కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి: చార్‌ధామ్ యాత్రలో తెలుగు భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

    • రచయిత, రవి కుమార్ పాణంగిపల్లి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. మే 3 అక్షయ తృతియ రోజున గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల్లో యాత్రికులకు అనుమతిచ్చారు.

మే 6 నుంచి కేదార్‌నాథ్, మే 8 నుంచి బదరీనాథ్‌లలో భక్తుల సందడి మొదలవనుంది.

చార్ ధామ్ అంటే

చార్ ధామ్... అంటే దేశానికి నలు దిశలా ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాలు.

అంటే తూర్పున పూరీ, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బదరీనాథ్, దక్షిణాన రామేశ్వరం.

ఈ నాలుగు క్షేత్రాలను జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించాలన్నది హిందువులలో కొందరి విశ్వాసం.

అలాగే హిమాలయ పర్వత శ్రేణుల్లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలనూ చార్ ధామ్ అంటారు.

సాధారణంగా ఏప్రిల్-మే నెలల్లో ప్రారంభమయ్యే ఈ యాత్రను సవ్యదిశలో(క్లాక్ వైజ్) ప్రారంభిస్తారు.

అంటే యమునోత్రితో ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆపై గంగోత్రి, కేదార్ నాథ్, బదరీనాథ్ దర్శనంతో యాత్ర ముగుస్తుంది.

అయితే, కొందరు కేవలం కేదార్ నాథ్, బదరీనాథ్‌లను మాత్రమే దర్శిస్తారని ఉత్తరాఖండ్ పర్యటక శాఖ వెబ్ సైట్ పేర్కొంది.

కరోనా తరువాత

కరోనా కారణంగా రెండేళ్లుగా పెద్దగా సందడి లేని ఈ యాత్ర ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో జరగనుంది. అందుకు తగ్గట్టే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది.

అందులో భాగంగా యాత్రికుల గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకునే భక్తుల సంఖ్యను పరిమితం చేసింది.

కేదార్‌నాథ్‌లో రోజుకు 12 వేల మంది, బదరీనాథ్‌లో 15 వేలు, గంగోత్రిలో 7 వేలు, యమునోత్రిలో 4 వేల మంది మాత్రమే దర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.

ఇది యాత్ర ప్రారంభానికి కేవలం 2 రోజుల ముందే తీసుకున్న నిర్ణయం కావడంతో ముందుగానే ప్లాన్ చేసుకున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.

రాత్రి వేళల్లో, అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు యాత్రా మార్గాల్లో ప్రయాణాలను నిషేధించింది.

రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యదర్శి హరీష్ చంద్ర సెమ్వాల్ తెలిపారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఇది మొదటి విడతలో జరుగుతున్న 45 రోజుల యాత్ర, యాత్రకు వచ్చే వారంతా కచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలి. అందుకోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ నమోదు ఏర్పాట్లు చేశారు.

మే 1 నాటికి సుమారు 2 లక్షల 90 వేల మంది రిజిస్టర్ చేయించుకున్నారు. మున్ముందు యాత్రికుల సంఖ్య భారీగా పెరగొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

2019లో మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సుమారు 38 లక్షల మంది యాత్రికులు సందర్శించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడిచింది.

ఆ తర్వాత 2020లో కేవలం 3లక్షల 22 వేల మంది దర్శించుకోగా, 2021లో 5 లక్షలకు పైగా చార్ ధామ్ యాత్ర చేశారు.

తెలుగు రాష్ట్రాల యాత్రికులకు సూచన

తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ యాత్రకు వెళ్తుంటారు.

రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో యాత్ర మొదలు కావడంతో ట్రావెల్ ఏజెన్సీలు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. గడచిన రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది యాత్రికుల సంఖ్య బాగా పెరిగిందని దిల్లీలోని రావు ట్రావెల్స్ వ్యవస్థాపకులు సుబ్బారావు బీబీసీతో అన్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణ మార్గంపై కనీస అవగాహన కూడా లేకుండా వస్తున్నారని ఇది కొంత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంటర్నెట్ సహాయంతో కానీ, గతంలో వెళ్లి వచ్చిన వారితో మాట్లాడి కానీ ఇక్కడ పరిస్థితులు, ప్రయాణ మార్గం గురించి ముందుగానే తెలుసుకొని తగిన అవగాహనతో రావడం మంచిదని చెప్పారు.

రిజిస్ట్రేషన్ ఇలా

చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ముందే చెప్పుకున్నట్టు 3 మార్గాల్లో యాత్రికులు రిజిస్టర్ చేసుకోవచ్చు.

అందులో మొదటిది ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ https://registrationandtouristcare.uk.gov.in కాగా రెండోది మొబైల్ అప్లికేషన్, మూడోది నేరుగా యాత్రి మిత్ర పేరుతో వెబ్ సైట్లో పేర్కొన్న ఏ ప్రాంతానికైనా వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.

సాధారణంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వచ్చే యాత్రికుల చార్ ధామ్ యాత్ర హరిద్వార్ లేదా రిషీకేష్‌ల నుంచే మొదలవుతుంది. విమాన మార్గంలో వస్తే డెహ్రడూన్‌ నుంచి ప్రారంభమవుతుంది.

దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఇక్కడకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం కన్నా ముందుగానే ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది.

లేదంటే యాత్రికుల రద్దీ బాగా ఎక్కువగా ఉండటం వల్ల గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చోవాల్సి ఉంటుందని సుబ్బారావు అన్నారు.

హెలికాప్టర్ సర్వీసు

హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనుకునే యాత్రికులు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న https://heliservices.uk.gov.in/ ఈ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లను రిజర్వ్ చేయించుకోవాలి.

అయితే రద్దీకి తగ్గట్టు హెలికాప్టర్ సర్వీసులు లేకపోవడంతో యాత్రికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే టిక్కెట్లు అయిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రిటైర్డ్ ఆర్టీసి ఉద్యోగి హరి బీబీసీతో అన్నారు.

విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన ఆయన మరో ఏడుగురితో కలిసి చార్ ధామ్ యాత్రకు బయల్దేరినట్లు చెప్పారు.

గడిచిన రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి యాత్రికుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. రోజుకు 15 నుంచి 20 వేల మంది వరకు వస్తున్నారని 18 ఏళ్లుగా హరిద్వార్‌లో ఉంటూ తెలుగు వారికోసం నిత్యాన్నదాన సత్రాన్ని నిర్వహిస్తున్న వాసుదేవ శర్మ గంటేల బీబీసీతో అన్నారు.

"రెండేళ్ల క్రితం వరకు చార్‌ధామ్ యాత్రకు వచ్చే తెలుగువారితో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు వస్తున్నారు. గడిచిన రెండేళ్లు కరోనా కారణంగా రాలేకపోయిన వారు మున్ముందు మళ్లీ చార్ ధామ్ యాత్ర చేసే అవకాశం ఉంటుందో ఉండదన్న అన్న ఆలోచనతో ఇప్పుడే వస్తున్నామని చెబుతున్నారు. కొద్ది రోజులు ఆగితే కాస్త జనం రద్దీ తగ్గుతుందని చెబుతున్నా వినడం లేదు. యాత్రికుల రద్దీ మేరకు హెలికాప్టర్ సర్వీసులు లేకపోవడంతో బ్లాక్‌లో 3 రెట్లు అధిక ధరకు టిక్కెట్లు అమ్ముతున్నారని, కనుక హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనుకునే యాత్రికులు ముందుగానే అన్ని విధాలుగా సిద్ధమై రావడం మంచిదని" వాసుదేవ శర్మ చెప్పారు.

యాత్రకు వెళ్లే వారు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

కొద్ది రోజుల క్రితం వరకు అంతరాష్ట్ర యాత్రికుల కోవిడ్ పరీక్ష, వ్యాక్సినేషన్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ప్రభుత్వం వాటన్నింటికీ తెరదించుతూ... వారికి కోవిడ్ పరీక్ష తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది.

కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొనిరావాల్సినవసరం లేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు స్పష్టం చేశారు. అయితే యాత్రికులు మాస్క్ మాత్రం ధరించాలి.

యాత్రికులంతా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మాత్రం తప్పనిసరి.

తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు

యాత్రలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అధికారులు, ట్రావెల్స్ యజమానులు తమ అనుభవం మేరకు యాత్రికులకు సూచనలు చేస్తున్నారు.

1. అన్నింటికన్నా ముందు మీరు సరైన ట్రావెల్ ఏజెన్సీలను ఎంచుకుంటున్నారో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఏటా తెలుగు యాత్రికులు ఎక్కడో ఒక చోట ట్రావెల్ ఏజెన్సీలను నమ్మి మోసపోవడం, ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవడం సర్వసాధారణంగా మారింది. కనుక ముందుగానే నమ్మదగ్గ సేవలు అందించే ట్రావెల్ ఏజెన్సీల్లో మాత్రమే మీ టూర్ బుక్ చేసుకోండి.

2. చార్ ధామ్ క్షేత్రాలు నాలుగూ సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండేవే. తెలుగు రాష్ట్రాల వాతావరణానికి భిన్నమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. అలాగే ఉన్నట్టుండి వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కూడా. కనుక ముందుగానే అందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాలి

3. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చితే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయి. కనుక అందుకు తగినట్టు దుస్తులు, ఇతర సామగ్రి తీసుకువెళ్లండి.

4. మీరు ఆరోగ్యంగా ఉన్నా సరే ఓ మెడికల్ కిట్ తప్పనిసరి. అందులో వైద్యుల సలహా మేరకు పెయిన్ కిల్లర్లు, యాంటిబయాటిక్స్, జలుబు, దగ్గు, జ్వరానికి సంబంధించిన మందులు, యాంటి సెప్టిక్ లోషన్లు ఉండేలా చూసుకోండి. ఒక వేళ మీరు ఆస్తమా బాధితులైనట్టయితే వైద్యుల సలహా తప్పనిసరి.

5. కొన్ని సార్లు అనుకోకుండా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడవచ్చు. అప్పుడు కొన్ని గంటల పాటు ఆహారం దొరికే పరిస్థితి ఉండదు. కనుక బిస్కెట్ ప్యాకెట్లు, ఎనర్జీ డ్రింక్స్, డ్రై ఫ్రూట్స్, గ్లూకోజ్, చాక్లెట్లు ఇతర స్నాక్స్ తీసుకెళ్లడం మంచిది.

6. యాత్రలో భాగంగా కిలోమీటర్ల దూరం ఎత్తయిన కొండలు, లోయల మధ్య నడవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీకు వ్యాయామం అలవాటు లేకపోతే యాత్రకు 4 నెలల ముందు నుంచే ప్రారంభించడం మంచిది. లేదంటే కనీసం నెల రోజుల ముందు నుంచి వ్యాయామం, నడక అలవాటు చేసుకోవడం వల్ల ప్రయాణంలో ఇబ్బందులు ఉండవు.

7. ప్యాక్ చేసిన లేదా కాచిన నీటిని మాత్రమే తీసుకోండి.

8. అన్నింటితో పాటు ఉన్ని రగ్గు, గొడుగు, రెయిన్ కోట్, టార్చిలైట్, కాన్వాస్ షూస్ ఇవి మీ ప్రయాణంలో కావాల్సిన కనీసం అవసరాలు. కనుక వీటిలో ఏ ఒక్కటీ మర్చిపోకండి.

9. స్థానిక పరిస్థితులపై అక్కడ ఉండే వారికి మాత్రమే అవగాహన ఉంటుంది. అందుకే దారులు తెలుసుకునేందుకు స్థానికంగా ఉండే దుకాణదారులపై ఆధారపడండి. కనీసం ఇద్దరి నుంచి నిర్ధరించుకోండి.

10. ఫోన్లు, కెమెరాలకు అదనపు బ్యాటరీలను లేదా బ్యాటరీ బ్యాకప్‌లను తీసుకెళ్లడం తప్పనిసరి. ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించండి. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యోగులతో పాటు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలిస్ సహా, జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు వారిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)