You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Only Fans: పోర్న్ వీడియోలతో వేల కోట్ల లాభాలు గడించిన లియోనిడ్ రాడ్విన్‌స్కీ ఎవరు?
- రచయిత, మాలు కర్సినో
- హోదా, బీబీసీ న్యూస్
‘ఓన్లీ ఫ్యాన్స్’ సంస్థ లాభాలు గత ఏడాది కాలంలో విపరీతంగా పెరిగాయి. డివిడెండ్ల రూపంలో సంస్థ యజమాని 300 మిలియన్ డాలర్లు (రూ.2,476.44 కోట్లు)ను సంపాదించడంతో ఈ పోర్న్ సామ్రాజ్యంపై ప్రజలను చాలా ప్రశ్నలు, సందేహాలు వెంటాడుతున్నాయి.
41 ఏళ్ల లియోనిడ్ రాడ్విన్‌స్కీ యుక్రేనియన్- అమెరికన్ వ్యాపారవేత్త. ఆయన ఆస్తుల విలువ 2.1 బిలియన్ డాలర్లు (రూ.17.33 వేల కోట్లు).
ఓన్లీ ఫ్యాన్స్ సంస్థను 2016లో తండ్రీ, కొడుకులైన గయ్, టిమ్ స్టోక్లీలు 12,500 డాలర్లు (రూ.10.31 లక్షలు)తో మొదలుపెట్టారు. 2018లో వీరి నుంచి ఆ సంస్థను లియోనిడ్ కొనుగోలు చేశారు.
ఓన్లీ ఫ్యాన్స్ సంస్థ కోసం లియోనిడ్ లక్షల డాలర్లను చెల్లించారు. అయితే, అసలు ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఎవరీ లియోనిడ్?
సూటిగా చెప్పాలంటే లియోనిడ్ గురించి అందుబాటులోనున్న సమాచారం చాలా తక్కువ. ఆ వెబ్‌సైట్‌కు విశేష ప్రజాదరణ ఉన్నప్పటికీ ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేటుగా ఉంచుకునేందుకే ఇష్టపడతారు. ఆయన పెద్దగా ఎవరికీ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరు.
అయితే, లింక్డ్ ఇన్ ప్రొఫైల్, పర్సనల్ వెబ్‌సైట్‌లో ఆయన గురించి కొన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి.
లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్, టెక్ పారిశ్రామికవేత్త, మానవతావాది. కొత్తగా ప్రజాదరణ పొందుతున్న సోషల్ మీడియా వేదికలంటే ఆయనకు ఆసక్తి ఎక్కువ.
గత రెండు దశాబ్దాలుగా సాఫ్ట్‌వేర్ కంపెనీల స్థాపన, వాటి అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తన సొంత వెబ్‌సైట్‌లో ఆయన రాసుకొచ్చారు.
యుక్రేనియన్ పోర్ట్ సిటీ ఒడెస్సాలో లియోనిడ్ జన్మించారు. యుక్రెయిన్‌లో సహాయక చర్యల కోసం ఆయన సంస్థ క్రిప్టోకరెన్సీల రూపంలో విరాళం కూడా ఇచ్చింది. దీని విలువ 1.3 మిలియన్ డాలర్లు (రూ.10.73 కోట్లు)గా కాయిన్ డెస్క్ సంస్థ అంచనా వేసింది.
సహాయక చర్యలు, కొత్త ఆవిష్కరణల కోసం తన సమయం, శ్రమ, నిధులను విరాళంగా ఇస్తుంటానని కూడా ఆయన తన వెబ్‌సైట్లో పేర్కొన్నారు.
సాఫ్ట్‌వేర్‌ల అభివృద్ధి, విరాళాలను పక్కనపెడితే, ఆయన పుస్తకాలను ఎక్కువగా చదువుతుంటారు. చెస్ కూడా ఆడుతుంటారు. హెలికాప్టర్ పైలట్ అయ్యేందుకూ ప్రయత్నిస్తున్నట్లు వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు.
ఆయన ఎక్కడుంటారు?
ఆయన చిన్నప్పుడే అమెరికాకు వీరి కుటుంబం వచ్చేసిందని, ఇప్పుడు వీరు షికాగోలో స్థిరపడ్డారని డైలీ టెలిగ్రాఫ్ తెలిపింది.
ప్రస్తుతం ఆయన సన్నీఫ్లోరిడాలో నివసిస్తున్నారు. అయితే, ఆయన చిరునామా ఎక్కడో కచ్చితంగా తెలియరాలేదు.
ఈ బిలియనీర్‌కు పెళ్లైందని ఫోర్బ్స్ వెల్లడించింది. కానీ, ఆయన జీవిత భాగస్వామి ఎవరో తెలియదు.
పోర్న్ బిజినెస్ కొత్తకాదు
లియోనిడ్‌కు పోర్న్ బిజినెస్ కొత్తేమీ కాదు.
ఇల్లినాయిస్‌లోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆయన ఇది వరకు కూడా కొన్ని ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నారు.
ఓన్లీ ఫ్యాన్స్ మాతృసంస్థ ఫెనిక్స్‌కు ఏకైక షేర్ హోల్డర్‌గా మారకముందు సైబెర్టానియా అనే సంస్థను ఆయన స్థాపించారు. ఈ కంపెనీ కూడా పోర్న్ సహా చాలా వీడియో కంటెంట్‌ను అందుబాటులో ఉంచేది.
ఆ తర్వాత అడల్డ్ వెబ్‌కామ్ బిజినెస్‌ను కూడా ఆయన విజయవంతంగా నడిపించారు.
ఇంటర్వ్యూ కోసం బీబీసీ పంపిన ఈమెయిల్‌కు ఆయన సమాధానం ఇవ్వలేదు.
ఓన్లీ ఫ్యాన్స్ వెనకున్న కంపెనీ చరిత్ర ఏమిటి?
లియోనిడ్ అమెరికాలో ఉంటున్నప్పటికీ ఓన్లీ ఫ్యాన్స్ మాతృ సంస్థ ఫెనిక్స్ ఇప్పటికీ బ్రిటన్‌లోనే రిజిస్టరై ఉంది.
కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లీ టేలర్ బ్రిటన్‌వాసి అని కంపెనీ రికార్డులు చెబుతున్నాయి.
ఫెనిక్స్ ఇన్వెస్టర్, ఫౌండర్ గయ్ స్టోక్లీ తన పదవి నుంచి 2021 డిసెంబరులో రాజీనామా చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.
మరోవైపు అదే ఏడాది గయ్ కొడుకు టిమ్ స్టోక్లీ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి తప్పుకున్నారు.
ఆ తర్వాత లియోనిడ్ నేతృత్వంలో ఓన్లీ ఫ్యాన్స్ విపరీతమైన లాభాలను అర్జించింది. ఇప్పుడు పోర్న్‌తోపాటు సేఫ్-ఫర్-వర్క్ కంటెంట్‌ను కూడా ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతోంది.
లాభాలు ఎలా?
లండన్‌లో రిజస్టరైన ఈ సంస్థ 2023 ఆగస్టులో ప్రీ-ట్యాక్స్ ప్రాఫిట్స్ 525 మిలియన్ల డాలర్లు (రూ.4,337 కోట్లు)గా వెల్లడించింది. నిరుడు ఇవి 432 మిలియన్ల డాలర్లు (రూ.3,566 కోట్లు)గా ఉండేవి.
ఏడాది కాలంలో ఓన్లీ ఫ్యాన్స్ క్రియేటర్ల సంఖ్య 47 శాతంపెరిగి 32 లక్షలకు చేరింది. అదే సమయంలో యూజర్ల సంఖ్య కూడా 27 శాతం పెరిగి 23.9 కోట్లకు చేరుకుంది.
అయితే, ఓన్లీ ఫ్యాన్స్‌పై చాలా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి పెడుతున్నాయి.
2021లో మైనర్ యూజర్లు తమ వీడియోలను విక్రయించకుండా నిలువరించడంలో ఓన్లీ ఫ్యాన్స్ విఫలం అవుతోందని బీబీసీ న్యూస్ ఒక కథనం ప్రచురించింది. అయితే, వయసును ధ్రువీకరించేందుకు తాము పటిష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నామని ఆనాడు సంస్థ వివరణ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో టేకు చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి?
- ఫుకుషిమా రియాక్టర్: అణు వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలిన జపాన్, ఈ నీటి వల్ల చేపలు చచ్చిపోతాయా, మనుషులకు ప్రమాదమెంత?
- కుక్కలు మనుషులకు ఎలా దగ్గరయ్యాయి? ఒకప్పటి పెంపుడు జంతువులైన తోడేళ్లు ఎందుకు దూరమయ్యాయి?
- తిరుపతి జిల్లా: దళితులను గొల్లపల్లి గుడిలోకి రానివ్వలేదా? ఇది తెలుగు దళితులతో తమిళ దళితుల పోరాటమా?
- విశాఖపట్నం - అమెరికన్ కార్నర్: యూఎస్ వెళ్లాలనుకునే వారికి ఉచితంగా సేవలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)