You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుకు ‘స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్’ కేసులో ఏసీబీ కోర్టు ఆదివారం రిమాండ్ విధించింది.
సెప్టెంబర్ 22 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు.
మరోవైపు చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీని విచారణ సోమవారం జరగనుంది.
అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఈ కేసులో వాదనలు కొనసాగాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది.
చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని నోటీసు ఇచ్చారు. దీనిపై వాదనలకు న్యాయమూర్తి అనుమతించారు.
ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడంపై సిద్దార్ధ లూధ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందుగా సాక్ష్యం చూపించాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని, కానీ, సీఐడీ ఆ పని చేయలేదని, ఇది చట్ట విరుద్ధమని లూథ్రా కోర్టులో వాదించారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని లూథ్రా అన్నారు.
చంద్రబాబు వాదనలు
ఒక దశలో చంద్రబాబు స్వయంగా తన వాదన వినిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో జరిగిన అవకతవకలతో తనకు సంబంధం లేదని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు కోర్టు ముందు విన్నవించారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని కోరారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబు.
స్కిల్ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చామని. దీనిని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందని చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులపై క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని, 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో గానీ, రిమాండ్ రిపోర్టులో కూడా తన పాత్ర ఉందని ఎక్కడా సీఐడీ పేర్కొనలేదని చంద్రబాబు వాదించారు.
సీఐడీ కోర్టుకు ఏం చెప్పింది?
చంద్రబాబు వాదనల తర్వాత సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుని కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోర్టుని అభ్యర్ధించారు.
చంద్రబాబుని అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే కోర్టులో హాజరు పరిచామని, ఈ కేసులో ఇప్పటి వరకూ ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
2015లో విడుదలైన జీవో నెంబర్ 4తోనే కుట్ర జరిగిందన్నారు. అటు చంద్రబాబుపై సీఐడీ 34 అభియోగాలు నమోదు చేసింది.
చంద్రబాబు అరెస్టుపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మధ్య మధ్య విరామం సమయంలో చంద్రబాబు, లోకేశ్‌లు లాయర్లతో చర్చలు జరిపారు.
రిమాండ్ రిపోర్టు మీద విచారణకు ఏసీబీ కోర్టు గంట బ్రేక్ ఇచ్చింది. తిరిగి మధ్యాహ్నం 1.30 తర్వాత విచారణ ప్రారంభమైంది.
గవర్నర్ అపాయింట్‌మెంట్ రద్దు
మరోవైపు గవర్నర్‌ను కలిసేందుకు టీడీపీ నాయకులకు ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఇచ్చిన అపాయింట్‌మెంట్ రద్దయింది.
అపాయింట్‌మెంట్ రద్దైనట్లు తమకు గవర్నర్ ఆఫీసు నుంచి సమాచారం అందిందని.. రేపు ఇదే సమయానికి రావాలని చెప్పారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
చంద్రబాబు కేసును విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేయడంతో పాటు హింసాత్మక నిరసనలు జరగకుండా బలగాలను మోహరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)