You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జగన్, హేమంత్ సొరేన్: మోదీ ఫోన్‌పై ముఖ్యమంత్రుల వాదులాట
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గురువారం (06.05.2021) జరిపిన ఫోన్ సంభాషణ ట్విటర్ వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులు, కొందరు ఇతర పార్టీల నేతల మధ్య చర్చకు దారి తీసింది.
మోదీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ చేసిన ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించడంతో చర్చ మొదలైంది.
అంతేకాదు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి మద్దతు పలుకుతూ ఇలా బహిరంగంగా మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి హితబోధ చేయడంపైనా విమర్శలొస్తున్నాయి.
''గౌరవనీయ ప్రధాన మంత్రి మోదీ ఈ రోజు నాకు ఫోన్ చేశారు. ఆయన మనసులో ఉన్నది మాత్రమే నాతో మాట్లాడారు. చేయాల్సిన పని గురించి మాట్లాడినా, మేం చేస్తున్న పని గురించి విన్నా బాగుండేది'' అంటూ గురువారం రాత్రి 11.19 గంటలకు హేమంత్ సొరేన్ ట్వీట్ చేశారు.
అయితే, హేమంత్ సొరేన్ ట్వీట్‌కు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 3.29 గంటలకు రెండు వరుస ట్వీట్‌లు చేశారు.
''ప్రియమైన హేమంత్ సొరేన్! మీరంటే నాకు గౌరవం ఉంది. కానీ, ఒక సోదరుడిగా నేను కోరుతున్నదేమంటే.. మనలో మనకు విభేదాలు ఏవైనా ఉండొచ్చు. కానీ, ఇలాంటి రాజకీయాలు చేయడం మన దేశాన్ని బలహీనపరుస్తుంది. కోవిడ్‌పై చేస్తున్న ఈ పోరాటంలో వేలెత్తి చూపడం కంటే అంతా కలసివచ్చి కోవిడ్‌పై పోరాటంలో ప్రధానికి అండగా నిలవాలి'' అంటూ తన ట్వీట్‌లతో హితబోధ చేశారు.
అయితే, జగన్ ట్వీట్‌లకు హేమంత్ సొరేన్ ఇంతవరకు ఏమీ ప్రతిస్పందించలేదు.
కానీ, కాంగ్రెస్ పార్టీ నేత, ఒడిశాలోని కొరాపుఠ్ ఎంపీ సప్తగిరి ఉలక స్పందించారు.
జగన్‌పై విమర్శలు చేశారు. ఈడీ దాడులకు భయపడి మోదీ భజన చేస్తున్నారంటూ జగన్‌పై మండిపడ్డారు.
''రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప నాయకుడి కొడుకువై ఉండి భయపడుతున్నావ్.. నువ్విప్పుడు పిల్లాడివి కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి'' అంటూ సప్తగిరి ఉలకా ట్వీట్ చేశారు.
''కరోనా సూపర్ స్ప్రెడర్ మోదీ పక్షాన మాట్లాడుతున్నారా మీరు.. బెంగాల్‌లో మోదీ ర్యాలీలను మర్చిపోయారా?
ఓహ్.. మర్చిపోయాను.. మీరు, సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు కదా. అందుకే ఈ ట్రిక్‌లు ప్లే చేస్తున్నారన్నమాట'' అని జగన్‌పై ఏఐసీసీ సభ్యుడు రోషన్ లాల్ బిట్టూ సెటైర్లు వేశారు.
రాష్ట్రానికి ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ కూడా కేటాయించకపోయినా ఆ విషయం అడగకుండా మోదీ భజన చేస్తారా? అంటూ కొందరు ట్వీట్‌లు చేశారు.
మరికొందరు జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ప్రస్తావించారు.
''మనకు మాట్లాడే ధైర్యం లేదు కదా అని అందరు ముఖ్యమంత్రులు మీలానే ఉంటారనుకుంటున్నారా.. మీకు ఎలాగూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు.. కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదు. కనీసం ఇతర రాష్ట్రాల సీఎంలు అడుగుతుంటే మీకు ఏంటి సార్?'' అని ట్విటర్ యూజర్ ఒకరు ట్వీట్ చేశారు.
మోదీకి మద్దతుగా సీఎంలు
కాగా.. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో మోదీకి మద్దతు పలుకుతూ ట్వీట్‌లు చేశారు. హేమంత్ సొరేన్ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ వారు మోదీ నుంచి తమకు ఎప్పుడూ మద్దతు ఉందని ఆ ట్వీట్‌లలో చెప్పారు.
నాగాలాండ్ సీఎం స్పందిస్తూ... తాను హేమంత్ సొరేన్ మాటలతో ఏకీభవించబోనని.. అనేకసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ప్రధాని మోదీతో ఎన్నడూ ఇబ్బంది రాలేదని.. రాష్ట్రాల ఆందోళనలను ఆయన అర్థం చేసుకుంటారని అన్నారు.
మిజోరం ముఖ్యమంత్రి జొరామ్ తాంగా దీనిపై స్పందిస్తూ... చురుగ్గా ఉండే మోదీ వంటి ప్రధాని ఉండడం అదృష్టమని, మోదీ ప్రతి విషయంలోనూ తక్షణం స్పందిస్తారని, ఆయన నుంచి ఫోన్ వస్తే కంఫర్టబుల్‌గా ఉంటుందని అన్నారు.
కోవిడ్, కార్చిచ్చులు, శరణార్థుల సమస్యలు.. ఇలా ఏ విషయంలోనైనా ఆయన తమ రాష్ట్ర సమస్యలను అడిగి తెలుసుకున్నారని ఆయన ట్వీట్ చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ దీనిపై ట్వీట్ చేస్తూ.. ప్రధాని మోదీ ప్రజల పట్ల చూపే శ్రద్ధను కూడా రాజకీయం చేయడం తగదంటూ, మోదీ చేసే ప్రతి పనీ ప్రజాసంక్షేమం కోసమేనని అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ వ్యవహారంలో స్పందిస్తూ.. ఎవరికి వారు సురక్షితంగా ఉండకపోతే దేశం సురక్షితంగా ఉండదంటూ, అందరం కలసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఇదంటూ ట్వీట్ చేశారు.
మణిపుర్ ముఖ్యమంత్రి ఎ.బీరేన్ సింగ్ స్పందిస్తూ ప్రధాని మోదీ ఎప్పుడు ఫోన్ చేసినా భరోసా ఇస్తారన్నారు.
మరోవైపు అస్సాం ప్రభుత్వంలో మంత్రి, బీజేపీ నేత హిమంత్ బిశ్వ శర్మ ఈ ట్వీట్‌ల వ్యవహారంలో తలదూర్చారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌పై ఆయన విమర్శలు కురిపించారు.
ఇలాంటి ట్వీట్‌తో కనీస మర్యాద పాటించలేదని.. ఝార్ఖండ్ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ప్రధాని మోదీ ఫోన్ చేస్తే ఆ విషయం పక్కన పెట్టి ఇలాంటివన్నీ మాట్లాడతారా.. ముఖ్యమంత్రి పదవికున్న హుందాతనాన్ని కూడా పోగొట్టారంటూ హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.
వీరే కాకుండా కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఇతర బీజేపీ నేతలు కొందరు ప్రధానికి మద్దతుగా ట్వీట్‌లు చేశారు.
అదే సమయంలో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తదితరులు హేమంత్ సొరేన్‌కు మద్దతుగా ట్వీట్‌లు చేశారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు... యూపీలో ఒకే రోజు 34 వేల మందికి వైరస్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)