున్నారు? వాళ్లు స్వయంగా తప్పించుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా.. సహాయం వచ్చే వరకు ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని 911 సిబ్బంది చెప్పారు.

సౌత్ టవర్‌ నుంచి కొన్ని డజన్ల మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారని చెబుతున్నారు. ఈ లెక్కపై భిన్న వాదనలు ఉన్నాయి.

09:05

ట్విన్ టవర్స్‌పై రెండో దాడి జరిగిందని వైట్ హౌజ్‌ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రూ కార్డ్ బుష్ చెవిలో చెప్పే సమయానికి ఆయన ఇంకా స్కూల్ విద్యార్థుల దగ్గరే ఉన్నారు.

అధ్యక్షుడు కూర్చునే ఉన్నారు. తలను కొద్దిగా ఊపారు.

"సంక్షోభం సమయంలో ఆందోళన చెందకుండా సంయమనం పాటించడం చాలా ముఖ్యం. అందుకే ఆ తరగతి గది నుంచి బయటకు రావడానికి సరైన సమయం కోసం ఎదురుచూశాను" అని బీబీసీ 9/11 ఇన్‌సైడ్ ద ప్రెసిడెంట్స్ వార్ రూం డాక్యుమెంటరీలో బుష్ చెప్పారు.

"నేను నాటకీయంగా ఏమీ చేయాలని అనుకోలేదు. ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి, పిల్లలను భయపెట్టాలని అనుకోలేదు. అందుకే సరైన సమయం కోసం వేచి చూశాను" అని ఆయన అన్నారు.

09:24

ట్విన్ టవర్స్‌పై రెండో దాడి జరిగిన తర్వాత తమకు చెందిన ఏ విమానాన్ని కూడా ఇక అనుమతించకూడదని అమెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నిర్ణయం తీసుకున్నాయి.

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎడ్ బల్లింగర్ మరొక అడుగు ముందుకేశారు. తన రాడార్‌లో కనిపిస్తున్న అన్ని విమానాలను ఆయన హెచ్చరించారు.

వాటిలో UA93 విమానం ఒకటి. ఈ విమానం హైజాక్ కావడానికి కొన్ని నిమిషాల ముందు ఎడ్ బల్లింగర్ హెచ్చరిక సందేశాలు పంపించారు.

"జాగ్రత్త.. కాక్‌పిట్‌లోకి ఎవరైనా చొరబడొచ్చు. రెండు విమానాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీకొట్టాయి" అని ఆయన హెచ్చరికలు పంపించారు.

అయితే, గందరగోళానికి గురైన పైలట్ జసన్ దాల్.. "ఎడ్ మీరేం చెప్పారో మరొకసారి చెప్పండి" అని అడిగారు.

ఆ సమయంలో తన సందేశం స్పష్టంగా లేకపోవడం పట్ల ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బిల్లింగర్‌ బాధపడుతూ ఉంటారు.

09:28

పైలట్ లేదా కో-పైలట్‌ గొడవపడుతున్న సమయంలో UA93 విమానం నుంచి డిస్ట్రెస్ కాల్ వచ్చింది. ఒహాయోలోని క్లీవీలాండ్‌ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఈ మే డే కాల్ అందుకుంది. కానీ, వాళ్లు చేయగలిగింది ఏమీ లేదు. అప్పటికే హైజాకర్లు ఆ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మిగతా విమానాల మాదిరిగా 30 నిమిషాలకు కాకుండా టేకాఫ్ అయిన 46 నిమిషాల తరువాత UA93 హైజాక్ మొదలైంది. ఈ అదనపు సమయం, బయలుదేరడంలో జరిగిన ఆలస్యం ఈ విమానం భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషించాయి.

లెబనాన్‌కు చెందిన జియాద్ జర్రా నాయకత్వంలోని హైజాకర్లు.. బాంబులు వేస్తామని ప్రయాణికులను, సిబ్బందిని బెదిరించారు. విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రయాణికులందరిని విమానం చివరకు పంపించారు.

ప్రయాణికులు తమ బంధువులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అది చూసి కూడా హైజాకర్లు ఏమనలేదు. దాదాపు 37 కాల్స్ చేశారు. ఇలా కాల్ చేయడం వల్ల ట్విన్ టవర్స్‌పై దాడి ఘటన గురించి వాళ్లకు తెలిసింది. తాము స్పందించకపోతే తమ భవిష్యత్తు ఏమిటన్నది వారికి బోధపడలేదు.

09:34

వాషింగ్టన్‌లోని న్యాయ విభాగం..

మూడో విమానం కూడా హైజాక్‌ అయిందని అధికారులకు అంతకుముందే తెలిసింది.

AA77 విమానంలో ఉన్న తన భార్య బార్బరా నుంచి సొలిసిటర్ జనరల్ థియోడోర్ ఓల్సన్‌కు ఈ విషయం తెలిసింది.

ఆమె ఏం చెప్పారో ఓల్సన్‌ గుర్తు చేసుకున్నారు.

"నేను ఆ పైలట్‌కు ఏమని చెప్పాలి. ఈ ఫోన్ కట్ అయ్యేలోపు ఆ పైలట్‌కు ఏం చేయమని చెప్పాలి" అని ఆమె అడిగిందని ఆయన చెప్పారు.

ఆ విమానాన్ని లోకేట్ చేయడానికి అప్పటికే అరగంట నుంచి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ - ఎఫ్ఏఏ ప్రయత్నిస్తోంది. కానీ ఆ విమానం ట్రాన్స్‌పాండర్ ఆఫ్ చేసి ఉంది.

ఈ విషయాన్ని సైన్యానికి చెప్పాలని అధికారులు నిర్ణయించారు.

మేము అమెరికన్ 77 విమానాన్ని కూడా కోల్పోయామని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్- ఎన్ఓఆర్ఏడీకి వాషింగ్టన్‌లోని ఎఫ్ఏఏ చెప్పింది. అమెరికా గగనతలాన్ని దాడుల నుంచి రక్షించే బాధ్యత ఎన్ఓఆర్ఏడీదే.

ఒక విమానం వైట్‌హౌజ్‌ దిశగా వస్తోందని వాషింగ్టన్‌లోని రొనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సీక్రెట్ సర్వీస్‌కు సమాచారం అందించారు.

ఉపాధ్యక్షుడిని బంకర్‌లోకి తీసుకెళ్లారు.

కానీ ఆ విమానం అప్పుడు 330 డిగ్రీల కోణంలో మలుపు తిరిగింది.

ఇప్పుడది వైట్‌హౌజ్ లేదా క్యాపిటల్ హౌజ్ భవనం దిశగా రావడంలేదు. అది గంటకు 850 కిలోమీటర్ల వేగంతో పెంటగాన్‌ వైపు వెళ్తోంది. అది అక్కడికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

09:37

AA77 పెంటగాన్‌ పశ్చిమ గోడను ఢీకొట్టింది. దాంతో పైకప్పుపై 60 మీటర్ల ఎత్తు వరకు మంటలు చెలరేగాయి.

విమానంలో ఉన్న 64 మంది చనిపోయారు. అలాగే పెంటగాన్‌లో ఉన్న 125 మంది మృతి చెందారు. కొన్ని డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు.

ట్విన్ టవర్స్‌పై దాడిపైనే మీడియా దృష్టి కేంద్రీకృతమై ఉంది. పెంటగాన్‌పై జరిగిన దాడిని పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ప్రెసిడెంట్ బుష్ మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోలేదు.

దేశం యుద్ధ క్షేత్రంలో ఉందని ఆయన గ్రహించారు.

మొదటి విమానం ప్రమాదం కావొచ్చు. రెండోది మాత్రం కచ్చితంగా దాడే. ఇక మూడోది యుద్ధం ప్రకటించడమే అని బీబీసీ డాక్యుమెంటరీలో బుష్ చెప్పారు.

09:42

పెంటగాన్‌పై దాడి తర్వాత ఎఫ్ఏఏ అసాధారణ చర్య తీసుకుంది. అన్ని వాణిజ్య విమానాలను సమీపంలో ఉన్న విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాలని ఆదేశించింది.

కానీ, ఒక విమానం ఇంకా గాల్లోనే ఉంది. అదే ఫ్లైట్ UA93. దాని ట్రాన్స్‌పాండర్ కూడా ఆఫ్ చేసి ఉంది. అంటే అది కూడా హైజాక్ అయింది.

09:57

కానీ ఈ సమయానికి హైజాకర్లను ఆపకపోతే తమ ప్రాణాలు పోతాయని యూఏ93 విమానంలోని ప్రయాణికులకు, సిబ్బందికి అర్థమైంది.

ఈ విమానంలో ఉన్న అలీస్ హోంగ్‌లాండ్ తన కుమారుడికి రెండు వాయిస్ మెసేజ్‌లు పంపించారు.

మార్క్.. నేను అమ్మను. మా విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేశారు. నేలపై ఉన్న ఏదో ఒక టార్గెట్‌ను విమానంతో ఢీకొట్టాలని అనుకుంటున్నారు. వాళ్లను అడ్డుకోవడానికి మీరు చేయగలిగింది చేయండి. వాళ్లు కిరాతకుల్లా ఉన్నారు అని తన మొదటి మెసేజ్‌లో చెప్పారు.

ఒక విమానం శాన్‌ఫ్రాన్సిస్కో వైపు వెళ్తోందని వాళ్లు చెబుతున్నారు. అది మీదే కావొచ్చు. వీలైతే కొంతమందిని కలుపుకుని, దాన్ని మీ అదుపులోకి తీసుకోవడానికి మీరు చేయగలిగింది చేయండి. ఐ లవ్ యు.. గుడ్ లక్ అని రెండో మెసేజ్‌లో ఆందోళనతో కూడిన స్వరంతో ఆమె చెప్పారు.

హైజాకర్లతో పోరాడాలని విమానంలో ఉన్న వాళ్లందరూ నిర్ణయించారని వారి నుంచి సమాచారం అందుకున్న వాళ్లు చెప్పారు.

09:58

ఇక ట్విన్ టవర్స్ దగ్గర పరిస్థితి దారుణంగా మారుతోంది.

సౌత్ టవర్ కుప్పకూలింది.

మొత్తం భవనం కూలడానికి కేవలం 11 సెకన్ల సమయం మాత్రమే పట్టింది.

ఆ భవనంలో ఉన్న వాళ్లందరూ చనిపోయారు. వీధుల్లో ఉన్న వారు, డబ్ల్యూటీసీ కాంప్లెక్స్ లోపల మారియట్ హోటల్‌లో ఉన్న వాళ్లూ మరణించారు.

ఆ టవర్‌ నుంచి ప్రాణాలతో బయటపడిన అతికొద్ది మందిలో లాబెట్టీ ఒకరు.

తన బాస్ పజియో, తప్పించుకోవాలని ప్రతిఒక్కరిని ప్రోత్సహించిన 'హీరో' ప్రాణాలు కోల్పోయారని ఆ తర్వాత రోజు ఉదయం ఆమెకు తెలిసింది.

10:03

కాక్‌పిట్‌లోకి వెళ్లి విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి UA93 ప్రయాణికులు గత ఆరు నిమిషాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

వాళ్లు డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. అరుపులు, గ్లాసులు, ప్లేట్లు పగులుతున్న శబ్ధాలు ఫ్లైట్ రికార్డర్‌లో నమోదయ్యాయి.

ప్రయాణికులకు బ్యాలెన్స్ లేకుండా చేయడానికి జియాద్ జర్రా ఒకదశలో విమానాన్ని ఎడమ నుంచి కుడికి తిప్పడం మొదలుపెట్టాడు. అదే సమయంలో మరొక హైజాకర్‌ డోర్‌ తెరవకుండా అడ్డుకుంటున్నాడు.

అంతేనా, మనం దీన్ని ముగించాలా.. అని జెర్రా అడిగాడు. లేదు.. లేదు. ఇప్పుడే కాదు. వాళ్లందరూ వచ్చిన తర్వాత మనం ముగిద్దాం అని మరో హైజాకర్ చెప్పారు.

వాషింగ్టన్ డీసీకి చేరుకోవడానికి వారికి ఇంకా 20 నిమిషాల సమయం ఉంది.

కాసేపైన తర్వాత ఈ విమానాన్ని ఇప్పుడు క్రాష్ చేయాలా అని జెర్రా మరోసారి అడిగాడు. అప్పుడు మరో హైజాకర్ అవునని చెప్పాడు.

UA93 విమానం నిటారుగా కిందికిపడిపోతోంది. అల్లా గ్రేట్.. అల్లా గ్రేట్ అని హైజాకర్లు అరిచారు.

ప్రయాణికులందరూ దాడిచేస్తూ ఉండగానే గంటకు 930 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో విమానం పెన్సెల్వేనియాలో షాంక్స్‌విల్లేలోని ఒక బహిరంగ ప్రదేశంలో కూలింది.

అందులో ఉన్న వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు.

10:28

AA11 విమానం నార్త్ టవర్‌ను ఢీకొట్టి 100 నిమిషాలకు పైగా అయింది.

ఇతర టవర్ కంటే అది రెండు రెట్లు ఎక్కువే దాడిని తట్టుకుని నిలబడింది. కానీ ఆ తర్వాత 9 సెకన్లలోనే కుప్పకూలింది.

న్యూయార్క్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బిల్ స్పాడే ఆ సమయంలో నార్త్ టవర్‌కు కొన్ని మీటర్ల దూరంలో ఉన్నారు. ఆ పేలుడు ఆయన్ను 12 మీటర్ల దూరంలో శిథిలాల కిందికి విసిరేసింది.

శిథిలాల నుంచి పైకి రావడానికి ఆయనకు కనీసం గంట సమయం పట్టింది. ఆ తర్వాత తమ 12 మంది ఫైర్ ఫైటర్లలో తాను ఒక్కడినే ప్రాణాలతో బయటపడ్డానని ఆయనకు తెలిసింది.

19 మంది హైజాకర్లు కాకుండా మొత్తం 2,977 మంది చనిపోయారు. అమెరికా గడ్డపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)