You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుమల కొండల్లో గుప్త నిధుల కోసం భారీ సొరంగం: ప్రెస్ రివ్యూ
ఒక ముఠా గుప్త నిధుల కోసం తిరుమల శేషాచలం కొండల్లో భారీ సొరంగం తవ్విందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
శేషాచలంలో ఎర్ర బంగారమే కాదు.. అపారమైన గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో ఓ ముఠా పథకం వేసింది.
ఏడాది పాటు శ్రమించి భారీ సొరంగం తవ్వింది. మరికొంత సొరంగం తవ్వితే.. గుప్తనిధులు బయటపడేవని ముఠా సభ్యులు చెబుతున్నారని పత్రిక చెప్పింది.
శేషాచలం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలకు యత్నించిన కొందరిని శనివారం అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అనకాపల్లికి చెందిన పెయింటర్ నాయుడు 2014లో తిరుపతికి మకాం మార్చాడు. భార్య నుంచి విడిపోయిన అతడు తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా పనిచేస్తున్నాడు.
అతడికి గుప్తనిధుల మీద ఆశ మొదలైంది. నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో పరిచయం ఏర్పడింది.
తవ్వకాల సమీపంలో రాయిపై ఉన్న గుర్తులు, కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్తనిధి ఉందని వారు భావించారని సాక్షి రాసింది.
నాయుడు, రామయ్యస్వామి.. ఆరుగురు కూలీలతో కలిసి ఏడాది కిందట తవ్వకాలు ప్రారంభించారు. విషయం బయటకు తెలియకుండా సొరంగం తవ్వుతూ వచ్చారు.
ఏడాది పాటు గుట్టుచప్పుడు కాకుండా.. రేయింబవళ్లు 80 అడుగుల సొరంగం తవ్వారు. మరికొంత తవ్వేందుకు శుక్రవారం రాత్రి కూలీలతో బయలుదేరారు.
మరికొందరి కోసం మంగళం వెంకటేశ్వర కాలనీ సమీపంలో ఎదురు చూడసాగారు. ఈ ముఠా కదలికలతో అనుమానం వచ్చిన కాలనీవాసులు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. గుప్తనిధుల తవ్వకాలకు వచ్చినట్లు వారు విచారణలో తెలిపారు. వారిద్వారా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేరకు తవ్వితే సరిపోయేదని ముఠా సభ్యులు చెబుతున్నారని సాక్షి రాసింది.
తిరునామాలు దిద్దే వ్యక్తి ఇంట్లో లక్షల నగదు
తిరుమలలో తిరునామాలు పెడుతూ జీవితం గడిపే ఓ వ్యక్తి ఇంట్లో రూ.6 లక్షలకు పైగా దొరికినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.
శ్రీవేంకటేశ్వరస్వామి తిరునామాలు దిద్దుకుంటూ తిరుమలలో జీవనం సాగించిన ఓ ఒంటరి వ్యక్తి ఇంటిలో కరెన్సీ కట్టలు లభించాయి.
యాచకుడి మాదిరే జీవనం సాగించిన అతడి ఇంటిలో ఏకంగా రూ.6.15 లక్షలు లభించాయి. తిరుపతిలో సోమవారం వెలుగుచూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...
శ్రీనివాసన్ అనే వ్యక్తి ఏళ్ళుగా తిరుమలలో తిరునామాలు దిద్దుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి తిరుపతి సమీపంలోని శేషాచలనగర్‌లో ఓ ఇంటిని కూడా టీటీడీ కేటాయించింది.
మరణానంతరం ఆ ఇల్లు టీటీడీకే చెందేలా శ్రీనివాసన్ వీలునామా రాయించాడు.
ఏడాదిన్నర క్రితం శ్రీనివాసన్ మృతి చెందడంతో వీలునామా ప్రకారం టీటీడీ అధికారులు సోమవారం అతడి ఇంటిని స్వాధీనం చేసుకోడానికి వచ్చారు.
ఇంట్లో వస్తువులను తీస్తున్న సమయంలో నోట్ల కట్టలు కనబడ్డాయి. దీంతో ఆశ్చర్యపోయిన సిబ్బంది ఆ నోట్ల కట్టలు లెక్కించారు.
ఆ మొత్తం రూ. 6.15లక్షలుగా తేలినట్లు సమాచారం. అయితే శ్రీనివాసన్ ఇంటి నుంచి ఎంత నగదు, ఏయే వస్తువులు సేకరించారన్నది టీటీడీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
శ్రీనివాసన్ ఇంటిలో లభించిన నగదును అధికారులు టీటీడీ ఖజానాకు తరలించారని ఆంధ్రజ్యోతి వివరించింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు-కేసీఆర్
తెలంగాణలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత రాకూడదని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టం చేశారు.
భవిష్యత్తులో కూడా ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కొవిడ్ రోగులకు అవసరమైన ప్రాణవాయువు అందించడానికి 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారని పత్రిక రాసింది.
అదనంగా మరో 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటును కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఆక్సిజన్ సరఫరా విషయంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదని సీఎం అన్నారు.
ప్రగతిభవన్‌లో సోమవారం కొవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ రోగులకు ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లోనే చేరాలని సీఎం కేసీఆర్ కోరారని నమస్తే తెలంగాణ రాసింది.
సోమవారం నాటికి ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అందులో ఆక్సిజన్ బెడ్స్ 2,253, ఐసీయూ బెడ్స్ 533, జనరల్ బెడ్స్ 4,140 ఉన్నాయని ఆయన వివరించారు.
ప్రభుత్వ దవాఖానల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ మందులు సహా అన్నీ అందుబాటులోనే ఉన్నందున ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేట్‌రంగంలో ఎకడైనా ఒకటే వైద్యం అయినందున కొవిడ్ చికిత్సకు ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లోనే చేరాలని ముఖ్యమంత్రి కోరినట్లు నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- Fake Newsపై అవగాహన కల్పించే కథనాలు మీ కోసం
- నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)