రఘురామకృష్ణరాజు: దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన నర్సాపురం ఎంపీ

    • రచయిత, బళ్ల సతీష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణ రాజు దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తరువాత వెంటనే దిల్లీ వెళ్లిన ఆయన అక్కడ ఎయిమ్స్‌లో చేరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామ కృష్ణ రాజుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసి గుంటూరుకు తరలించగా.. ఆయన తనపై పోలీసులు హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన్ను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం ఆయన కొద్ది రోజులు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు.

ఈ రోజు ఆయన డిశ్చార్జ్‌ అయ్యారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామకృష్ణరాజు నేరుగా దిల్లీ వెళ్లారు.

మే 15న ఆర్మీ ఆసుపత్రికి

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును మే 15 రాత్రి 11.00 గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

ఆస్పత్రి చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్కార్ట్‌ వాహనం దిగి మిలిటరీ అంబులెన్స్‌లో ఎక్కే సమయంలో నడవలేక ఆయన ఇబ్బంది పడి, అక్కడే కూర్చుండి పోయారు. ఆర్మీ అధికారుల సాయంతో ఆయన అంబులెన్స్‌లోకి ఎక్కారు.

అప్పటికే రఘురామ రాజు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొన్నారు. సీఐడీ అధికారుల అనుమతితో వారు ఆయనతో మాట్లాడారు.

న్యాయం గెలుస్తుంది.. ధైర్యంగా ఉండండంటూ కుటుంబ సభ్యులకు రఘురామ భరోసా ఇచ్చారు.

అక్కడే ఉన్న మీడియాతో రఘురామ మాట్లాడే ప్రయత్నం చేయగా.. అధికారులు అనుమతించలేదు.

ఏపీలో తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని మాత్రమే ఆయన వెల్లడించారు.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో ఆర్మీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యనిపుణుల బృందం రఘురామరాజుకు వైద్యపరీక్షలు నిర్వహిస్తుందని ఆర్మీ అధికారులు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో వీడియో తీసి కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.

ఏపీ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చిన ఎంపీ అభిమానులు ఆర్మీ ఆస్పత్రి వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ముందుగానే ఆర్మీ ఆస్పత్రి ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

రోడ్డుమార్గంలో సికింద్రాబాద్‌కు

నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

గుంటూరు జైలు నుంచి ఆయన్ను రోడ్డు మార్గంలో తీసుకెళ్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ తరలింపు వ్యవహారమంతా పర్యవేక్షిస్తున్నారు.

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని, ఆ బాధ్యత సీఎస్ తీసుకోవాలని కోర్టు ఈ రోజు మధ్యాహ్నం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆదేశాల కాపీ ఈమెయిల్‌లో సీఎస్‌కు అందడంతో ఆయన కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నారు.

కాగా జైలు తరలింపు సమయంలో రఘు రామకృష్ణ రాజు తన న్యాయవాదులకు, మీడియాకు అభివాదం చేశారు.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది

ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆ సమయంలో ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లుగానే భావించాలని న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ అన్నారు.

ఈ వైద్య పరీక్షలకు పర్యవేక్షణాధికారిని నియమించే బాధ్యతను తెలంగాణ హైకోర్టుకు అప్పగించింది సుప్రీంకోర్టు.

వైద్యపరీక్షల నివేదికను సీల్డ్ కవరులో కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను మే 21కి వాయిదా వేశారు.

లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ

రఘురామ కృష్ణంరాజు తరఫున సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ-ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు.

జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. అత్యున్నత న్యాయస్థానం లంచ్ మోషన్‌ పిటిషన్‌పై విచారణకు ఆమోదం తెలిపింది.

కోర్టుకు తన వాదనలు వినిపించిన రఘురామ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ... ఇది అసాధారణ కేసు. కానీ సెక్షన్ 439 సీఆర్పీసీ కింద ఉమ్మడి జ్యూరిస్‌డిక్షన్ గుర్తించిన హైకోర్టు... కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అంతేకాదు, రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని మరో ఆదేశాల్లో పేర్కొంది అని వివరించారు. పిటిషనర్ అధికార పార్టీ ఎంపీ, ఆయన ప్రభుత్వంపై విమర్శనాత్మక ధోరణితో ఉంటారని రోహత్గీ చెప్పారు.

రఘురామ రాజుకు భద్రత అవసరమని, ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని, తటస్థ ఆస్పత్రి లేదా ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని రోహత్గీ కోర్టును కోరారు. జగన్‌ను, అధికార పార్టీని విమర్శించే ఆ పార్టీ ఎంపీకి ఇంతకు ముందు కేంద్రం భద్రతను ఏర్పాటు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు రోహత్గీ.

రఘురామ రాజు వైద్య పరీక్షల కోసం ఒక గైనకాలజిస్ట్ నేతృత్వంలో మెడికల్ బోర్డ్ ఏర్పాటు చేశారని. కానీ, ఆమె భర్త అధికార పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడని ఆయన తెలిపారు.

మేజిస్ట్రేట్ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని కోర్టు చెప్పింది. ఈరోజు రఘురామ రాజును గోకర్ణ లేదా సికింద్రాబాద్‌లో ఉన్న ఆర్మీ లేదా ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలి. హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వకపోవడం సరికాదు అని రోహత్గీ అన్నారు.

నిందితుడు దాఖలు చేసిన ఎస్ఎల్‌పీని పరిశీలించాలని, ఆయనపై పెట్టిన కేసులన్నీ పూర్తిగా నిరాధారమైనవని, బోగస్‌ అని రోహత్గీ కోర్టుకు చెప్పారు. దీనిపై విచారణ నిర్వహిస్తున్న సీఐడీ స్వయంగా ఫిర్యాదుదారుడుగా ఉందని, నిందితుల్లో ఎంపీతోపాటు రెండు మీడియా సంస్థలు, వాటి ఛానళ్లు ఉన్నాయని చెప్పారు.

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్‌ దవే.. ఈ ఫైళ్లకు సంబంధించిన వివరాలు తనకు ఇవ్వాలని, ఈ విచారణను శుక్రవారం నిర్వహించే అవకాశం కల్పించాలని కోరారు.

పిటిషన్ కాపీని మీరు వారికి అందించారా అని రోహత్గీని జస్టిస్‌ గవాయ్‌ ప్రశ్నించారు. వారు దాన్ని కోరలేదని రోహత్గీ సమాధానం ఇచ్చారు.

రఘురామ రాజుకు ఎయిమ్స్ వైద్యుల ప్యానల్‌తో పరీక్షలు చేయించవచ్చని దవే అన్నారు. రమేష్ ఆస్పత్రిలో గత ఏడాది మంటలు చెలరేగి 20 మంది చనిపోయారని, అందువల్లే ఆ ఆస్పత్రిని వద్దంటున్నామని దవే తెలిపారు.

అక్కడ ఏ ఆర్మీ ఆస్పత్రి ఉందని జస్టిస్ శరణ్... అడ్వొకేట్‌ రోహత్గీని ప్రశ్నించారు. గోకర్ణలో ఒకటి, సికింద్రాబాద్‌లో మరొకటి ఆర్మీ ఆస్పత్రులు ఉన్నాయని రోహత్గీ సమాధానం ఇచ్చారు.

ఆర్మీ ఆస్పత్రి అయితే తటస్థంగా ఉంటుందని జస్టిస్ శరణ్ చెప్పగా, ఎయిమ్స్ కూడా కేంద్రం పరిధిలోకే వస్తుందని దవే కోర్టుకు తెలిపారు.

"రఘురామ రాజు ప్రమేయం లేని అంశాలపై ఏపీ పోలీసులు ఆయన్ను విచారణ చేస్తున్నారు. ఆ నివేదికను సీఐడీకి పంపించారు. సీఎం ఓ వర్గం పక్షపాతి అని వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. రఘురామ రాజు ఆయుధాలు, హింసను ప్రేరేపించేలా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. కానీ దేశద్రోహనేరానికి ఇవి అవసరం.

ఇక్కడ ఎలాంటి ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కూడా లేదు. దీన్ని తీవ్ర నేరంగా చూపించేందుకు రఘురామరాజుపై దేశద్రోహం కింద నేరం మోపారు. మిగిలిన అన్ని ఆరోపణలు బెయిల్‌కు అర్హమైనవే" అని రోహత్గీ సుప్రీం కోర్టుకు వివరించారు.

"మే 14 రఘురామ రాజు పుట్టినరోజు. ఆ రోజే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని, 300 కిలోమీటర్ల దూరంలోని గుంటూరు తీసుకెళ్లారు. ఆ రాత్రి ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆయన్ను కొట్టారు, హింసించారు. రాజును కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆయన పాదాలకు గాయాలు ఉండడం మేజిస్ట్రేట్ గుర్తించారని" రోహత్గీ వివరించారు.

"గత ఏడాది డిసెంబర్లో రఘురామ రాజు గుండెకు సర్జరీ జరిగింది. అందుకే ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు, ప్రైవేటు ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఆయనకు ఇంకా ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించలేదు. ఆయన బెయిల్‌ కోసం హైకోర్టుకు వెళ్లగా దిగువ కోర్టుకు వెళ్లాలని హైకోర్ట్ సూచించిందని" రోహత్గీ తెలిపారు.

రోహత్గీ వాదనలు పూర్తైన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తరపున దుష్యంత్‌ దవే వాదనలు ప్రారంభించారు.

ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించాలని, ఈరోజే ఆయన్ను ఎయిమ్స్‌కు పరీక్షలకు తీసుకెళ్తామని దవే చెప్పారు. సీనియర్ జ్యుడీషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించవచ్చని, రఘురామ రాజు కూడా పౌరుడేనని, ఆయన హక్కులను కూడా పరిరక్షించాలని దవే అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణల్లో ఆర్మీ హాస్పిటళ్లు ఎక్కడున్నాయని జస్టిస్‌ శరణ్‌ అడిగారు.

రఘురామ రాజును అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ప్రాంతం సికింద్రాబాద్‌లో ఒకటుందని, విశాఖపట్నంలో నేవల్‌ హాస్పిటల్‌ ఉందని అడ్వొకేట్‌ ఆదినారాయణ రావు కోర్టుకు తెలిపారు. విశాఖ ఎంత దూరం ఉంటుందని జడ్జి ప్రశ్నించగా దాదాపు 300 కిలోమీటర్లని రావు చెప్పారు. అయితే తుపాను పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని దవే కోర్టును కోరారు.

పిటిషన్ కాపీని ప్రతివాదులకు ఈమెయిల్ ద్వారా పంపాలని జస్టిస్ శరణ్ సూచించారు. ఏజీకి కూడా ఒక కాపీ పంపించాలని, తాము 12 గంటలకు ఈ విషయంపై విచారణ జరుపుతామని తెలిపారు.

రఘురామకృష్ణ రాజు కేసులో ఆదివారం ఏం జరిగిందంటే..

ఉదయం రఘురామకృష్ణ రాజుకు కోర్టు నియమించిన బృందం వైద్య పరీక్షలు పూర్తి చేయగానే ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు. అక్కడ పాత జైల్లోని బ్యారక్ కేటాయించారు. ఖైదీ సంఖ్యగా 3468 ఇచ్చారు.

ఈ లోపు ఆయన వైద్య నివేదికను వైద్యులు హైకోర్టు న్యాయమూర్తికి అందించారు. ఆ నివేదికను జడ్జీలు చదివి వినిపించారు. ''రఘురామరాజు శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. అన్ని రకాల పరీక్షలు చేశాం. ఆల్రా సౌండ్, కలర్‌ డాప్లర్‌ ఈసీజీ, రక్తపరీక్షలు చేశాం. ఫలితాల్లో అన్ని సాధారణ స్థాయలోనే ఉన్నాయి.'' అని నివేదికలో ఉన్నట్టు సమాచారం. పాంటాప్, జింకోవిట్‌ మందులు ఇచ్చి డిశ్చార్జి చేస్తున్నట్టుగా వైద్యులు తమ నివేదికలో తెలిపారు.

ఆ క్రమంలో హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. రమేశ్ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశం పట్టించుకోలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో ఆయన్ను రమేశ్‌ ఆసుపత్రికి పంపించాలని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ కోర్టు ఆదేశాల ప్రకారం రఘురామరాజును రమేశ్ ఆసుపత్రికి పంపాలి. దీంతో ఆ ఆదేశాలు అమలు చేయాలని చెప్పింది హైకోర్టు. అయితే దానికి ఏఏజీ అభ్యంతరం చెప్పారు. శనివారం సాయంత్రమే ప్రైవేటు వైద్యుల పరీక్షలను హైకోర్టు తిరస్కరించిన విషయాన్నీ ఏఏజీ లేవనెత్తారు. హైకోర్టు ఆదేశాల తరువాత సీఐడీ కోర్టు రమేశ్ ఆసుపత్రికి తరలించాలన్న ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. హైకోర్టు ఆదేశాల తరువాత వచ్చిన సీఐడీ ఆదేశాలు వచ్చాయనీ, కానీ ఆర్డర్ కాపీ సీఐడీ కోర్టుకు అందలేదనీ చెప్పారు.

అదే సమయంలో రమేశ్ ఆసుపత్రికి రఘురామకృష్ణ రాజును తరలించవద్దని ఏఏజీ వాదించారు. ''రమేష్‌ ఆస్పత్రికి తరలించడం అంటే టీడీపీ కార్యాలయానికి తరలించడమే. ఆ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది చనిపోయారు. ఆసుపత్రిపై కేసులున్నాయి'' అని ఏఏజీ సుధాకర రెడ్డి వాదించారు. దీంతో ఏఏజీ వాదనలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీనిపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రఘురామరాజు గుంటూ జైల్లో ఉంటారు.

మరోవైపు ఈ ఉదంతం రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం నుంచి ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ప్రాణహాని ఉందంటూ గవర్నర్ కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాజుపై దారుణంగా కస్టోడియల్ హింసకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ''ఆయనకున్న ప్రాణహానిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం సైతం 'వై' కేటగిరి భధ్రతను కల్పించింది. రాజు సతీమణి శ్రీమతి రమాదేవి సైతం తన భర్త రాజుకు ప్రాణహాని ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ఎంపీ రాజు ప్రాణాన్ని కాపాడేందుకు మీరు కల్పించుకోవాలి'' అని చంద్రబాబు లేఖలో రాశారు.

బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ''ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఇలానే లోపలేసి నాలుగు తగిలిస్తాం'' అని చెప్పడానికే ప్రభుత్వం ఇలా చేస్తోంది'' అని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కూడా దీనిపై స్పందించారు. ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు.

నరసాపురం పార్లమెంటు పరిధి క్ష‌త్రియ సేవాస‌మితి ఈ అంశంపై స్పందించింది. తమ సంస్థ ర‌ఘురామకృష్ణరాజుకు మద్దతు ఇవ్వడం లేదనీ, ఈ గొడవలో జోక్యం చేసుకోవడం లేదనీ, దీనిలో క్షత్రియ కులాన్ని కలపవద్దనీ ఆ సంస్థ ప్రకటన ఇచ్చింది.

తనను కొట్టారని కోర్టులో ఫిర్యాదు చేసిన ఎంపీ, అవి దెబ్బలు కాదన్న పోలీసులు

నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణ రాజు అరెస్టు వ్యవహారం శనివారం నాడు కోర్టుల్లో అనేక మలుపులు తిరిగింది. పోలీసులు తనను కష్టడీలో కొట్టారనీ, తన కాలికి గాయాలు అయ్యాయనీ రఘురామ ఆరోపించడం సంచలనం రేపింది.

గాయాలపై కోర్టు మెడికల్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోపణలు నిజం అయితే బాధ్యులపై తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. మరోవైపు ఆయనకు బెయిల్ నిరాకరించి, 28వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించింది.

శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని నివాసంలో రఘురామకృష్ణ రాజును అరెస్టు చేసిన ఆంధ్రా సీఐడీ పోలీసులు, విజయవాడ తీసుకువెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన సీఐడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నించారు. శనివారం ఉదయం కోర్టుల్లో వాదనలు జరిగాయి.

శనివారం మధ్యాహ్నం ఈ కేసు విచారించిన హైకోర్టు, జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకువచ్చారని ప్రశ్నించింది. పిటిషన్ ను డిస్మిస్ చేసి సీఐడీ కోర్టులో ప్రయత్నించమని చెప్పింది.

గుంటూరు కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ, రఘురామ లాయర్లు తమ వాదనలు వినిపించారు. రఘురామ రిమాండ్ రిపోర్టులో లోపాలు ఉన్నాయని పెండింగులో పెట్టింది కోర్టు.

అదే సమయంలో పోలీసులు రఘురామను కొట్టారంటూ కోర్టులో ఫిర్యాదు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. అందుకు కొన్ని ఫోటోలు కూడా వారు చూపించారు. అరికాళ్లపై గాయాలను కోర్టు నమోదు చేసుకుంది.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స రఘురామ రాజు నిరాకరించడంతో, రమేశ్ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఆ తరువాత రఘురామ న్యాయవాదులు హైకోర్టులో మరో పిటిషన్ (హెబియస్ కార్పస్) వేశారు. అటు హైకోర్టు బెంచ్ కూడా కాలి ఫోటోలు పరిశీలించింది. ఒకవేళ దెబ్బలు కొట్టింది నిజమే అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈనెల 28వ తేదీ వరకూ ఆయనకు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఆయనకు వై కేటగిరీ భద్రత కొనసాగించాలని ఆదేశించింది. ఆసుపత్రిలో చికిత్స తరువాత జైలుకు తరలించాలని సూచించింది.

అయితే కాలికి గాయాలు అనడాన్ని ప్రభుత్వ న్యాయవాదులు తప్పు పట్టారు. ‘‘ఆయనకు మందులు ఇచ్చాం. ఆయన కుటుంబ సభ్యులు మధ్యాహ్నం భోజనం తెచ్చారు. అప్పటి వరకూ ఆయన మామూలుగానే ఉన్నారు. పిటిషన్ డిస్మిస్ కాగానే కొత్త నాటకం ప్రారంభించారు. పోలీసులు కొట్టారంటూ కథ అల్లారు. దీనిపై కోర్టు మెడికల్ కమిటి వేసింది. రేపు మధ్యాహ్నంలోపు నివేదిక ఇవ్వాలని సూచించింద’’ అని మీడియాకు చెప్పారు ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వొకేట్ జనరల్.

తన వ్యక్తిగత వైద్యులు, కుటుంబ సభ్యులను కూడా తనతో పాటూ ఉండటానికి అనుమతించాలని రఘురామరాజు కోరారు. దానికి కోర్టు తిరస్కరించింది.

ఏం కేసు పెట్టారు?

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వైయస్సార్సీపీ ఎంపీగా గెలిచిన కనుమూరి రఘురామకృష్ణ రాజు కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ క్రమంలో తరచూ సోషల్ మీడియా, టీవీ చానెళ్లలో వైయస్సార్సీపీ నాయకులపై, జగన్ పై, ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయన పై సుమోటో కేసు పెట్టారు సీఐడీ పోలీసులు, రెడ్డి కులం, క్రైస్తవ మతంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఎఫ్ఐఆర్ లో రాశారు. ఐపీసీ 124 కింద రాజద్రోహం కేసు నమోదు చేశారు.

రెండు చానెళ్లపై కేసులు:

ఎఫ్ఐఆర్ లో రఘురామకృష్ణ రాజుతో పాటూ ఏబీఎన్, టీవీ5 చానెళ్లపై కూడా కేసు పెట్టారు. ఈ సంస్థలపై కూడా అవే సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయితే రఘురామతో పాటూ మీడియా సంస్థలపై కేసు పెట్టడం సరికాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశాలు మినహా ఇతర రాజకీయ కారణాలతో మీడియా పై రాజద్రోహం కేసు మోపడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.

రఘురామను కొట్టారన్న ఆరోపణలపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. రఘురామ రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర నేరం అని ఆయన అన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడ్డానికి చట్టాన్ని ఉల్లంఘిస్తారా అని ఆయన ప్రశ్నించారు.

కులం కోణం:

రఘురామకృష్ణ రాజు రెండు గోదావరి జిల్లాల్లో ప్రముఖంగా ఉండే రాజు (క్షత్రియ) కులానికి చెందిన వారు. దీంతో టీడీపీకి చెందిన అదే కులానికి చెందిన ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఈ అంశంపై మాట్లాడారు. ‘‘క్షత్రియులపై (రాజులపై) వైయస్సార్సీపీ కక్ష సాధిస్తోంది. మొన్న అశోక్ గజపతిరాజు రాజుపై అక్రమ కేసు పెట్టారు, ఇవాళ రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేశారు? రేపు మరొకరిని అరెస్ట్ చేస్తారు. క్షత్రియులు సర్వశక్తివంతులు, సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. సమాజ సేవ చేస్తూ రాష్ట్రాభివృద్దికి పాటు పడేవాళ్లు. అలాంటి వారిపై కక్ష సాధింపు చర్యలు సరికాదు. క్షత్రియుల ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దు. రఘురామకృష్ణరాజు పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేసి విడుదల చేయాలి, లేకపోతే తరవాత జరిగే పరిణమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

అటు వైయస్సార్సీపీ నుంచి కూడా ఇతర నాయకులతో పాటూ, రాజు కులానికి చెందిన నాయకులు స్పందించారు. ‘‘పశ్చిమగోదావరి జిల్లా అంటే ప్రశాంతంగా ఉన్న జిల్లా. ఇలాంటి ప్రాంతంలో ఒక చీడపురుగుని ఎంపీగా ఎన్నుకున్నామని ప్రజలు సిగ్గుపడుతున్నారు. అందరూ సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న ఎంపీపై నేను కూడా కేసు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఫోటో తో రఘురామకృష్ణరాజు గెలిచారు కానీ, తన ఫేమ్ తో కాదు. సంక్రాంతి కోడి పందాలపై కేసులు వేస్తూ ప్రచారం పొందే వ్యక్తి రఘురామ రాజు’’ అన్నారు ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి చెఱుకువాడ శ్రీరంగనాథ రాజు.

అటు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కూడా రఘురామపై తీవ్ర విమర్శలు చేశారు. అటు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఈ అంశంపై స్పందించారు. ‘‘జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులు క్షత్రియులు. క్షత్రియ సామాజిక వర్గానికి అపకీర్తి తెచ్చిన వ్యక్తి రఘురామ కృష్ణరాజు.’’ అని ఆయన అన్నారు.

"రాష్ట్ర పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు గారి చిత్రాలు కలతపెట్టేవి, ఖండించదగినవి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. పార్లమెంటు సభ్యుడిని ఈ విధంగా రాష్ట్ర పోలీసులు వేధించగలిగితే, రాష్ట్రంలోని సాధారణ ప్రజల స్థితి ఏమిటి?" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)