మోను మానేసర్: గోసంరక్షకుడిని అని చెప్పుకునే ఈ 28 ఏళ్ల యువకుడే నూహ్ మత అల్లర్లకు కారణమా?

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

హరియాణాలో ఈ వారం మొదట్లో చెలరేగిన భీకర మత అల్లర్లకు 28 ఏళ్ల యువకుడు ప్రధాన కేంద్రంగా ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి.

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఉన్న గురుగ్రామ్‌తో పాటు మరికొన్ని ఇతర జిల్లాల్లో కూడా ఈ అల్లర్లు కనిపించాయి. వీధుల్లోని కార్లు, దుకాణాలను తగులబెట్టారు.

హిందువులు, ముస్లిం గ్రూపుల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్లో ఒక ఇమామ్ సహా ఆరుగురు చనిపోయారు. పలువురు పోలీసులతో పాటు అనేక మందికి గాయాలయ్యాయి.

నూహ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం బజ్‌రంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తోన్న ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగిన తర్వాత ఈ హింస చెలరేగినట్లు పోలీసులు వెల్లడించారు.

కానీ, హిందూ ముస్లింల మధ్య చెలరేగిన ఈ అల్లర్లకు మోను మానేసర్‌గా ప్రసిద్ధి చెందిన మోహిత్ యాదవ్ ప్రధాన కేంద్రమని భారతీయ మీడియా ఆరోపించింది.

ఊరేగింపుకు రెండు రోజుల ముందు మానేసర్ విడుదల చేసిన ఒక వీడియో ఈ అల్లర్లకు ఆజ్యం పోసిందని నూహ్ నివాసితులతో పాటు పలువురు ముస్లిం రాజకీయవేత్తలు అన్నారు.

‘‘ఆ వీడియో రాకపోయి ఉంటే నూహ్ తగులబడి ఉండేదే కాదు’’ అని మీడియాతో అక్కడి స్థానికులు పలువురు చెప్పారు.

సోమవారం నాటి ఊరేగింపులో హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలంటూ మానేసర్ విజ్ఞప్తి చేయడం ఆయన విడుదల చేసిన వీడియోలో కనిపిస్తుంది.

‘‘నా మద్దతుదారులు, నా టీమ్‌తో కలిసి నేను కూడా అందులో పాల్గొంటా’’ అని ఆ వీడియోలో మానేసర్ చెప్పారు.

వీడియోలో మానేసర్ చేసిన వ్యాఖ్యలు హానికరమైనవి కావు. అయినప్పటికీ, ఆయనను ఎందుకు నిందిస్తున్నారు?

ఒక డ్రైవర్ కుమారుడు అయిన మానేసర్ తనకున్న చిన్న చిన్న ఆస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. కానీ, ఆయన చేసే రాజకీయ కార్యక్రమాలే ఆయనను ముఖ్యాంశాల్లో నిలబెడతాయి.

పదేళ్ల క్రితమే ఆయన బజ్‌రంగ్ దళ్‌లో చేరి అందులో ప్రముఖుడిగా ఎదిగారు. మెషీన్ గన్‌లతో సహా ఇతర ఆయుధాలను పట్టుకున్న ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాటు శక్తిమంతమైన పలువురు మంత్రులు, ఇతర సీనియర్ పోలీసు అధికారులతో దిగిన సెల్ఫీలు కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

హరియాణా గో సంరక్షణ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, నూహ్‌లోని బజ్‌రంగ్ దళ్ గో సంరక్షణ యూనిట్ అధ్యక్షుడు అయిన మానేసర్ మాట్లాడుతూ హిందూ మతాన్ని, ఆవులను సంరక్షించడమే తన విధి అని అన్నారు. భారత్‌లోని రాజస్థాన్, హరియాణా సహా అనేక ఇతర రాష్ట్రాల్లో గోవధను నిషేధించారు. గత కొన్నేళ్లుగా ఆవులను చంపుతున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో చాలామంది ముస్లింలపై దాడులు జరిగాయి.

మానేసర్‌కు తన మద్దతుదారుల్లో విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆయనకే అంకితం చేస్తూ అనేక సోషల్ మీడియా ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. మానేసర్ కృషి వల్లే ఇప్పటివరకు 50కి పైగా ఆవుల ప్రాణాలు దక్కాయంటూ వారు సోషల్ మీడియా పేజీల్లో ఆయనను పొగుడుతుంటారు.

ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలను ఎలాంటి ఆధారాలు లేకుండా ముస్లింలపై దాడులు చేయడానికి ఒక ఉపాయంగా వాడుకునే గోసంరక్షకులు మానేసర్, అతని అనుచరులు అని నూహ్‌లోని ముస్లింలు అంటున్నారు.

చట్టానికి లోబడే తనతో పాటు తన బృందం పనిచేస్తుందని మానేసర్ ఎప్పుడూ చెబుతుంటారు.

‘‘హిందువులను, ఆవులను కాపాడటం మా విధి. కానీ, మేం అడ్మినిస్ట్రేషన్‌తో కలిసే పనిచేస్తాం. ఆవు స్మగ్లర్లను పట్టుకున్నప్పుడల్లా వారిని పోలీసులకే అప్పగిస్తాం’’ అని ఆయన అన్నారు.

అయితే, ఈ వాదనలు రియాలిటీలో మరోలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, గత కొన్నేళ్లుగా స్వయంగా మానేసర్‌తో పాటు అతని మద్దతుదారులు... ఆవు స్మగర్లను అడ్డగిస్తున్న ఫోటోలు, ఆవులను లేదా ఆవు మాంసాన్ని తరలిస్తున్నారని చెబుతున్న ట్రక్కులను వెంటాడి తగులబెట్టే ఫొటోలు, వీడియోలను తరచుగా పోస్ట్ చేస్తుంటారు.

ఈ ఫొటోల్లో చాలావరకు రక్తసిక్తమైన ముస్లిం వ్యక్తుల ముఖాల పక్కన మానేసర్ పోజులిస్తూ కనిపిస్తారు. హిందువుల దేవుడు రాముడిని, గోమాతను స్తుతిస్తూ నినాదాలు చేయాలంటూ పురుషులను బలవంతం చేస్తున్న వీడియోలను కూడా మానేసర్ పోస్ట్ చేశారు.

జునైద్, నాసిర్ అనే ఇద్దరు ముస్లింల హత్య కేసులో మానేసర్‌ను ఫిబ్రవరిలో నిందితుడిగా చేర్చారు. ఆయనపై కిడ్నాప్, దాడి, హత్య అభియోగాలను నమోదు చేశారు. ఈ ఆరోపణలు అన్నింటినీ ఆయన కొట్టిపారేశారు.

పశువుల వ్యాపారులనే ఆరోపణలతో ‘బజ్‌రంగ్ దళ్ గో సంరక్షణ దళ’ సభ్యులు ఫిబ్రవరి 15న నూహ్‌లో ముస్లిం వ్యక్తులను అపహరించారని రాజస్థాన్‌లోని కోర్టు పత్రాలు పేర్కొన్నాయి.

వారిని దారుణంగా కొట్టారు. ఒకరోజు తర్వాత కాలిపోయిన వారి శరీరాలు హరియాణాలోని ఒక కారులో గుర్తించారు.

ఈ నేరం జరిగినప్పటి నుంచి మానేసర్ పరారీలో ఉన్నారని, అతని ఆచూకీ తెలియలేదని హరియాణా పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో అతన్ని అరెస్ట్ చేయడానికి రాజస్తాన్ పోలీసులు కూడా హరియాణాకు వెళ్లారు. కానీ, అతను దొరకలేదని చెప్పారు.

కానీ, మానేసర్‌కు సంబంధించిన కొత్త వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో అతని ఖాతాలో, అతని మద్దతుదారుల, అభిమానుల ఖాతాల్లో కనిపిస్తున్నాయి.

సోమవారం నాటి హింస తర్వాత మానేసర్ అనేక భారతీయ టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ హింసలో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. వీహెచ్‌పీ నాయకుల సూచన మేరకే తాను ఆ ఊరేగింపులో పాల్గొనలేదని ఆయన వెల్లడించారు.

మతంపై, ఆవులపై ఎలాంటి దాడిని హిందువులు సహించరని ఆయన అన్నారు.

తనపై ఉన్న హత్య ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ ఆ నేరం జరిగిన సమయంలో తాను అక్కడ లేనని విలేఖరులతో ఆయన చెప్పారు.

మానేసర్‌తో భారత మీడియా మాట్లాడగలిగినప్పుడు హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులు అతన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

దీనిపై రాజస్థాన్, హరియాణా పోలీసులను బీబీసీ సంప్రదించింది. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తమ రాష్ట్రంలో మానేసర్ ‘వాంటెడ్ మ్యాన్’ కాదని, కావాలంటే రాజస్థాన్ పోలీసులకు అవసరమైన సహాయం చేస్తామని గురువారం ఉదయం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు.

కానీ, మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు మానేసర్ చెప్పిన వాటితో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. ప్రతీ కేసులో హరియాణా పోలీసులు తనను ఇరికించారని ఒక న్యూస్ చానెల్‌తో మానేసర్ అన్నారు.

‘‘చివరకు ఒక ఎలుక చచ్చిపోయినా వారు నన్నే నిందిస్తున్నారు’’ అని మానేసర్ అన్నారు.

ఫిబ్రవరి 6న జరిగిన ఘటనతో సహా అల్లర్లు, హింసకు సంబంధించిన ఇతర ఫిర్యాదుల్లో కూడా మానేసర్ పేరు ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)