మణిపుర్: తెగల మధ్య ఘర్షణలు మతాల మధ్య చిచ్చుగా మారిన వైనం, ఎందుకిలా జరుగుతోంది?

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మణిపుర్ మండుతోంది. వందల ఏళ్ల నాటి సామరస్యం తగలబడిపోతోంది. వివిధ తెగల మధ్య విలసిల్లిన సౌభ్రాతృత్వం కాలి బూడిదైపోతోంది.

పాత గొడవలను చెరిపేసి, మెయ్‌తెయి, కుకి, నాగ తెగల ప్రజలు కలిసి జీవించాలనే కల ఛిద్రమైపోయింది. పరస్పర విశ్వాసం కోల్పోయిన ప్రజలు నిస్సహాయంగా మారారు.

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో జాతి హింస చెలరేగి నెలన్నర దాటింది. కానీ, పరిస్థితిలో ఏ మార్పూ లేదు. రాష్ట్రం అగ్నిగుండలా రగిలిపోతోంది.

మెయ్‌తెయి, కుకి తెగల మధ్య రాజుకున్న హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 390 మంది గాయపడ్డారు.

కానీ, హింస ఆగడం లేదు. స్థానికుల సహనం నశిస్తోంది.

దీన్ని అంతర్యుద్ధమని ఎందుకు అంటున్నారు?

మణిపుర్‌లోని మెయితెయి తెగ ప్రజలు తమను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది.

మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రంలో భీకర హింస చెలరేగింది. మెయితెయిలు కుకిలను, కుకిలు మెయితెయిల స్థలాలను లక్ష్యంగా చేసుకున్నారు.

రాజధాని ఇంఫాల్‌కు రెండు గంటల దూరంలో కుకి ఆధిపత్యం ఉన్న చురచంద్‌పూర్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతుండగా, 23 ఏళ్ల అలెక్స్ జమ్‌కోథంగ్ అక్కడే నిల్చుని చూస్తున్నారు.

అకస్మాత్తుగా పైన ఉన్న ఒక భవనం నుంచి బుల్లెట్ వచ్చి ఆయన ఛాతీని చీల్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అంతలోనే ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

అప్పటి నుంచి అలెక్స్ తల్లి నిద్రపోలేదు. ఏడుస్తూనే ఉన్నారు.

అలెక్స్ తండ్రి ఆర్మీలో పనిచేస్తున్నారు. సోదరుడు ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్)లో ఉన్నారు. తమ డిమాండ్‌ను నెరవేర్చిన తరువాతే తన తమ్ముడికి అంత్యక్రియలు నిర్వహిస్తానని ఆయన అంటున్నారు.

"మా జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలీదు. కేంద్రప్రభుత్వం గిరిజనులకు సౌకర్యాలు కల్పించకపోతే మేం ఒప్పుకోం. మెయితెయి ప్రజలు కూడా ఒప్పుకోరు. అంతర్యుద్ధం ఇప్పుడు మొదలైంది. కేంద్రంతో కూడా యుద్ధం జరుగుతోంది. డిమాండల్లు నెరవేర్చకపోతే మార్చురీ నుంచి శవాలు కూడా కదలవు" అని అలెక్స్ అన్నయ్య అన్నారు.

స్పష్టంగా కనిపిస్తున్న విభజన రేఖ

ప్రస్తుతం మణిపుర్ రెండు ముక్కలైంది. ఒక వైపు మెయితెయి ప్రజలు, మరొకవైపు కుకి ప్రజలు.

మనుషులు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, తోటలు ధ్వంసమయ్యాయి. గ్రామాలు, పల్లెలు నాశనమైపోయాయు. ఒకటి, రెండు రోజులు కాదు, వారాల తరబడి హింస కొనసాగుతోంది.

రాష్ట్రం బీటలు వారిపోయింది. ఈ పగుళ్లు చాలా కాలంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత, క్రైస్తవాన్ని అనుసరించే కుకి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగల్లో చేర్చారు.

మెయితెయ్ తెగలో హిందువులు ఎక్కువ. కొందరికి రిజర్వేషన్లు లేవు. కొంతమందిని షెడ్యూల్డ్ కులం కింద, మరికొందరిని ఓబీసీల కింద చేర్చారు.

మెయితెయిలు కుకి ప్రాంతాల్లో భూములను కొనలేరు. అందుకే, తమను కూడా షెడ్యూల్ తెగలలో చేర్చాలని వారు పట్టుబడుతున్నారు. ఇక్కడే గొడవ మొదలైంది.

మణిపుర్‌లో మెయితెయి జనాభా ఎక్కువ. 28 లక్షలు ఉన్నారు. వారంతా లోయ ప్రాంతంలో నివసిస్తున్నారు. కుకి జనాభా నాలుగు కొండ ప్రాంతపు జిల్లాలలో స్థిరపడ్డారు.

మెయితెయి తెగలో ముస్లింలు కూడా ఉన్నారు. వీరితో పాటు నాగ తెగ ప్రస్తుతం ఈ ఘర్షణలకు దూరంగా ఉంది.

50 వేల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు

మణిపుర్ ప్రాంతంలో ఇంత హింస చోటుచేసుకున్న చరిత్ర లేదని మణిపుర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ ప్రియోరంజన్ సింగ్ చెప్పారు.

"నాగా, కుకి తెగలను ఏకం చేసి పరిపాలనలో స్థానం కల్పించిన చరిత్ర మెయితెయిలది. ఇక్కడి హిందువుల చరిత్ర కూడా చాలా భిన్నమైనది. మణిపురి ప్రజలకు మతోన్మాదం లేదు. 19వ శతాబ్దంలో రాచరిక పాలనలో హిందూమతం ఆధిపత్యం చెలాయించిందన్నది నిజమే, కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు" అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండలో నష్టం ఇరువైపులా వారికీ జరుగుతోంది.

50 వేలకు పైగా ప్రజలు ఇళ్ల నుంచి పారిపోయి సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వీరిలో మెయితెయి, కుకి...రెండు వర్గాల వారూ ఉన్నారు.

రాజధాని ఇంఫాల్‌లోని స్టేడియం పక్కనే యూత్ హాస్టల్ ఉంది. దాన్ని సహాయక శిబిరంగా మార్చారు. హింస మొదలైనప్పుడు అక్కడ 40 మంది గర్భిణులు తలదాచుకున్నారు. వారిలో నలుగురికి ఇప్పుడు పిల్లలు పుట్టేశారు. ఈ పసిబిడ్డలను 'కాంఫ్లిక్ట్ చిల్డ్రన్’ అని పిలుస్తున్నారు. తమ పిల్లలు ఇలా సహాయక శిబిరాల్లో పుడతారని వారి తల్లులు కలలో కూడా ఊహించి ఉండరు.

వారిలో 27 ఏళ్ల మరీనా ఒకరు. ఆమె ఆడబిడ్దకు జన్మనిచ్చారు. ఆమె తన భర్త నుంచి దూరమయ్యారు. పరిస్థితులపై ఆమె చాలా ఆగ్రహంగా ఉన్నారు. పాపకు 'జీత్' (విజయం) అని పేరు పెట్టారు.

"రాత్రి భోజనానికి కూర్చుంటుండగా, మా గ్రామంపై దాడి జరిగింది. ఇల్లు వదిలి నది వైపు పరుగుతీశాం. అక్కడ చాలామంది పిల్లలు నీటిప్రవాహంలో కొట్టుకుపోవడం చూశాం. మర్నాడు ఉదయం మాకు వాళ్ల శవాలు కనిపించాయి" అని మరీనా చెప్పారు.

ఒకప్పటి మెయితెయి హిందూ రాజకుటుంబానికి పెరుగుతున్న మద్దతు

కొన్నేళ్ళుగా, మణిపుర్‌లో ఒకప్పటి రాజకుటుంబానికి ప్రదారణ పెరుగుతూ వస్తోంది. వీళ్లు మెయితెయి హిందువులు. ఈ కుటుంబానికి చెందిన మహారాజా లిషెంబా సంజవోబా ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

ఆయనతో మాట్లాడేందుకు బీబీసీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఆయన సమ్మతించలేదు.

అయితే, మణిపుర్‌లో జరుగుతున్న హింస గురించి ఒక ప్రకటన విడుదల చేశారు.

"హింసాకాండ ఖండించదగినది. ఏ సమస్యకైనా సామరస్యంగా చర్చించుకోవడమే పరిష్కారం" అన్నది దాని సారంశం.

కాగా, మణిపుర్‌లో జాతుల మధ్య హింసకు మతపరమైన ప్రదేశాలు ధ్వంసమైపోవడం ఇదే తొలిసారి.

మెయితెయి, కుకి వర్గాల మధ్య రాజుకున్న హింస సరికాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శారదా దేవి కూడా అన్నారు.

కొందరు శారదా దేవి ఇంటికి కూడా నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. భద్రతా దళాలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

“చర్చిలను తగులబెట్టారు, దేవాలయాలపై దాడిచేశారు. మెయితెయి, కుకి వర్గాల వారిరువురూ నష్టపోతున్నారు. ఇది బాధాకరం" అని ఆమె అన్నారు.

బీబీసీకి అందిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జూన్ మొదటి వారానికి మణిపుర్‌లో 250 కంటే ఎక్కువ చర్చిలు ధ్వంసమయ్యాయి. సుమారు రెండు వేల కుకి ఇళ్లు దాడికి గురయ్యాయి.

'ప్రభుత్వంపై నమ్మకం లేదు'

చురచంద్‌పూర్‌లో కుకి క్రిస్టియన్ లీడర్స్ ఫెలోషిప్ సంస్థ హెడ్, ఫాదర్ హావోకిప్ థోగ్‌ఖోసే రాష్ట్రంలోని చర్చిల భద్రత గురించి ఆందోళన వ్యక్తంచేశారు.

“కుకి సమాజం చాలా ఆందోళన చెందుతోంది. మాకు ప్రభుత్వంపై నమ్మకం లేదు. మనుషులు, ఇళ్లు, చర్చిలపై మూకదాడిని ప్రభుత్వం అడ్డుకోలేదు. మాకు దుర్భర కాలం ఇది. ఇక్కడ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కానీ, భారతీయ హిందువులను సంతోషపెట్టడానికి చర్చిలపై దాడులు చేస్తున్నారు" అని ఆయన అన్నారు.

అక్కడ చర్చిలు లేదా దేవాలయాల ఫొటోలు తీయడం లేదా వాటిపై జరిగిన హింసను కవర్ చేయడం మీడియా వాళ్లకు ప్రమాదకరమని భావిస్తున్నారు. దగ్గరకొచ్చి స్థానికులు రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఫొటోలు తీస్తుంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇరువైపులవారూ కోపంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 100 దేవాలయాలతో పాటు 2000 మెయితెయి ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.

అయితే, మెయితెయి వర్గం ప్రయోజనాల కోసం ఏర్పాటైన కోకోమి ప్రతినిధి కె. ఓథాబాయ మాట్లాడుతూ, "మణిపుర్‌లోని సమస్యలు మతపరమైనవి కావు. ఈసారి కూడా ఈ అంశం తీవ్రం కాకుండా అడ్డుకున్నారు" అని అన్నారు.

"200 చర్చిలు దెబ్బతిన్నాయి. కానీ, మరో 400 చర్చిలు చెక్కుచెదరకుండా ఉన్నాయన్నది మీరు తెలుసుకోవాలి. మతపరమైన హింస జరిగి ఉంటే అవి తప్పించుకునేవా? కొండ ప్రాంతాల్లో ఒక్క మందిరం కూడా కనిపించదన్న మాట వాస్తవమే" అని చెబుతూ హింసకు మతం రంగు పులుముతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు.

పొరుగున ఉన్న మియన్మార్‌లోని చిన్ ప్రాంతం నుంచి పారిపోయి వచ్చిన కుకి మిలిటెంట్లు కూడా ఈ హింసకు కారణమని చెబుతున్నారు. వారి దగ్గ ఆధునిక ఆయుధాలు ఉన్నాయని అంటున్నారు.

స్వయం పాలన కావాలంటున్న కుకి ప్రజలు

మరోవైపు, మణిపుర్‌లోని మైనారిటీ కుకిలు తమ ప్రాంతాలకు విడిగా ప్రభుత్వం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను తిరస్కరించింది.

"కేంద్రమైనా, రాష్ట్రం ప్రభుత్వమైనా తమ బాధలను పట్టించుకోవడం లేదని" కుకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ హోం సెక్రటరీ మాంగ్ ఖోన్సాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

“అందరూ ఎక్కడో ఒకచోట మైనారిటీలే అవుతారు. ఇప్పుడు మీరు మణిపుర్‌లో ఉన్నారు కాబట్టి మీరు మెజారిటీ అనుకోవచ్చు. కానీ, ఇక్కడే ఉండిపోతారా? బయటికి వెళితే మైనారిటీ అవుతారు కదా. ఇక్కడ మేం పడుతున్న కష్టాలే అక్కడ మీకూ ఎదురవుతాయి" అన్నారాయన.

తెగల మధ్య హింస మతం రంగు పులుముకుంటుందన్న దానిపై మాంగ్ ఖోన్సాయ్ విచారం వ్యక్తంచేశారు.

"మేం దేని కోసం పోరాడుతున్నామో నాకూ అయోమయంగా ఉంది. హక్కుల కోసం పోరాడుతుంటే హింస మొదలైంది. అది మతం రంగు పులుముకుంటోంది. దీన్ని వెంటనే నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి, లేకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది" అన్నారు.

కుకి ప్రాంతాల్లో మామూలుగా తిరగడం అసాధ్యంగా మారింది. అక్కడ మహిళలు, పురుషులు గట్టి కాపలా కాస్తున్నారు.

గ్రామాలపై పరస్పర దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఒక కుకి గ్రామంలో వాళ్లు మాకు గ్రెనేడ్లు, ఆర్పీజీ నుంచి పేల్చిన గుండ్లు చూపించారు.

చాలా గ్రామాల్లో గార్డులకు వాకీ-టాకీలు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు, వీరి వద్ద లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి. కానీ, ఇప్పుడు భారత భద్రతా దళాలు నలువైపులా కాపుకాశాయి. ఆయుధాలు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేశాయి.

'పక్షపాత రాజకీయాలదే తప్పు'

ఇంఫాల్ వెలుపల ఒక రహస్య ప్రదేశానికి వెళ్లి, స్వతంత్ర మణిపుర్ కోసం డిమాండ్ చేస్తూ దశాబ్దాలుగా అండర్ గ్రౌండ్‌లో ఉన్న మాజీ యూఎన్ఎల్ఎఫ్ చైర్మన్ రాజకుమార్ మేఘన్‌తో బీబీసీ మాట్లాడాం.

“ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు. నాకు షాకింగ్‌గా ఉంది. చాలా బాధపడుతున్నా. చర్చిలు లేదా ప్రార్థనా స్థలాలను తగులబెట్టడాన్ని నేను సమర్థించను. మెయితెయి, కుకి రెండువర్గాలు ఇంత నష్టం ఎదుర్కోడానికి పక్షపాత రాజకీయాలే ప్రధాన కారణమని నేను నమ్ముతున్నా" అన్నారాయన.

“మణిపుర్‌లో మతం పేరుతో ఎప్పుడూ అల్లర్లు జరగలేదు. జరుగుతున్నదాన్ని డైవర్ట్ చేసి మతపరమైన హింసగా చూపించడం ఇదే మొదటిసారి" అని మణిపుర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేబబ్రత సింగ్ అన్నారు.

ఏది ఏమైనా, మణిపుర్‌లో ప్రజలంతా నష్టపోతున్నారు. వందేళ్లుగా కలిసి జీవిస్తున్న ఒక సమాజం, అందులోని ప్రజల మధ్య పరస్పర విశ్వాసం తగ్గిపోయింది. పరిస్థితులు భయానకంగా మారాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)