కోచి - నరేంద్ర మోదీ: వాటర్ మెట్రో అంటే ఏంటి? ఏం సౌకర్యాలు ఉంటాయి? టికెట్ ఎంత?

ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో ‘‘వాటర్ మెట్రో’’ను ప్రారంభించారు.

కేరళలో నదులు, సరస్సులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అక్కడి ప్రజలు రాకపోకలకు నీటి మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటారు.

సుమారు 41 నదులు ఉన్న కేరళలో 1,895 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలున్నాయి. పడవల్లో రోజూ వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ప్రస్తుతం చెక్క, స్టీలు, ఫైబర్ బోట్లను ఎక్కువగా వాడుతున్నారు.

ఇప్పుడు ఈ జల రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తూ ‘‘వాటర్ మెట్రో’’లను తీసుకొచ్చారు.

వాటర్ మెట్రో అంటే?

ప్రస్తుతం మనకు మెట్రో రైళ్లు తెలుసు. పెద్దపెద్ద నగరాల్లో తిరిగే లోకల్ రైళ్లు ఇవి. ఇలాంటి కాన్సెప్ట్ ఆధారంగా తీసుకొచ్చిందే వాటర్ మెట్రో. పట్టణ ప్రాంతాల్లోని నదులు, సరస్సులలో ఆధునిక టెక్నాలజీ ఆధారంగా నడిచే బోట్లను తీసుకొచ్చారు.

కేరళలోని కోచిలోవాటర్ మెట్రోను ప్రారంభించారు.

ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు, రవాణా సదుపాయాలు మరింత సులభతరం చేసేందుకు వాటర్ మెట్రో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

‘‘తొలి వాటర్ మెట్రో’’

కోచి వాటర్ మెట్రోను దేశంలో తొలి వాటర్ మెట్రోగా చెబుతున్నారు.

కోచి వాటర్ మెట్రో ప్రాజెక్ట్ వివరాల ప్రకారం- ప్రస్తుతం 15 మార్గాలను గుర్తించారు. 78 కిలోమీటర్ల పరిధిలోని 10 దీవులను ఇవి కలుపుతాయి.

ఆధునిక టెక్నాలజీతో వేగంగా ప్రయాణించే 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు ఈ మార్గాల్లో ప్రయాణిస్తాయి.

ఇందుకోసం 38 జెట్టీలు ఏర్పాటు చేశారు. బోట్లను నిలిపేందుకు, నిర్వహణ కోసం రెండు బోటు యార్డ్స్ కూడా ఉంటాయి.

ఈ బోట్లకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సహాయ చర్యలు చేపట్టడానికి నాలుగు రెస్క్యూ బోట్లు కూడా ఉంటాయి.

ఇప్పుడు వాటర్ మెట్రో తొలి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు.

సౌకర్యాలు ఎలా ఉంటాయి?

మెట్రో రైళ్లలో ఉన్నట్లే ఈ వాటర్ మెట్రోలోనూ సౌకర్యాలు ఉంటాయి. మొబైల్ చార్జింగ్ పోర్ట్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు డిస్‌ప్లే స్క్రీన్లు ఉన్నాయి.

సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది.

ప్రకృతి అందాలను వీక్షించేందకు పెద్దపెద్ద గ్లాస్ కిటికీలు ఉన్నాయి.

ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు, లైఫ్ జాకెట్లు వంటివి ఉన్నాయి.

బోటును నడిపే వ్యవస్థ ఉండే కాక్‌పిట్‌ను ఆధునిక సదుపాయలతో తీర్చిదిద్దారు.

గంటకు 8 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఈ బోట్లు ప్రయాణిస్తాయి.

ఎంత మంది ప్రయాణించొచ్చు?

మొత్తం 78 బోట్లను అంచెల వారీగా ప్రారంభిస్తారు.

వీటిలో 23 బోట్లలో 100 మంది వరకు కూర్చొవచ్చు.

మిగతా 55 బోట్లలో 50 మంది ప్రయాణించొచ్చు.

రోజుకు లక్ష మంది రాకపోకలు సాగించేందుకు అనువుగా వాటర్ మెట్రో వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు.

రూ.20 నుంచి రూ.40 మధ్య టికెట్ ధరలున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడానికి 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది.

కోచి మెట్రో రైలు, వాటర్ మెట్రో బోట్లలో ప్రయాణించేందుకు ‘‘కోచి వన్’’ అనే కార్డును ఉపయోగించొచ్చు. యాప్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

వికలాంగులు సులభంగా సేవలు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రాజెక్ట్ వ్యయం ఎంత?

వాటర్ మెట్రో ప్రాజెక్ట్ ఖర్చు రూ.1,136.83 కోట్లు.

కేరళ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు జర్మనీకి చెందిన ఫండింగ్ ఏజెన్సీ కేఎఫ్‌డబ్ల్యూ రుణం ఇచ్చింది.

వాటర్ మెట్రోలో వాడే బోట్లను కోచి షిప్ యార్డ్ తయారు చేసింది.

పర్యావరణ అనుకూల మెట్రో

పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఇంజిన్లను ఈ బోట్లలో వాడుతున్నారు. ఇవి కరెంటు, డీజిల్‌తో నడుస్తాయి. ఇందుకోసం లిథియం టైటనేట్ ఆక్సైడ్(ఎల్‌టీవో) బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు.

బ్యాటరీలను చార్జ్ చేసేందుకు చార్జింగ్ పోర్టళ్లను ఏర్పాటు చేశారు. 15 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుందని కేరళ మెట్రో సంస్థ చెబుతోంది.

కోచి కేరళలో వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ జనాభా కూడా ఎక్కువే. అందువల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు వాటర్ మెట్రో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వాయు కాలుష్యం తగ్గించాలన్నది కూడా ఈ ప్రాజెక్ట్ మరో లక్ష్యం.

రోడ్లు, రైళ్ల కంటే ‘మేలు’

నేషనల్ వాటర్ వేస్ యాక్ట్-2016 ప్రకారం, దేశవ్యాప్తంగా 111 జలమార్గాలను ‘‘నేషనల్ వాటర్ వేస్’’గా ప్రకటించారు.

20,754 కిలోమీటర్ల పొడువు ఉండే ఈ మార్గాలు 24 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రయాణికులు, సరకు రవాణాకు వీటిని ఉపయోగిస్తారు.

ఇప్పటికీ దేశంలో మెజారిటీ రవాణా రోడ్ల ద్వారానే సాగుతోంది.

2019-2020లో రోడ్ల ద్వారా జరిగిన గ్రాస్ వాల్యూ అడిషన్ 3.06 శాతం. రైళ్లు(0.74 శాతం), విమానాలు(0.12 శాతం), జలరవాణా(0.08 శాతం) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

రోడ్లు, రైళ్లతో పోలిస్తే జలరవాణా వల్ల ఖర్చుతోపాటు కాలుష్యం తక్కువగా ఉంటుంది.

ఒక లీటరు ఇంధనంతో షిప్ ద్వారా 105 టన్నులను తరలించొచ్చు. అదే రైలు విషయంలో 85 టన్నులు, రోడ్డు మీద అయితే 24 టన్నులు మాత్రమే రవాణా చేయొచ్చని ప్రపంచ బ్యాంకు చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)