హరియాణా - నూహ్: 'అవన్నీ రాళ్ళు విసిరిన వారి నిర్మాణాలే, జాలి చూపించాల్సిన పని లేదు... కూల్చేయండి' - గ్రౌండ్ రిపోర్ట్

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, నుహ్ నుంచి బీబీసీ ప్రతినిధి

హరియాణాలోని నూహ్‌లో జులై 31న బజరంగ్ దళ్ ధార్మిక యాత్ర నిర్వహించింది. ఈ యాత్రలో వేలాది మంది బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. నుహ్‌లోని దేవాలయం నుంచి యాత్ర జరుగుతుండగా రాళ్ల దాడి, క్షణాల వ్యవధిలో మంటలు చెలరేగాయి.

అల్లరిమూకల గుంపు నగరంలోని పలు వీధులు, ఆలయం వెలుపల ప్రాంతాల్లో నిప్పు పెట్టింది. దీంతో పెద్ద సంఖ్యలో జనం ఆలయంలో చిక్కుకుపోయారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో వారంతా బయటపడ్డారు.

నూహ్‌లో చెలరేగిన హింస సాయంత్రానికి హరియాణాలోని సోహ్నా, గురుగ్రామ్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ హింసాకాండలో ఇద్దరు హోంగార్డులు సహా ఆరుగురు చనిపోయారు.

ఇప్పటి వరకూ నూహ్‌ ఘటనలో 56 కేసులు నమోదు చేయడంతో పాటు 150 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఆగస్టు 8 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.

గురుగ్రామ్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. అక్కడి నుంచి సోహ్నా వెళ్తున్నప్పుడు రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. నూహ్ చేరుకునేప్పటికి అంతా నిశ్శబ్దం. చాలా ప్రాంతాల్లో ఆర్పీఎఫ్, పోలీసు బలగాలను మోహరించారు.

నూహ్ బస్టాండ్ ఎదురుగా పనిచేస్తున్న బుల్డోజర్ల శబ్దం అక్కడి నిశ్శబ్దాన్ని చెదరగొడుతోంది. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు.

ఇనుముతో తయారు చేసిన నిర్మాణాలను ధ్వంసం చేసేందుకు బుల్డోజర్ డ్రైవర్ వెనకాడినప్పుడు, ''అవన్నీ రాళ్లు విసిరిన వాళ్ల దుకాణాలే. ఎవరిపైనా జాలి పడాల్సిన అవసరం లేదు. మొత్తం తీసెయ్'' అని అక్కడే ఉన్న ఒక పోలీసు అధికారి చెప్పారు.

మాకెందుకీ శిక్ష?

సమీపంలోని ఒక గ్రామానికి చెందిన చమన్‌లాల్ తన హెయిర్ కటింగ్ షాపు వైపే మౌనంగా చూస్తూ నిల్చుని ఉన్నారు. ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.

బుల్డోజర్ దుకాణాన్ని తొలగించడంతో, అక్కడ తన దుకాణానికి సంబంధించిన వస్తువులను చమన్‌లాల్ పోగుచేసుకుంటూ ఉన్నారు.

''అప్పు తీసుకుని ఈ షాప్ పెట్టుకున్నాను. దీనిపైనే పది మంది బతకాలి. ఇప్పుడు రోడ్డుపై పడిపోయాం. మేమేం చేశాం. మాకెందుకీ శిక్ష'' అని చమన్‌లాల్ అన్నారు.

అయితే, అనధికారిక కట్టడాలను మాత్రమే తొలగిస్తున్నట్లు నూహ్ అధికారులు చెబుతున్నారు.

''పోలీసుల నివేదిక మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నాం. అనధికారిక కట్టడాలను మాత్రమే తొలగిస్తున్నాం'' నూహ్ జిల్లా అధికారి ధీరేంద్ర ఖడ్గటా చెప్పారు. ఇది కొనసాగుతుందని ఆయన తెలిపారు.

''ఎక్కడి నుంచి రాళ్లు రువ్వారో ఆ ప్రదేశాలను గుర్తించాం. ఈ ఘటనతో సంబంధమున్న చోట్ల ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నాం'' అని నూహ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్ వినేశ్ సింగ్ తెలిపారు.

45 పక్కా దుకాణాలు, కొన్ని తాత్కాలిక దుకాణాలు, మరికొన్ని పక్కా ఇళ్లను తొలగించినట్లు వినేశ్ సింగ్ చెప్పారు.

మా గోడు వినేవారెవరు?

''మేము నాశనమయ్యాం. ఇప్పుడేం చేయాలో మాకు తెలియడం లేదు'' అని యూసుఫ్ అలీ అన్నారు. ఆయన నూహ్ బస్టాండ్ ఎదురు వాటర్, కూల్‌డ్రింక్స్ అమ్ముతుంటారు.

నూహ్‌లోని మోర్ మెడికల్ కాలేజీ సమీపంలో మూడంతస్తుల ఇల్లు, స్కూల్ భవనాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు.

''ఈ బిల్డింగ్ నుంచి రాళ్లు విసిరారు. అలాంటి భవనాల్నింటినీ గుర్తించాం'' అని వినేశ్ సింగ్ చెప్పారు.

భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆ భవనాన్ని కూల్చివేశారు. అందులో ఒక హోటల్‌ కూడా నడుస్తుండేది.

ఈ భవన యజమానులు ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ''అధికారుల నుంచి మాకు ఎలాంటి నోటీసులు అందలేదు. 2016లో ఒకసారి నోటీసు వచ్చింది. జిల్లా అధికారిని కలిసి జరిమానా కట్టేశాం. అప్పటి నుంచి ఎలాంటి సమస్య లేదు'' అని యజమాని తమ్ముడు సర్ఫరాజ్ బీబీసీకి చెప్పారు.

''ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చాం. జావెద్ ఇక్కడ హోటల్ నడుపుతున్నారు. రాళ్లు విసురుతున్న వారిని భవనం పైకి ఎక్కకుండా అడ్డుకున్నామని మాతో చెప్పారు. ఆ గుంపు ఎవరో తెలియదు'' అని ఆయన అన్నారు.

''ఒకవేళ మా ఇంట్లో ఎవరైనా ఈ అల్లర్లలో పాల్గొని ఉంటే అధికారులు చేసేది సరైనదే. కానీ, హింసతో మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా మా భవనాన్ని ఏకపక్షంగా కూల్చేశారు.'' అని చెప్పారు.

అయితే, అధికారుల చర్యలపై వారు కోర్టుని ఆశ్రయిస్తారా?

ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు వెనుకాడారు. ''పోలీసులు, అధికారులు, కోర్టులు, రాజకీయ నాయకులు అంతా కలిసి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. మాకు ఏదైనా ఆశ ఉంటే కోర్టుకు వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తాం. మా బాధ ఎవరు వింటారు?'' అని సర్ఫరాజ్ అన్నారు.

నల్హర్ మెడికల్ కాలేజీ బయట ఉన్న మార్కెట్‌ను కూడా కూల్చివేశారు.

అక్కడ దాదాపు 45 దుకాణాలు ఉన్నాయి. వాటన్నింటినీ శనివారం ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. స్థానికులు కూల్చివేసిన భవనాల నుంచి తమ వస్తువులను సేకరిస్తూ కనిపించారు.

విచారణ జరపకుండానే..

హతిన్‌కు చెందిన హర్కేశ్ శర్మ నూహ్‌లో హ్యారీ జెర్సీస్ పిజ్జా పేరుతో రెస్టారెంట్ నడుపుతున్నారు. అల్లరిమూకలు ఆయన రెస్టారెంట్‌పై పడి దోచుకున్నారు.

మెడికల్ కాలేజీ ముందు ఉన్న ఈ రెస్టారెంట్‌ను కూడా అధికారులు కూల్చివేశారు.

''ప్రభుత్వం భవనాలను కూల్చేసింది. అనధికారిక కట్టడాలని చెబుతోంది. ఏదైనా నోటీసు ఇచ్చారేమోనని చూసేందుకు నిన్న సాయంత్రం నేను ఇక్కడికి వచ్చాను.'' అని శర్మ చెప్పారు.

''ఒకవేళ నోటీసు ఇచ్చి ఉంటే, మా వస్తువులైనా తీసుకుని వెళ్లేవాళ్లం. ఇది అనధికారిక కట్టడమైతే ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఎలా ఇచ్చింది, రెంటల్ అగ్రిమెంట్‌‌ను ఎలా ఆమోదించింది?'' అని శర్మ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే, బుల్డోజర్లతో భవనాలను కూల్చివేయడాన్ని ఆయన సమర్థించారు. ''అల్లరిమూకలను గుర్తించి, ఆ దాడులకు పాల్పడిన వారిని శిక్షిస్తే ప్రభుత్వం మంచి పని చేస్తోందని అనుకునేవాళ్లం. కానీ, ఎలాంటి విచారణ చేయకుండానే ప్రభుత్వం దుకాణాలను ధ్వంసం చేస్తోంది'' అని ఆయన అన్నారు.

న్యాయవాది ఖాన్ ఇక్కడ పదేళ్లుగా ల్యాబ్ నిర్వహిస్తున్నారు. దుకాణాలు కూల్చివేస్తున్నట్లు ఆయన మీడియలో వార్తల ద్వారా తెలుసుకున్నారు. ''మాకు కొంత సమయం ఇచ్చి ఉంటే మా వస్తువులను మేం తీసుకెళ్లి ఉండేవాళ్లం. మేం ఇక్కడ అద్దెకు ఉంటున్నాం. మేం చేసిన తప్పేంటి?'' అని ఆయన ప్రశ్నించారు.

''ఇక్కడ ఆరు మెడికల్ షాపులు ఉన్నాయి. అందులో లక్షల రూపాయల మందులు ఉన్నాయి. అల్ట్రాసౌండ్ సెంటర్ కూల్చేశారు. అందులో ఖరీదైన స్కానింగ్ మెషీన్లు ఉన్నాయి. ఎక్స్ రే సెంటర్ కూడా కూల్చేశారు. అధికారులు ఎవరినీ వదిలిపెట్టలేదు'' అని ఖాన్ అన్నారు.

'అవి అనధికారిక కట్టడాలే'

మెడికల్ కాలేజీ చుట్టుపక్కల కూల్చేసిన భవనాలన్నీ అటవీ భూముల్లో అనధికారికంగా కట్టినవేనని అధికారులు చెబుతున్నారు.

''అవి అటవీ భూముల్లో అనధికారికంగా కట్టినవే. గతంలోనే నోటీసులిచ్చాం'' అని ధీరేంద్ర ఖడ్గటా చెప్పారు.

కూల్చేసిన భవనాలను చూసేందుకు చాలా మంది వస్తున్నారు. అశోక్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చారు.

బుల్డోజర్లతో భవనాలను కూల్చేయడాన్ని ఆయన సమర్థించారు. ''ప్రభుత్వం సరైన పనే చేస్తోంది. అల్లరిమూకలకు గుణపాఠం చెప్పాల్సిందే'' అని ఆయన అన్నారు.

భవనాల కూల్చివేత పనులు ఆదివారం కూడా కొనసాగాయి. అవి కొనసాగుతాయని జిల్లా అధికారి ధీరేంద్ర చెప్పారు.

ఇవి కూడా చదవండి: