You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- రచయిత, అమండా రుగేరి
- హోదా, బీబీసీ ఫ్యూచర్
అది వేసవి కాలంలో ఓ అందమైన సాయంత్రం. డాబాపై కూర్చొని సూర్యరశ్మిని ఆస్వాదించడానికి బదులుగా నేను కంప్యూటర్ ముందు కూర్చున్నాను. మా పాప కోసం స్విమ్‌సూట్ల ఫొటోలు ఒకదాని తర్వాత మరొకటి చూస్తూ వెళ్తున్నారు. ఎన్ని చూసినా ఇంకా వస్తూనే ఉన్నాయి.
తెల్లరంగు అంచులతో సముద్రపు గవ్వల ప్రింట్, దానికి సరిపడే టోపీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మరొకటి అచ్చం జలకన్యను తలపించే నీలి రంగులో ఉంది. ఇంకొకటి ఇంద్రధనుస్సు రంగుల గీతలతో ఆకట్టుకుంటోంది.
కొన్ని స్విమ్‌సూట్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వేసుకోవడానికి సౌకర్యవంతంగానూ ఉంటాయి. వీటిలో చాలావరకు ఎస్‌పీఎఫ్ 50 కంటే ఎక్కువ ఉండే క్లాత్‌తో తయారుచేస్తారు. కానీ, ఇక్కడ ఒక సమస్య ఉంది.
ఒకవేళ మా పాప ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతే, ఈ స్విమ్‌సూట్లపై రంగులు, ప్రింట్‌లు ఆమె జాడ కనిపించకుండా చేస్తాయా?
వినడానికి కాస్త విపరీతంగా అనిపించొచ్చు. కానీ, గణాంకాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అమెరికాలో ఒకటి నుంచి నాలుగేళ్ల చిన్నారుల్లో ఎక్కువ మంది నీటిలో మునిగిపోవడం వల్లే చనిపోతున్నారు. 5 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల మరణాల్లోనూ కారు ప్రమాదాల తర్వాత స్థానంలో నీటిలో మునిగిపోవడమే ఉంది.
తృటిలో మరణం నుంచి తప్పించుకునే ‘‘నీటిలో మునక’’ కేసులు కూడా చాలా ఉంటాయి. నీటిలో మునిగి చనిపోతున్న ఒక్కో చిన్నారితో పోల్చినప్పుడు ఏడుగురు పిల్లలు ‘‘ఎమర్జెన్సీ కేర్’’లో చేరుతున్నారు.
ఒక్కోసారి దీని వల్ల ప్రాణాలు కోల్పోకుండా అడ్డుకోవచ్చు. కానీ, నీటిలో మునిగిపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో మెదడు దెబ్బతినడం కూడా ఒకటి.
అయితే, కేవలం పిల్లలే దీనికి ప్రభావితం అవుతున్నారని భావించకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సమాచారం ప్రకారం, ఏటా 2,36,000 మంది ప్రమాదవశాత్తు నీటిలో ముగినిపోతున్నారు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో వీరి వాటా 8 శాతం వరకూ ఉంటోంది.
డబ్ల్యూహెచ్‌వో తోపాటు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సమాచారం ప్రకారం కొన్ని చర్యలతో నీటిలో మునిగి మరణించే ముప్పులను తగ్గించుకోవచ్చు. స్విమ్మింగ్ పాఠాలు నేర్చుకోవడం, స్విమ్మింగ్ పూల్స్‌లో కంచెలు ఏర్పాటుచేసుకోవడం, పిల్లలు ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తగా గమనించడం లాంటివి ఇందులో ఉన్నాయి.
అయితే, ఒకసారి పిల్లలు నీటిలో ఈత కొడుతూ కనిపించకుండా పోయేటప్పుడు ప్రతి సెకనూ అమూల్యమైనది. మరోవైపు పైన చెప్పుకున్న ‘సురక్షిత చర్యలకు’లకు అదనంగా నిపుణులు మరొక సూచన కూడా ఇస్తున్నారు. అదే నీటిలో స్పష్టంగా కనపడే రంగులు, దుస్తులను వేసుకోవాలని వారు చెబుతున్నారు.
లైఫ్‌గార్డ్, లైఫ్‌గార్డ్ ఇన్‌స్ట్రక్టర్, వాటర్‌పార్క్ మేనేజర్, పూల్-స్పా ఇన్‌స్పెక్టర్‌గా నటాలీ లివింగ్‌స్టన్ పనిచేశారు. ‘ఎలైవ్ సొల్యూషన్స్’ అనే సంస్థను కూడా ఆమె స్థాపించారు. ప్రజలకు సురక్షితంగా ఈత కొట్టడంపై ఈ సంస్థ ద్వారా ఆమె అవగాహన కల్పిస్తుంటారు.
ఏళ్ల నుంచి ఆమె సురక్షితంగా ఈత కొట్టడం అనే అంశంపై పనిచేస్తున్నారు. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు నీటిలో ముగినిపోతే సదరు వ్యక్తి వేసుకునే బట్టలు ఆయన్ను కనిపెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని తన అనుభవంతో ఆమె చెప్పారు. ఈ విషయంపై ఆమె ఒక అధ్యయనం కూడా నిర్వహించారు.
‘‘2019లో మా పిల్లలను తరచూ స్విమ్మింగ్‌కు తీసుకెళ్లేదాన్ని. అక్కడ స్విమ్‌సూట్లలో పిల్లలు కనిపించేవారు. అయితే, కొందరు నీటిలో కొట్టొచ్చినట్లు కనిపించే రంగుల బట్టలు వేసుకునేవారు కాదు. ప్రమాదవశాత్తు వారు నీటిలో మునిగిపోతే, కనిపెట్టడం చాలా కష్టమయ్యేది’’ అని ఆమె చెప్పారు.
‘‘అందుకే ఈ రంగులపై ఒక అధ్యయనం చేపట్టాలని అనుకున్నాను. భిన్న రకాల నీటిలో ఏ బట్టలు స్పష్టంగా కనిపిస్తాయో నేను గమనించాలని భావించాను’’ అని ఆమె తెలిపారు.
లిప్‌స్టిక్ ఎరుపు నుంచి ఆకుపచ్చ రంగు వరకూ భిన్నరకాల బట్టలు భిన్న రకాల నీటిలో ఎలా కనిపిస్తున్నాయో వీరు గమనించారు. చీకటిగా కనిపించే పూల్ అడుగుభాగం, కాస్త వెలుగుతో కనిపించే పూల్‌లో ఇతర భాగాలు, చెరువులు ఇలా చాలా ప్రాంతాల్లో ఈ అధ్యయనం జరిగింది.
పూల్ లేదా చెరువు లేదా సముద్రంలో కొన్ని రంగులు కనిపించడం చాలా కష్టమవుతోందని వీరు గుర్తించారు. మన కళ్లతో పోల్చినప్పుడు కెమెరా లెన్సులు చూపించే ఈ రంగుల్లో తేడా ఉంటోందని కనిపెట్టారు.
ముఖ్యంగా నీలం, గోధుమ, తెలుపు రంగులు అసలు కనిపించడంలేదని తేలింది. అదే సమయంలో ముదురు రంగు బట్టలు కూడా కనిపించడం కష్టం అవుతోందని వెల్లడైంది. అయితే, ఇక్కడ అన్ని రంగులనూ పరీక్షించలేనప్పటికీ, ఇంచుమించు ఒకేలా కనిపించే రంగులు ఒకేలా కనిపించొచ్చు.
గాలితో పోల్చినప్పుడు కాంతిని నీరు శోషించుకోవడం, ప్రతిబింబించడం భిన్నంగా ఉంటుంది. ఫలితంగా నీటిలో కొన్ని రంగులను చూడటం కష్టం అవుతుంది. ఇక్కడ పొడుగైన తరంగ దైర్ఘ్యం గల కాంతిని నీరు శోషించుకుంటోంది. నీటి లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఈ రంగుల ప్రభావం తగ్గిపోతుంటుంది. అంటే కాంతి వర్ణపటంలోని ముదురు ఎరుపు వైపు ఉండే రంగులను నీటిలో గుర్తించడం కాస్త కష్టం అవుతుంది. ముఖ్యంగా కొన్ని అడుగులు నీటి లోతుకు వెళ్లిన తర్వాత ఈ రంగులను కనిపెట్టడం చాలా కష్టం.
ఎడ్యుకేషనల్ బ్రాడ్‌కాస్టర్ పీబీఎస్ లెర్నింగ్ కూడా దీనిపై ఒక అధ్యయనం చేపట్టింది. సముద్రంలో ఎంత వేగంగా ఈ రంగులు నీటిలో కలిసి పోయినట్లుగా అవుతున్నాయో దీనిలో పరిశోధకులు గమనించారు.
నీటిలో దాదాపు 16 అడుగుల లోతుకు వెళ్లినప్పుడు ఎరుపు రంగులో కనిపించే వస్తువులు కూడా దగ్గర నుంచి చూసినప్పటికీ నీలం రంగులో కనిపిస్తాయి. అదే పైనుంచి చూస్తే పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. ‘‘మంచినీటి స్విమ్మింగ్ పూల్‌లో అయితే, ముదురు రంగులు ఏదో నీడలా కనిపిస్తాయి. అదే కాస్త మురికిగా ఉండే పూల్‌లో అయితే, మేఘం రంగులో కనిపిస్తాయి’’ అని లివింగ్‌స్టన్ చెప్పారు.
నీరు కాస్త అలజడికి గురైనప్పుడు, మనకు కనిపించే విధానంలోనూ మార్పు వస్తుంది. ‘‘మనం గాలి లేదా కిటికీ నుంచి చూసినట్లుగా నీటిలోకి చూడలేం. కాస్త నీరు కదిలినా మనకు కనిపించే రంగుల్లో మార్పు వస్తుంది’’ అని ఆమె అన్నారు.
అంటే, మరీ లేత లేదా ముదురు రంగుల్లో కనిపించే బట్టలు నీటిలో కనిపించడం కాస్త కష్టం అవుతుంది. అలజడితో ఉండే నీటిలో ఎరుపు రంగు నీడలా కనిపిస్తుంది. ప్రకాశవంతమైన నీలం రంగు కూడా అంతే. అయితే, ఇలాంటి పిల్లల స్విమ్‌సూట్లే మార్కెట్‌లో మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
తాజాగా మే 2023లో ఎలైవ్ మరో అధ్యయనం కూడా చేపట్టింది. దీనిలో ప్రింట్స్ ఉండే బట్టలు ఎలా పనిచేస్తాయో దృష్టిసారించారు. ఎందుకంటే చాలా స్విమ్‌సూట్లు ఇప్పుడు ప్రింట్‌లతో వస్తున్నాయి.
ప్రింట్‌లతో పోలిస్తే, ఇవిలేని బట్టలు చక్కగా కనిపిస్తున్నాయని అధ్యయనంలో తేలింది. ప్రింట్‌లు తక్కువగా ఉండే బట్టలు కూడా వేసుకోవచ్చని దీనిలో పరిశోధకులు సూచించారు. ప్రకాశవంతమైన రంగులపై వేసినప్పటికీ పెద్ద ప్రింట్‌లు కనిపించడంలేదని వివరించారు.
తెల్లని, నారింజ రంగు గీతలు కూడా నీటిలో సరిగా కనిపించడంలేదని, అదే ముదురు రంగు గీతలైతే పూర్తిగా కనిపించకుండా పోతున్నాయని తేలింది.
మనం ప్రకృతిని జాగ్రత్తగా గమనిస్తే ఇదేమీ ఆశ్చర్యంగా అనిపించదు. చాలా చేపలు చర్మంపై ఉండే గీతలతో పెద్ద చేపలకు కనిపించకుండా తప్పించుకుంటాయి. ఈ గీతల వల్ల వాటిని గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది.
మొత్తంగా ఈ రెండు అధ్యయనాల ఫలితాలను విశ్లేషించిన తర్వాత, కాస్త ప్రకాశవంతంగా కనిపించే రంగులతోపాటు పరస్పర భిన్నంగా కనిపించే రెండు రంగులుండే స్విమ్‌సూట్లు లేదా ప్రింట్స్ తక్కువగా ఉండేవి ఎంచుకోవాలని లివింగ్‌స్టన్ సూచిస్తున్నారు.
గతంతో పోలిస్తే ఇలాంటి స్విమ్‌సూట్లు ఇప్పుడు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆమె అన్నారు. బహుశా ఈ విషయాన్ని కొన్ని బట్టల తయారీ సంస్థలు కూడా గ్రహించి ఉండొచ్చని ఆమె అన్నారు.
అయితే, ఇప్పటికీ స్విమ్‌సూట్‌లు ఎంపిక చేసుకోవడం చాలా మందికి కష్టంగా ఉంటోంది. ‘‘ఎందుకంటే చాలా సంస్థలు ఇప్పటికీ మరీ ముదురు రంగు స్విమ్‌సూట్లనే ఎక్కువగా తీసుకొస్తున్నాయని చాలా మంది అంటున్నారు’’ అని ఆమె చెప్పారు.
నేను కూడా అలా చెబుతున్న వారిలో ఒకరిని. ఇంటర్నెట్‌లో దాదాపు గంట సేపు వెతికిన తర్వాత, నాకు రెండు లేతరంగు స్విమ్‌సూట్లు కనిపించాయి. వీటిలో ఒకటి లేత నారింజ రంగు స్విమ్‌సూట్, మరొకటి పసుపు రంగు బికినీ. పొడుగు చేతుల బట్టలైతే కేవలం ముదురు నీలి రంగులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో పొట్టి చేతుల స్విమ్‌సూట్లే కొనుగోలు చేయాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- తేజస్విని రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)