‘సెక్స్ కోరికలు పెంచే ఆ హార్మోన్ తీసుకున్నాక నాకు కొడుకు పుట్టాడు’

    • రచయిత, ఫిలిప్పా రాక్స్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సెక్స్ కోరికలు తక్కువగా ఉండే పురుషులు, మహిళలకు కిస్‌పెప్టిన్ హార్మోన్ ఇస్తే, మెదడులోని లైంగిక కోరికలకు సంబంధించిన ప్రాంతం క్రియాశీలం అవుతున్నట్లు ఇటీవలి రెండు అధ్యయనాల్లో వెల్లడైంది.

దాదాపు 10 శాతం మందిని వేధిస్తున్న సెక్స్ కోరికలు తగ్గిపోవడమనే సమస్యను కిస్‌పెప్టిన్ సమర్థంగా పరిష్కరించగలదని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు.

తమలో కోరికలు తగ్గిపోతున్నాయని వయసు పైబడిన వారి కంటే వయసులో ఉన్నవాళ్లే ఎక్కువగా చెబుతుంటారని ఇంపీరియల్ కాలేజీ లండన్ పరిశోధకులు తెలిపారు.

అయితే, దాన్ని ఎక్కువ మంది పట్టించుకోరు. కానీ కొంతమందిని మానసికంగా, సామాజికంగా ఈ సమస్య కుంగదీస్తుంది కూడా.

43 ఏళ్ల పీటర్ (పేరు మార్చాం) కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడేవారు. ఈ అధ్యయనాల్లోని ఒక దాంట్లో ఆయన కూడా పాల్గొన్నారు.

‘‘బాగా అలసిపోయాను.. ఒత్తిడి ఎక్కువైంది.. ‘ఇప్పుడు వద్దు’ అనే సాకులు చెప్పే వాణ్ని’’ అని ఆయన చెప్పారు.

‘‘ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. ఎందుకంటే అసలు నాకు అమ్మాయిలంటేనే నచ్చరని వారు అనుకుని గందరగోళానికి గురికావచ్చని భయం వేసింది’’ అని ఆయన తెలిపారు.

కిస్‌పెప్టిన్ సహజంగా శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్. సెక్స్‌కు సంబంధించిన ఇతర హార్మోన్లు శరీరంలో విడుదల కావడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మహిళల్లో అండాశయం అండాలను ఉత్పత్తి చేసేలా ఈ హార్మోన్ ప్రేరేపించగలదని ఇదివరకటి అధ్యయనాల్లో తేలింది.

మరోవైపు పురుషుల్లో మూడ్‌ను కూడా ఇది మెరుగుపరచగలదని వెల్లడైంది.

అయితే, కోరికలు తక్కువగా ఉండేవారిలో ఇది ఎలా పనిచేస్తుందో పరీక్షించడం ఇదే తొలిసారి.

‘‘కోరికలు తక్కువగా ఉండే చాలా మంది సెక్స్‌లో పాల్గొనడం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఫలితంగా ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. ఫలితంగా వారి జననాంగాల్లో ఉద్రేకం కనిపించదు’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అలెగ్జాండర్ కామ్నినోస్ చెప్పారు.

‘‘ఈ అసమతౌల్యాన్ని కిస్‌పెప్టిన్ పరిష్కారం చూపించగలదు’’ అని ఆయన చెప్పారు.

పురుషుల జననాంగానికి రక్త సరఫరాను మెరుగుపరిచే వయాగ్రా కంటే ఈ హార్మోన్ కాస్త భిన్నంగా పనిచేస్తుంది.

దీని పనితీరును గుర్తించేందుకు చేపట్టిన రెండు అధ్యయనాల్లో 21-52 ఏళ్ల మధ్య వయసున్న 32 మంది పురుషులు, 19-48 ఏళ్ల మధ్య వయసున్న 32 మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ బాధపడుతున్నారు.

వీరికి కొన్నిసార్లు కిస్‌పెప్టిన్, మరికొన్ని సార్లు ప్లాసిబో ఇచ్చారు. ఆ సమయంలో వారి ప్రవర్తనతోపాటు మెదడులోని భాగాలను ఎంఆర్ఐ స్కాన్‌ల సాయంతో పరిశీలించారు. పురుషుల్లో జననాంగాల కదలికలను కూడా పరిశీలించారు.

‘నాకు బాబు పుట్టాడు’

స్కానర్‌లో ఉండేటప్పుడు తన జననాంగాన్ని పరిశీలించినప్పుడు కాస్త వింతగా అనిపించిందని, కానీ, ఈ అధ్యయనంలో పాల్గొనడంతో చాలా మేలు జరిగిందని పీటర్ చెప్పారు.

‘‘ఇప్పుడు నాకు బాబు పుట్టాడు. నేను ఆ హార్మోన్‌ను తీసుకున్న తర్వాతే బాబు జన్మించాడు’’ అని ఆయన చెప్పారు.

అయితే, దీనికి హార్మోనే కారణమా? అనే విషయాన్ని నిరూపించడం కష్టమని, కానీ, ఇప్పుడు తనలో కోరికలు పెరిగాయని ఆయన అన్నారు.

సెక్స్ కోరికలకు సంబంధించి మహిళలు, పురుషుల్లో మెదడులోని కీలక ప్రాంతాలను కిస్‌పెప్టిన్ క్రియాశీలం చేస్తున్నట్లు ఈ అధ్యయనాల్లో తేలింది.

అసలు కోరికలు లేని వారిలోనూ పరిస్థితి చాలా మెరుగుపడింది. ప్లాసిబోతో పోల్చినప్పుడు కిస్‌పెప్టిన్‌ తీసుకున్న పురుషుల్లో జననాంగం గట్టిపడటం 56 శాతం వరకూ పెరిగింది.

‘‘చాలా కేసుల్లో ఇది సానుకూల ప్రభావం చూపిస్తోంది. నిజానికి మేం ల్యాబ్‌లో మెదడును పరిశీలించాం. అదే బెడ్‌రూమ్‌లోనో లేదా ఇంట్లో మరెక్కడైనా అయితే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండొచ్చు’’ అని కామ్మినోస్ చెప్పారు.

కిస్‌పెప్టిన్ తీసుకున్న తర్వాత తమని తాము మరింత సెక్సీగా చూసుకుంటున్నామని మహిళలు చెప్పగా, సెక్స్‌ సమయంలో తమ సంతోష స్థాయిలు పెరిగాయని పురుషులు చెప్పారు.

పురుషులు, మహిళలు ఇద్దరిపైనా జరిగిన ఈ అధ్యయనాలను జేఏఎంఏ నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు.

రిలేషన్‌షిప్ సమస్యలు, ఒత్తిడి, అంగ స్తంభనం, యోని పొడిబారడం, మెనోపాజ్, ప్రసవం తర్వాత అలసట ఇలా చాలా అంశాల వల్ల సెక్స్ కోరికలు తగ్గుతుంటాయని ఎన్‌హెచ్ఎస్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లు, గర్భ నిరోధకాలు కూడా కోరికలను తగ్గిస్తాయి. ఆల్కహాల్ అతిగా సేవించినా అంతే.

హృద్రోగాలు, మధుమేహం, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా కొన్నిసార్లు కోరికలను తగ్గిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)